Wednesday, January 11, 2017

'ఖైదీ నంబర్ 150' మూవీ రివ్యూ


ఇటీవల కాలంలో టాలీవుడ్ లో భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా ఖైదీ నంబర్ 150. తొమ్మిదిన్నరేళ్ల తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించటం. తండ్రి రీ ఎంట్రీ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మారటం. తమిళంలో ఘనవిజయం సాధించిన కత్తి సినిమాకు ఖైదీ నంబర్ 150 రీమేక్ కావటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి మెగాస్టార్ ఆ అంచనాలను అందుకున్నాడా..? ఖైదీ నంబర్ 150 గా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు బాస్ ఈజ్ బ్యాక్ అనిపించాడా..?
 కథ :
తమిళంలో ఘన విజయం సాధించిన కత్తి కథకు దాదాపు ఎలాంటి మార్పులు చేయకుండానే ఈ సినిమాను తెరకెక్కించారు. దొంగతనాలు, మోసాలు చేసి కోల్ కతా సెంట్రల్ జైల్ లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ కత్తి శ్రీను (చిరంజీవి). ఆ జైలు నుంచి ఓ ఖైదీ పరారవ్వటంతో ఆ ఖైదీని పట్టుకోవడానికి జైలర్, కత్తి శ్రీనును సాయం అడుగుతాడు. ఖైదీని పట్టించి శ్రీను జైలు నుంచి పారిపోతాడు. ఇండియాలో ఉంటే పోలీసులను తప్పించుకోలేమని తన ఫ్రెండ్(అలీ) సాయంతో బ్యాంకాక్ వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఎయిర్ పోర్ట్ లో లక్ష్మీ(కాజల్)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడి, బ్యాంకాక్ ప్రయాణం మానుకొని ఇండియాలో ఉండిపోతాడు.

లక్ష్మీ అడ్రస్ ఎలా సాధించాలని ఆలోచిస్తుండగా అచ్చు శ్రీనులానే ఉన్న శంకర్(చిరంజీవి) ను కొంత మంది వ్యక్తులు యాక్సిడెంట్ చేసి కాల్చి వెళ్లిపోతారు. కొన ఊపిరితో ఉన్న శంకర్ ను కాపాడి శంకరే శ్రీను అని పోలీసులు నమ్మేలా తన వస్తువులు శంకర్ దగ్గర ఉంచి వెళ్లిపోతాడు. దీంతో శంకర్ ను కోల్ కతా పోలీసులు అరెస్ట్ చేస్తారు. లక్ష్మీ హ్యాండ్ ఇచ్చిందని తెలుసుకున్న శ్రీను తిరిగి బ్యాంకాక్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న సమయంలో శంకర్ కు సంబంధించిన వాళ్లు శ్రీనును శంకర్ అనుకొని తీసుకెళతారు. అదే సమయంలో శంకర్ ను చంపడానికి ప్రయత్నించిన కార్పోరేట్ ఇండస్ట్రియలిస్ట్ అగర్వాల్(తరుణ్ అరోరా) శ్రీనును పిలిపించి 25 కోట్లు ఇస్తా నీతో ఉన్న ముసలి వాళ్లను వదిలేసి వెళ్లిపోమని చెపుతాడు. అందుకు ఒప్పుకున్న శ్రీను డబ్బు తీసుకొని బయల్దేరతాడు.

కానీ శంకర్ కోసం ఏర్పాటు చేసిన ఓ సన్మాన సభలో అతని పోరాటం గురించి తెలుసుకున్న శ్రీను.. మనసు మార్చుకుంటాడు. నిజాయితిగా శంకర్ చేస్తున్న పోరాటం గెలవటం కష్టమని.. తానే శంకర్ గా మారి రైతులను గెలిపించాలని నిర్ణయించుకుంటాడు. అసలు శంకర్ చేస్తున్న పోరాటం ఏంటి..? ఓ టీవీ రిపోర్ట్ కూడా పట్టించుకోని సమస్యను శ్రీను దేశం దృష్టిలో పడేలా ఎలా చేశాడు..? చివరకు శంకర్ ఆశయం గెలిచిందా..? శంకర్, శ్రీనులు కలిసారా..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
తొమ్మిదిన్నరేళ్ల తరువాత వెండితెర మీద హీరోగా కనిపించిన మెగాస్టార్ చిరంజీవి తనలో ఏమాత్రం జోష్, గ్రేస్ తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. మాస్ డ్యాన్స్ లు, యాక్షన్స్ సీన్స్ తో తన అభిమానులను ఫుల్ ఖుషీ చేశాడు. ముఖ్యంగా తన మార్క్ కామెడీ టైమింగ్ తో రీ ఎంట్రీలో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లో చిరు నటన కంట తడి పెట్టిస్తోంది.

హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన పరిథి మేరకు ఆకట్టుకుంది. నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినా.. గ్లామర్ సీన్స్ తో మెప్పించింది. మెయిన్ విలన్ గా నటించిన తరుణ్ అరోరా తెర మీద కనిపించింది కొద్దిసేపే అయినా.. స్లైలిష్ లుక్స్ తో పరవాలేదనిపించాడు. చిరు ఫ్రెండ్ గా అలీ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళీ, జయప్రకాష్ రెడ్డిలు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా కామెడీ కోసం క్రియేట్ చేసిన బ్రహ్మానందం క్యారెక్టర్, చిరు బ్రహ్మీల మధ్య వచ్చే కామెడీ సీన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. శంకర్ స్థానంలోకి వచ్చిన చిరు తన వేషం భాషా ఏ మాత్రం మార్చుకోకపోయినా తన వారు గుర్తుపట్టకపోవటం లాంటివి పక్కన పెడితే.. సినిమాను చిరు అభిమానులను అలరించే పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించటంతో వినాయక్ విజయం సాధించాడు. 60 ఏళ్ల చిరును ఇప్పటికీ మాస్ హీరోగా చూపించేందుకు టెక్నికల్ టీం చాలా కృషి చేసింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, జానీ, శేఖర్, లారెన్స్ మాస్టర్ల కొరియోగ్రఫీ ఇలా అన్ని మెగా రీ ఎంట్రీ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. తన తండ్రి  రీ ఎంట్రీ కోసం నిర్మాతగా మారిన రామ్ చరణ్ ఖర్చు వెనుకాడకుండా బెస్ట్ అవుట్ పుట్ కోసం పడిన కష్టం తెర మీద ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. అంతేకాదు అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ అంటూ మెగాస్టార్ తో కలిసి చరణ్ వేసిన స్టెప్పులు మెగా అభిమానులకు బోనస్.
ఓవరాల్ గా ఖైదీ నంబర్ 150.. మాస్ క్లాస్ ఆడియన్స్ ను అలరించే పక్కా కమర్షియల్ సినిమా. బాస్ ఈజ్ బ్యాక్