‘ఎం.ఎల్.ఎ’ అంటే మంచి లక్షణాలున్న అబ్బాయి మాత్రమే కాదు. మంచి లక్షణాలున్న ‘అమ్మాయి’ కూడా. కాజల్ అలాంటి కథానాయికే. అందం, అభినయాల కలబోత కాజల్. ‘లక్ష్మీ కల్యాణం’ నుంచి మొన్నొచ్చిన ‘అ..!’ వరకూ తన దగ్గరకు వచ్చిన ప్రతి పాత్రకూ న్యాయం చేసింది. అందాల ప్రదర్శన హద్దుల్లోనే ఉంచుతూ ఊరించింది. కమర్షియల్ కథానాయికగా గుర్తింపు పొందింది. అగ్ర కథానాయకులందరితోనూ జోడీ కట్టింది. ఈ ప్రయాణంలో యాభై చిత్రాల్ని పూర్తి చేసింది. తన తొలి కథానాయకుడు కల్యాణ్ రామ్‌తో మరోసారి నటించిన చిత్రం ‘ఎం.ఎల్.ఎ’ . ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా కాజల్‌తో బాతాఖానీ!
యాభై చిత్రాల మైలు రాయిని దాటేశారు... సెంచరీ కొట్టే ఆలోచనలు ఉన్నాయా?
(నవ్వుతూ) అసలు ఇన్ని సినిమాలు చేస్తానని అస్సలు అనుకోలేదు. ‘లక్ష్మీ కల్యాణం’ రోజులు నాకింకా గుర్తు. ‘ఈ ఒక్క సినిమా చేస్తే చాలు భగవంతుడా’ అనుకున్నా. ఆ సినిమా వీలైనంత త్వరగా పూర్తి చేసి, మళ్లీ నా చదువులు నేను చదువుకుందామనుకున్నా. కానీ.. అక్కడి నుంచి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇదిగో.. వెనక్కి తిరిగి చూసుకుంటే యాభై సినిమాలు పూర్తయ్యాయి.
‘కథానాయికగా నేను స్థిరపడినట్టే’ అని ఎప్పుడు అనిపించింది..?
‘మగధీర’తో ఆ నమ్మకం వచ్చింది. అంతకు ముందు కూడా కొన్ని సినిమాలు చేసినా ఎక్కడో చిన్న బెరుకు ఉండేది. ‘నాకూ సినిమాకూ సెట్ అవ్వదేమో’ అనిపించేది. కానీ ‘మగధీర’ విజయం నాపై నాకు నమ్మకాన్ని కలిగించింది.
ఈ ప్రయాణంలో కథానాయకుల ఆధిపత్య ధోరణి ఎప్పుడూ ఎదురవ్వలేదా?
లేదు. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ‘సినిమా అంటే నా ఒక్కడి వల్ల కాదు.. అది సమష్టి బాధ్యత’ అనే విషయం నేను పనిచేసిన కథానాయకులందరికీ తెలుసు. కాబట్టి నాకు గౌరవం ఇచ్చారు. మంచి పాత్రలు దక్కాయి. కొన్నిసార్లు వాళ్లతో సమానమైన పాత్రలు లభించాయి.
కథానాయకులందరితోనూ నటించారు... ‘ఫలానా వాళ్లతో నటించాలి’ అనే కోరికలు మిగిలిపోయాయా?
నటించిన వాళ్లందరితోనూ మరోసారి నటించాలని వుంది. ఇప్పుడు కల్యాణ్‌రామ్‌తో చేసినట్టు..
మీ తొలి కథానాయకుడు కల్యాణ్‌రామ్. ‘లక్ష్మీ కల్యాణం’ నుంచి ‘ఎం.ఎల్.ఎ’ వరకూ ఆయనలో ఏమైనా మార్పులు కనిపించాయా?
‘లక్ష్మీ కల్యాణం’ సమయంలో నాకు సినిమా గురించి ఎలాంటి అవగాహన లేదు. సెట్లో ఎలా ఉండాలో, కెమెరా ముందు ఎలా నిలబడాలో కూడా అర్థమయ్యేది కాదు. ఆ సమయంలో కల్యాణ్ రామ్ సలహాలు ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం ఇద్దరం చర్చించుకుని మరీ సన్నివేశంలో నటించాం. ఇప్పటికీ ఆయన నాకు విలువైన సలహాలు ఇస్తున్నారు. ఈ ప్రయాణంలో ఇద్దరం మారాం. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. నా తొలి కథానాయకుడిగా కల్యాణ్‌రామ్‌కి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఇస్తాను. ‘ఎం.ఎల్.ఎ’ సెట్లో తొలిరోజు ఆయన్ని చూసినప్పుడు పాత స్నేహితుడ్ని కలుసుకున్న అనుభూతి కలిగింది.
‘ఎం.ఎల్.ఎ’లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
కథానాయిక పాత్రలకు ప్రాధాన్యం ఉన్న కథలు చాలా తక్కువ వస్తున్నాయి. అలాంటి కథల్లో ‘ఎం.ఎల్.ఎ’ కూడా ఉంటుంది. కథలో కీలకమైన పాత్ర నాది. ఓ మంచి సందేశం కథలో మిళితమై సాగుతుంది. సందేశం అంటే... బలవంతంగా ఏదో రుద్దుతున్నట్టు ఉండదు. దాన్నీ వినోద భరితంగా చెప్పే ప్రయత్నం చేశారు.
కథానాయికగా ఇంత అనుభవం వచ్చింది కదా, ఇక ముందు కథల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు?
కథల విషయంలో ముందు నుంచీ నేను జాగ్రత్తగానే ఉంటున్నాను. అయితే ఇక మీదట మరింత ఆచి తూచి అడుగులేయాలి. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను. అన్ని సినిమాలూ కథలు నచ్చే ఒప్పుకోం. కొన్ని కొన్ని ప్రత్యేక కారణాలుంటాయి. ప్రతీసారీ మంచి కథలు, మంచి పాత్రలూ రావు. డబ్బుల కోసం కూడా కొన్ని సినిమాలు చేయాలి.
యాభై చిత్రాల్లో కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా ఒక్కటీ కనిపించలేదు. అనుష్క, నయనతారలా లేడీ సూపర్‌స్టార్ ఇమేజ్ కోరుకోవడం లేదా?
ఎవరినో చూసి, నేనూ అలానే ఉండాలి అనుకోవడం నాకు ఇష్టం ఉండదు. నా ప్రయాణం నాది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు నాకూ వచ్చాయి. అప్పట్లో కాల్షీట్లు సర్దుబాటు చేయడం కుదరక కొన్ని వదులుకున్నా. అయితే కథానాయిక ప్రాధాన్యం ఉన్న కథలంటే.. హారర్, థ్రిల్లర్ లేదంటే ఓ సమస్య కోసం పోరాటం చేసే స్త్రీ పాత్రలే అనుకోవడం తప్పు. మంచి ప్రేమకథలూ చేయొచ్చు. వ్యాపార విలువలు ఉన్న సినిమాలూ చేయొచ్చు. అలాంటి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా.
మీరు నటించిన సినిమాలు చూస్తే మీకేమనిపిస్తుంది? ‘ఇంకొంచెం బాగా నటిస్తే బాగుణ్ను’ అనుకుంటారా?
నాకే కాదు.. నటీనటులు ఎవరికైనా అలానే అనిపిస్తుంది. నాకైతే ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తుంది. నా కుటుంబంలో సినీ పరిశ్రమకు చెందిన వాళ్లెవరూ లేరు. నాకు దగ్గరుండి నేర్పించే గురువులూ లేరు. నాకు నేనే నేర్చుకుంటూ వెళ్లాలి. అందుకే కెరీర్ ఆరంభంలో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. కొన్ని సినిమాలు చూస్తుంటే.. ‘అలా ఎందుకు నిలబడ్డాను? డైలాగ్ ఇలానే ఎందుకు చెప్పాను?’ అనిపిస్తుంటుంది. మరో పదేళ్ల తరవాత ఇప్పటి సినిమాలు చూస్తే.. అలాంటి భావనే కలుగుతుందేమో?