ముగ్ధమనోహర సౌందర్యంతో భారతీయ సినీ ప్రేమికుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలిసింది. ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఐష్ గత కొంతకాలంగా సినిమాలకు పూర్తి దూరంగా వుంటోంది. ‘హీరోయిన్’ చిత్రం నుంచి అర్థాంతరంగా తప్పుకున్న తర్వాత ఐశ్వర్య మరే చిత్రంలోనూ నటించలేదు. డెలివరీ తర్వాత ఓ సంవత్సరం విరామం తీసుకొని సినిమాల్లో నటిస్తానని ఐష్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఐశ్వర్య పరిస్థితిని గమనిస్తే ఇక ఏ మాత్రం సినిమాల్లో నటించే అవకాశం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ మధ్యన రెండు భారీ చిత్రాల్లో నటించడానికి ఐశ్వర్యకు ఆఫర్లు వచ్చాయి. తల్లి కావడం వల్ల ఐశ్వర్య కొంచెం ఒళ్లు చేసి బొద్దుగా తయారైంది. దీంతో ఆఫర్లతో ముందుకొచ్చిన నిర్మాతలు ఈ సుందరి మళ్లీ మునుపటిలా ఒక్కపల్చగా తయారవ్వాలనే షరతులు ముందుంచారట. అయితే చక్కటి డైటింగ్‌తో నాజూకు అందాల్ని సొంతం చేసుకునే వీలున్న, ఆ సమయంలో తన పాప ఆలనాపాలనకు దూరమౌతానేమోనన్న బెంగపట్టుకుందట ఐష్‌కు. దీంతో భారీ పారితోషికాలతో వచ్చిన ఆఫర్లను కూడా ఈ మద్దుగుమ్మ తిరస్కరించిందని తెలిసింది. ఈ సమయంలో తనకు పాపే ముఖ్యమని భావిస్తున్న ఐశ్వర్య పాప కోసం సినిమాల్ని వదులుకోవడానికి సిద్ధంగా వుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. దీంతో వెండితెరపై ఈ సుందరి సమ్మోహన రూపం చూసే అదృష్టం ఇక వుండబోదని ఆమె అభిమానులు నిరుత్సాహపడుతున్నారు.
No comments:
Post a Comment