Monday, January 30, 2017

లాస్యకు కాబోయే వరుడు ఇతడే..


ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎంగేజ్ మెంట్ వార్తను ఒక్కసారిగా చెప్పి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది యాంకర్ లాస్య. అంతే కాకుండా భారీ సస్పెన్స్ మూవీని తలపించేలా తనకు కాబోయే జీవిత భాగస్వామి వివరాలను వెల్లడించింది. తన ఎంగేజ్ మెంట్ కు సంబంధించి పోస్ట్ పెట్టిన కొద్ది వ్యవధిలోనే కాబోయే భర్తకు సంబంధించి చిన్న క్లూను ఓ ఫోటో ద్వారా ఇచ్చింది లాస్య.
ఒకరి చేతి పై మరొకరి ముద్దు పేరుతో పచ్చబొట్టు వేసి ఉన్న ఫోటోను లాస్య తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. చిన్ని, మంజూ అని రాసున్న ఆ రెండు చేతుల పక్కనే రెండు ఎంగేజ్ మెంట్ రింగులు కూడా ఉన్నాయి. దీన్నే లాస్య తన వాల్ పోస్ట్ గా కూడా పెట్టింది. ఈ ఫోటోను ఫేస్ బుక్ పేజీలో పెట్టిన కొద్ది సేపటికే పెద్ద ఎత్తున లైకులు వచ్చాయి. ఎంగేజ్ మెంట్ ఎవరితో అయింది..ఈ మంజూ ఎవరు అంటూ.. అభిమానులు భారీగా కామెంట్లు చేశారు.

దీనికి స్పందిచిన లాస్య విషెస్ తెలిపిన వారందరికి కృతజ్ఞతలు తెలిపింది. తనకు కాబోయే జీవిత భాగస్వామికి సంబంధించి ఫోటోను సరిగ్గా ఐదు గంటలకు ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేస్తానని లాస్య పేర్కొంది. తాను చెప్పినట్టుగానే సరిగ్గా సోమవారం సాయంత్రం ఐదుగంటలకు ఎంగేజ్ మెంట్ ఫోటోలను విడుదల చేసింది. అయితే ఆదివారం రోజే ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరిగిందని పేర్కొంది. మంజూనాథ్ మరాఠీ అబ్బాయని తెలిపింది.

Sunday, January 29, 2017

ఒకే తరహా పాత్రల్లో నటించడం నచ్చదు

 బాలీవుడ్‌లో కెరీర్‌ని మొదలు పెట్టినప్పటికీ.. తెలుగులో ‘హార్ట్‌ఎటాక్‌’.. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఆదా శర్మ. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘కమాండో2’ చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడికి ఒకే తరహా పాత్రల్లో నటించడమంటే అస్సలు నచ్చదంట.
‘‘ ఒకే విధమైన పాత్రల్లో నటించడమంటే నచ్చదు. విభిన్న పాత్రల్లో నటించాలని అనుకుంటున్నా. అలాంటి పాత్రలు దొరికితే ఎక్కడైనా సంతోషంగా నటిస్తా. దక్షిణాదిలో ఇప్పటివరకు ఎమోషనల్‌ పాత్రల్లో మాత్రమే నటించా. అయితే ‘కమాండో2’లో మాత్రం ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రలో నటిస్తున్నా. ఈ చిత్రంలో నాపై యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇందులో నేను ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా కనిపిస్తున్నా. ఇంతకముందు ఎప్పుడూ గన్‌ని పట్టుకోలేదు. కానీ ఈ సినిమా కోసం గన్‌ పట్టుకున్నా. అలాగే ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా కనిపించేందుకు.. గన్‌ సరిగ్గా పట్టుకోవడంపై ప్రత్యేక శ్రద్ధపెట్టా. ఇందులో నటించడం చాలా సరదాగా అనిపించింది.’’ అని చెప్పుకొచ్చింది ఆదాశర్మ.

Friday, January 27, 2017

'టాప్' లేపిన డేవిడ్ వార్నర్!

