Sunday, January 22, 2017

నేను.. అతడు.. ఆమె

ఈ వీకెండ్‌ సమంతకి ఎప్పటికీ గుర్తుండే మెమరబుల్‌ మూమెంట్‌ అనే చెప్పాలి. చల్లగాలిలో చెలికాడితో కలసి షికారుకి వెళ్లారు. అప్పుడు తీసిన ఫొటోల్ని ‘నేను, అతను మరియు ఆమె’ అని సమంత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇక్కడ ‘నేను’ అంటే సమంత. ‘అతడు’ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదూ... సమంత ప్రేమికుడు అక్కినేని నాగచైతన్యే! మరి, ‘ఆమె’ ఎవరు? అనుకుంటున్నారా! సూపర్‌ఫాస్ట్‌ స్పోర్ట్స్‌ కార్‌. నాగచైతన్యకి బైక్స్‌ అండ్‌ కార్స్‌ అంటే చాలా ఇష్టం.
వీలు చిక్కినప్పుడు... కారులో షికారుకి వెళ్లడం చైతూకి అలవాటు. అంతకు ముందు సోలోగా రేసింగ్‌ కారులో రయ్‌ రయ్‌మంటూ చక్కర్లు కొట్టేవారు. ఇప్పుడు ప్రేమలో ఉన్నారు కదా! ప్రేయసి, త్వరలో కాబోయే శ్రీమతి సమంతతో కలసి శనివారం ఢిల్లీ శివార్లలోని రేసింగ్‌ సర్క్యూట్‌లో ఎంజాయ్‌ చేశారు. ఆ హ్యాపీ మూడ్‌లో ‘మా శ్రీమతి తీసిన ఫొటోలు’ అని నాగచైతన్య సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. ఈ లవ్‌బర్డ్స్‌ పెళ్లి చేసుకుని ఒకే గూటిలో ఉండే సమయం దగ్గర్లోనే ఉంది.

Friday, January 20, 2017

యువీని చూసి మీరేం నేర్చుకుంటారు!

 పర్యాటక ఇంగ్లాండ్‌ జట్టుతో కటక్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో యువరాజ్‌, ధోనిలు చెలరేగి ఆడిన సంగతి తెలిసిందే. ఈ జోడీపై ఒకప్పటి డాషింగ్‌ ఓపెనర్‌, ట్విటర్‌ కింగ్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు. మూడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన 35 ఏళ్ల యువీ అసాధారణ ఆటతో 150, కెప్టెన్సీ నుంచి వైదొలిగిన ధోని 134 పరుగులతో రాణించారు. దీంతో మాజీ క్రికెటర్లు, సినీ ప్రముఖులు, వ్యాఖ్యాతలు సైతం వీరిద్దరినీ ఆకాశానికెత్తేస్తున్నారు.
‘పాత నోట్లు మాత్రమే చలామణిలో లేవు. యువరాజ్‌, ధోనిల ఆట మాత్రం అందుబాటులోనే ఉందని’ తన తొలి ట్వీట్‌లో పేర్కొన్నాడు. ‘ఈ వ్యక్తి క్యాన్సర్‌ను జయించాడు. అతడు మాత్రమే ఈ రోజు ఇంగ్లీష్‌ బౌలర్లను ఓడించాడు. సాధించేదాకా పట్టు వదలని తత్వాన్ని అతడి (యువీ) దగ్గర నుంచి నేర్చుకోవాలని’ యువరాజ్‌సింగ్‌ను ఉద్దేశించి సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. మైదానంలో యువీ, ధోనిల ఫోటోతో పాటు యువరాజ్‌సింగ్‌ క్యాన్సర్‌ చికిత్స చేయించుకున్న తర్వాత తీసిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.

Wednesday, January 18, 2017

సంజయ్‌కు కుమార్తె దొరికింది!

 బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ నటిస్తున్న ‘భూమి’ చిత్రంలో నటి అదితిరావు హైదరి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె సంజయ్‌ కుమార్తె పాత్రలో కనిపించనున్నారు. ఇన్నాళ్లు ఈ పాత్రకు తగిన నటి కోసం అన్వేషించిన చిత్ర బృందం అదితిని ఎంపిక చేసినట్లు బుధవారం తెలిపింది. ఒమంగ్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో తన పాత్ర కోసం అదితి సిద్ధమౌతున్నారట. ఫిబ్రవరిలో ‘భూమి’ షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
అదితి ఈ పాత్రకు సరిపోతుందని, తాము తీయబోయే ‘భూమి’ ఎలా ఉండాలో దానికి తగ్గట్టు ఆమె ఉన్నారని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు.

Tuesday, January 17, 2017

అతడితో డేటింగ్‌లో ఉన్నా

 బాలీవుడ్‌ నటి సోనమ్‌కపూర్‌.. వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాతో రిలేషన్‌లో ఉన్నట్లుగా కొంతకాలంగా బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై సోనమ్‌ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే తాజాగా తన ప్రేమ వ్యవహారంపై ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది సోనమ్‌.
ఇటీవల సోనమ్‌కపూర్‌.. ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా మీరు ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కదా! అని సోనమ్‌ని కరణ్‌జోహర్‌ అడిగాడు. దానికి బదులిచ్చిన సోనమ్‌.. ‘‘లండన్‌కి చెందిన వ్యాపారవేత్తతో డేటింగ్‌ చేస్తున్నా. ఈ విషయాన్ని అక్కడితోనే వదిలేయండి. నా పర్సనల్‌ విషయాల గురించి అంతకంటే ఎక్కువగా ప్రస్తావించాలని అనుకోవడం లేదు. ఎందుకంటే దాన్ని నేను చాలా పవిత్రంగా భావిస్తున్నా. కాబట్టి నా వ్యక్తిగత విషయం గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు.’’ అని చెప్పుకొచ్చింది సోనమ్‌ కపూర్‌.

Friday, January 13, 2017

ప్రియుడి కోసం ఏం చేసిందో తెలుసా?

 ప్రేమకోసం.. ప్రియురాలి కోసం ప్రియుడు ఎన్ని కష్టాలైనా భరిస్తాడు. ఎన్ని యుద్ధాలైనా చేస్తాడు. విలన్లతో పోరాడుతాడు. దెబ్బలు తింటాడు. జైలుకెళ్తాడు. ప్రేమను గెలుపించుకోవడం కోసం ఏదైనా చేస్తాడు. ఇది సహజం. కానీ.. ప్రియుడు కోసం ఓ ప్రియురాలి చేసిన సాహసం గురించి చెబితే.. ఔరా! అంటూ ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు.. ఏం చేసిందంటే..
వెనుజులాకి చెందిన 25ఏళ్ల ఆంటోనిటా రొబుల్స్‌ సౌడా బార్సిలోనాలోని ప్యుంటె అయేలా జైలులో శిక్ష అనుభవిస్తున్న తన ప్రియుడు జోస్‌ ఆంటోనియోను చూసేందుకు వచ్చింది. ఆమెతో పాటు తన పాపను.. గులాబి రంగు సూట్‌కేస్‌ను వెంట తెచ్చుకుంది. ఈ జైల్లో ఖైదీలను చూసేందుకు వచ్చిన వారు రాత్రంతా అక్కడే గడిపే వెసులుబాటు ఉంది. దీంతో సౌడా తన ప్రియుడితో రాత్రంతా గడిపింది. మరుసటి రోజు సౌడా తాను తెచ్చుకున్న గులాబి రంగు సూట్‌కేసులో ప్రియుడిని కుక్కి పడుకోబెట్టి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. దాదాపు తప్పించుకున్నారన్న సమయంలో జైలు ద్వారం వరకు సూట్‌కేసును మోసుకెళ్లిన సౌడా ద్వారం గడపను దాటించేందుకు చాలా అవస్థలు పడింది. సూట్‌కేసులో ప్రియుడు ఉండటంతో అది బరువైక్కింది. దాన్ని సౌడా ఒక్కతే మోయలేకపోయింది. వచ్చేటప్పుడు సౌడా సూట్‌కేసును అవలీలగా మోసుకెళ్లింది. ఇప్పుడు మోసేందుకు శ్రమిస్తుడంటంతో అనుమానం వచ్చిన పోలీసులు సూట్‌కేసును తెరిచారు. అందులో ఆమె ప్రియుడు జోస్‌ ఆంటానియో ఉండటం చూసి పోలీసులు షాక్‌ అయ్యారు. వెంటనే అతన్ని మళ్లీ జైలు గదికి పంపి.. సౌడాను కోర్టులో హాజరుపర్చారు. తొందరల్లో ఆమెకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. వారి పాపను సోషల్‌ సర్వీస్‌ శాఖకు అప్పగించనున్నారు.

