Saturday, March 5, 2016

రివ్యూ: గుంటూర్ టాకీస్


            కొద్ది కాలంగా తెలుగు తెరపై క్రైమ్ కామెడీ చిత్రాల సంద‌డి ఎక్కువైంది.  ఇలాంటి చిత్రాల్లో ఆస‌క్తిక‌ర‌మైన క‌థాంశం, క‌థ‌ను వేగంగా న‌డిపించే స్ర్కీన్‌ప్లే,  సంద‌ర్భోచిత హాస్యాన్ని అందించే సంభాష‌ణ‌లు ఉంటే చాలు, తారాగ‌ణంతో సంబంధం లేకుండానే ప్రేక్ష‌కులు విజ‌యాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈకోవ‌లోనే తెర‌కెక్కిన చిత్రం గుంటూర్ టాకీస్‌. జాతీయ పుర‌స్కారం సాధించిన చంద‌మామ క‌థ‌లు చిత్రాన్ని తెర‌కెక్కించిన ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌కుడు కావ‌డం, బుల్లితెర యాంక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ర‌ష్మి నాయిక‌గా న‌టించ‌డం, శ్ర‌ద్ధ‌దాస్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌టంతో ఈ చిత్రంపై ప్రేక్ష‌కులు మంచి అంచ‌నాలు పెట్టుకున్నారు.

