Tuesday, October 14, 2014

తక్షణ సాయంగా వెయ్యి కోట్లు మోడీ ప్రకటన

 
                    హుద్‌హుద్‌ తుపాను కారణంగా త్రీవంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపట్టడానికి తక్షణ సాయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెయ్యికోట్ల రూపాయలు ప్రకటించారు. సర్వే అయిన తర్వాత పూర్తిస్థాయి సాయం అందిస్తామని ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. విద్యుత్తు, తాగునీటి సరఫారా, కమ్యూనికేషన్ల వ్యవస్థ పునరుద్దరణే తమ ప్రాథమిక కర్తవ్యమని చెప్పారు. మంగళవారం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో విశాఖపట్నంకు సుమారు 1.30 గంటలకు చేరుకున్నారు. నగరంలో పర్యటించి నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడూతూ సాదారణ పరిస్థితులు నెలకొనే వరకూ విశాఖవాసులకు ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తుఫాను వల్ల పంటలు నష్టపోయిన విషయాన్ని కూడా బీమా సంస్థలతో మాట్లాడుతానన్నారు. విశాఖను స్మార్ట్‌ సిటీగా చేస్తానని అమెరికాలో చెప్పానని, అలాంటిది ఊహకందని రీతిలో నష్ట ంజరిగిందని వాపోయారు. ఇప్పుడు నష్టం జరిగినంత మాత్రాన నిరుత్సాహ పడక్కర్లేదని కూడా మోడీ ఊరటనిచ్చారు. తర్వలోనే పరిస్థితులు సాధారణ పరిస్థితులకు చేరుకుంటుదని ప్రధాని భరోసా ఇచ్చారు.
అంతక ముందు ఢిల్లీ నుంచి నేరుగా విశాఖకు చేరుకున్న మోడీ గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌, చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజుతోపాటు పలువురు రాష్ట్రమంత్రులు స్వాగతం పలికారు. నగరంలో తుఫాను ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న పలు ప్రాంతాలో ప్రధాని పర్యటించారు. అలాగే కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తుఫాను ప్రభావిత ప్రాంతాల ఫొటో ఎగ్జిబిషన్‌ను మోడీ పరిశీలించారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ రైల్వేలు, విమానాశ్రయం మరమ్మతు, జాతీయ రహదారులు తదితరాలను కేంద్రమే బాధ్యత తీసుకుంటుందని ప్రధాని భరోసా ఇచ్చారు. మృతులకు లక్షరూపాయాలు, క్షతగాత్రులకు రూ. 50వేలు సాయంగా మోడీ ప్రకటించారు. 

 
తుపాను బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన చిత్ర పరిశ్రమ 
హుదుర్‌ తుపాను ప్రభావానికి తీవ్రంగా నష్టపోయాన ఉత్తరాంధ్ర జిల్లాలను ఆదుకోవడానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ ముందుకువచ్చింది. కథానాయకులు, ఇతరులు విరాళాలు ఇచ్చి తమ పెద్ద మనుసును చాటుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి వారు ప్రకటించిన విరాళాలు
పవన్‌ కల్యాణ్‌ రూ.50 లక్షలు
మహేశ్‌ బాబు రూ. 25 లక్షలు
ప్రభాస్‌ రూ. 20 లక్షలు
జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ. 20 లక్షలు
అల్లు అర్జున్‌ రూ. 20 లక్షలు
రామ్‌చరణ్‌ తేజ రూ. 10 లక్షలు మరో 5 లక్షలు రామకృష్ట మిషన్‌కు ప్రకటించారు.
వెంకటసాయి మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ రాజశేఖర్‌ రూ. 30 లక్షలు

సంపూర్ణేశ్‌ బాబు రూ. 1 లక్ష
సూపర్‌ స్టార్‌ కృష్ణ రూ. 15 లక్షలు
విజయనిర్మల రూ. 10 లక్షలు


మూగబోయిన పోన్లు

                     ఆంధ్రప్రదేశ్‌లోని తుపాను ప్రభావిత విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో మూగబోయిన ఫోన్లు పూర్తిస్థాయిలో పనిచేయడానికి మరో వారం రోజులు పట్టే అవాకాశం ఉంది. ప్రస్తుతం విశాఖ నగరంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్లను పునరుద్ధరించడానికి అధికారులు యుద్ధప్రాతిపదికన పని చేస్తున్నారు. అవసరమైన కేబుల్స్‌, సామగ్రిని ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు పంపిస్తున్నారు. ఈ పనుల పర్యవేక్షణకు హైదరాబాదు నుండి పలువురు ఉన్నతాధికారులు విశాఖపట్టం వెళ్లారు. ఈ మూడు జిల్లాలో ఉన్న మొత్తం సెల్‌టవర్లలో సగానికి పైగా విరిగిపోయాయని విశ్వసనీయ సమాచారం.
 

చిన్నారి గిరిజ చనిపోయింది



రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. బోరు బావిలో పడిపోయిన చిన్నారి గిరిజ మృతి చెందిందని మంత్రి మహేందర్‌ రెడ్డి ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా గిరిజ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ప్రాణాలతో తిరిగి వస్తుందని అనుకున్న కుటుంబ సభ్యులు ఈ వార్త వినడంతో కుప్పకూలిపోయారు. అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గడిచిన రెండు రోజులుగా రెస్క్యూ టీం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగించింది. ఆదివారం మధ్యాహ్నం వ్యవసాయ క్షేత్రంలో అడుకుంటున్న గిరిజ (5) ప్రమాదవశాత్తు 60 అడుగులున్న బోరు బావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారిని వెలికి తీసేందుకు ప్రోక్లెయ్నిర్లు, సింరేణి నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సహాయక చర్యలు చేపట్టారు. భూమి లోపల బండరాళ్లు అడ్డు తగిలాయి. దీనితో గ్రిల్స్‌ వేస్తూ చర్యలు చేపట్టారు. బాలికను రక్షించేందుకు 4 జేసీబీలతో బోరుబావికి సమాంతరంగా 45 అడుగుల లోతులో గొయ్యి తవ్వి 8 సిలిండర్ల ఆక్సిజన్‌ పంపించినా ప్రయేజనం లేకపోయింది. అత్యాధునికమైన సిసి కెమెరాల సాయంతో చిన్నారిని గుర్తించారు. ఆమె మృతి చెందిందని చేప్పారు. మృతదేహంపైన మూడు అడుగుల నీరు ఉందని గ్రహించారు.