 కెరీర్‌లో ఉన్నత దశలో ఉన్న ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటాడు. ఇటీవల సొంతగడ్డపై పాకిస్తాన్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో శతకాల మోత మోగించిన వార్నర్‌ 367 పరుగులతో రాణించి, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కెరీర్‌లో తొలిసారిగా ఆసీస్ ప్లేయర్ ఫస్ట్ ర్యాంకును సాధించాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక ర్యాంకు దిగజారి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. టాప్ ర్యాంక్‌లో ఉన్న దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి మారాడు.
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఒక స్థానం మెరుగు పరుచుకుని 13వ ర్యాంకు సాధించగా, గాయాలతో సతమతమవుతున్న రోహిత్ శర్మ మూడు స్థానాలు దిగజారి 12వ స్థానానికి పరిమితం అయ్యాడు. ఇంగ్లండ్ ప్లేయర్ జాస్ బట్లర్‌తో సంయుక్తంగా శిఖర్ ధావన్ 14వ ర్యాంకులో నిలిచాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన కేదార్ జాదవ్ 57 స్థానాలు మెరుగు పరుచుకుని 47వ ర్యాంకు దక్కించుకున్నాడు.

బౌలింగ్ ర్యాంకింగ్స్: టాప్ టెన్‌లో నో ప్లేస్
 ఏ భారత బౌలర్ కూడా వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్‌లో చోటు దక్కించుకోలేదు. మూడు స్థానాలు దిగజారిన అక్షర్ పటేల్ 12వ స్థానంలో, లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 14వ ర్యాంకులో నిలిచాడు. టీమిండియా బౌలింగ్‌ కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఓవరాల్‌గా టీమిండియా వన్డేల్లో మూడో స్థానాన్ని అలాగే కొనసాగించింది.

Wednesday, January 25, 2017

రివ్యూ: రయీస్‌


 ‘బాలీవుడ్‌ బాద్‌షా’ షారుక్‌ ఖాన్‌. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారు. భావోద్వేగాలు పండించాలన్నా.. మాస్‌ని మెప్పించాలన్నా.. కుర్రకారుకు కిక్కిచ్చే రొమాన్స్‌ పండించాలన్నా ఆయనకు ఆయనే సాటి. అందుకే షారుక్‌ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకు వినోదపు విందు దొరికినట్లేనని భావిస్తారు. ఆయన తాజా చిత్రం ‘రయీస్‌’ పైనా అలాంటి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని గతేడాది జులైలో రంజాన్‌ సందర్భంగా విడుదల చేయాలనుకున్నప్పటికీ.. సల్మాన్‌ ఖాన్‌ ‘సుల్తాన్‌’ రావడంతో వాయిదా వేశారు. ఆరు నెలలు ఆలస్యంగా థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం సినీ అభిమానులను ఏ మేరకు అలరించింది? ప్రేక్షకుల అంచనాలను చేరుకుందా? అన్నది చూస్తే..
కథేంటి?: గుజరాత్‌లోని ఓ పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న ఆ రాష్ట్రంలో 1980.. 90 మధ్య కాలంలో జరిగిన అక్రమ వ్యాపారం నేపథ్యంతో సాగుతుంది. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన రయీస్‌ (షారుక్‌ ఖాన్‌) అక్రమ మద్యం వ్యాపారానికి అధిపతిగా ఎదుగుతాడు. తాను చేసేది తప్పా.. ఒప్పా అన్నది పట్టించుకోకుండా వ్యాపారం కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడతాడు.
తన వ్యాపారానికి అడ్డు చెప్పిన వారిని అంతమొందించేందుకూ వెనకాడడు. రాష్ట్రంలోని రాజకీయ.. పోలీసు.. కార్పొరేట్‌ వర్గాలను తన గుప్పిట్లో పెట్టుకునే స్థాయికి చేరుకుంటాడు. అయితే.. ఒక్కసారిగా రయీస్‌ జీవితం తలకిందులవుతుంది. వ్యాపారాధిపతిగా ఉన్న రయీస్‌ జీవితం ఒక్కసారి మారిపోవడానికి గల కారణాలేంటి? అతని అవినీతి అక్రమాలను ఎవరు.. ఎలా నిలువరించారు? చివరికి రయీస్‌ ఏమయ్యాడన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?: అక్రమ మద్యం వ్యాపారాన్ని కథాంశంగా తీసుకున్నప్పటికీ దాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు తడబడ్డాడు. మొదటి భాగంలో కొన్ని సన్నివేశాల్లో ఛాలెంజింగ్‌ ఛేజ్‌లు చేసిన షారుక్‌ మొదటి భాగాన్ని తన భుజాలపై నడిపించాడు. ద్వితీయార్ధంలో ఎమోషనల్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కంటెంట్‌ లేకుండానే కథ సాగినట్లు అనిపిస్తుంది. ముందుగానే వూహించేలా సన్నివేశాలు ఉంటాయి. కత్తెరకు మరికాస్త పని చెబితే బాగుండేది.
బలమైన కథ ఉన్నప్పటికీ కథనం మాత్రం దారి తప్పింది. రయీస్‌ అక్రమ బాగోతాలను బహిర్గతం చేసేందుకు నిజాయతీపరుడైన పోలీసు అధికారిగా నవాజుద్దీన్‌ సిద్దిఖీ వేసే ఎత్తులు ఆసక్తి రేకెత్తిస్తాయి. సంగీతం ఆకట్టుకునేలా ఉంది.
 
