Tuesday, June 14, 2016

నన్ను పోలీసు అనుకునేవారు



డ్వెయిన్‌ జాన్సన్‌ అనే కన్నా.. ‘ది రాక్‌’ అంటేనే అతనెవరో అందరికి బాగా తెలుస్తుంది. ‘హెర్కులస్‌’.. ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ వంటి చిత్రాలతో మెప్పించి నటుడిగా స్థిరపడినా.. డ్వెయిన్‌ కెరీర్‌ మాత్రం రెజ్లింగ్‌ పోటీలతో ప్రారంభమైంది. ఆరు అడుగులకుపైగా ఎత్తు.. కండలు తిరిగిన దేహంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోకు.. చిన్నతనంలో భారీ శరీరాకృతే ఇబ్బందులు తెచ్చి పెట్టిందట.
‘మా నాన్న బాక్సర్‌. దీంతో చాలా ప్రదేశాలకు మారాల్సి వచ్చేది. ప్రతిసారి కొత్త ప్రాంతాలు.. కొత్త స్కూళ్లలో చదవాల్సి వచ్చేది. నాకు 14 ఏళ్ల వయస్సు వచ్చినప్పటినుంచి నా దేహాన్ని చూసి.. అందరూ నన్ను అండర్‌ కవర్‌ పోలీసు అని భావించేవాళ్లు. ఏ పాఠశాలకు వెళ్లినా అలాగే అనుకునేవారు. అది చాలా ఇబ్బందిగా అనిపించేది. 14 ఏళ్ల వయసులో నాలుగు స్కూళ్లు మారాను. దీంతో నాకు స్నేహితులెవరు లేకుండా పోయారు. కనీసం అమ్మాయిలతో సరదాగా గడిపే అవకాశం కూడా రాలేదు’ అని వాపోయాడు.

ఇది నాన్న కానుక: నిహారిక


నటుడు, నిర్మాత నాగబాబు తన కుమార్తె నిహారికకు ఆడి కారు గిఫ్ట్‌గా ఇచ్చారట. ఈ విషయాన్ని నిహారిక అభిమానులు ఫేస్‌బుక్‌ ద్వారా తెలుపుతూ నిహారిక తండ్రి నాగబాబుతో కారు పక్కన కలిసి దిగిన ఫొటోలను పోస్ట్‌ చేశారు. యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన నిహారిక ‘ముద్దపప్పు ఆవకాయ’ అనే యూట్యూబ్‌ సిరీస్‌లో నటించింది. ‘ఒక మనసు’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగశౌర్య కథానాయకుడిగా నటించారు. ఈ నెల 24న ‘ఒక మనసు’ చిత్రం విడుదల కానుంది.

మహేష్‌ దత్తత గ్రామంలో వైద్య శిబిరం



సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు దత్తత తీసుకున్న గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామంలో వైద్య ఆరోగ్య సర్వే నిర్వహించారు. మహేష్‌ తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... వైద్య విద్యార్థులు గ్రామస్థులను కలిసిన సమయంలో తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఎంతో శ్రమించి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి, అనారోగ్య సమస్యల గురించి తెలుసుకున్న యంగ్‌ ఇండియా వాలంటీర్‌ ఆర్గనైజేషన్‌కు మహేశ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యం పట్ల గ్రామస్థులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో 150 మంది వైద్య విద్యార్థుల బృందం పాల్గొన్నట్లు మహేష్‌ తెలిపారు.