           క‌థేంటంటే: గుంటూర్ టాకీస్ మెడిక‌ల్ షాపులో చిరుద్యోగులుగా  ప‌నిచేసే హ‌రి(సిద్ధు), గిరి(న‌రేష్‌) రాత్రివేళ చిల్ల‌ర‌దొంగ‌త‌నాలు చేస్తుంటారు.  ఓరోజు రాత్రి దొంగ‌త‌నానికి వెళ్లిన‌ప్పుడు ఓ ఇంట్లో హ‌రికి రూ. ఐదు ల‌క్ష‌లు దొరుకుతుంది. ఆ విష‌యం గిరికి చెప్ప‌డు. మ‌రో ఇంట్లో గిరికీ రూ.ఐదుల‌క్ష‌లు దొరుకుతాయి. ఆ విష‌యం హ‌రికి చెప్ప‌కుండా దాస్తాడు.  అయితే ఆ రెండిళ్లు సీఐ ర‌ఘ‌బాబువ‌న్న విష‌యం వారికి తెలియ‌దు. హ‌రి ఆ డ‌బ్బుతో త‌ను ప్రేమించే ర‌ష్మితో క‌ల‌సి ఎంజాయ్ చేయ‌డానికి గోవా వెళ్లిపోతాడు.  అక్క‌డ ఓ రౌడీ బ్యాచ్ హ‌రిని బంధిస్తారు. అప్ప‌టికే గిరినీ వారు బ‌ల‌వంతంగా తీసుకొచ్చుంటారు.  వారు తాము దొంగ‌లించిన డ‌బ్బు తాలుకు మ‌నుషులేమో అని హ‌రి, గిరి అనుకుంటారు. అయితే వారు మాత్రం కోటి రూపాయ‌లు విలువ చేసే ఓ డ‌బ్బా గురించి అడుగుతూ ఎక్క‌డ దాచారంటూ తీవ్రంగా కొడ‌తారు.  మ‌రోవైపు సీఐ ఇంట్లో దొంగ‌త‌నం చేసిన హ‌రి, గిరిల‌ను పోలీసులు వెంబ‌డిస్తుంటారు. ఇలా ఇద్ద‌రి మ‌ధ్య చిక్కుకున్న హ‌రి, గిరి ప‌రిస్థితి ఏంటి? అస‌లు ఆ డ‌బ్బా సంగ‌తేంటి? హ‌రికి, రివాల్వ‌ర్ రాణి(శ్ర‌ద్ధ‌దాస్‌)కు సంబంధ‌మేంటి?  ఇంత‌కూ ఆ కోటి రూపాయ‌ల డ‌బ్బా ఎవ‌రి సొంత‌మైంది? త‌దిత‌ర విషయాలు తెర‌పై చూడాలి.
            ఎలా ఉందంటే:  ఇలాంటి క‌థ‌ల‌కు ఉండాల్సిన ప్ర‌ధాన ల‌క్ష‌ణం వేగం. అయితే ప్ర‌థ‌మార్ధంలో అది క‌ర‌వైంది. గంట నిడివికే సాగ‌తీత ఎక్కువైన‌ట్లు అనిపిస్తుంది.  విశ్రాంతి సమ‌యం నుంచే అస‌లైన క‌థ మొద‌లైన అభిప్రాయం క‌లుగుతుంది.  అప్ప‌టి వ‌ర‌కూ సిద్దు, న‌రేష్ పాత్ర‌లే ఎక్కువ‌గా క‌నిపించిన ప్రేక్ష‌కుల‌కు,   ద్వితీయార్ధంలో మ‌హేష్ మంజ్రేక‌ర్‌, ర‌ఘుబాబు త‌దిత‌రుల ప్ర‌వేశంతో  కొత్త‌ద‌నం ఉంటుంద‌న్న ఆశ క‌లుగుతుంది. గిలిగింత‌లు పెట్టే సంభాష‌ణ‌లు కాకుండా సంద‌ర్భోచిత హాస్యాన్ని పండించ‌డం బాగుంది.  అయితే శ్ర‌ద్ధాస్ చేసిన రివాల్వ‌ర్ రాణి పాత్ర‌ను కుటుంబ ప్రేక్ష‌కులు జీర్ణించుకోవ‌డం క‌ష్టం. మ‌హేష్ మంజ్రేక‌ర్, ఫిష్ వెంక‌ట్‌,ర‌విప్ర‌కాష్‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు న‌వ్విస్తాయి.  మ‌హేష్ మంజ్రేక‌ర్ పాత్ర‌తో  ప‌లికించిన సంభాష‌ణ‌లు కొంద‌రికి రుచించ‌క‌పోవ‌చ్చు. మొత్తంగా ఇది  యువ ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో ఉంచుకుని చేసిన సినిమా క‌నుక వారికి న‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌.
            ఎవ‌రెలా:  సిద్ధు, న‌రేష్ పాత్ర‌ల‌కు ప్రాధాన్య‌మెక్కువ‌.  సుల‌భంగా డ‌బ్బు సంపాదించాల‌నుకునే పైలా ప‌చ్చీస్ యువ‌కుడిగా సిద్దు ఒదిగిపోయాడు. న‌రేష్ అనుభ‌వం ముందు ఇలాంటి పాత్ర‌లు కొట్టిన పిండి. ర‌ష్మి క‌నిపించే స‌మయం  ఎక్కువైనా ప‌లికే సంభాష‌ణలు చాలా త‌క్కువ‌. ఓ పాట‌తో పాటు మ‌రికొన్ని స‌న్నివేశాల్లో గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంటుంది. శ్ర‌ద్ద‌దాస్ చేయ‌డానికి పెద్ద‌గా స్కోప్ లేదు.  మ‌హేష్ మంజ్రేక‌ర్ వైవిధ్య‌మైన డైలాగ్ డెలివ‌రీతో ఆక‌ట్టుకుంటాడు. ఇత‌రులు వారి పాత్ర‌ల మేర‌కు న‌టించారు.  పాత్ర‌ల రూప‌క‌ల్ప‌న‌పై శ్ర‌ద్ధ పెట్టే ద‌ర్శ‌కుడిగా పేరున్న ప్ర‌వీణ్ స‌త్తారు ఇందులో ఆ విషయాన్ని మ‌రిచాడు.  పాత్ర‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నా వాటి ప్ర‌భావం అంత‌గా క‌నిపించ‌దు.  శ్రీ చ‌ర‌ణ్‌కు పాట‌లతో ప్ర‌తిభ నిరూపించుకోవ‌డానికి ఇందులో అవ‌కాశం లేదు. నేపథ్య సంగీతంలో ఫ‌ర్వాలేద‌నిపించాడు.  ద‌ర్శ‌కుడు బిగువైన క‌థ‌నంపై దృష్టి పెట్టి ఉంటే బాగుండ‌నిపిస్తుంది.

