Friday, April 1, 2016

అలా మాట్లాడితే నేను సహించను!

 పుట్టిన గడ్డ గురించి నాలుగు మంచి మాటలు చెప్పే అవకాశం వస్తే, ఎవరూ వదులుకోరు. దేశ ప్రతిష్ఠ గురించి నాన్‌స్టాప్‌గా చెప్పేస్తారు. ప్రస్తుతం ప్రియాంకా చోప్రా అలానే చేస్తున్నారు. అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’లో నటించడం మొదలుపెట్టాక, ప్రియాంకకు ‘బేవాచ్’ అనే హాలీవుడ్ చిత్రంలో కూడా అవకాశం వచ్చింది. ఇది కాకుండా ఓ టాక్ షోకి కూడా అవకాశం దక్కించుకున్నారు. వీటి కోసం ఆమె అమెరికాలో ఎక్కువగా ఉంటున్నారు.
              అక్కడివాళ్లకి మన దేశ ప్రతిష్ఠ గురించి, హిందీ చిత్రాల గురించి అదే పనిగా చెబుతున్నారట. ఆ విషయం గురించి ప్రియాంకా చోప్రా చెబుతూ - ‘‘మన దేశం ఎందులోనూ తక్కువ కాదు. మన భారతీయ చిత్రాలు వేరే ఏ దేశం చిత్రాలకూ తీసిపోవు. ‘అక్కడి సినిమాల్లో పాటలూ, డ్యాన్సులూ కామన్ అట’ అని విదేశీయులు మన సినిమాల గురించి అన్నప్పుడు ‘మేమేమీ కావాలని పాటలు పెట్టం.
              కథ ముందుకు సాగడానికి పాటలు ఉపయోగపడతాయి. మా ప్రేక్షకులు వాటిని బాగా ఎంజాయ్ చేస్తారు. మా వాళ్ల ఆనందమే మాకు ముఖ్యం’ అని చెబుతుంటాను. మన దేశం గురించి ఎవరు చులకనగా మాట్లాడినా నేను సహించను’’ అని ఆవేశంగా అన్నారు.

'సావిత్రి' రివ్యూ


 
చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న నారా రోహిత్ ఈ శుక్రవారం 'సావిత్రి' అనే టైటిల్ తో ప్రేక్షకులను పలకరించాడు. 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పవన్ సాదినేని చాలా కాలం గ్యాప్ తర్వాత తెరకెక్కించిన సినిమా 'సావిత్రి'. టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ లో బడ్జెట్ మూవీ ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..
కథ : సావిత్రి (నందిత) అనే అమ్మాయికి చిన్నప్పటి నుంచి పెళ్లి అంటే విపరీతమైన ప్రేమ. ఖాళీ దొరికినప్పుడల్లా తన పెళ్లి గురించే కలలు కంటూ ఉంటుంది. పెళ్లి జరిగేందుకు ఏం చేయడానికైనా వెనుకాడని విచిత్ర మనస్తత్వం ఉన్న చలాకీ పిల్ల. తమ కుటుంబానికి సన్నిహితులైన ఓ వ్యక్తితో సావిత్రికి పెళ్లి నిశ్చయం అవుతుంది. నానమ్మ (రమప్రభ)తో కలిసి సంతోషంగా దైవ దర్శనానికి రైల్లో షిర్డీ బయలుదేరుతుంది సావిత్రి. ఆ ప్రయాణంలో తారసపడతాడు రిషి(నారా రోహిత్).

ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన ప్రేమ జంట (మధునందన్, శ్రీముఖి)ను రక్షించే క్రమంలో రిషీ ఆ రైల్లో ప్రయాణించాల్సి వస్తుంది. తొలిచూపులోనే సావిత్రికి ఆకర్షితుడైన రిషి.. ఆమె ప్రేమను గెలుచుకోవాలనుకుంటాడు. అయితే ప్రేమ జంటను రౌడీల నుంచి తప్పించే సమయంలో రిషితోపాటు సావిత్రి కూడా ట్రైన్ మిస్ అవుతుంది.ఇక తిరిగి వాళ్లు రైలును అందుకోవడానికి చేసే ప్రయత్నాలు, ప్రేమజంట పెళ్లి, సావిత్రి  ప్రేమ పొందడానికి రిషి పడే కష్టాలతో మిగిలిన కథ నడుస్తుంది.


