Wednesday, February 15, 2017

లేడీ గెటప్.. నాకు అన్నం పెట్టింది


సినిమాలపై మోజుతో ఓ యువకుడు ఇంట్లో చెప్పకుండా కృష్ణానగర్‌ వచ్చి అనేక కష్టాలకు ఓర్చి ఓ సినిమా కార్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌గా చేరి తన లక్ష్యానికి చేరువయ్యాడు. ఈ ప్రస్థానంలో ఆ యువకుడు లేడీ గెటప్‌తో ఆకట్టుకుంటూ బుల్లితెరపై వెలుగుతున్నాడు. నటనపై మక్కువతో 15 ఏళ్లుగా సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తనకు అచ్చొచ్చిన ఆడపాత్రలో బుల్లితెరపై నవ్వులు పూయిస్తున్నాడు. అతడే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన కె.శాంతికుమార్‌. వాస్తవంగా శాంతికుమార్‌ అంటే ఎవరికీ తెలియదు. లేడీ గెటప్‌లో ‘శాంతి స్వరూప్‌’గా మాత్రమే సుపరిచితుడు. తనదైన మేనరిజంతో సందడి చేస్తూ అలరిస్తున్న ఈ బక్కపల్చటి యువకుడు తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. ఆ వివరాలు అతడి మాటల్లోనే.. 
  అర్ధాకలితో అలమటించా..
సినిమా మోజుతో కృష్ణానగర్‌లో మకాం పెట్టి చాలా కష్టాలు ఎదుర్కొన్నా. కొన్ని రోజులు నీళ్లతోతోనే కడుపు నింపుకోవాల్సి వచ్చింది. తర్వాత ఓ సినిమా కార్యాలయంలో రూ.1000 జీతంతో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తూ స్టూడియోల చుట్టూ ఒక్కచాన్స్‌ అంటూ తిరిగాను. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తచ్చాడుతున్న నన్ను జబర్దస్త్‌ కమెడియన్స్‌ రాఘవ, రచ్చ రవి చూశారు. నటనపై నాకున్న మక్కువను వారి దృష్టికి తీసుకెళితే.. తమ జట్టులో ఓ అవకాశం ఇచ్చారు. శాంతిగా కామెడీ టైమింగ్‌తో మంచి మార్కులు పడ్డాయి. దాంతో అవకాశాలు వచ్చాయి.
ఇప్పటి వరకూ 80 స్కిట్స్‌..
వచ్చేవన్నీ లేడీ గెటప్‌లే. అయినా సరే.. ఈ శాంతి ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. దాదాపు అన్ని చానళ్లలోనూ ఆ గెటప్‌లోనే కనిపిస్తున్నా. మొన్నటి దసరా మహోత్సవం స్కిట్‌లో యాంకర్‌ శ్రీముఖిని అనుసరిస్తూ చేసిన డ్రామా ప్రేక్షకులకు ఆకట్టుకుంది. నా శరీరతత్వం.. లేడీ గెటప్‌లో నా వేషధారణతో అన్ని టీంలవారు ప్రోత్సహిస్తూ వారి స్కిట్‌లో అవకాశం ఇస్తున్నారు. ఒక్కసారి మొహానికి రంగు వేసుకున్నాక.. ఏ నటుడన్నా ఏ పాత్ర వేయడానికైనా సిద్ధంగా ఉంటాడు.. నేనూ అంతే. 
  నా చీరలు బాగుంటాయట.. 
ఇటీవల ప్రైవేట్‌ ప్రోగ్రామ్స్‌ ఇవ్వడానికి వెళుతున్నా. అక్కడ నన్ను చూసిన చాలామంది మగవాళ్లే మీ చీరలు బాగుంటాయని కితాబిస్తున్నారు. నా భార్యకు కూడా చీరల సెలక్షన్‌లో ఇంత ప్రావీణ్యం లేదంటూ వాళ్ల ముందే నన్ను పొగుడుతుంటారు. అది  నాకు చాలా సంతోసంగా ఉంటుంది.
ఆడీ లేదు.. ఆనందం ఉంది
నాకు ఆడీ కారుందని, పెద్ద ఇల్లు ఉందని ఇటీవల సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అవన్నీ నిజం కాదు.. ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తున్నప్పుడు పైసాపైసా దాచుకుని ఓ స్కూటీ కొనుకున్నా. నాకున్నది అదొక్కటే. ఆడి కారు లేదు కానీ నా కష్టాలు మరిచిపోయేలా రెండు పూటలా తిండికి, ఇంటి అద్దె చెల్లించే స్తోమత మాత్రం జబర్దస్త్‌ ఇచ్చింది.