Thursday, May 12, 2016

అఖిల్ రెండో సినిమా రీమేకేనా?


 
చిన్నప్పుడు ‘సిసింద్రీ’లో ముద్దు ముద్దుగా కనిపించి, ఆకట్టుకున్న అఖిల్ పెద్దయ్యాక ‘మనం’లో కొన్ని క్షణాలు కనిపించి, కుర్రాడు కత్తి అనిపించుకున్నాడు. ఇక ‘అఖిల్’ చిత్రం ద్వారా పూర్తి స్థాయిలో హీరోగా జనం ముందుకొచ్చాడు. ఆ సినిమా జయాపజయాల సంగతెలా ఉన్నా తనలో మంచి హీరో మెటీరియల్ ఉన్నాడని నిరూపితమైంది.

  ఇప్పుడు అక్కినేని అభిమానుల దృష్టంతా అఖిల్ చేయనున్న రెండో చిత్రం పైనే. ‘ఊపిరి’ చేస్తున్నప్పుడు ఆ చిత్రదర్శకుడు వంశీ పైడిపల్లి పని తీరు నచ్చి, అఖిల్ రెండో సినిమాకి అతనే దర్శకుడని నాగార్జున అనుకున్నారనే వార్త వచ్చింది. దానికి తగ్గట్లే అఖిల్ కోసం వంశీ స్టోరీ వర్కవుట్ చేస్తున్నారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. అయితే, ఇప్పుడు తాజాగా మరో వార్త ప్రచారంలోకొచ్చింది. ఆ వార్త ప్రకారం అఖిల్ రెండో సినిమాని వంశీ డెరైక్ట్ చేయలేదట.

 మూడేళ్ల క్రితం హిందీలో రణబీర్ కపూర్, దీపికా పదుకొనే జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘యే జవానీ హై దీవానీ’ని తెలుగులో అఖిల్ హీరోగా రీమేక్ చేయాలని నాగ్ అనుకుంటున్నారట. ఆ కథ మీదే వంశీని వర్కవుట్ చేయమని కోరారని భోగట్టా. కానీ, వంశీ అందుకు ఇష్టపడలేదట. వాస్తవానికి ‘ఊపిరి’ చిత్రాన్ని ఫ్రెంచ్ మూవీ ‘ఇన్‌టచబుల్స్’ ఆధారంగానే తీశారు. మళ్లీ వెంటనే మరో రీమేక్ చేయడానికి వంశీ అంత సుముఖంగా లేరట. అందుకే వేరే స్టోరీ లైన్‌తో చేద్దామని నాగ్‌తో అన్నారని తెలుస్తోంది.

  కానీ ఓ సూపర్ హిట్ మూవీ రీమేక్‌ని వదిలేసి, కొత్త కథతో చేయడానికి నాగ్ సుముఖంగా లేరని కృష్ణానగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో వేరే దర్శకుడితో అఖిల్ హీరోగా ‘యే జవానీ హై దీవానీ’ తెలుగు రీమేక్ చేయాలనుకుంటున్నారట. ఆ సంగతలా ఉంచితే.. ప్రస్తుతం తాను అనుకుంటున్న మంచి స్టోరీ లైన్‌తో ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలనే ఆలోచనలో వంశీ పైడిపల్లి ఉన్నారని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ గుసగుసల్లోని నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయి.

నాని కనిపించేంత మంచి వాడు కాదట!

 ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని కథానాయకుడుగా నటిస్తున్న ‘జెంటిల్‌మన్‌’ చిత్రం టీజర్‌ విడుదలైంది. నాని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘కనిపించేంత మంచి వాడు మాత్రం కాదు’ అని ట్వీట్‌ చేశారు. టీజర్‌ను బట్టి... నాని చిత్రంలో విలన్‌గా కనిపిస్తారా... లేక హీరోగా కనిపిస్తారా అన్న అంశం ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంలో సురభి, నివేదా థామస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Wednesday, May 11, 2016

