ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో ఓటములతో సతమవుతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు కష్టాలు మరింత పెరగనున్నాయి. డేర్ డెవిల్స్ సారథి వీరేంద్ర సెహ్వాగ్ భుజం గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. ఐపీఎల్ నాలుగో సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్న సెహ్వాగ్ భుజం గాయానికి చికిత్స చేసుకునేందుకు గానూ వెంటనే లండన్ వెళ్లనున్నాడు. జూన్, జులై నెలల్లో జరిగే వెస్టిండీస్ టూర్‌కు కూడా సెహ్వాగ్ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సెహ్వాగ్ గైర్హాజరీలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ హోప్స్ ప్రస్తుత సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టు పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది. ఆడిన 11 మ్యాచ్‌లలో ఈ జట్టు నాలుగు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది.