Sunday, November 7, 2010
తీవ్రత తగ్గిన 'జల్'
కొద్దిరోజులుగా వణుకు పుట్టించిన జల్ తుపాను తీవ్రత తగ్గింది. తీవ్ర తుపాను నుండి సాధారణ తుపాను స్థాయికి జల్ తీవ్రత తగ్గినట్లు వాతావరణశాఖ ఆదివారం సాయంత్రం నిర్ధారించింది. ఇది మరింతగా బలహీనపడి చెన్నై, నెల్లూరుల మధ్య ఆదివారం రాత్రికే తీరం దాటే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. తుపాను కారణంగా నెల్లూరు జిల్లాలో 14 మంది, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. విశాఖ జిల్లాలో ఒక మత్స్యకారుడు గల్లంతయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవాని లంక వద్ద సముద్రంలో 15 మంది జాలర్లతో కూడిన సోనా బోటు చిక్కుకుంది. కృష్ణపట్నం రేవులో పదో నెంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు. పులికాట్ సరస్సు పొంగుతోంది. కాళంగి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమశిల, కండలేరు జలాశయాలు నిండాయి. తుపాన్ ప్రభావంతో నెల్లూరు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో పెద్దఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. సముద్రం కల్లోలంగా ఉంది.రాత్రి 7.30 గంటలకు భారత వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం తుపాన్ చెన్నై తీరానికి 90 కిలోమీటర్లు దూరాన, నెల్లూరుకు 200 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉంది.
దక్షిణ కోస్తా జిల్లాల వైపు నెమ్మదిగా కదులుతున్న తుపాను ఆదివారం రాత్రి 12 గంటల నుండి సోమవారం తెల్లవారుజామున రెండు గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. అయితే తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు మీటరు నుంచి రెండు మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. తుపాను తీవ్రత తగ్గినప్పటికీ మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను కొనసాగిస్తోంది.
అహ్మదాబాద్ టెస్టు : భారత్ 82/6
న్యూజిలండ్‌తో జరుగుతున్న తొలిటెస్టు నాలుగో రోజున ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 82 పరుగుల మాత్రమే చేసింది. లక్ష్మణ్ 34, భజ్జీ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ గంభీర్ 0, సెహ్వాగ్ 1, ద్రావిడ్ 1, సచిన్ 12, రైనా 0, ధోని 22 పరుగులకే అవుట్ అయ్యారు. మార్టిన్ భారత్‌ను దెబ్బమీద దెబ్బ తీశాడు. భారత్ 110 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Subscribe to:
Posts (Atom)