Saturday, December 5, 2015

ఇతనెవరు?

 సన్నగా, తీగలా ఉండే దీపికా పదుకొనే బొద్దుగా బందరు లడ్డూలా ఉన్న ఓ వ్యక్తిని హత్తుకున్నారు. ఆ ఫొటోను ప్రపంచానికి చూపించాలనుకుని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇంతకీ దీపికా హత్తుకున్న ఆ వ్యక్తి ఎవరో ఆ ఫొటో బయటపెట్టలేదు. ఎందుకంటే, అతని బ్యాక్ మాత్రమే ఫొటోలో కనిపిస్తుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా?  హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ చిత్రాలు ‘ ఏజెంట్ త్రిబుల్ ఎక్స్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫేమ్ విన్ డీజిల్ అతను.

  ఇంతకీ ఇతగాణ్ణి దీపికా ఎప్పుడు హగ్ చేసుకున్నారు? అనే విషయంలోకి వస్తే.. హాలీవుడ్ చిత్రం ‘ఏజెంట్ త్రిబుల్ ఎక్స్’ సీక్వెల్‌లో హీరోయిన్‌గా నటించే అవకాశం ఆమెకు వచ్చిందట. ఆ చిత్రానికి సంబంధించిన ఆడిషన్స్‌లో పాల్గొనడానికి ఆమె అమెరికా వెళ్లారు. ఈ చిత్రంలో విన్ డీజిల్ హీరోగా నటించనున్నారు. అమెరికాలో విన్, దీపికా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 ఇదిలా ఉంటే.. గతంలో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఏడో భాగంలో కథానాయికగా అవకాశం వచ్చినా  డేట్స్ సర్దుబాటు చేయలేక ఆ సినిమా ఆఫర్‌ను దీపిక తిరస్కరించారు. ఇప్పుడు ‘ఏజెంట్ త్రిబుల్ ఎక్స్’ సీక్వెల్ ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. మరి.. ఈ చిత్రానికి ఒప్పందం చేసుకున్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

No comments:

Post a Comment