Tuesday, December 6, 2016

లక్షాధికారులు!

  రామ్‌చరణ్ లక్షాధికారి అయ్యాడండీ. ఈ హీరోగారు 40 లక్షలకు అధిపతి. హన్సిక ఏకంగా 60 లక్షలకు అధిపతి అయ్యారు. త్రిష 30, ఇలియానా 40 లక్షలు... ఇలా లక్షాధికారులు అయినందుకు వీళ్లంతా చాలా హ్యాపీగా ఉన్నారు. కోట్లు కోట్లు పారితోషికం తీసుకునే వీళ్లు లక్షాధికారులైనందుకు ఆనందపడటమేంటి? అనేగా మీ డౌట్! అయితే అసలు విషయంలోకి వెళదాం...
 
 కరెన్సీ కష్టాల కారణంగా ఎవరెవరు తమ బ్యాంక్ ఖాతాల్లో ఎంతుందో చూసుకుని హ్యాపీగా ఫీలవుతున్నారు అనుకుంటున్నారా? కాదండి! ఈ లెక్క సోషల్ మీడియాల్లోని తమ ఖాతాల్లో అభిమానుల సంఖ్య. ఈ లెక్క ఆల్ ఇండియాకి సంబంధించినది కాదు.. హోల్ వరల్డ్‌ది అన్న మాట. సెలబ్రిటీలంతా అభిమానులతో నేరుగా తమ విశేషాలు పంచుకోవడానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్న విషయం తెలిసిందే. అభిమాన నటీనటులతో నేరుగా మాట్లాడకపోయినా.. ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా అభిప్రాయాలు పంచుకోవచ్చు కాబట్టి, వీళ్ల ఎకౌంట్స్‌ని ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. ఒక్కో సెలబ్రిటీ ఎకౌంట్‌లో లక్షల్లో ఫాలోయర్స్ ఉంటారు. గడచిన పది రోజుల్లో... 40, 60, 30 లక్షలకు చేరుకున్న సెలబ్రిటీల ఖాతాల వివరాల్లోకి వెళితే...
 
 మీకోసం ఎంత కష్టపడుతున్నానో
 రామ్‌చరణ్‌కి ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఖాతాలున్నాయి. ఫేస్‌బుక్ ఖాతాను ఇప్పుడు ‘40 లక్షల’ మంది అనుసరిస్తున్నారు. ‘‘మన ఫ్యామిలీ మొత్తం నాలుగు మిలియన్లు (40 లక్షలు). చాలా ఆనందంగా ఉంది. చూడండి.. ఫేస్‌బుక్‌లో మీకు అప్‌డేట్స్ ఇవ్వడానికి ఎంత కష్టపడుతున్నానో’’ అంటూ షూటింగ్ సమయాల్లో ఫోన్ ద్వారా ఫేస్‌బుక్‌లో తాను అప్‌డేట్ చేస్తున్న ఫొటోను రామ్‌చరణ్ పోస్ట్ చేశారు. తాను చేస్తున్న సినిమాల విశేషాలతో పాటు అడపా దడపా ఫేస్‌బుక్ ద్వారా ఫ్యాన్స్‌తో ప్రత్యేకంగా ‘చాట్’ చేస్తుంటారు రామ్‌చరణ్. అభిమానులు అడిగిన ప్రశ్నలకు లైవ్‌లో ఓపికగా సమాధానాలిస్తుంటారు.
 
 మీ ప్రేమకో మంచి ఉదాహరణ
 బబ్లీ బ్యూటీ హన్సిక తమిళంలో కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాక అభిమానుల సంఖ్య బాగా పెరిగిపోయింది. పైగా తమిళనాడులో ‘చిన్న ఖుష్బూ’ అనిపించుకున్నారు కాబట్టి, అభిమానుల సంఖ్య సినిమా సినిమాకీ పెరుగుతోంది. ఫలితంగా ఈ బ్యూటీ ఫేస్‌బుక్ ఖాతాలో 60 లక్షలు ఫాలోయర్స్ చేరారు. ఫేస్‌బుక్‌లో ఎప్పట్నుంచో ఆమెకు ఎకౌంట్ ఉంది. ‘‘అభిమానులు నన్నెంతగా ప్రేమిస్తున్నారో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం’’ అని హన్సిక పేర్కొన్నారు.
 
 ఆ ఫొటోలకు బోల్డంత క్రేజ్
 గోవా బ్యూటీ ఇలియానా హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టాక సౌత్‌కి దూరమయ్యారు. కానీ, అభిమానులకు మాత్రం దూరం కాలేదు. ముఖ్యంగా ఈవిడగారి ‘ఇన్‌స్టాగ్రామ్’కి ఫాలోయర్ల సంఖ్య ఎక్కువ. ఎందుకంటే.. ఎప్పటిప్పుడు తన పర్సనల్ ఫొటోలను అందులో పొందుపరుస్తుంటారు. ‘వామ్మో.. చాలా హాట్ గురూ’ అనే స్థాయిలో ఆ ఫొటోలు ఉంటాయి. బికినీలో ఉన్న ఫొటోలను, వీడియోలను సైతం ఆమె పెడుతుంటారు. ఆ ఫొటోలకున్న క్రేజ్ ఎలాంటిదింటే ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌ని 40 లక్షల మంది ఫాలో అవుతున్నారు. 
 
 థర్టీ ప్లస్.. థర్టీ లాక్స్!
 త్రిష వయసు 30. నటిగా ఆమె కెరీర్ వయసు దాదాపు 15. ఇన్నేళ్లుగా కథానాయికగా రాణించడం అంటే చిన్న విషయం కాదు. పైగా చేతిలో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండటం అంటే మాటలు కాదు.  ఈ చెన్నై చందమామ చాలా ఆనందంలో ఉన్నారు. ఎందుకంటే ఈవిడగారి ట్విట్టర్ ఎకౌంట్‌ను 30 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ‘‘థ్యాంక్యూ.. నా మనసులో మీకు (ఫ్యాన్స్) ప్రత్యేకమైన స్థానం ఉంది’’ అని ఆనందం వ్యక్తం చేశారామె.
 
 కోట్లు తీసుకునే తారలకు వందల్లో ఫ్యాన్స్ ఉంటే లాభం లేదు. లక్షల్లో ఉండాలి. అప్పుడే లైమ్‌లైట్‌లో ఉన్నట్లు లెక్క. కెరీర్ మంచి ఊపు మీద ఉంటుంది. అందుకే ఈ కోటీశ్వరులందరూ తమను ఫాలో అవుతున్న లక్షలాది అభిమానులకు ‘బిగ్ థ్యాంక్స్’ అంటున్నారు.

No comments:

Post a Comment