Thursday, January 12, 2017

గౌతమీపుత్ర శాతకర్ణి ఎర్లీ రివ్యూ!


నందమూరి బాల‌కృష్ణ‌ను సంక్రాంతి హీరో అంటారు. ఆయ‌న సినిమాలు సంక్రాంతికొచ్చాయంటే సంద‌డే సంద‌డి. ఇప్పుడు మ‌రోసారి పండ‌గ సంద‌ర్భంగానే బాల‌య్య చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవు. ఈసారి వ‌చ్చిన ఈ చిత్రం ప్ర‌త్యేక‌మైన‌ది. బాల‌కృష్ణ సినీ ప్ర‌యాణానికి ఓ కీల‌క‌మైన మైలురాయిలాంటి వందో చిత్రం. అది కూడా చారిత్రక క‌థ‌తో కూడుకున్నది కావటం విశేషం. చారిత్రక పాత్ర‌ల్లో ఇమిడిపోతారు బాలకృష్ణ. ఆ త‌ర‌హా క‌థ‌లని న‌మ్మి సినిమా చేయ‌డంలోనూ త‌న‌కి తానే సాటి అయిన బాల‌య్య త‌న వందో చిత్రంగా `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` చేయ‌డం విశేషం. తెలుగు జాతి వీర‌త్వాన్ని చాటి చెప్పిన శ‌క‌పురుషుడు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి పాత్ర‌లో బాల‌య్య‌ను.. ఆయ‌న హావ‌భావాల్ని.. పౌరుషంతో చెప్పిన సంభాష‌ణ‌ల్ని ప్ర‌చార చిత్రాల్లో చూసిన‌ప్ప‌ట్నుంచి ప్రేక్ష‌కుల్లో ఆత్రుత‌.. అంచ‌నాలు అంతకంతకూ పెరిగిపోయాయి. మ‌రి అందుకు త‌గ్గ‌ట్టుగానే బాల‌య్య తెర‌పై విజృంభించాడా? చ‌రిత్ర ఆధారంగా కొద్దిగానే తెలిసిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి జీవితం ఎలాంటిది? ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ఎలా చిత్రీక‌రించార‌న్న‌ది చూస్తే..

కథేంటంటే: ఒకే రాజ్యం... ఒకే యుద్ధం.. అడ్డు గోడ‌లు లేని అఖండ భరత జాతి... అనే కలలుగన్న శాతవాహన చక్రవర్తి శాతకర్ణి (బాల‌కృష్ణ‌) . చిన్న‌ప్పుడే తాను క‌న్న క‌లని సాకారం చేసుకోవ‌డమే ల‌క్ష్యంగా అడుగులేస్తుంటాడు. దక్షిణ భారతంలో తిరుగులేని వీరునిగా కుంతల, కల్యాణ దుర్గంతో పాటు మ‌రెన్నో రాజ్యాల‌ని త‌న రాజ్యంలో క‌లుపుకొంటాడు. సౌరాష్ట్రలో నహపాణుడి (కబీర్‌బేడీ) ఆధీనంలో ఉన్న రాజ్యాన్ని కూడా సొంతం చేసుకొని ఉత్త‌ర, ద‌క్షిణాల్ని ఒక్క‌టి చేయాల‌నుకొంటాడు. అయితే అప్ప‌టికే శాత‌క‌ర్ణి పూర్వీకుల్ని ఓడించిన నహపాణుడు దీటుగా జ‌వాబిస్తాడు. నాతో యుద్ధ‌మే చేయాల‌నుకొంటే నీ బిడ్డ పులోమావిని తీసుకొని రా అంటాడు. నేను ఓడిపోతే నా వీర‌ఖ‌డ్గం నీకు ఇస్తాను, నువ్వు ఓడిపోతే నీ బిడ్డ‌ని నాకిచ్చి వెళ్లిపోవాలంటాడు. అందుకు శాత‌క‌ర్ణి ఒప్పుకొన్న‌ప్ప‌టికీ, ఆయ‌న భార్య వాశిష్టీ దేవి (శ్రియ‌) ఎలా స్పందించింది? త‌న బిడ్డ‌తో క‌లిసి యుద్ధానికి వెళ్లిన శాత‌క‌ర్ణి ఎలాంటి పోరాటం చేశాడు? మొత్తం 33 రాజ్యాల్ని ఏక‌ఛత్రాధిప‌త్యం కింద‌కి తీసుకొచ్చి శ‌క‌పురుషుడిగా ఆవిర్భ‌వించిన శాత‌క‌ర్ణిని దెబ్బ కొట్టేందుకు యుద్ధానికి దిగిన గ్రీకు చక్రవర్తి డెమిత్రియస్‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? శాత‌క‌ర్ణిని ఓడించేందుకు అత‌డుఎలాంటి వ్యూహాల్ని ర‌చించాడు? అందులో గెలుపు ఎవ‌రిది? తిరుగులేని శాత‌క‌ర్ణికి మాతృమూర్తి గౌత‌మి (హేమ‌మాలిని) అండ‌గా నిలిచిన వైనం ఎలాంటిది? లాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వెండితెర‌పైన చూడాల్సిందే.
 

