Tuesday, December 8, 2015

నిర్మాతగా బిజీ అవుతోన్న హీరోయిన్

 అతి కొద్ది కాలంలో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హాట్ బ్యూటి అనుష్క శర్మ. హీరోయిన్ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే నిర్మాణ రంగం మీద దృష్టిపెట్టిన ఈ భామ, వరుసగా మూడు సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటోంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'ఎన్ హెచ్ 10' సినిమాతో నిర్మాతగా మారిన అనుష్క, అదే సినిమాలో నటనతో కూడా ఆకట్టుకుంది. అదే ఊపులో ఒకేసారి మూడు సినిమాల నిర్మాణానికి రెడీ అవుతోంది అనుష్క శర్మ. ఈ సినిమాలు, నా కోసం నేను నిర్మించుకుంటున్నా అంటున్న అనుష్క ఇప్పటికే రెండు సినిమాల కథా కథనాలు కూడా రెడీ అయ్యాయని, మరో సినిమాకు సంబందించిన కథా చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ మూడు చిత్రాల్లో, ఎన్ హెచ్ 10 సినిమాకు దర్శకత్వం వహించిన నవదీప్ సింగ్ ఒక సినిమాను డైరెక్ట్ చేస్తుండగా, మిగతా రెండు సినిమాల ద్వారా అన్షయ్ లాల్, అక్షంత్ వర్మలు దర్శకులుగా పరిచయం అవుతున్నారు.

ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు


 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి రెండు కొత్త జట్లు వచ్చాయి. వచ్చే రెండు సీజన్లలో పుణె, రాజ్ కోట్ ఫ్రాంచైజీలు ఆడుతాయని మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. బెట్టింగ్ ఉదంతంలో రెండేళ్ల పాటు నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల స్థానాల్లో ఈ రెండు జట్లను తీసుకున్నారు.  పుణె టీమ్ ను 16 కోట్ల రూపాయలకు న్యూ రైజింగ్ (సంజీవ్ గొయెంకా) సొంతం చేసుకోగా, రాజ్ కోట్ జట్టును 10 కోట్ల రూపాయలకు ఇంటెక్స్ దక్కించుకుంది.  చెన్నై, రాజస్థాన్ జట్లలోని టాప్-5 ఆటగాళ్లను.. పుణె, రాజ్ కోట్ ఎంపిక చేసుకునే అవకాశముంది. ఈ నెల 15న ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు.

Monday, December 7, 2015

దక్షిణాఫ్రికాపై టీమిండియా 3-0 తేడాతో ఘన విజయం



నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించింది. 481 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సఫారీలు 143 పరుగులకే చాపచుట్టేశారు. 72/2 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీలు మరో 71 పరుగుల మాత్రమే చేసి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయారు.  ఈ రోజు ఆటలో టీ విరామం వరకూ మ్యాచ్ ఫలితంపై పెద్దగా అంచనాలు లేకపోయినా తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీమిండియా బౌలర్లు వరుసగా వికెట్లు తీసి సఫారీలకు మరో షాకిచ్చారు. దాంతో టీమిండియా 337 పరుగులతో ఘన విజయం సాధించడమే కాకుండా సిరీస్ ను 3-0 తేడాతో గెలిచింది. టీమిండియా బౌలర్లలో రవి చంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు సాధించగా, ఉమేష్ యాదవ్ కు మూడు, రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్ లో వరుస రెండు సెంచరీలు చేసిన అజింక్యా రహానేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అశ్విన్ కు లభించింది.

                        చివరి టెస్టు.. కనీసం గెలవకపోయినా డ్రా చేయాలని సఫారీలు శతవిధాలా ప్రయత్నించారు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో గోడ కట్టినట్లే ఆటను కొనసాగించారు. అటు హషీమ్ ఆమ్లా దగ్గర్నుంచి.. ఇటు ఏబీ డివిలియర్స్ వరకూ ఎంతో శ్రమించారు. టీమిండియా బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొంటూ అత్యంత రక్షణాత్మక పద్ధతిని అవలంభించారు. ఆమ్లా 244 బంతుల్లో 25 పరుగులు, డివిలియర్స్ 297 బంతుల్లో 43 పరుగులు చేసి దక్షిణాఫ్రికాను గట్టెక్కించే యత్నం చేశారు. కాగా, చివరకు ఓటమి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు.
 


                                            లంచ్ తరువాత అసలు కథ..               నాల్గో టెస్టు ఆఖరి రోజు ఆటలో భాగంగా తొలి సెషన్ లో దక్షిణాఫ్రికానే పైచేయి సాధించినట్లు కనబడింది. లంచ్ విరామ సమయానికి సఫారీలు మూడు వికెట్ల నష్టానకి 94 పరుగులు చేసి మెరుగ్గా కనిపించారు. అయితే ఆ తరువాత అసలు కథ ప్రారంభమైంది. లంచ్ సెషన్ అనంతరం దక్షిణాఫ్రికా వరుసగా రెండు వికెట్లను కోల్పోయి ఒక్కసారిగా కష్టాల్లో పడింది. తొలుత డుప్లెసిస్(10)ను నాల్గో వికెట్ గా పెవిలియన్ కు చేరగా, స్వల్ప వ్యవధిలోనే జేపీ డుమినీ(0)  ఐదో వికెట్ గా పెవిలియన్ చేరాడు.

