Sunday, May 15, 2016

అయ్యో పాపం... గాయం!

 
అదో పెద్ద కోట. ఆ కోట గోడపై పరిగెత్తడం అంటే సాహసం చేయడమే. కండల వీరుల గుండెలు దడదడలాడి పోతాయ్. ఇక, గులాబీ బాల కృతీ సనన్ వంటి భామలైతే వణికిపోతారు. ఆ వణుకుతో పరిగెత్తితే జారడం ఖాయం. అదే జరిగింది. కృతీ సనన్ ఎవరో ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. మహేశ్‌బాబుతో ‘నేనొక్కడినే’, నాగచైతన్యతో ‘దోచెయ్’ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత హిందీ సినిమాలకు పరిమితమయ్యారు. ప్రస్తుతం దినేశ్ విజన్ దర్శకత్వం వహిస్తున్న ‘రాబ్తా’ చిత్రంలో సుషాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో జతకట్టారామె. ఈ చిత్రం షూటింగ్ హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరుగుతోంది.
ఓ కోట గోడపై కృతి పరిగెత్తే సన్నివేశం తీయడానికి ప్లాన్ చేశారు. సీన్ విన్న కృతి భయపడినా, ‘చేయను’ అంటే బాగుండదు కదా... ఒప్పేసుకున్నారు. డెరైక్టర్ షాట్ రెడీ అనగానే, మనసులో భయాన్ని బయటికి కనిపించనివ్వకుండా గోడపై పరిగెత్తసాగారామె. హఠాత్తుగా కృతి పరుగుకి బ్రేక్ పడింది. కాలు జారిందట. అయితే గోడ పైనుంచి పూర్తిగా కిందపడకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కానీ, నొప్పితో కృతి విలవిలలాడిపోయారట. పెద్ద గాయం కాకపోయినా, కాలు బెణికినందువల్ల రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారట.

పెళ్లికి రావాలని కండిషన్ పెట్టాడు!

వెండితెర తారలు కళ్ల ముందు మెదిలితే అభిమానులు ఏం చేస్తారు? పెన్నూ పేపరు చేతిలో ఉంటే ఆటోగ్రాఫ్... స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే సెల్ఫీ లేదా ఓ ఫొటో... ఆ కోరిక తీరితే ‘ఈ జన్మకి ఇది చాలు’ అని సంబరపడి పోతారు. ఇంకో రక ం ఫ్యాన్స్ ఉంటారు.. తమ ఫేవరెట్ స్టార్స్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వాళ్ల పిచ్చి పీక్స్‌లో ఉంటుంది. ఎలాగైనా అభిమాన తారను కలవాలని పట్టుదలగా ఉంటారు. వెర్రి ప్రేమతో ఏం చేస్తున్నారో తెలీని దశలో వాళ్లు ఉంటారు.  సరిగ్గా ఇలాంటి టైప్ 2 అభిమాని ఒకడు తాప్సీకి చుక్కలు చూపించి, తెగ ఇబ్బంది పెట్టేశాడట. మేటర్‌లోకి వెళితే... తాప్సీ తన సోదరితో కలసి వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్‌ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇందుకోసమే వాళ్ల ఆఫీసుకు బోల్డెన్ని ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక ఫోన్ కాల్ వచ్చింది. కోల్‌కతాకు చెందిన తాప్సీ వీరాభిమాని తన పెళ్లికి వెడ్డింగ్ ప్లానర్ గా వ్యవహరించాలని కోరాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, తాప్సీ కచ్చితంగా తన పెళ్లికి ముఖ్య అతిథిగా హాజరైతేనే వెడ్డింగ్ ప్లానింగ్ కాంట్రాక్ట్ ఇస్తానని షరతు పెట్టాడు. దీంతో ఈ అభిమానిని తాప్సీ టీమ్ సీరియస్‌గా తీసుకోలేదు. ఆ కాంట్రాక్ట్ గురించి కూడా పెద్దగా ఆలోచించలేదు.
అయినా ఆ అభిమాని వదల్లేదు. విచిత్రమేమింటే, అసలింకా అతని పెళ్లి ఫిక్స్ లేదు. కానీ, పెళ్లికి మాత్రం తాప్సీ తప్పనిసరిగా రావాలని కండిషన్ పెట్టాడు. ఆ విషయం తెలిసి, ‘‘అతన్ని ముందు పెళ్లి కూతుర్ని వెతుక్కోమని సలహా ఇచ్చాను. ఒకవేళ కుదిరినా పెళ్లికి రావడానికి నా డేట్స్ ఖాళీగా లేవని చెప్పా. దాంతో పెళ్లి విషయం మానేసి, తన దగ్గర సినిమా స్క్రిప్ట్ ఉందనీ, దర్శకుణ్ణి పంపుతాననీ అన్నాడు. నాకిలాంటి అనుభవం కలగడం ఇది తొలిసారి’’ అని తాప్సీ చెప్పారు.