ఎవరెలా చేశారంటే..

ఎప్పటికప్పుడు తన పాత్రల్లో వైవిధ్యం ఉండాలని తపనపడే నటుల్లో నారా రోహిత్ ఒకరు. రిషి పాత్రలో తేలికగా ఒదిగిపోయాడు. హీరోయిన్ నందిత అందంగా కనపడింది. తన రోల్ కు పూర్తి న్యాయం చేసిందని చెప్పొచ్చు. పెద్దలకు తెలియకుండా పారిపోయి వచ్చిన జంటగా కామెడీ టచ్ తో మధునందన్, శ్రీముఖిలు అలరించారు. ప్రభాస్ శీను, ఫిష్ వెంకట్, షకలక శంకర్ లు కాసేపు నవ్వించగలిగారు. సీనియర్ నటి రమాప్రభతో సహా మిగిలిన నటీనటులంతా తమ పాత్ర మేరకు రాణించారు.

అయితే దర్శకుడు ఇంతకుముందు తెలిసిన కథనే ఎంచుకోవడంతో పెద్దగా థ్రిల్లింగ్ గా అనిపించదు. తర్వాత ఏం జరుగుతుందనేది ముందే అర్థమైపోతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోరుతోపాటు పాటలు పర్లేదనిపించాయి. కుటుంబ విలువలను చూపించే ప్రయత్నం బావుంది. క్లైమాక్స్ లో డైలాగులు పేలాయి. ఓవరాల్ గా సావిత్రి సాధారణ సినిమానే.

Thursday, March 31, 2016

పవన్ vs మహేష్

 టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ కి పోటీ పడుతున్న ఇద్దరు హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఈ వేసవిలో తమ సినిమాలతో రిలీజ్ కు రెడీ అవుతున్నారు. అయితే ఈ ఇద్దరి సినిమాల మధ్య చాలా గ్యాప్ ఉన్నా, రికార్డ్ ల విషయంలో మాత్రం భారీగా పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ కాగా, ఏప్రిల్ 8న ఈ సినిమాను  తెలుగు, హిందీ భాషల్లో భారీగా రిలీజ్ చేయాడానికి రెడీ అవుతున్నారు.

ఇక మహేష్ హీరోగా తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం ఆడియోను ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ చేసి మే లో సినిమా విడుదల కు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బిజినెస్ విషయంలో ఈ రెండు సినిమాల మధ్య పోటీ పక్కాగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫారిన్ మార్కెట్ లో గట్టి పట్టున్న మహేష్, ఓవర్సిస్ రైట్స్ విషయంలో పై చేయి సాధించాడు.

బ్రహ్మోత్సవం ఓవర్సీస్ రైట్స్ 13 కోట్లకు అమ్ముడవ్వగా, సర్థార్ గబ్బర్ సింగ్ 11.5 కోట్లతో సరిపెట్టుకున్నాడు. కానీ శాటిలైట్ రైట్స్ విషయంలో మాత్రం పవన్ ముందున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ శాటిలైట్ రైట్స్ 13 కోట్లకు అమ్ముడవ్వగా, బ్రహ్మోత్సవం రైట్స్ 11.5 కోట్లతో సరిపెట్టుకుంది. బిజినెస్ లోనే ఇంతగా పోటి పడుతున్న ఈ ఇద్దరు స్టార్స్, రిలీజ్ తరువాత కలెక్షన్ల విషయంలో ఎలాంటి రికార్డ్స్ నమోదు చూస్తారో చూడాలి.

ఆయన నటనకు పడిపోయా!

  విజయ్ నటనకు ఫ్లాటైపోయానంటోంది ఇంగ్లిష్ బ్యూటీ ఎమీజాక్సన్. ఈ భామ ఇప్పుడు రెండు భారీ క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం 2.ఓ కాగా మరొకటి ఇళయదళపతి విజయ్‌తో రొమాన్స్ చేస్తున్న తెరి చిత్రం. 2.ఓ చిత్రం గురించి చెప్పుకోవడానికి ఇంకా చాలా రోజులు ఉన్నాయి. కాబట్టి తమిళ ఉగాదికి విడదలకు ముస్తాబవుతున్న తెరి గురించి మాట్లాడుకుందాం అంటోంది నటి ఎమీజాక్సన్. 
 