Friday, March 4, 2016

'శౌర్య' మూవీ రివ్యూ


కరెంటు తీగ లాంటి హిట్ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ సరికొత్త అవతారంలో శౌర్యగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఎక్కువగా ఎనర్జిటిక్ రోల్స్ లోనే కనిపించిన మనోజ్, ఈ సినిమాలో డీసెంట్ లుక్ తో, సెటిల్డ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పటి వరకు ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్స్ మాత్రమే తీసిన దర్శకుడు దశరథ్ కూడా ఈ సినిమాతో రూటు మార్చే ప్రయత్నం చేశాడు. తొలిసారిగా ఓ క్రైమ్ థ్రిల్లర్ తో అభిమానుల మెప్పించడానికి ప్రయత్నించాడు. మనోజ్ లుక్ తో పాటు ప్రమోషన్ పరంగా ఆకట్టుకున్న శౌర్య థియేటర్స్ కు వచ్చిన ఆడియన్స్ ను ఆ స్ధాయిలో థ్రిల్ చేశాడా..?
కథ :
శౌర్య( మంచు మనోజ్), నేత్ర (రెజీనా) చాలా కాలంగా ప్రేమించుకుంటుంటారు. వీరి పెళ్లికి నేత్ర తండ్రి సత్యమూర్తి(నాగినీడు), బాబాయి కృష్ణమూర్తి(సుబ్బరాజు) ఒప్పుకోలేదన్న కారణంతో తన గోల్ ను కూడా వదులుకొని యుకె వెళ్లి సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్న శౌర్య, చివరిసారిగా నేత్ర మొక్కు చెల్లించటం కోసం శివరాత్రి జాగరం చేయటానికి ఆమె సొంత ఊరికి వస్తారు. ఇద్దరు నిద్రపోయిన సమయంలో నేత్ర మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది.


శౌర్య పక్కన ఉండగానే ఎవరో నేత్ర గొంతుకోసి పారిపోతారు. ఆ నేరం, ఆమెతోనే ఉన్న శౌర్య మీద పడుతుంది. నేత్ర తండ్రి ఎంపీ కావటంతో పోలీసులు కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకుంటారు. ఇంతకీ నేత్ర మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు..? ఆ కేసు శౌర్య మీదకు ఎందుకు వచ్చింది..? శౌర్య ఈ కేసు నుంచి బయటపడి అసలు నేరస్థులను ఎలా పట్టించాడు..? అన్న అంశాన్ని ఆసక్తి కరమైన మలుపులతో, థ్రిల్లింగ్ ట్విస్ట్ లతో తెరకెక్కించారు.
 
నటీనటులు :
ప్రతీ సినిమాలో ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించే మనోజ్ ఈ సినిమాతో సెటిల్డ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో తనదైన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు. పాజిటివ్, నెగెటివ్ రెండు యాంగిల్స్ ను పర్ఫెక్ట్ గా చూపించి సినిమాకు ప్లస్ అయ్యాడు. రెజీనా కూడా తన పాత్ర మేరకు ఆకట్టుకుంది. నాచురల్ యాక్టింగ్ తో కథను ముందుకు నడిపించింది. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రకాష్ రాజ్ మరోసారి తన మార్క్ చూపించాడు. హీరో పాత్రకు ధీటుగా పోలీస్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో నాగినీడు, సుబ్బరాజు, శియాజీ షిండే లు తమ పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ శీను కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది.

Thursday, March 3, 2016

నేను షారుక్ అభిమానిని!