గురువు కోసం సింగిల్ సాంగ్‌లో..


 
గురువు కోసం సింగిల్ సాంగ్‌లో దుమ్ము రేపడానికి సిద్ధమైంది ఇంగ్లిష్ బ్యూటీ. ఆ అమ్మడు ఎవరో ఇప్పటికే చాలా మందికి అర్థం అయ్యే ఉంటుంది. ఎస్.అనతికాలంలోనే సూపర్‌స్టార్‌తో రొమాన్స్ చేసే స్థాయికి ఎదిగిన ఎమీజాక్సన్‌నే ఆ బ్యూటీ. ఇక ఆమె గురువెవరన్నది అందరికీ తెలిసిందే. 16 ఏళ్ల పరువంలోనే ఈ ముద్దుగుమ్మను మదరాసుపట్టణం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి చేసి దర్శకుడు ఏఎల్.విజయ్‌ను ఎమీ తన గురువుగా భావిస్తుంది. చాలా కాలం తరువాత ఏఎల్.విజయ్ కోరిక మేరకు సింగిల్‌సాంగ్ చేయడానికి సిద్ధమైంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న ఎమీ ఇప్పటి వరకూ సింగిల్ సాంగ్‌లో నటించలేదు. తొలిసారిగా తన గురువు కోసం తన సింగిల్‌సాంగ్‌లో తన కాలు కదపనుంది.

  సంగతేమిటంటే డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా హీరోగా నటిస్తూ సొంతంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఏఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తమన్న కథానాయికగా నటిస్తున్నారు. హారర్ ఇతివృత్తంతో కూడిన ఈ చిత్రాన్ని ప్రభుదేవా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నిర్మించడం విశేషం. ఈ చిత్రానికి అభినుత్రి అనే పేరును నిర్ణయించారు. ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాట చోటు చేసుకోవడంతో అందులో ప్రభుదేవాతో లెగ్ షేక్ చేయడానికి క్రేజీ నటి అవసరం అవడంతో దర్శకుడి మదిలో మెదిలిన తార ఎమీజాక్సన్.

 మూడు భాషల్లోనూ ఎమీకి గుర్తిం పు ఉండడంతో తనే కరెక్ట్ అని భావించిన ఏఎల్.విజయ్ వెంటనే ఎమీజాక్సన్‌కు ఫోన్ కొట్టగా గురువు కోసం వెంటనే ఓకే అనడంతో పాటు అందుకు కొన్ని డేట్స్ కేటాయించేసిందట. ప్రస్తుతం రజనీకాంత్ చిత్రం 2.ఓ చిత్రం కోసం చెన్నైలోనే మకాం పెట్టిన ఎమీ త్వరలోనే అభినేత్రి చిత్రం కోసం ప్రభుదేవాతో డాన్స్ చేయనుందని సమాచారం.ఈ చిత్రానికి ఎస్.తమన్, జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించడం మరో విశేషం.