మనసు మార్చుకున్న మెగా వారసుడు


వారసుడిగా ఎంట్రీ ఇచ్చి మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకుంటున్న యువ నటుడు సాయిధరమ్ తేజ్. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఈజీగానే ఎంట్రీ ఇచ్చినా.., తన టాలెంట్ తో మంచి సక్సెస్ లు సాధిస్తున్నాడు. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం సినిమాల సక్సెస్ తో మంచి ఫాంలో ఉన్నాడు. అయితే ఈ సినిమాలతో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో అదే స్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొంటున్నాడు.
ముఖ్యంగా తన ప్రతీ సినిమాలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను ఇమిటేట్ చేయటంతో పాటు చిరు పాటలను రీమిక్స్ చేయటం ఇప్పుడు సాయికి ఇబ్బందిగా మారింది. కెరీర్ స్టార్టింగ్ లో గుర్తింపు కోసం ఫర్వాలేదు కానీ, ప్రతీ సినిమాలో ఇలా ఇమిటేట్ చేస్తే, సొంత ఐడెంటిటీ రాదంటున్నారు విశ్లేషకులు. దీంతో ఇక ఈ ఇమిటేషన్ సెంటిమెంట్ కు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాడు తేజు.

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తిక్క సినిమాలో కూడా చిరంజీవి పాటను రీమిక్స్ చేయాలని ప్లాన్ చేశారు చిత్రయూనిట్. అయితే సాయి మాత్రం వద్దని ఖచ్చితంగా చెప్పేశాడట. కథకు అవసరమైతే తప్ప ఇప్పట్లో రీమిక్స్ పాటలను చేసే ఆలోచనే లేదంటున్నాడు. మరి సొంత ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తున్న సాయి ప్లాన్స్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.

విరాట్‌పై మనసు పారేసుకున్న బ్యూటీ


అద్భుతమైన ఆటతీరుతో పాటు తన లైఫ్‌స్టైల్‌తో ఎందరో అమ్మాయిలకు ఆరాధ్యుడయ్యాడు భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి. బాలీవుడ్‌ హీరోలతో సమానంగా క్రేజ్‌ సంపాదించుకుని యూత్‌కు ఐకాన్‌ మారిపోయాడు. బాలీవుడ్‌ హీరోయిన్లే అతడితో డేట్‌కు వెళ్లాలని ఆశపడుతున్నారంటే అతడి క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.
‘విరాట్‌ అంటే నాకు ఎంతో ఇష్టం. నేను అతడిని ప్రేమిస్తున్నా. దీనిపై అనుష్క ఏమనుకున్నా నాకు సంబంధం లేదు’ అంటూ కొద్దిరోజుల క్రితం ఐటెం గర్ల్‌ రాఖీసావంత్‌ బహిరంగంగా కామెంట్‌ చేసింది. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ ప్రాచీ దేశాయ్‌ కూడా కోహ్లిపై మనసు పారేసుకుంది. అతడితో డేటింగ్‌కు వెళ్లాలని ఉందంటూ ‘అజర్‌’ ప్రచార కార్యక్రమంలో తన మనసులో మాట బయటపెట్టింది. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మరో అందగత్తె నర్గిస్‌ ఫక్రి.. సచిన్‌తో డిన్నర్‌ చేయాలని తన ఇష్టాన్ని చెప్పుకొచ్చింది. వీరిద్దరూ ‘అజర్‌’ చిత్రంలో ఇమ్రాన్‌ హష్మికి జంటగా నటించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tuesday, May 10, 2016

‘ముద్దు’లపై పుస్తకం రాస్తాడట!

 ఇమ్రాన్‌ హష్మీ సినిమాల్లో ప్రధానంగా ఆకర్షించేవి అదర చుంబన సన్నివేశాలే. ఆయన సినిమాలు ఎలా ఉన్నా.. ఇమ్రాన్‌ నటించే చాలాసినిమాల్లో ముద్దు సన్నివేశాలు మాత్రం కచ్చితంగా ఉంటాయి. అందుకే ఆయన్ను బీటౌన్‌లో సీరియల్‌ కిస్సర్‌ అంటారు. తాజాగా ఈ సీరియల్‌ కిస్సర్‌.. ముద్దులు ఎలా పెట్టాలో వివరించే పుస్తకం రాయబోతున్నాడట.
ఇప్పటికే.. తన కుమారుడు అయాన్‌ క్యాన్సర్‌ చికిత్స సమయంలో తాను పడ్డ ఆవేదన.. ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఇమ్రాన్‌ ‘ది కిస్‌ ఆఫ్‌ లైఫ్‌’ పుస్తకాన్ని రచించి విడుదల చేశాడు. తాజాగా ముద్దులపై కూడా ఓ పుస్తకాన్ని రాస్తానంటున్నాడు. అందుకోసం.. ప్రత్యేకంగా రచనలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. ‘పుస్తకం రచించాలన్న ఆలోచన మాత్రమే ఉంది. ఇంకా మొదలుపెట్టలేదు. ప్రస్తుతం నేను ఒప్పుకున్న సినిమాలతో బిజీగా ఉన్నాను. నాకు తెలిసి మార్కెట్లో ఇలాంటి అంశంపై పుస్తకాలు ఏమీ లేవు. కాబట్టి కచ్చితంగా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని పుస్తకం రాయలని భావిస్తున్నా’ని అన్నాడు.
వెండితెరపై ముద్దుల వర్షం కురిపించే ఇమ్రానే వాటిపై పుస్తకం రాస్తే.. అవి హాట్‌కేకుల్లా అమ్ముడుపోవడం ఖాయమంటున్నారు సినీ వర్గాలు.

ఎనిమిది నెలలుగా విశ్రాంతి లేదు

 ఎనిమిది నెలలుగా విశ్రాంతి లేకుండా వరుస షూటింగ్‌లలో పాల్గొంటున్నానని కథానాయకి సమంత అన్నారు. ఇటీవల విడుదలైన ‘24’ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘సమ్మర్‌లో వరుసగా నాలుగు (పోలీస్‌, 24, బ్రహ్మోత్సవం, అ..ఆ) సినిమాలు ఉన్నాయి. విభిన్న కథలతో కూడుకున్న ఈ చిత్రాల్లో నేనూ ఓ భాగం కావడం ఆనందంగా ఉంది’ అన్నారు.
తరువాత సూర్యతో జంటగా నటించిన ‘24’ గురించి మాట్లాడారు. ‘24 కథ వింటున్నప్పుడు ఈగ సినిమా గుర్తొచ్చింది. ఇంత చిన్న ఈగను ఎలా స్క్రీన్‌పై చూపిస్తారని అప్పుడు అనిపించింది. కాలంతో కూడుకున్న ‘24’ కథను ప్రజలకు అర్థమయ్యేలా ఎలా తీస్తారనే సందేహం కలిగింది. దర్శకుడు విక్రమ్‌కుమార్‌ సినిమాని చాలా చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమాలో నా పాత్ర చిన్నది కావచ్చు. కానీ ఈ సినిమాలో నేను ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో నేను లవ్‌ట్రాక్‌లో కనిపిస్తాను. ఆ ట్రాక్‌ చాలా క్యూట్‌గా ఉంటుంది. కథ చాలా ఆసక్తిగా సాగుతున్న సమయంలో నాతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులకు రిలీఫ్‌ ఇస్తాయి. కొత్తగా ఏ సినిమా ఒప్పుకోలేదు. గత ఎనిమిది నెలలుగా ఒక్క రోజు కూడా విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నాను. కథ బాగా నచ్చితే తప్ప సినిమా చేయడానికి ఒప్పుకోను. ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్‌’లో నటిస్తున్నాను. దాని తరువాత కన్నడ సినిమా ‘యూటర్న్‌’ రీమేక్‌లో నటిస్తున్నారు’.
‘బ్రహ్మోత్సవం’ ఆడియోలో మీరు మహేశ్‌బాబు కుమార్తె సితారతో చాలా క్లోజ్‌గా కనిపించారు అని విలేకరి అడిగిన ప్రశ్నకు సమంత సమాధానం ఇచ్చారు. ‘మేము మంచి ఫ్రెండ్స్‌. సితార నవ్వు, డ్యాన్స్‌ సూపర్‌గా ఉంటాయి. మహేశ్‌బాబులా సితార కూడా మంచి స్టార్‌గా ఎదుగుతుంది. గౌతమ్‌, సితార ఫీచర్‌స్టార్స్‌’ అని సమంత పేర్కొన్నారు.

