టీమిండియా ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులు సాధించాడు. టెస్ట్ కెప్టెన్ గానూ అద్భుత విజయాలను సాధిస్తూ దూసుకెళ్తున్నాడు. టీమిండియాలో కీలక ఆటగాడిగా ఉన్నా కోహ్లీ మాత్రం ఇప్పటికీ ఓ వ్యక్తికి భయపడతాడట. అయితే అతడు ఓ బౌలర్ అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే కోహ్లీ అతడి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అంటే అంతగా భయపడిపోతాడట. బుధవారం తన జీవితం కథాంశంగా సీనియర్ క్రికెట్ జర్నలిస్ట్ విజయ్ లోకపల్లి రచించిన 'డ్రైవెన్' పుస్తకావిష్కరణలో విరాట్ పాల్గొన్నాడు. సందర్భంగా ఈ ఆసక్తికర అంశాన్ని కోహ్లీ వెల్లడించాడు.
కోచ్ అంటే ఉన్న అపార గౌరవం కారణంగా ఆయన ఎన్ని మాటలన్నా ఇప్పటికీ మౌనమే తన సమాధానమని చెప్పాడు. 1998 నుంచి రాజ్ కుమార్ శర్మే తన కోచ్‌గా ఉన్నారని, తానెప్పుడూ కోచ్ ను మార్చే ప్రయత్నం చేయలేదన్నాడు. కానీ, తప్పుచేస్తే కోచ్ నుంచి చీవాట్లు తినాల్సి వస్తుందని హడలిపోయేవాడినని మరోసారి గుర్తుచేసుకున్నాడు కోహ్లీ. ఐపీఎల్ లో తాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి మాత్రమే ఆడానని, భవిష్యత్తులోనూ తన నిర్ణయం ఇదేనని స్పష్టంచేశాడు.
భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, రవిశాస్త్రి ఈ ఈవెంట్లో పాల్గొని విరాట్ ఆటతీరును కొనియాడారు. సెహ్వాగ్ మాట్లాడుతూ.. తాను టీమిండియాలో కీలక ఆటగాడిగా ఉన్న సమయంలో 'ప్రదీప్ సాంగ్వాన్ తన వద్దకు వచ్చి భయ్యా ఓ బ్యాట్స్ మన్ నిన్ను కచ్చితంగా అదిగమిస్తాడు. నీ రికార్డులను బ్రేక్ చేస్తాడని చెప్పాడు. అతడు మరెవరో కాదు విరాట్ కోహ్లీ' అని వివరించాడు. కోహ్లీ ఫిట్ నెస్ అతడి బలమని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.