రహస్యంగా పెళ్లి చేసుకుంటున్న మరో నటి

 ఇటీవల కొందరు బాలీవుడ్‌ నటులు ఎవరికీ తెలీకుండా రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో మరో బాలీవుడ్‌ నటి అమృతా రావ్‌(అతిథి ఫేం) చేరింది. అమృత ముంబయికి చెందిన రేడియో జాకీ అన్మోల్‌తో ఈరోజు వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఆన్మోల్‌, అమృతలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈరోజు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది.
అయితే అమృతా, అన్మోల్‌ల వివాహం కొన్ని నెలల క్రితమే అయిపోయిందని పెళ్లయ్యాక ఇద్దరూ విడిగా ఉంటున్నారని ఇంతకుముందువార్తలు వెలువడ్డాయి. ఇటీవల అమృత హాజరైన ఓ కార్యక్రమంలో చేతికిఉంగరం ఉండడం చూసి అమృత పెళ్లి విషయం కాస్తా బాలీవుడ్‌లో చక్కర్లు కొట్టింది. ఇది ఎంత వరకు నిజమో తెలీదు కానీ ఈరోజు వివాహమయ్యాక కొద్దిరోజుల తర్వాత అందరికీ గ్రాండ్‌గా రిసెప్సన్‌ ఇవ్వనున్నట్లు సన్నిహితులు తెలిపారు.
హిందీలో మై హూ నా, వివాహ్‌, ఇష్క్‌ విష్క్‌ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది అమృత. ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో తన సోదరి ప్రీతికా రావ్‌లాగే టీవీ సీరియళ్లలో నటిస్తోంది.

Saturday, May 14, 2016

సొట్టబుగ్గల సుందరి పెళ్లిపార్టీ

 బాలీవుడ్‌ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా, జీన్‌ గుడ్‌ ఇనోను ఫ్రిబవరి 29న అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలీవుడ్‌ నటులకు ప్రీతి గ్రాండ్‌గా పార్టీని ఇచ్చింది. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రీటి జింటా ఎరుపు రంగు గౌనులో మెరిసిపోయింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌,అభిషేక్‌ బచ్చన్‌, లారా దత్తా, మహేశ్‌ భూపతి, మాధురి దీక్షిత్‌ ఆమె భర్త శ్రీరామ్‌, క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ తనకు కాబోయే భార్య హెజెల్‌ కీచ్‌తో కలిసి హాజరయ్యారు. గురువారం ప్రీతి తన భర్త, అత్తమామలతో కలిసి ప్రేమకు ప్రతిరూపమైన తాజ్‌మహల్‌ అందాలను వీక్షించిన సంగతి తెలిసిందే.


‘చంద్రముఖి-2’లో...?

 లక లక లక అంటూ ‘చంద్రముఖి’లో జ్యోతికను తమకంగా చూస్తూ, రజనీకాంత్ అనే డైలాగ్‌ను అంత సులువుగా మర్చిపోలేం. యాంటీ షేడ్స్ ఉన్న కింగ్‌గా ఆ డైలాగ్‌ని రజనీ అద్భుతంగా పలికితే, జ్యోతిక అంతే అద్భుతంగా నటించారు. పి. వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి అందరికీ తెలుసు. దీనికి సీక్వెల్ చేయాలని వాసు అనుకున్నారు కానీ, కుదరలేదు. అందుకేనేమో తమిళంలో తాను చేయ నున్న తాజా చిత్రానికి ‘చంద్రముఖి-2’ అని పెట్టుకుని ఉంటారని చెన్నై చిత్రపరిశ్రమ వారు అంటున్నారు. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా ఇటీవల పి. వాసు ‘శివలింగ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈ చిత్రాన్నే తమిళంలో రీమేక్ చేయాలను కుంటున్నారట. దీనికే ‘చంద్రముఖి-2’ అని టైటిల్ అనుకుంటున్నారట. తమిళంలో లారెన్స్, అనుష్క జంటగా ఈ చిత్రాన్ని రూపొందించాలను కుంటున్నారని సమాచారం. ‘చంద్రముఖి’లో సందడి చేసిన వడివేలు ఈ చిత్రంలో కూడా నటిస్తారని టాక్.

