పదకొండు సంవత్సరాల వైవాహిక జీవితం.. అరడజనుకుపైగా పిల్లలు. హాలీవుడ్‌లోనే అత్యంత బలమైన అనుబంధమున్న జంటగా భావించిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ వైవాహిక బంధానికి బీటలు వారినట్టు కనిపిస్తోంది. ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోనుందన్న వార్తలు ప్రస్తుతం విదేశీ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి.
గతకొన్ని నెలలుగా పిట్-జోలీ అనుబంధంలో లుకలుకలు మొదలయ్యాయని, తాజాగా బ్రాడ్ పిట్ ఒక్కడే తమ పిల్లలు పాక్స్, జాహరా, మడొక్స్, షిల్హా, నాక్స్, వివియెన్నెలతో కలిసి షాపింగ్ చేస్తూ కనిపించడం.. వీరి బంధం విడిపోవడానికి చేరినట్టు సూచిస్తోందని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ పత్రిక పేర్కొంది. జోలీ తన డైరీలో రాసుకున్న వ్యక్తిగత నిజాలను పిట్ చదువడం వల్లే వీరి మధ్య విభేదాలు మొదలైనట్లు ఆ పత్రిక పేర్కొంది. ఆమె గత జీవితానికి సంబంధించిన సమస్యలు మళ్లీ వెలుగుచూడటంతో, ఆమె చిత్రంగా ప్రవర్తిస్తుండటంతో బ్రాడ్ పిట్ జోలీకి దూరమవుతున్నట్టు ద నేషనల్ ఎంక్వైరెర్ పత్రిక పేర్కొంది.
పిట్‌తో అనుబంధం నానాటికీ సన్నగిల్లుతుండటంతో ఆమె బేలగా, నీరసంగా మారిపోయిందని, ఇటీవల లండన్‌లో తన పిల్లలతో బయటకొచ్చిన జోలీ 'ఎముకల గూడు'లా కనిపించడంతో ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్నదని 'టచ్ మ్యాగజీన్' తెలిపింది. పిట్‌తో గొడవలు, వ్యవహారం విడాకుల దాకా వెళుతుండటంతో జోలీ చాలా నీరసంగా మారిపోయి మరింత బరువు తగ్గిపోయిందని, తీవ్ర ఒత్తిడిలో భావోద్వేగానికి లోనవుతున్న ఆమె శారీరకంగా, మానసికంగా బ్రేక్‌డౌన్ అయ్యేలా కనిపిస్తున్నదని ఆ మ్యాగజీన్ పేర్కొంది. ఈ పరిస్థితిలో జోలీకి సహాయపడటం కానీ, తమ వైవాహిక బంధాన్ని నిలుపుకోవడానికిగానీ బ్రాడ్ పిట్ ప్రయత్నించడం లేదని చెప్పింది. అయితే ఇన్ని కథనాలు వెలువడుతున్నా ఈ దంపతులు మాత్రం ఇప్పటివరకు పెదవి విప్పలేదు.
No comments:
Post a Comment