 ఈ చిత్రంలో విజయ్‌కి జంటగా సమంత, ఎమీజాక్సన్ నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చెన్నై చిన్నది సమంతదే ప్రధాన పాత్ర అట. విజయ్‌కు భార్యగా నటిస్తున్న సమంతకు కూతురుగా నటి మీనా కూతురు నటిస్తోంది.ఇది తల్లీ కూతుర్లు అనుబంధం ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం అని,చిత్ర కథ వీరి చుట్టూనే తిరుగుతుందని సమాచారం. ఎమీ ఇందులో టీచర్‌గా కనిపించనున్నారట. 
 
 దీని గురించి ఎమీ తెలుపుతూ తాను నటుడు విజయ్ వీరాభిమానిని ఆయన నటన, డాన్స్ చూసి ఎప్పుడో ఫ్లాటైపోయానని చెప్పింది. ఆయనతో నటించే అవకాశం వస్తే చాలని కోరుకున్నానని, అందుకే తెరి చిత్రంలో రెండో కథానాయకి పాత్ర అయినా నటించడానికి అంగీకరించానని అంది. ఇందులో తాను టీచర్‌గా నటించానని తన పాత్రకు మంచి పేరు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

Wednesday, March 30, 2016

అయ్యోపాపం! వాళ్లూ విడిపోతున్నారంట!


పదకొండు సంవత్సరాల వైవాహిక జీవితం.. అరడజనుకుపైగా పిల్లలు. హాలీవుడ్‌లోనే అత్యంత బలమైన అనుబంధమున్న జంటగా భావించిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ వైవాహిక బంధానికి బీటలు వారినట్టు కనిపిస్తోంది. ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోనుందన్న వార్తలు ప్రస్తుతం విదేశీ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి.
గతకొన్ని నెలలుగా పిట్‌-జోలీ అనుబంధంలో లుకలుకలు మొదలయ్యాయని, తాజాగా బ్రాడ్ పిట్‌ ఒక్కడే తమ పిల్లలు పాక్స్, జాహరా, మడొక్స్, షిల్హా, నాక్స్‌, వివియెన్నెలతో కలిసి షాపింగ్ చేస్తూ కనిపించడం.. వీరి బంధం విడిపోవడానికి చేరినట్టు సూచిస్తోందని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ పత్రిక పేర్కొంది. జోలీ తన డైరీలో రాసుకున్న వ్యక్తిగత నిజాలను పిట్ చదువడం వల్లే వీరి మధ్య విభేదాలు మొదలైనట్లు ఆ పత్రిక పేర్కొంది. ఆమె గత జీవితానికి సంబంధించిన సమస్యలు మళ్లీ వెలుగుచూడటంతో, ఆమె చిత్రంగా ప్రవర్తిస్తుండటంతో బ్రాడ్ పిట్‌ జోలీకి దూరమవుతున్నట్టు ద నేషనల్ ఎంక్వైరెర్ పత్రిక పేర్కొంది.

పిట్‌తో అనుబంధం నానాటికీ సన్నగిల్లుతుండటంతో ఆమె బేలగా, నీరసంగా మారిపోయిందని, ఇటీవల లండన్‌లో తన పిల్లలతో బయటకొచ్చిన జోలీ 'ఎముకల గూడు'లా కనిపించడంతో ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్నదని 'టచ్ మ్యాగజీన్' తెలిపింది. పిట్‌తో గొడవలు, వ్యవహారం విడాకుల దాకా వెళుతుండటంతో జోలీ చాలా నీరసంగా మారిపోయి మరింత బరువు తగ్గిపోయిందని, తీవ్ర ఒత్తిడిలో భావోద్వేగానికి లోనవుతున్న ఆమె శారీరకంగా, మానసికంగా బ్రేక్‌డౌన్ అయ్యేలా కనిపిస్తున్నదని ఆ మ్యాగజీన్ పేర్కొంది. ఈ పరిస్థితిలో జోలీకి సహాయపడటం కానీ, తమ వైవాహిక బంధాన్ని నిలుపుకోవడానికిగానీ బ్రాడ్ పిట్ ప్రయత్నించడం లేదని చెప్పింది. అయితే ఇన్ని కథనాలు వెలువడుతున్నా ఈ దంపతులు మాత్రం ఇప్పటివరకు పెదవి విప్పలేదు.