ఎలా ఉందంటే:. మ‌నదైన చ‌రిత్ర‌కి క్రిష్ బృందం క‌లిసిక‌ట్టుగా పెట్టిన ఓ బొట్టు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి. బాల‌కృష్ణ త‌న వందో చిత్రంగా ఈ సినిమాని ఎంపిక చేసుకొన్న‌ప్పుడు భిన్న‌మైన అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. బాల‌య్య చారిత్రక చిత్రాల్లో చ‌క్క‌గా ఒదిగిపోగ‌ల‌ర‌నే ఓ సానుకూలాంశం త‌ప్ప‌.. చ‌రిత్ర‌లో మాస్ అంశాలు ఏముంటాయి? అభిమానుల్ని మెప్పించ‌గ‌ల‌దా? అనే మాట‌లు వినిపించాయి. కానీ క్రిష్ మాత్రం మ‌న చ‌రిత్ర‌కి మించిన మాస్ అంశం ఏముంటుందని ఈ చిత్రంతో చాటి చెప్పారు. త‌న‌కు ల‌భ్య‌మైన ఆ కొద్దిపాటి చ‌రిత్ర‌నే సినిమాకి అనుగుణంగా చ‌క్క‌టి క‌థ‌గా తీర్చిదిద్దుకొన్నారు, అంతే చ‌క్క‌గా తెర‌పైకి తీసుకొచ్చారు. క‌ళ్యాణ‌దుర్గం రాజ్యంపై శాత‌క‌ర్ణి దండెత్తడం నుంచి సినిమా క‌థ మొద‌లవుతుంది. క‌ళ్యాణ‌దుర్గంతో పాటు, స‌హ‌పాణుడిని ఓడించి మొత్తం 33 రాజ్యాల్ని ఏక‌ఛ‌త్రాధిప‌త్యంలోకి తీసుకొస్తాడు శాత‌క‌ర్ణి.
 

