Tuesday, October 4, 2016

కొత్త జిల్లాల్లో దసరాకు సెలవు నో

 దసరా పండుగ రోజున ఉద్యోగులు విధిగా విధులకు హాజరుకావాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ రోజున కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నందు న సెలవును రద్దు చేసింది. జిల్లాల  పునర్విభజనతో సంబంధ మున్న ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశాలు జారీ చేశారు.

 జిల్లాల ప్రారంభం రోజున ఉదయం 10:30 గంటలకల్లా కలెక్టరేట్, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు విధులకు హాజరుకావాలని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా వర్క్ టు సర్వ్ ఆర్డర్లను అందజేయాలని సూచించారు. అన్ని విభాగాల ఉద్యోగులకు వర్తించేలా సింగిల్ ఆర్డర్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక పునర్విభజన పరిధిలోకి రాని ఉద్యోగులు సోమవారం (10వ తేదీ) ఐచ్చిక సెలవును వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.
 
వేడుకలు నిర్వహించండి
నూతన జిల్లా, డివిజన్, మండలాలకు అవసరమైన ఫైళ్లు, స్టేషనరీ, ఫర్నిచర్ ఇతర సరంజామాను ఆయా కార్యాలయాలకు తక్షణం చేరవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆవిర్భావ ఏర్పాట్లను ఘనంగా నిర్వహించేందుకు ఆయా విభాగాల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యమైన ఫైళ్లను మాత్రం మాతృ (ప్రస్తుత) జిల్లా కార్యాలయాల్లోనే ఉంచాలని.. పరిపాలన కుదుటపడ్డాక సంబంధిత కార్యాలయాలకు బదిలీ చేయాలని పేర్కొంది. నూతన మండలాల్లో ఆవిర్భావ వేడుకలను ఇన్‌చార్జి అధికారులు నిర్వహించాలని కోరింది. కొత్త జిల్లాలకు కొత్త వెబ్‌సైట్, ఫేస్‌బుక్ ఖాతాలను అదే రోజున ఆవిష్కరించాలని స్పష్టం చేసింది.
 
తొలి రోజునే పని విభజన
జిల్లాల ఆవిర్భావం రోజునే ఏ అధికారి ఏ విధులు నిర్వహించాలి, ఏయే విభాగం ఏయే దస్త్రాలను పరిశీలించాలన్న అంశంపై పని విభజన జరగాలని సర్కారు ఆదేశించింది. దానివల్ల ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోవడం ఉండదని స్పష్టం చేసింది. ప్రజల నుంచి అందే అర్జీలను పరిష్కరించేందుకు సిటిజన్ చార్టర్ అమలు పక్కాగా జరిగేం దుకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలని ఆదేశించింది. ఇక మండలాలను ఏ, బీ, కేటగిరీ లుగా విభజించిన ప్రభుత్వం దానికి అనుగుణంగా ఉద్యోగులను కేటాయించనుంది. ‘ఏ’ కేటగిరీలోని మండలాలకు ఉద్యోగుల కేటాయింపులో కోత ఉండదు. బీ కేటగిరీ మండలాలకు సిబ్బందిని కుదించనున్నారు. ఆయా మండలాలకు డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఉండదని అధికారవర్గాలు తెలిపాయి.

తాగి కారు నడిపిన నటుడి కుమారుడు

ప్రముఖ నటుడు అలోక్‌నాథ్‌ కుమారుడు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో పట్టుపడ్డాడు. సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత అలోక్‌నాథ్‌ కుమారుడు శివాంగ్‌నాథ్‌, ఓ స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి మిగిలిన స్నేహితులతో కలిసి తిరిగి వస్తుండగా, ట్రాఫిక్‌ పోలీసులు అతడి కారును ఆపే ప్రయత్నం చేశారు. అయితే అతడు కారు ఆపకుండా ఇంకా వేగాన్ని పెంచి, పారిపోవాలని ప్రయత్నించాడు. శాంతాక్రజ్‌ పోలీసులు వెంబడించి పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
శివాంగ్‌ వద్ద కనీసం డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా లేదు. అయితే అతడి వెంట వున్న మహిళా స్నేహితులు పోలీసులతో వాగ్వాదానికి దిగి, తామే వాహనాన్ని నడిపామని తెలిపినట్లు పోలీసులు తెలిపారు.అనంతరం బాంద్రా ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు, పోలీసులతో నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు మరో కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్‌ అశోక్‌ దుదే తెలిపారు. అనంతరం వాహనాన్ని సీజ్‌ చేసి, జరిమానా రూ.2,600 విధించినట్లుగా తెలిపారు.

పరుగు ఆపేశా

 ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క... అంటూ ప్రభాస్‌ ‘మిర్చి’లో ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెబుతాడు. కథానాయిక కాజల్‌ కూడా ఇంచుమించు అదే చెబుతోంది. కాకపోతే ఇక్కడ కాజల్‌ చెబుతున్నది సినిమా కోసం కాదు, తన కెరీర్‌ గురించే. ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలో కొనసాగుతున్న సీనియర్‌ కథానాయికల్లో కాజల్‌ ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె అవకాశాల్ని అందుకొంటోంది. సుదీర్ఘమైన ఈ ప్రయాణం కోసం మీరు అనుసరించిన వ్యూహాలు ఎలాంటివి? అని అడిగితే... ‘‘కథానాయికగా ఇంత దూరం నేను ప్రయాణం చేయాలని, ఇన్నేళ్లు నటిగా కొనసాగాలని నేనెప్పుడూ ప్రణాళికలు వేసుకోలేదు. అయినా చిత్రసీమలో వ్యూహాలు, ప్రణాళికలు చెల్లుబాటవుతాయంటే నేను నమ్మను. మనం ఒకటి వూహిస్తే, వాస్తవంలో మరోటి జరుగుతుంటుంది. అందుకే తొలినాళ్లల్లో ఇదే నా చివరి సినిమా అనుకొనేదాన్ని. కొన్నాళ్ల తర్వాత కెరీర్‌పై పట్టు పెరిగింది. వరుసగా అవకాశాలొస్తున్నప్పుడు ఇక దేని గురించీ ఆలోచించే అవసరం రాలేదు. అయితే అంతా సీనియర్‌ కథానాయిక అని పిలుస్తున్నప్పట్నుంచే నా ఆలోచనల్లో మార్పులొచ్చాయి. వ్యూహం అంటారో, ఇంకేమంటారో తెలియదు కానీ.. ఇక నుంచి మాత్రం కొత్త లెక్కలతో ప్రయాణం చేయాలనుకొంటున్నా. చేసే ప్రతి పాత్ర నటిగా ఆత్మ సంతృప్తినిచ్చేలా ఉండాలనే ఆలోచనతో సినిమాల్ని ఎంపిక చేసుకొంటున్నా. ఇదివరకటి పరుగుని ఆపేశా. ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ పనిచేస్తున్నా’’ అని చెప్పుకొచ్చింది కాజల్‌.