శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ సొంతం చేసుకున్న మహేష్ బాబు, తన తాజా చిత్రం బ్రహ్మోత్సవంతో తన రికార్డ్ లు తానే బ్రేక్ చేయనున్నాడు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సంచలనాలు సృష్టిస్తున్నాడు రాజకుమారుడు. ఈ సినిమా రూ.85 కోట్లకు పైగా బిజినెస్ చేసేసిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ టాక్ కు మరింత బలం చేకూరుస్తూ.., ఏ ఏ ఏరియాల్లో ఎంత బిజినెస్ చేసిందో లెక్కలతో సహా చెపుతున్నారు ఫ్యాన్స్. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా ఈ నెంబర్స్ తో సూపర్ స్టార్ అభిమానులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు.
బ్రహ్మోత్సవం రైట్స్ నైజాం ఏరియా 18 కోట్లు, సీడెడ్ 8.5 కోట్లు, ఆంధ్రా 25.5 కోట్లకు అమ్ముడయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. వీటికి తోడు కర్ణాటక హక్కులు 6.5 కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా కలిపి 2 కోట్ల వరకు బిజినెస్ అయ్యింది. ఇక మహేష్ మార్కెట్ కు కంచు కోట లాంటి ఓవర్ సీస్ లో బ్రహ్మోత్సవం రికార్డ్ స్థాయిలో 13 కోట్లకు అమ్ముడయ్యింది. ఈ మొత్తం 74 కోట్లుగా లెక్క తేలగా, శాటిలైట్ రైట్స్ రూపంలో మరో 11 కోట్ల బిజినెస్ జరిగినట్టుగా సమాచారం. మొత్తంగా మహేష్, బ్రహ్మోత్సవం రిలీజ్ కు ముందే 85 కోట్ల బిజినెస్ చేసి టాలీవుడ్ శ్రీమంతుడిగా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.
మహేష్ బాబు సరసన సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. భారీ బడ్జెట్ తో టాప్ కాస్టింగ్ తో పీవీపీ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. అయితే రిలీజ్ కు ముందే శ్రీమంతుడు సినిమాను మించి బిజినెస్ చేసిన బ్రహ్మోత్సవం, రిలీజ్ తరువాత కూడా శ్రీమంతుడు కలెక్షన్లు మించి సాధిస్తే గాని సినిమా హిట్ లిస్ట్ లోకి చేరదు. మరి మహేష్ మరోసారి మ్యాజిక్ చేస్తాడో లేదో చూడాలి.