 ఆ మధ్య వరకూ షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఆ తర్వాత సీన్ మారింది. సల్మాన్ చెల్లెలు అర్పితా ఖాన్ పెళ్లి నుంచి ఈ ఇద్దరి మధ్య మళ్లీ స్నేహం చిగురించింది. ఆ తర్వాత తమ మధ్య ఉన్న విభేదాలన్నింటినీ మరిచిపోయి ఇద్దరూ హ్యాపీగా ఉంటున్న సంగతి తెలిసిందే.

  ఇప్పుడు సల్మాన్‌ఖాన్ తాను షారుక్‌ఖాన్ అభిమానిని అని పేర్కొనడం బాలీవుడ్ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. షారుక్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యాన్’ ప్రచార చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా కండలవీరుడు సల్మాన్ ‘‘బీయింగ్ ఎ ఫ్యాన్ ఆఫ్ షారుక్’’ అంటూ ‘ఫ్యాన్’ ట్రైలర్ లింక్‌ను తన ట్విటర్‌లో షేర్ చేశారు. గత ఏడాది సల్మాన్ నటించిన ‘బజరంగీ భాయ్‌జాన్’ చిత్రం ఫస్ట్ లుక్‌ను షారుక్ ట్విట్టర్‌లో ఆవిష్కరిస్తే, ఆ తర్వాత షారుక్ నటించిన ‘దిల్‌వాలే’ చిత్రం డైలాగ్స్‌తో సల్మాన్ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ టీమ్ డబ్‌స్మాష్ చేసింది.

  ఇదంతా చూస్తుంటే, ఎలాంటి ఈగోలు లేకుండా సల్మాన్, షారుక్‌లు చాలా ఫ్రెండ్లీగా ఉంటూ, ఒకరి చిత్రాలను మరొకరు ప్రమోట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద పోటీ పోటీనే... స్నేహం స్నేహ మే అన్న మాట. సల్మాన్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. షారుక్ కూడా అంతే. కొత్తగా చిగురించిన ఈ ఇద్దరి స్నేహం ఎందాకా కొనసాగుతుందో కాలమే చెప్పాలి.

మహిళలకు శ్రుతిహాసన్‌ ప్రత్యేక బహుమతి

 నటి శ్రుతిహాసన్‌ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఓ పాటను అంకితం చేయనున్నారట. సంగీత దర్శకులు ఎహ్‌సాన్‌ నూరానీ, లాయ్‌ మెన్‌డోన్కాలతో కలిసి ఆమె ఈ పాటను విడుదల చేస్తున్నారు. మహిళలను చైతన్య పరిచే దిశగా ఈ పాటను రచించినట్లు శ్రుతి పేర్కొన్నారు. స్త్రీలకు కలలు కనే శక్తి నిస్తూ... ఆత్మహత్యలకు పాల్పడాలనే ఆలోచనలు రాకుండా చేసే దిశగా పాట ఉంటుందని తెలిపారు. ఈ పాటలోని సంగీతం చక్కగా ఉంటుందని, పాట అందరికీ నచ్చుతుందని అభిప్రాయపడ్డారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్న శ్రుతి ఇలా సమయం కేటాయించి మరీ మహిళల కోసం పాట విడుదల చేయడం విశేషమే కదా.
         ప్రస్తుతం శ్రుతిహాసన్‌ తెలుగులో నాగచైతన్యతో ‘ప్రేమమ్‌’లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో ఆమె నటించిన ‘రాకీ హ్యాండ్సమ్‌’ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్‌ అబ్రహం కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి నిశికాంత్‌ కామత్‌ దర్శకత్వం వహించారు.

