Tuesday, October 27, 2015

మూడు దేశాల్లో భూవిలయం

పాకిస్తాన్‌లో 200 మంది, అఫ్ఘానిస్తాన్‌లో 63 మంది మృత్యువాత
 అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులు భారీ భూకంపంతో విలవిల్లాడాయి. హిందూకుష్ పర్వతశ్రేణుల్లో సోమవారం మధ్యాహ్నం సంభవించిన భూకంపం పాక్, అఫ్ఘాన్‌లలో పెను విధ్వంసం సృష్టించి 263 మంది ప్రాణాలను బలిగొంది. 1,300 మందికి పైగా ప్రజలను గాయాలపాల్జేసింది. పెద్దఎత్తున ఆస్తులను ధ్వంసం చేసింది. భూకంప భయంతో భారత్‌లోని కశ్మీర్‌లో ముగ్గురు చనిపోగా, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. పలు ఉత్తర భారత రాష్ట్రాల్లో ప్రజలు ప్రాణభయంతో వణికారు. అఫ్ఘాన్ రాజధాని కాబూల్‌కు 250 కి.మీ. దూరంలోని జుర్మ్‌లో హిందూకుష్ పర్వతాల కింద 213 కిలోమీటర్ల లోతులో మధ్యాహ్నం 2.39 గంటలకు(భారత కాలమానం ప్రకారం) భూకంపం సంభవించినట్లు అమెరికన్ జియోలాజికల్ సర్వే  తెలిపింది.
అన్ని విధాలా సహకరిస్తాం: మోదీ
 ‘ఎక్కడ ఎలాంటి సాయం కావాలన్నా అందించాలని అధికారులను ఆదేశించాను. పాక్, అఫ్ఘాన్‌తో సహా అందించటానికి సిద్ధంగా ఉన్నాం. జమ్మూకశ్మీర్ సీఎం సయీద్‌తో ఫోన్‌తో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నా. అఫ్ఘాన్ అధ్యక్షుడు ఘనీ, పాక్ ప్రధాని  షరీఫ్‌లతో మాట్లాడి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చాను. అఫ్ఘాన్‌లో స్కూలు పిల్లలు చనిపోవటం నాకు చాలా ఆవేదన కలిగించింది’అని  ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.


ప్రాణభయంతో పరుగులు...
  హింద్‌కుష్ పర్వత శ్రేణుల్లో సంభవించిన భూ ప్రకంపనలు ఉత్తర, వాయవ్య భారత ప్రాంతాలన కుదిపేశాయి. మధ్యాహ్నం 2.39 గంటలకు సంభవించిన భూకంపం, జమ్మూకశ్మీర్‌తో పాటు, దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలను వణికించింది. ఆఫీసులు, ఆస్పత్రులు, సినిమాహాళ్లల్లోంచి ప్రజలు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. కశ్మీర్‌లో ముగ్గురు చనిపోయారు. భూకంప వార్తలు వచ్చిన మరుక్షణమే ప్రధానిమోదీ పరిస్థితిని సమీక్షించారు.