Saturday, November 7, 2015

సచిన్ @ వార్న్

 నేటి నుంచి క్రికెట్ ఆల్ స్టార్స్ లీగ్
     న్యూయార్క్‌లో తొలి మ్యాచ్

అంతర్జాతీయ క్రికెట్‌లో తమ అద్భుత విన్యాసాలతో ఆటపై చెరగని ముద్ర వేసిన దిగ్గజ ఆటగాళ్లు మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ నిర్వహిస్తున్న ‘క్రికెట్ ఆల్ స్టార్స్’ టి20 లీగ్‌కు నేటి (శనివారం) నుంచి తెర లేవనుంది. దీంట్లో భాగంగానే ఆయా దేశాల మాజీ ఆటగాళ్లు తిరిగి మైదానంలోకి అడుగుపెడుతున్నారు. తమ సత్తా ఏమిటో నేటి తరానికి పరిచయం చేయనున్నారు.
సచిన్ జట్టే ఫేవరెట్
 ఇక జట్ల విషయానికొస్తే.. గంగూలీ, సెహ్వాగ్, లక్ష్మణ్, బ్రియాన్ లారా లాంటి దిగ్గజాలతో సచిన్ జట్టు బ్యాటింగ్‌లో బలంగా ఉంది. భారత్ తరఫున గంగూలీతో పాటు సెహ్వాగ్‌తోనూ సచిన్ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఈసారీ అలాంటి దృశ్యమే కనిపించనుందా లేక దాదా, వీరూ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తారా అనేది వేచి చూడాలి. బ్రియాన్ లారా, జయవర్ధనే, ఆల్‌రౌండర్ క్లూసెనర్ ప్రత్యర్థిని ఎలా వణికిస్తారనేది ఆసక్తికరం. ఇక బౌలింగ్‌లో పేసర్లు అక్తర్, పొలాక్, మెక్‌గ్రాత్, స్పిన్నర్ మురళీధరన్, స్వాన్  సత్తా తెలిసిందే. వీరంతా తమ పూర్వపు స్థాయి అందుకుంటే గెలుపు ఖాయమే..

 సంగక్కరే కీలకం
 వార్న్ వారియర్స్ జట్టులో కుమార సంగక్కర కీలకంగా కనిపిస్తున్నాడు. ఇటీవలి వరకు క్రికెట్‌తో టచ్‌లో ఉండడంతో పాటు పొట్టి ఫార్మాట్‌లో మంచి అనుభవముంది. వార్న్ కూడా బిగ్‌బాష్‌లో మెరిసినవాడే. కలిస్ ప్రభావం చూపించవచ్చు. ఫీల్డింగ్‌లో జాంటీ రోడ్స్ పాదరసంలా కదిలితే సచిన్ జట్టు పరుగుల కోసం చెమటోడ్చాల్సిందే. బౌలింగ్‌లో 49 ఏళ్ల వసీం అక్రమ్ మరోసారి తన యార్కర్ పవర్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. స్పిన్నర్లు వెటోరి, సక్లయిన్ ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి.

 జట్లు
 సచిన్ బ్లాస్టర్స్: సచిన్ (కెప్టెన్), గంగూలీ, సెహ్వాగ్, లక్ష్మణ్, లారా, జయవర్ధనే, హూపర్, మొయిన్ ఖాన్, మురళీధరన్, స్వాన్, అంబ్రోస్, పొలాక్, మెక్‌గ్రాత్, క్లూసెనర్, అక్తర్.
 వార్న్ వారియర్స్: వార్న్ (కెప్టెన్), హేడెన్, వాన్, పాంటింగ్, రోడ్స్, కలిస్, సైమండ్స్, సంగక్కర, సక్లయిన్, వెటోరి, వాల్ష్, అక్రం, డొనాల్డ్, అగార్కర్.