Wednesday, March 2, 2016

విడాకులు కోరుతున్న నటి

 తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రేమ తన జీవిత భాగస్వామి జీవన్‌ అప్పచ్చు నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో బుధవారం పిటిషన్‌ దాఖలు చేశారు. విడాకులు తీసుకోవడానికి తన భర్త అంగీకరించినట్లు ఆమె పేర్కొన్నారు. అభిప్రాయబేధాల కారణంగా వీరిద్దరూ కొద్దికాలంగా విడిగా ఉంటున్నారు.
బెంగుళూరులోని కొడగు ప్రాంతానికి చెందిన ప్రేమ 2006లో పారిశ్రామిక వేత్త జీవన్‌ అప్పచ్చును వివాహం చేసుకున్నారు. 1995లో ‘సవ్యసాచి’ అనే కన్నడ చిత్రం ద్వారాప్రేమ తెరంగేట్రం చేశారు. వెంకటేశ్‌ సరసన ‘ధర్మచక్రం’ చిత్రంతో తెలుగు సినీపరిశ్రమకు పరిచయమయ్యారు.

బాహుబలి 2 రిలీజ్ డేట్


దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ముందుగా ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావించినా, భారీ గ్రాఫిక్స్ తో పాటు షూటింగ్ పార్ట్ కూడా చాలా మిగిలి ఉండటంతో వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. 2017 ఏప్రిల్ 17న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.        ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి ద బిగినింగ్ ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించటంతో పాటు 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న బాహుబలి 2 పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునే స్థాయిలో మరింత ప్రతిష్ఠాత్మకంగా బాహుబలి 2 ను తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్.

Tuesday, March 1, 2016

'24' టీజర్ రిలీజ్ కు ముహుర్తం కుదిరింది

 సౌత్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్ టైనర్ 24. ఇష్క్, మనం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ డిఫరెంట్ మూవీలో సూర్య త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ లు అభిమానులను ఆకట్టుకోగా త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్.
తొలి రోజు నుంచి సినిమా ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న చిత్రయూనిట్ టీజర్ లాంచ్ చేయబోతున్న విషయాన్ని కూడా క్రియేటివ్ గా ఎనౌన్స్ చేశారు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా జానర్ ను రివీల్ చేసే విధంగా సైంటిస్ట్ ఉపయోగించే పరికరాలతో పోస్టర్ ను రిలీజ్ చేశారు. మార్చి 4, సాయింత్రం 6గంటలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా పోస్టర్ తో ఎనౌన్స్ చేశారు.  ఈవిషయాన్ని సూర్య తన ట్విట్టర్ లో వెల్లడించారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 16 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న ప్రీతి జింతా



బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా ఎట్టకేలకు పెళ్లి కూతురైంది. ప్రీతి తన ప్రేమికుడు, అమెరికాకు చెందిన ఆర్థిక విశ్లేషకుడు జీని గుడెనఫ్ ను వివాహం చేసుకుంది. ఫిబ్రవరి 29న లాస్ ఏంజిలెస్ లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వివాహానికి ప్రీతి, గుడెనఫ్ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు సమాచారం.            ఏడాదిన్నరగా ప్రీతి జింతా, గుడెనఫ్ చెట్టాపట్టాలేసుకుని తిరుగున్నారు. వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్టు కొంతకాలంగా వార్తలు వచ్చినా ప్రీతి వీటిని ఖండించింది. అయితే లాస్ ఏంజిలెస్ లో ప్రీతి తన బాయ్ ఫ్రెండ్ ను వివాహం చేసుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీతికి సన్నిహితంగా ఉండే సుజానే ఖాన్, సురిలీ గోయెల్ లాస్ ఏంజిలెస్ వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రీతి ఏప్రిల్ లో ముంబైకు రానుంది.            ఈ దిల్ సే  హీరోయిన్  ప్రముఖ  వ్యాపారవేత్త నెస్ వాడియాను వివాహం చేసుకోనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ను కొనుగోలు చేశారు. అనంతరం వారిద్దరి మధ్య వివాదం ఏర్పడటం, పరస్పరం కేసులు పెట్టుకునే దాకా వ్యవహారం వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు.