మనకు పిజ్జా కావాలంటే ఇలా ఆర్డర్ చేస్తే అలా తెచ్చి ఇచ్చేస్తారు. సమయానికి పిజ్జా డెలివరీ ఇవ్వడానికి రోడ్ల మీద డెలివరీ బాయ్స్ బైక్‌లపై రయ్ రయ్‌మని తిరగడం చూస్తుంటాం. కానీ పడవలో వెళ్లి పిజ్జా డెలివరీ ఇవ్వడం చూశారా.. కరేబియన్ సముద్రంలోని ద్వీపాల మధ్య పడవల్లో వెళ్లే వారికి పిజ్జా బోట్ సౌకర్యం ఉంది తెలుసా. ఆర్డర్ చేస్తే పడవలో వెళ్లి పిజ్జా ఇచ్చేస్తున్నారు అమెరికాకు చెందిన దంపతులు.
సాషా, తారా బోయిస్ అనే దంపతులకు పడవలు అన్నా, పడవ ప్రయాణం అన్నా.. పిజ్జాలు అన్నా చాలా ఇష్టమట. ఈ రెండింటినీ కలిపి ‘పిజ్జా పై’ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ఇందుకోసం అమెరికాలో ఉద్యోగాలు వదిలేసి కరేబియన్ సముద్రంలో పిజ్జాబోట్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. సాషా కంప్యూటర్ ప్రోగ్రామర్, తారా ఎలిమెంటరీ టీచర్ ఉద్యోగాన్ని వద్దనుకున్నారు. ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. బోట్‌నే కిచెన్‌గా మార్చేసి నోరూరించే పిజ్జాలు తయారుచేసి అమ్ముతున్నారు. అదే బోట్‌ను ఇల్లుగా మలుచుకొని ఆనందంగా గడిపేస్తున్నారు.