Thursday, May 12, 2016

అఖిల్ రెండో సినిమా రీమేకేనా?


 
చిన్నప్పుడు ‘సిసింద్రీ’లో ముద్దు ముద్దుగా కనిపించి, ఆకట్టుకున్న అఖిల్ పెద్దయ్యాక ‘మనం’లో కొన్ని క్షణాలు కనిపించి, కుర్రాడు కత్తి అనిపించుకున్నాడు. ఇక ‘అఖిల్’ చిత్రం ద్వారా పూర్తి స్థాయిలో హీరోగా జనం ముందుకొచ్చాడు. ఆ సినిమా జయాపజయాల సంగతెలా ఉన్నా తనలో మంచి హీరో మెటీరియల్ ఉన్నాడని నిరూపితమైంది.

  ఇప్పుడు అక్కినేని అభిమానుల దృష్టంతా అఖిల్ చేయనున్న రెండో చిత్రం పైనే. ‘ఊపిరి’ చేస్తున్నప్పుడు ఆ చిత్రదర్శకుడు వంశీ పైడిపల్లి పని తీరు నచ్చి, అఖిల్ రెండో సినిమాకి అతనే దర్శకుడని నాగార్జున అనుకున్నారనే వార్త వచ్చింది. దానికి తగ్గట్లే అఖిల్ కోసం వంశీ స్టోరీ వర్కవుట్ చేస్తున్నారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. అయితే, ఇప్పుడు తాజాగా మరో వార్త ప్రచారంలోకొచ్చింది. ఆ వార్త ప్రకారం అఖిల్ రెండో సినిమాని వంశీ డెరైక్ట్ చేయలేదట.

 మూడేళ్ల క్రితం హిందీలో రణబీర్ కపూర్, దీపికా పదుకొనే జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘యే జవానీ హై దీవానీ’ని తెలుగులో అఖిల్ హీరోగా రీమేక్ చేయాలని నాగ్ అనుకుంటున్నారట. ఆ కథ మీదే వంశీని వర్కవుట్ చేయమని కోరారని భోగట్టా. కానీ, వంశీ అందుకు ఇష్టపడలేదట. వాస్తవానికి ‘ఊపిరి’ చిత్రాన్ని ఫ్రెంచ్ మూవీ ‘ఇన్‌టచబుల్స్’ ఆధారంగానే తీశారు. మళ్లీ వెంటనే మరో రీమేక్ చేయడానికి వంశీ అంత సుముఖంగా లేరట. అందుకే వేరే స్టోరీ లైన్‌తో చేద్దామని నాగ్‌తో అన్నారని తెలుస్తోంది.

  కానీ ఓ సూపర్ హిట్ మూవీ రీమేక్‌ని వదిలేసి, కొత్త కథతో చేయడానికి నాగ్ సుముఖంగా లేరని కృష్ణానగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో వేరే దర్శకుడితో అఖిల్ హీరోగా ‘యే జవానీ హై దీవానీ’ తెలుగు రీమేక్ చేయాలనుకుంటున్నారట. ఆ సంగతలా ఉంచితే.. ప్రస్తుతం తాను అనుకుంటున్న మంచి స్టోరీ లైన్‌తో ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలనే ఆలోచనలో వంశీ పైడిపల్లి ఉన్నారని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ గుసగుసల్లోని నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయి.

నాని కనిపించేంత మంచి వాడు కాదట!

 ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని కథానాయకుడుగా నటిస్తున్న ‘జెంటిల్‌మన్‌’ చిత్రం టీజర్‌ విడుదలైంది. నాని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘కనిపించేంత మంచి వాడు మాత్రం కాదు’ అని ట్వీట్‌ చేశారు. టీజర్‌ను బట్టి... నాని చిత్రంలో విలన్‌గా కనిపిస్తారా... లేక హీరోగా కనిపిస్తారా అన్న అంశం ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంలో సురభి, నివేదా థామస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.