Sunday, December 6, 2015

ఐపీఎల్‌ కొత్త జట్లొస్తున్నారు!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో వచ్చే రెండేండ్లకు నూతనంగా రెండు జట్లు రానున్నాయి. రెండేండ్ల నిషేధం ఎదుర్కొంటున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రాంఛైజీల స్థానంలో 2016, 2017 సీజన్‌లలో ఈ రెండు జట్లు పాల్గొంటాయి. డిసెంబర్‌ 8న సమావేశం కానున్న ఐపీఎల్‌ పాలకమండలి భేటీ అనంతరం రెండు కొత్త జట్లపై ప్రకటన చేయనుంది. బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్‌ మనోహర్‌, కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌, రాజీవ్‌ శుక్లా సమావేశంలో పాల్గొననున్నారు. చెన్నైకి చెందిన చెట్టనాడ్‌ సంస్థ ఓ జట్టును సొంతం చేసుకోనుందని సమాచారం. సూపర్‌ కింగ్స్‌ ఇండియా సిమెంట్‌ యాజమాన్యానిది కాగా.. చెట్టినాడ్‌ గ్రూప్‌కు సైతం సిమెంట్‌ వ్యాపారం ఉన్న విషయం తెలిసిందే. గోయంకా బ్రదర్స్‌.. హర్ష్‌, సంజీవ్‌లు సైతం ఐపీఎల్‌ జట్టుపై ఆసక్తిగా ఉన్నారు. మొబైల్స్‌ కంపెనీ వీడియోకాన్‌ కూడా బీసీసీఐ నుంచి ఇన్విటేషన్‌ టూ టెండర్‌ ఫామ్‌ను తీసుకున్నట్టు సమాచారం. మంగళవారం ఐపీఎల్‌ పాలకమండలి భేటీ తర్వాత జరిగే మీడియా సమావేశంలో బోర్డు పెద్దలతో పాటు కొత్తగా చేరిన రెండు జట్ల యజమానులూ పాల్గొననున్నారు.

షాపింగ్‌కి వెళితే అవి కొనకుండా ఉండలేను!

శ్రుతీహాసన్ ఫిజిక్ చాలా బాగుంటుంది. మోడ్రన్ దుస్తుల్లోనూ బాగుంటారు.. సంప్రదాయ దుస్తుల్లోనూ లవ్లీగా ఉంటారు. ఫ్యాషన్ ప్రపంచంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అందుకు అనుగుణంగా డ్రెస్సులు సెలక్ట్ చేసుకుంటారామె. ఆ విషయం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ - ‘‘నాకు తెలిసి బట్టలు, నగలు ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. నగల సంగతెలా ఉన్నా డ్రెస్సులంటే నాకు పిచ్చి. షాపింగ్ మాల్‌లోకి అడుగుపెట్టానంటే బట్టలు కొనకుండా ఉండలేను.           జనరల్‌గా నాకు జీన్స్, టీ-షర్ట్ ఇష్టం. అవే సౌకర్యవంతంగా అనిపిస్తాయి. అయినప్పటికీ వేరే డ్రెస్సులు కూడా కొంటుంటాను. బట్టల పిచ్చి మాత్రమే కాదు.. నాకు పాదరక్షల పిచ్చి కూడా ఉంది. షాపింగ్‌కి వెళ్లినప్పుడు షూస్ కొనకుండా ఉండలేను.                      ఇప్పటివరకూ నా దగ్గర యాభై, అరవై షూస్ ఉన్నాయి. అన్నేం చేసుకుంటావని ఫ్రెండ్స్ అడుగుతుంటారు. నవ్వేసి ఊరుకుంటాను. సీజన్‌కి తగ్గట్టుగా, వేసుకున్న డ్రెస్‌కి మ్యాచింగ్‌గా షూలు వేసుకుంటాను’’ అని చెప్పారు.

అదృష్టం అంటే నాదే..

 జట్టులో చోటు కోల్పోయిన సమయంలో రంజీల్లో ఆడటం తనకు చాలా కలిసి వచ్చిందని టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. జట్టులో చోటు కోల్పోయిన అనంతరం సౌరాష్ట్ర తరఫున జడేజా రంజీల్లో అద్భుతంగా రాణించాడు. రంజీల్లో బౌలింగ్ చేసిన మాదిరిగానే సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫ్రీడమ్ సిరీస్‌లోనూ చేస్తున్నాను పునరాగమనంలో నా బౌలింగ్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాను. అశ్విన్, అమిత్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేయడం నా అదృష్టం. నాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా పోయింది. అందుకే వికెట్లు తీస్తున్నాను అని జడేజా ఆనందం వ్యక్తం చేశాడు.