ఎవరెలా?: ఐదు పదుల వయసులోనూ పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో షారుక్‌ ఖాన్‌ మెప్పించారు. యాక్షన్‌ సన్నివేశాల్లో తన మార్క్‌ను చాటుకున్నారు. భావోద్వేగంతో కూడిన సన్నివేశాల్లో నటించడమంటే నవాజుద్దీన్‌ సిద్ధిఖీకి వెన్నతో పెట్టిన విద్య. ఈ చిత్రంలోనూ ఆయన తన మార్కును చాటుకోగలిగారు. నిజాయతీపరుడైన పోలీసు అధికారి పాత్రలో నవాజ్‌ ఒదిగిపోయారు. పాకిస్థానీ ముద్దుగుమ్మ మహీరా ఖాన్‌ నటన పర్వాలేదనిపిస్తుంది. ప్రత్యేక గీతంలో వచ్చిన సన్నీ లియోని ప్రేక్షకులకు హుషారెత్తిస్తుంది.
చివరగా.. ‘రయీస్‌’ ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది  

Sunday, January 22, 2017

నేను.. అతడు.. ఆమె

ఈ వీకెండ్‌ సమంతకి ఎప్పటికీ గుర్తుండే మెమరబుల్‌ మూమెంట్‌ అనే చెప్పాలి. చల్లగాలిలో చెలికాడితో కలసి షికారుకి వెళ్లారు. అప్పుడు తీసిన ఫొటోల్ని ‘నేను, అతను మరియు ఆమె’ అని సమంత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇక్కడ ‘నేను’ అంటే సమంత. ‘అతడు’ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదూ... సమంత ప్రేమికుడు అక్కినేని నాగచైతన్యే! మరి, ‘ఆమె’ ఎవరు? అనుకుంటున్నారా! సూపర్‌ఫాస్ట్‌ స్పోర్ట్స్‌ కార్‌. నాగచైతన్యకి బైక్స్‌ అండ్‌ కార్స్‌ అంటే చాలా ఇష్టం.
వీలు చిక్కినప్పుడు... కారులో షికారుకి వెళ్లడం చైతూకి అలవాటు. అంతకు ముందు సోలోగా రేసింగ్‌ కారులో రయ్‌ రయ్‌మంటూ చక్కర్లు కొట్టేవారు. ఇప్పుడు ప్రేమలో ఉన్నారు కదా! ప్రేయసి, త్వరలో కాబోయే శ్రీమతి సమంతతో కలసి శనివారం ఢిల్లీ శివార్లలోని రేసింగ్‌ సర్క్యూట్‌లో ఎంజాయ్‌ చేశారు. ఆ హ్యాపీ మూడ్‌లో ‘మా శ్రీమతి తీసిన ఫొటోలు’ అని నాగచైతన్య సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. ఈ లవ్‌బర్డ్స్‌ పెళ్లి చేసుకుని ఒకే గూటిలో ఉండే సమయం దగ్గర్లోనే ఉంది.

