ముంబయికి చెందిన ముషీర్ ఖాన్ అనే చిచ్చరపిడుగు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. 114 ఏళ్ల గైల్స్ షిల్డ్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడిన అతిచిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఆరు సంవత్సరాల తొమ్మిది నెలల వయస్సున్న ముషీర్ ఖాన్ మంగళవారం ముంబయిలో జరిగిన అండర్ -14, ఇంటర్ స్కూల్ గైల్ షీల్డ్ పోటీల్లో పాల్గొని అందరిని ఆశ్చర్య పరిచాడు. ఓపెనింగ్ బ్యాటింగ్‌కు దిగిన ముషీర్ 28 బంతులాడి మూడు పరుగులు సాధించాడు. అంతేకాదు ఇతను మంచి లెఫ్ ఆర్మ్ స్మిన్నర్ కూడా. ఐదు ఓవర్లు వేసిన ముషీర్ 12 పరుగులిచ్చాడు. తొలి మ్యాచులో పెద్దగా రాణించనప్పటికీ ఈ బుల్లి క్రికెటర్ అందరిని ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ డానియల్ వెటోరి తన ఆదర్శమంటున్నాడు ఈ బుడతడు. భవిష్యత్తులో గొప్ప క్రికెటర్ కావాలన్నదే తన లక్ష్యమంటున్నాడు. ముషీర్ అంజుమన్ -ఈ- ఇస్లాం అల్లెనా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదువుతున్నాడు. ముషీర్ తండ్రి నౌషద్ ఖాన్ క్రికెట్ కోచ్ కాగా, అన్నయ్య సర్ఫ్‌రాజ్ ఖాన్ రెండేళ్ల క్రితం హరిస్ షీల్డ్ టోర్నమెంట్‌లో 438 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.