Monday, May 9, 2016

నేనూ... మా ఆయన!

 ‘దేవుడా.. శ్రుతీహాసన్‌కి పెళ్లయ్యిందా? ఏం పాపం చేశామని ఇప్పుడే పెళ్లి చేసేసుకుంది. ఇంకొన్నాళ్ల పాటు సినిమాలు చేస్తుందా? లేదా.. కొంపతీసి సినిమాలు మానేసే ఉద్దేశం ఏమీ లేదు కదా’ అని శ్రుతీహాసన్ అభిమానులు తెగ ఫీలైపోయారు. వీళ్లు ఇంతగా బాధపడిపోవడానికి కారణం, సరదాగా శ్రుతీహాసన్ తన ట్విట్టర్‌లో చేసిన ఓ ట్వీట్. ‘లంచ్ విత్ మై డియరెస్ట్ హజ్బెండ్’ అంటూ శ్రుతి ఓ ఫొటోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో దుమారమే చెలరేగింది.
అది చూసి, ఆమె అభిమానులందరూ చెలరేగిపోయారు. ‘మీకు పెళ్లయిందా...? అతను మీ భర్తా... ఇంతకన్నా హ్యాండ్‌సమ్ పర్సన్ మీకు భర్తగా వస్తాడు కదా... ఇంత తొందరపడ్డారేంటి?’ అని కామెంట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో శ్రుతీహాసన్ ‘‘నాకస్సలు పెళ్లి కాలేదు.. నిజం చెబుతున్నా... నన్ను నమ్మండి. సరదాగా చేసిన ట్వీట్ అది’’ అని పోస్ట్ పెట్టడంతో అభిమానులు శాంతించారు.

విద్యాబాలన్‌ ఎంత పనిచేసింది!

 బాలీవుడ్‌ నటులు హృతిక్‌ రోషన్‌, కంగనా రనౌత్‌ల మధ్య వివాదం ఇంకా ఏమీ తేలనే లేదు. మరో పక్క దాని ప్రభావం మాత్రం ఇతరుల మీద బాగానే పడుతోంది. తాజాగా ఈ విషయమై విద్యాబాలన్‌ స్పందన ఆమె భర్త సిద్దార్థ్‌ రాయ్‌ కపూర్‌కి ఇబ్బందికరంగా పరిణమించింది. విషయమేమిటంటే.. తీన్‌ చిత్ర ప్రచార కార్యక్రమం సందర్భంగా మీడియా కంగనా విషయంలో స్పందించాల్సిందిగా విద్యాబాలన్‌ను కోరింది.
ఇతరుల గురించి మాట్లాడడం మర్యాద కాదంటూనే కంగనా ధైర్యాన్ని మెచ్చుకుంది విద్య. ఆమె తనకు తాను మద్దతుగా నిలబడి పోరాడడం తనకు నచ్చిందని, ఈ విషయంలో కంగనాని అభినందిస్తున్నానని విద్య పేర్కొంది. సాధారణంగా మహిళలు కుటుంబంలో వారందరి కోసం పోరాడడం చూస్తాం కానీ ఇలా తమకోసం తాము ధైర్యంగా నిలబడడం అరుదని పేర్కొంది.
విద్య అలా కంగనాకి మద్దతిస్తున్నట్లుగా మాట్లాడటం భర్త సిద్దార్థ్‌కి ఇబ్బందికరంగా మారిందట. ఎందుకంటే హృతిక్‌ నటిస్తున్న కాబిల్‌ చిత్రానికి సిద్దార్థ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అందులోనూ ఓ నిర్మాతగా నటీనటులందరితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వివాదంతో హృతిక్‌కి, తనకి మధ్య ఎక్కడ అభిప్రాయభేదాలు వస్తాయోనని సిద్దార్థ్‌ కంగారుపడుతున్నాడని బాలీవుడ్‌ సమాచారం.