Wednesday, January 25, 2017

రివ్యూ: రయీస్‌


 ‘బాలీవుడ్‌ బాద్‌షా’ షారుక్‌ ఖాన్‌. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారు. భావోద్వేగాలు పండించాలన్నా.. మాస్‌ని మెప్పించాలన్నా.. కుర్రకారుకు కిక్కిచ్చే రొమాన్స్‌ పండించాలన్నా ఆయనకు ఆయనే సాటి. అందుకే షారుక్‌ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకు వినోదపు విందు దొరికినట్లేనని భావిస్తారు. ఆయన తాజా చిత్రం ‘రయీస్‌’ పైనా అలాంటి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని గతేడాది జులైలో రంజాన్‌ సందర్భంగా విడుదల చేయాలనుకున్నప్పటికీ.. సల్మాన్‌ ఖాన్‌ ‘సుల్తాన్‌’ రావడంతో వాయిదా వేశారు. ఆరు నెలలు ఆలస్యంగా థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం సినీ అభిమానులను ఏ మేరకు అలరించింది? ప్రేక్షకుల అంచనాలను చేరుకుందా? అన్నది చూస్తే..
కథేంటి?: గుజరాత్‌లోని ఓ పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న ఆ రాష్ట్రంలో 1980.. 90 మధ్య కాలంలో జరిగిన అక్రమ వ్యాపారం నేపథ్యంతో సాగుతుంది. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన రయీస్‌ (షారుక్‌ ఖాన్‌) అక్రమ మద్యం వ్యాపారానికి అధిపతిగా ఎదుగుతాడు. తాను చేసేది తప్పా.. ఒప్పా అన్నది పట్టించుకోకుండా వ్యాపారం కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడతాడు.
తన వ్యాపారానికి అడ్డు చెప్పిన వారిని అంతమొందించేందుకూ వెనకాడడు. రాష్ట్రంలోని రాజకీయ.. పోలీసు.. కార్పొరేట్‌ వర్గాలను తన గుప్పిట్లో పెట్టుకునే స్థాయికి చేరుకుంటాడు. అయితే.. ఒక్కసారిగా రయీస్‌ జీవితం తలకిందులవుతుంది. వ్యాపారాధిపతిగా ఉన్న రయీస్‌ జీవితం ఒక్కసారి మారిపోవడానికి గల కారణాలేంటి? అతని అవినీతి అక్రమాలను ఎవరు.. ఎలా నిలువరించారు? చివరికి రయీస్‌ ఏమయ్యాడన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?: అక్రమ మద్యం వ్యాపారాన్ని కథాంశంగా తీసుకున్నప్పటికీ దాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు తడబడ్డాడు. మొదటి భాగంలో కొన్ని సన్నివేశాల్లో ఛాలెంజింగ్‌ ఛేజ్‌లు చేసిన షారుక్‌ మొదటి భాగాన్ని తన భుజాలపై నడిపించాడు. ద్వితీయార్ధంలో ఎమోషనల్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కంటెంట్‌ లేకుండానే కథ సాగినట్లు అనిపిస్తుంది. ముందుగానే వూహించేలా సన్నివేశాలు ఉంటాయి. కత్తెరకు మరికాస్త పని చెబితే బాగుండేది.
బలమైన కథ ఉన్నప్పటికీ కథనం మాత్రం దారి తప్పింది. రయీస్‌ అక్రమ బాగోతాలను బహిర్గతం చేసేందుకు నిజాయతీపరుడైన పోలీసు అధికారిగా నవాజుద్దీన్‌ సిద్దిఖీ వేసే ఎత్తులు ఆసక్తి రేకెత్తిస్తాయి. సంగీతం ఆకట్టుకునేలా ఉంది.
 
ఎవరెలా?: ఐదు పదుల వయసులోనూ పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో షారుక్‌ ఖాన్‌ మెప్పించారు. యాక్షన్‌ సన్నివేశాల్లో తన మార్క్‌ను చాటుకున్నారు. భావోద్వేగంతో కూడిన సన్నివేశాల్లో నటించడమంటే నవాజుద్దీన్‌ సిద్ధిఖీకి వెన్నతో పెట్టిన విద్య. ఈ చిత్రంలోనూ ఆయన తన మార్కును చాటుకోగలిగారు. నిజాయతీపరుడైన పోలీసు అధికారి పాత్రలో నవాజ్‌ ఒదిగిపోయారు. పాకిస్థానీ ముద్దుగుమ్మ మహీరా ఖాన్‌ నటన పర్వాలేదనిపిస్తుంది. ప్రత్యేక గీతంలో వచ్చిన సన్నీ లియోని ప్రేక్షకులకు హుషారెత్తిస్తుంది.
చివరగా.. ‘రయీస్‌’ ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది