Sunday, March 20, 2016

ఔను... నేనంతే!

 సినిమాల్లో తప్ప నయనతార విడిగా కనిపించరు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరు. యాడ్స్‌లో నటించరు. అప్పుడెప్పుడో ఓ యాడ్‌లో నటించారంతే. పబ్లిక్ దర్శనాలు ఎక్కువ ఇవ్వకపోవడానికి నయనతార కారణాలు నయనతారకున్నాయి. అయితే, ఇలా చేయడం వల్ల నయనతార ఫ్రెండ్లీ టైప్ కాదనీ, గర్వం అనీ, పొగరనీ చాలామంది అనుకుంటారు. ఈ విషయం గురించి నయనతార ప్రస్తావిస్తూ, ‘‘అవును. నేను పొగరుబోతునే! అహంకారిని కూడా! అయితే, నాతో వేళాకోళంగా ప్రవర్తించే వాళ్ల దగ్గరే అలా ఉంటాను. మిగతావాళ్ల దగ్గర అలా ఉండాల్సిన అవసరం నాకేంటి?’’ అన్నారు. తమిళ, తెలుగు, మలయాళ భాషా చిత్రాలతో తెగ బిజీగా ఉన్న ఈ మలయాళ సుందరి తన స్వభావం గురించి ఇంకా చాలానే చెప్పారు.            ‘‘నాతో సినిమాలు చేసినవాళ్లకూ, చేసేవాళ్లకూ నేనెంత ఫ్రెండ్లీగా ఉంటానో తెలుసు! నా గురించి నేను ఎక్కువ చెప్పుకుంటున్నానని అనుకోకపోతే ఒక్క మాట. నాది చాలా స్వీట్ నేచర్! షూటింగ్ లొకేషన్లో చాలా సరదాగా ఉంటాను. అందరితోనూ మాట్లాడుతుంటాను’’ అని ఆమె తన వాదన వినిపించారు. ఇన్నీ చెబుతూనే, ఒక్క విషయం కుండబద్దలు కొట్టారు. ‘‘ఏమైనా, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. నాకు మర్యాద ఇస్తే... నేనూ వాళ్ళకు మర్యాద ఇస్తా. ఒకవేళ నా దగ్గర మర్యాదగా నడుచుకోకూడదని ఎవరైనా నిశ్చయించుకుంటే, నా నుంచి కూడా ఇక మర్యాద ఎక్స్‌పెక్ట్ చేయొద్దు’’ అన్నారు.

షారుఖ్‌.. సన్నీ లైలా ఓ లైలా

 80వ దశకంలో బాలీవుడ్‌ను ఓ వూపు వూపేసిన క్లబ్‌ పాట ‘లైలా ఓ లైలా...’. ఫిరోజ్‌ ఖాన్‌, జీనత్‌ అమన్‌, వినోద్‌ ఖన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘ఖుర్బానీ’లో పాట అది. ఆ హుషారును మరోసారి బాలీవుడ్‌ తెరపై చూపించడానికి రంగం సిద్ధమవుతోంది. షారుఖ్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘రాయీస్‌’లో ఈ పాటను రీమేక్‌ చేయాలని నిర్ణయించారట. ఇందులో షారుఖ్‌ పక్కన సన్నీ లియోని స్టెప్పులేయబోతోంది. ‘‘రాయీస్‌’లో ఓ ప్రత్యేక గీతం పెట్టాలనే ఆలోచన వచ్చింది. అందులోనూ అది 80వ దశకం నాటి వాతావరణంలో ఉండాలి. అందుకే ‘లైలా ఓ లైలా..’ పాటను ఎంచుకున్నాం. ఇప్పటికే దీని హక్కుల కొనుగోలు జరిగిపోయింద’’ని సినిమా వర్గాలు చెబుతున్నాయి. నాటి కాలాన్ని ప్రతిబింబించేలా ఓ బార్‌ సెట్‌ కూడా వేశారు. ఇందులో రెండు రోజులపాటు చిత్రీకరణ జరుపుతారు. ఇప్పటికే షారుఖ్‌, సన్నీ రిహార్సల్స్‌ మొదలెట్టేశారని తెలుస్తోంది.

ధోనీ భార్యకు కోపం వచ్చింది..


గత రాత్రి ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన టి 20 మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై గెలిచిన ఆనందంలో క్రికెట్ అభిమానులంతా సంబరాలు జరుపుకోగా ధోనీ సతీమణి సాక్షికి మాత్రం చిరు కోపం వచ్చిందట.. అది కూడా భారత్ అభిమానులపై!  అంత చిరాకు పెట్టేలా అభిమానులు ఏం చేసుంటారనుకుంటున్నారా ? ధోనీ గారాల పట్టి జీవాకు నిద్రా భంగం కలిగించారు.         భారత్ మ్యాచ్ గెలిచిన సంబరంలో కొందరు అభిమానులు ధోనీ ఇంటి ముందు బాణా సంచా పేల్చి హంగామా చేయడం మొదలుపెట్టారు.అప్పటికే బాగా పొద్దు పోవడంతో సాక్షి కాస్త ఇబ్బంది పడ్డారు. పాప నిద్ర లేస్తుందని చెప్తూ చిరు కోపాన్ని ట్విట్టర్ లో ప్రదర్శించారు!           టీం ఇండియాకు శుభాకాంక్షలు చెబుతూనే.. ఇంటి ముందు హంగామాను కూడా వివరించారు. 'మీరంతా కలిసి నా చిన్నారిని నిద్ర లేపేలా ఉన్నారు. నేను తప్పకుండా ఏదో ఒక రోజు భారత్-పాక్ మ్యాచ్ గురించి పాపకు చెప్తాను, కానీ ఇప్పుడు తను చాలా చిన్నపిల్ల కదా.. ఏం జరుగుతుందో, వాళ్ల నాన్న ఎవరో .. ఇవేమీ పాపకు అర్థం కావు' అంటూ ట్వీట్ చేశారు సాక్షి సింగ్ ధోనీ.