Wednesday, January 11, 2017

'ఖైదీ నంబర్ 150' మూవీ రివ్యూ


ఇటీవల కాలంలో టాలీవుడ్ లో భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా ఖైదీ నంబర్ 150. తొమ్మిదిన్నరేళ్ల తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించటం. తండ్రి రీ ఎంట్రీ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మారటం. తమిళంలో ఘనవిజయం సాధించిన కత్తి సినిమాకు ఖైదీ నంబర్ 150 రీమేక్ కావటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి మెగాస్టార్ ఆ అంచనాలను అందుకున్నాడా..? ఖైదీ నంబర్ 150 గా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు బాస్ ఈజ్ బ్యాక్ అనిపించాడా..?
 కథ :
తమిళంలో ఘన విజయం సాధించిన కత్తి కథకు దాదాపు ఎలాంటి మార్పులు చేయకుండానే ఈ సినిమాను తెరకెక్కించారు. దొంగతనాలు, మోసాలు చేసి కోల్ కతా సెంట్రల్ జైల్ లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ కత్తి శ్రీను (చిరంజీవి). ఆ జైలు నుంచి ఓ ఖైదీ పరారవ్వటంతో ఆ ఖైదీని పట్టుకోవడానికి జైలర్, కత్తి శ్రీనును సాయం అడుగుతాడు. ఖైదీని పట్టించి శ్రీను జైలు నుంచి పారిపోతాడు. ఇండియాలో ఉంటే పోలీసులను తప్పించుకోలేమని తన ఫ్రెండ్(అలీ) సాయంతో బ్యాంకాక్ వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఎయిర్ పోర్ట్ లో లక్ష్మీ(కాజల్)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడి, బ్యాంకాక్ ప్రయాణం మానుకొని ఇండియాలో ఉండిపోతాడు.

లక్ష్మీ అడ్రస్ ఎలా సాధించాలని ఆలోచిస్తుండగా అచ్చు శ్రీనులానే ఉన్న శంకర్(చిరంజీవి) ను కొంత మంది వ్యక్తులు యాక్సిడెంట్ చేసి కాల్చి వెళ్లిపోతారు. కొన ఊపిరితో ఉన్న శంకర్ ను కాపాడి శంకరే శ్రీను అని పోలీసులు నమ్మేలా తన వస్తువులు శంకర్ దగ్గర ఉంచి వెళ్లిపోతాడు. దీంతో శంకర్ ను కోల్ కతా పోలీసులు అరెస్ట్ చేస్తారు. లక్ష్మీ హ్యాండ్ ఇచ్చిందని తెలుసుకున్న శ్రీను తిరిగి బ్యాంకాక్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న సమయంలో శంకర్ కు సంబంధించిన వాళ్లు శ్రీనును శంకర్ అనుకొని తీసుకెళతారు. అదే సమయంలో శంకర్ ను చంపడానికి ప్రయత్నించిన కార్పోరేట్ ఇండస్ట్రియలిస్ట్ అగర్వాల్(తరుణ్ అరోరా) శ్రీనును పిలిపించి 25 కోట్లు ఇస్తా నీతో ఉన్న ముసలి వాళ్లను వదిలేసి వెళ్లిపోమని చెపుతాడు. అందుకు ఒప్పుకున్న శ్రీను డబ్బు తీసుకొని బయల్దేరతాడు.

కానీ శంకర్ కోసం ఏర్పాటు చేసిన ఓ సన్మాన సభలో అతని పోరాటం గురించి తెలుసుకున్న శ్రీను.. మనసు మార్చుకుంటాడు. నిజాయితిగా శంకర్ చేస్తున్న పోరాటం గెలవటం కష్టమని.. తానే శంకర్ గా మారి రైతులను గెలిపించాలని నిర్ణయించుకుంటాడు. అసలు శంకర్ చేస్తున్న పోరాటం ఏంటి..? ఓ టీవీ రిపోర్ట్ కూడా పట్టించుకోని సమస్యను శ్రీను దేశం దృష్టిలో పడేలా ఎలా చేశాడు..? చివరకు శంకర్ ఆశయం గెలిచిందా..? శంకర్, శ్రీనులు కలిసారా..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
తొమ్మిదిన్నరేళ్ల తరువాత వెండితెర మీద హీరోగా కనిపించిన మెగాస్టార్ చిరంజీవి తనలో ఏమాత్రం జోష్, గ్రేస్ తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. మాస్ డ్యాన్స్ లు, యాక్షన్స్ సీన్స్ తో తన అభిమానులను ఫుల్ ఖుషీ చేశాడు. ముఖ్యంగా తన మార్క్ కామెడీ టైమింగ్ తో రీ ఎంట్రీలో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లో చిరు నటన కంట తడి పెట్టిస్తోంది.

హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన పరిథి మేరకు ఆకట్టుకుంది. నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినా.. గ్లామర్ సీన్స్ తో మెప్పించింది. మెయిన్ విలన్ గా నటించిన తరుణ్ అరోరా తెర మీద కనిపించింది కొద్దిసేపే అయినా.. స్లైలిష్ లుక్స్ తో పరవాలేదనిపించాడు. చిరు ఫ్రెండ్ గా అలీ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళీ, జయప్రకాష్ రెడ్డిలు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా కామెడీ కోసం క్రియేట్ చేసిన బ్రహ్మానందం క్యారెక్టర్, చిరు బ్రహ్మీల మధ్య వచ్చే కామెడీ సీన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. శంకర్ స్థానంలోకి వచ్చిన చిరు తన వేషం భాషా ఏ మాత్రం మార్చుకోకపోయినా తన వారు గుర్తుపట్టకపోవటం లాంటివి పక్కన పెడితే.. సినిమాను చిరు అభిమానులను అలరించే పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించటంతో వినాయక్ విజయం సాధించాడు. 60 ఏళ్ల చిరును ఇప్పటికీ మాస్ హీరోగా చూపించేందుకు టెక్నికల్ టీం చాలా కృషి చేసింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, జానీ, శేఖర్, లారెన్స్ మాస్టర్ల కొరియోగ్రఫీ ఇలా అన్ని మెగా రీ ఎంట్రీ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. తన తండ్రి  రీ ఎంట్రీ కోసం నిర్మాతగా మారిన రామ్ చరణ్ ఖర్చు వెనుకాడకుండా బెస్ట్ అవుట్ పుట్ కోసం పడిన కష్టం తెర మీద ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. అంతేకాదు అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ అంటూ మెగాస్టార్ తో కలిసి చరణ్ వేసిన స్టెప్పులు మెగా అభిమానులకు బోనస్.
ఓవరాల్ గా ఖైదీ నంబర్ 150.. మాస్ క్లాస్ ఆడియన్స్ ను అలరించే పక్కా కమర్షియల్ సినిమా. బాస్ ఈజ్ బ్యాక్

Monday, January 9, 2017

ధోనీ రిటైర్మెంట్‌ పై వివాదం

  టీమిండియా వన్డే, టి-20 కెప్టెన్ గా మహేంద్ర సింగ్‌ ధోనీ తప్పుకోవడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వచ్చే వన్డే ప్రపంచ కప్‌ ను దృష్టిలో ఉంచుకుని కొత్త సారథిని ఎంపిక చేసేందుకు వీలుగా ధోనీ వైదొలగాడని పలువురు క్రికెటర్లు, మాజీలు అభిప్రాయపడగా.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని బీసీసీఐ అతనిపై ఒత్తిడి చేసినట్టు తాజాగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. మహీ స్వతహాగా రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకోలేదని కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటనపై వివాదం ఏర్పడటంతో భారత సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎంఎస్‌ కే ప్రసాద్‌ స్పందించాడు.
కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిందిగా ధోనీపై ఎవరూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, అతను స్వతహాగానే నిర్ణయం తీసుకున్నాడని ప్రసాద్‌ స్పష్టం చేశాడు. రంజీ ట్రోఫీ సెమీస్‌ మ్యాచ్‌ సందర్భంగా ధోనీ రిటైర్మెంట్‌ గురించి తనతో మాట్లాడినట్టు వెల్లడించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ పదవి నుంచి తాను వైదొలగాలని భావిస్తున్నానని, తన స్థానంలో మరొకరిని కెప్టెన్ గా ఎంపిక చేయాలని కోరినట్టు ప్రసాద్‌ తెలిపాడు. ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని ధోనీ తనతో చెప్పాడని ఎంఎస్ కే ప్రసాద్‌ వివరణ ఇచ్చాడు. ధోనీ నిజాయతీ గల వ్యక్తని, అతని నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పాడు. విరాట్‌ కోహ్లీకి జట్టు పగ్గాలు అప్పగించేందుకు ఇదే సరైన నిర్ణయమని, అతనికి ధోనీ గైడ్‌గా వ్యవహరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. త్వరలో ఇంగ్లండ్‌ తో జరిగే వన్డే, టి-20 సిరీస్ లకు విరాట్‌ కోహ్లీని కెప్టెన్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో ధోనీకి స్థానం కల్పించారు.