సెమీస్‌లో యువరాజ్ ఔట్.. మనీశ్ పాండే ఇన్

 టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో విండీస్‌తో తలపడే మ్యాచ్‌కు యువరాజ్‌సింగ్‌ దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు, వికెట్ల మధ్య పరుగు తీసేందుకు యువీ చాలా ఇబ్బంది పడ్డాడు. గాయం నయం కాకపోవడంతో విండీస్‌తో ఆడే తుది జట్టు నుంచి యువీ తప్పుకున్నాడు. యువరాజ్‌ స్థానంలో మనీష్‌ పాండేకు అవకాశం కల్పించారు.

Tuesday, March 29, 2016

ఆ హీరోయిన్ పెళ్లైపోయింది

  హీరోయిన్ అంకిత సోమవారం పెళ్లి చేసుకుంది. పుణేకు చెందిన వ్యాపారవేత్త విశాల్ జగ్తాప్ ను ఆమె వివాహమాడింది. ముంబై వర్లీ ప్రాంతంలో ఓ స్టార్ హోటల్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
రస్నాబేబీగా పాపులర్ అయి ఆ తరువాత బాలతారగా పలు చిత్రాలలో నటించింది. 'లాహిరి లాహిరి లాహిరి' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. తెలుగు తమిళ, కన్నడ భాషాల్లో 20 పైగా చిత్రాల్లో నటించింది. సింహాద్రి, విజయేంద్రవర్మ, అందురూ దొంగలే దొరికితే, మనసు మాట వినదు, ఖతర్నాక్, సీతారాములు, నవ వసంతం, అనసూయ, వినాయకుడు, అర్జునుడు, పోలీస్ అధికారి తదితర తెలుగు సినిమాల్లో కనిపించింది.

కొంత కాలం క్రితం నటనకు దూరం అయిన అంకిత న్యూయార్క్ వెళ్లి అక్కడ సినిమాకు సంబంధించిన కోర్స్ చేసింది. ఆ సమయంలో పరిచయం అయిన వ్యాపారవేత్త విశాల్‌తో అంకిత లవ్ లో పడింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించి పెళ్లి చేయడంతో ప్రేమకథ సుఖాంతం అయింది.

కొత్త లుక్‌తో... దిల్ ఖుష్!

 ఎర్రటి పంజాబీ డ్రెస్‌లో, చందమామ లాంటి మోముతో తళతళలాడుతున్న అందాల తార ఐశ్వర్యారాయ్ ‘సరబ్‌జిత్’ సిన్మా లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో ఐష్‌ది మెయిన్ రోల్ కాకపోయినా ఆమే ఈ చిత్రానికి సెంటరాఫ్ ఎట్రాక్షన్ అని వేరే చెప్పాల్సిన పని లేదు.

 అందుకే చిత్ర బృందం ఐష్ స్టిల్స్‌ను ఎక్కువగా విడుదల చే సి, సినిమాకు మరింత ప్రచారం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. భారత గూఢచారి అనే అభియోగంతో జీవితాంతం జైల్లోనే మగ్గిపోయిన ‘సరబ్‌జిత్’ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. తమ్ముడికి జరిగిన అన్యాయం గురించి పోరాడిన సోదరి దల్బీర్ కౌర్ పాత్రలో ఐష్ కనిపించనున్న సంగతి తెలిసిందే.

 అందుకు తగ్గట్టే సహజత్వానికి దగ్గరగా లుక్స్ విషయంతో చిత్ర దర్శకుడు ఒమంగ్ కుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరబ్‌జిత్‌గా రణదీప్‌హుడా, ఆయన భార్యగా రిచా చద్దా కనిపించనున్నారు. ఆ మధ్య ‘జజ్బా’ చిత్రం అనుకున్న ఫలితమివ్వకపోవడంతో, ఈ సినిమాతోనైనా హిట్ సాధించాలని ఐశ్వర్య శ్రమిస్తున్నారు.