Saturday, December 5, 2015

ఇతనెవరు?

 సన్నగా, తీగలా ఉండే దీపికా పదుకొనే బొద్దుగా బందరు లడ్డూలా ఉన్న ఓ వ్యక్తిని హత్తుకున్నారు. ఆ ఫొటోను ప్రపంచానికి చూపించాలనుకుని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇంతకీ దీపికా హత్తుకున్న ఆ వ్యక్తి ఎవరో ఆ ఫొటో బయటపెట్టలేదు. ఎందుకంటే, అతని బ్యాక్ మాత్రమే ఫొటోలో కనిపిస్తుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా?  హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ చిత్రాలు ‘ ఏజెంట్ త్రిబుల్ ఎక్స్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫేమ్ విన్ డీజిల్ అతను.

  ఇంతకీ ఇతగాణ్ణి దీపికా ఎప్పుడు హగ్ చేసుకున్నారు? అనే విషయంలోకి వస్తే.. హాలీవుడ్ చిత్రం ‘ఏజెంట్ త్రిబుల్ ఎక్స్’ సీక్వెల్‌లో హీరోయిన్‌గా నటించే అవకాశం ఆమెకు వచ్చిందట. ఆ చిత్రానికి సంబంధించిన ఆడిషన్స్‌లో పాల్గొనడానికి ఆమె అమెరికా వెళ్లారు. ఈ చిత్రంలో విన్ డీజిల్ హీరోగా నటించనున్నారు. అమెరికాలో విన్, దీపికా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 ఇదిలా ఉంటే.. గతంలో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఏడో భాగంలో కథానాయికగా అవకాశం వచ్చినా  డేట్స్ సర్దుబాటు చేయలేక ఆ సినిమా ఆఫర్‌ను దీపిక తిరస్కరించారు. ఇప్పుడు ‘ఏజెంట్ త్రిబుల్ ఎక్స్’ సీక్వెల్ ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. మరి.. ఈ చిత్రానికి ఒప్పందం చేసుకున్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

మా ఆయన మారాలని ఎప్పుడూ కోరుకోలేదు

             తన జీవితంలో వివాహం ఎలాంటి మార్పులు తేలేదని బాలీవుడ్  హీరోయిన్ కరీనా కపూర్ చెబుతోంది.  వైవాహిక జీవితంలో  తామిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నామని, తమ మధ్య ఎలాంటి  అభిప్రాయ భేదాలు లేకుండా  చాలా హ్యాపీగా ఉన్నామని తెలిపింది. సైఫ్  అలీఖాన్ తో పెళ్లి అనంతరం.. మీ  జీవితంలో ఏవైనా మార్పులు వచ్చాయా అని మీడియా ప్రశ్నించినపుడు ఈ బాలీవుడ్  బ్యూటీ ఇలా స్పందించింది.                    పెళ్ళి చేసుకొని మూడేళ్ళు అవుతున్నా తమ మధ్య చిన్నపాటి సమస్య కూడా తలెత్తలేదని   పెళ్లికి ముందు తన భర్త, సైఫ్ ఎలా వున్నాడో పెళ్లి తర్వాత  కూడా అలాగే ఉన్నాడని చెప్పింది. తన వ్యక్తిత్వాన్ని, ఇష్టాలను మార్చుకోమని ఎపుడూ  కోరలేదని, భవిష్యత్తులో  కూడా అలా కోరనని కరీనా తెలిపింది.                     హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ సందర్భంగా కరీనా  కపూర్ ఖాన్.. . మీడియాతో తన మనసులోని  భావాలను ఇలా వ్యక్తం చేసింది. 'మా ఆయన మారాలని నేను  ఎపుడూ కోరుకోలేదు...కోరను కూడా.. నేను తనని ఇష్టపడి పెళ్లి  చేసుకున్నాను. పెళ్లి నా జీవితంలో మార్పులు తేవాలని అనుకోలేదు. నేను కూడా పెళ్లికి ముందు ఎలా వున్నానో ఇపుడూ అలాగే ఉన్నాను.. ఉంటాను   కూడా... అంటూ  వైవాహితక జీవితం గురించి  కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.                     తన భర్తకు ఏ రోజూ ...  ఎలాంటి షరతులు పెట్టలేదని, తనని సాధ్యమైనంత వరకు అర్ధం చేసుకోడానికే ప్రయత్నిస్తానని ఈ అమ్మడు పేర్కొంది. ఈ మూడేళ్ళలో సైఫ్ లో ఎలాంటి మార్పులు తను చూడలేదని, పెళ్లికి ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడని పేర్కొంది.  భవిష్యత్ లో కూడా ఆ అవసరం రాకుండా చూసుకుంటానంటూ కరీనా వెల్లడించింది . కాగా  కపూర్ కుటుంబం నుంచి  వచ్చిన కరీనా 2012 లో  బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పెళ్లాడిన విషయం తెలిసిందే.