ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ సంచలనం. సాధారణ మ్యాచ్‌ల్లోనే సులభంగా సాధ్యమయ్యే ఫీట్ కాదిది. అలాంటిది తొలి టీ20 ప్రపంచకప్‌లోనే బలమైన ఇంగ్లండ్ జట్టు బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో సాధించి చూపాడు రెండు వరల్డ్‌కప్ టోర్నీల్లో హీరోగా నిలిచిన యువరాజ్. మరోసారి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదేస్తా అంటున్నాడు.
మొహాలిలో కింగ్స్ లెవన్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌సింగ్ (42; 24 బంతుల్లో 3×4, 3×6) తన అద్భుత ఆటతీరుతో సన్‌రైజర్స్‌కు అసాధారణ విజయం అందించి ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 179/4 పరుగులు చేసింది. ఛేదనలో రన్‌రేట్ పెరిగిపోతున్న దశలో దీపక్‌హుడా (34), బెన్‌కట్టింగ్(18) సహకారంతో మొహిత్‌శర్మ బౌలింగ్‌లో సిక్సర్లు బాది యువరాజ్ జట్టుకు విజయం అందించాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత యువీ క్యాన్సర్‌తో పోరాడుతున్న 17 మంది చిన్నారులతో ముచ్చటించాడు. ఈ సందర్భంలో ఓ చిన్నారి.. మీరు మళ్లీ ఆరు సిక్సర్లు కొడతారా అన్ని ప్రశ్నించగా... ‘నువ్వు ప్రార్థించు.. నేను మళ్లీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదేస్తా’ అని అన్నాడు. ఐతే అప్పుడు ఆరు సిక్సర్లు ఎలా కొట్టగలిగానో తెలియదనీ, ఆ ఫీట్ సాధించి చాలా ఏళ్లు గడిచిందని అన్నాడు.