Friday, January 20, 2017

యువీని చూసి మీరేం నేర్చుకుంటారు!

 పర్యాటక ఇంగ్లాండ్‌ జట్టుతో కటక్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో యువరాజ్‌, ధోనిలు చెలరేగి ఆడిన సంగతి తెలిసిందే. ఈ జోడీపై ఒకప్పటి డాషింగ్‌ ఓపెనర్‌, ట్విటర్‌ కింగ్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు. మూడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన 35 ఏళ్ల యువీ అసాధారణ ఆటతో 150, కెప్టెన్సీ నుంచి వైదొలిగిన ధోని 134 పరుగులతో రాణించారు. దీంతో మాజీ క్రికెటర్లు, సినీ ప్రముఖులు, వ్యాఖ్యాతలు సైతం వీరిద్దరినీ ఆకాశానికెత్తేస్తున్నారు.
‘పాత నోట్లు మాత్రమే చలామణిలో లేవు. యువరాజ్‌, ధోనిల ఆట మాత్రం అందుబాటులోనే ఉందని’ తన తొలి ట్వీట్‌లో పేర్కొన్నాడు. ‘ఈ వ్యక్తి క్యాన్సర్‌ను జయించాడు. అతడు మాత్రమే ఈ రోజు ఇంగ్లీష్‌ బౌలర్లను ఓడించాడు. సాధించేదాకా పట్టు వదలని తత్వాన్ని అతడి (యువీ) దగ్గర నుంచి నేర్చుకోవాలని’ యువరాజ్‌సింగ్‌ను ఉద్దేశించి సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. మైదానంలో యువీ, ధోనిల ఫోటోతో పాటు యువరాజ్‌సింగ్‌ క్యాన్సర్‌ చికిత్స చేయించుకున్న తర్వాత తీసిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.

Wednesday, January 18, 2017

సంజయ్‌కు కుమార్తె దొరికింది!

 బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ నటిస్తున్న ‘భూమి’ చిత్రంలో నటి అదితిరావు హైదరి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె సంజయ్‌ కుమార్తె పాత్రలో కనిపించనున్నారు. ఇన్నాళ్లు ఈ పాత్రకు తగిన నటి కోసం అన్వేషించిన చిత్ర బృందం అదితిని ఎంపిక చేసినట్లు బుధవారం తెలిపింది. ఒమంగ్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో తన పాత్ర కోసం అదితి సిద్ధమౌతున్నారట. ఫిబ్రవరిలో ‘భూమి’ షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
అదితి ఈ పాత్రకు సరిపోతుందని, తాము తీయబోయే ‘భూమి’ ఎలా ఉండాలో దానికి తగ్గట్టు ఆమె ఉన్నారని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు.

Tuesday, January 17, 2017

అతడితో డేటింగ్‌లో ఉన్నా

 బాలీవుడ్‌ నటి సోనమ్‌కపూర్‌.. వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాతో రిలేషన్‌లో ఉన్నట్లుగా కొంతకాలంగా బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై సోనమ్‌ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే తాజాగా తన ప్రేమ వ్యవహారంపై ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది సోనమ్‌.
ఇటీవల సోనమ్‌కపూర్‌.. ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా మీరు ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కదా! అని సోనమ్‌ని కరణ్‌జోహర్‌ అడిగాడు. దానికి బదులిచ్చిన సోనమ్‌.. ‘‘లండన్‌కి చెందిన వ్యాపారవేత్తతో డేటింగ్‌ చేస్తున్నా. ఈ విషయాన్ని అక్కడితోనే వదిలేయండి. నా పర్సనల్‌ విషయాల గురించి అంతకంటే ఎక్కువగా ప్రస్తావించాలని అనుకోవడం లేదు. ఎందుకంటే దాన్ని నేను చాలా పవిత్రంగా భావిస్తున్నా. కాబట్టి నా వ్యక్తిగత విషయం గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు.’’ అని చెప్పుకొచ్చింది సోనమ్‌ కపూర్‌.