Wednesday, January 11, 2017

'ఖైదీ నంబర్ 150' మూవీ రివ్యూ


ఇటీవల కాలంలో టాలీవుడ్ లో భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా ఖైదీ నంబర్ 150. తొమ్మిదిన్నరేళ్ల తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించటం. తండ్రి రీ ఎంట్రీ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మారటం. తమిళంలో ఘనవిజయం సాధించిన కత్తి సినిమాకు ఖైదీ నంబర్ 150 రీమేక్ కావటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి మెగాస్టార్ ఆ అంచనాలను అందుకున్నాడా..? ఖైదీ నంబర్ 150 గా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు బాస్ ఈజ్ బ్యాక్ అనిపించాడా..?
 కథ :
తమిళంలో ఘన విజయం సాధించిన కత్తి కథకు దాదాపు ఎలాంటి మార్పులు చేయకుండానే ఈ సినిమాను తెరకెక్కించారు. దొంగతనాలు, మోసాలు చేసి కోల్ కతా సెంట్రల్ జైల్ లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ కత్తి శ్రీను (చిరంజీవి). ఆ జైలు నుంచి ఓ ఖైదీ పరారవ్వటంతో ఆ ఖైదీని పట్టుకోవడానికి జైలర్, కత్తి శ్రీనును సాయం అడుగుతాడు. ఖైదీని పట్టించి శ్రీను జైలు నుంచి పారిపోతాడు. ఇండియాలో ఉంటే పోలీసులను తప్పించుకోలేమని తన ఫ్రెండ్(అలీ) సాయంతో బ్యాంకాక్ వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఎయిర్ పోర్ట్ లో లక్ష్మీ(కాజల్)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడి, బ్యాంకాక్ ప్రయాణం మానుకొని ఇండియాలో ఉండిపోతాడు.

లక్ష్మీ అడ్రస్ ఎలా సాధించాలని ఆలోచిస్తుండగా అచ్చు శ్రీనులానే ఉన్న శంకర్(చిరంజీవి) ను కొంత మంది వ్యక్తులు యాక్సిడెంట్ చేసి కాల్చి వెళ్లిపోతారు. కొన ఊపిరితో ఉన్న శంకర్ ను కాపాడి శంకరే శ్రీను అని పోలీసులు నమ్మేలా తన వస్తువులు శంకర్ దగ్గర ఉంచి వెళ్లిపోతాడు. దీంతో శంకర్ ను కోల్ కతా పోలీసులు అరెస్ట్ చేస్తారు. లక్ష్మీ హ్యాండ్ ఇచ్చిందని తెలుసుకున్న శ్రీను తిరిగి బ్యాంకాక్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న సమయంలో శంకర్ కు సంబంధించిన వాళ్లు శ్రీనును శంకర్ అనుకొని తీసుకెళతారు. అదే సమయంలో శంకర్ ను చంపడానికి ప్రయత్నించిన కార్పోరేట్ ఇండస్ట్రియలిస్ట్ అగర్వాల్(తరుణ్ అరోరా) శ్రీనును పిలిపించి 25 కోట్లు ఇస్తా నీతో ఉన్న ముసలి వాళ్లను వదిలేసి వెళ్లిపోమని చెపుతాడు. అందుకు ఒప్పుకున్న శ్రీను డబ్బు తీసుకొని బయల్దేరతాడు.

కానీ శంకర్ కోసం ఏర్పాటు చేసిన ఓ సన్మాన సభలో అతని పోరాటం గురించి తెలుసుకున్న శ్రీను.. మనసు మార్చుకుంటాడు. నిజాయితిగా శంకర్ చేస్తున్న పోరాటం గెలవటం కష్టమని.. తానే శంకర్ గా మారి రైతులను గెలిపించాలని నిర్ణయించుకుంటాడు. అసలు శంకర్ చేస్తున్న పోరాటం ఏంటి..? ఓ టీవీ రిపోర్ట్ కూడా పట్టించుకోని సమస్యను శ్రీను దేశం దృష్టిలో పడేలా ఎలా చేశాడు..? చివరకు శంకర్ ఆశయం గెలిచిందా..? శంకర్, శ్రీనులు కలిసారా..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
తొమ్మిదిన్నరేళ్ల తరువాత వెండితెర మీద హీరోగా కనిపించిన మెగాస్టార్ చిరంజీవి తనలో ఏమాత్రం జోష్, గ్రేస్ తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. మాస్ డ్యాన్స్ లు, యాక్షన్స్ సీన్స్ తో తన అభిమానులను ఫుల్ ఖుషీ చేశాడు. ముఖ్యంగా తన మార్క్ కామెడీ టైమింగ్ తో రీ ఎంట్రీలో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లో చిరు నటన కంట తడి పెట్టిస్తోంది.

హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన పరిథి మేరకు ఆకట్టుకుంది. నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినా.. గ్లామర్ సీన్స్ తో మెప్పించింది. మెయిన్ విలన్ గా నటించిన తరుణ్ అరోరా తెర మీద కనిపించింది కొద్దిసేపే అయినా.. స్లైలిష్ లుక్స్ తో పరవాలేదనిపించాడు. చిరు ఫ్రెండ్ గా అలీ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళీ, జయప్రకాష్ రెడ్డిలు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా కామెడీ కోసం క్రియేట్ చేసిన బ్రహ్మానందం క్యారెక్టర్, చిరు బ్రహ్మీల మధ్య వచ్చే కామెడీ సీన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. శంకర్ స్థానంలోకి వచ్చిన చిరు తన వేషం భాషా ఏ మాత్రం మార్చుకోకపోయినా తన వారు గుర్తుపట్టకపోవటం లాంటివి పక్కన పెడితే.. సినిమాను చిరు అభిమానులను అలరించే పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించటంతో వినాయక్ విజయం సాధించాడు. 60 ఏళ్ల చిరును ఇప్పటికీ మాస్ హీరోగా చూపించేందుకు టెక్నికల్ టీం చాలా కృషి చేసింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, జానీ, శేఖర్, లారెన్స్ మాస్టర్ల కొరియోగ్రఫీ ఇలా అన్ని మెగా రీ ఎంట్రీ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. తన తండ్రి  రీ ఎంట్రీ కోసం నిర్మాతగా మారిన రామ్ చరణ్ ఖర్చు వెనుకాడకుండా బెస్ట్ అవుట్ పుట్ కోసం పడిన కష్టం తెర మీద ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. అంతేకాదు అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ అంటూ మెగాస్టార్ తో కలిసి చరణ్ వేసిన స్టెప్పులు మెగా అభిమానులకు బోనస్.
ఓవరాల్ గా ఖైదీ నంబర్ 150.. మాస్ క్లాస్ ఆడియన్స్ ను అలరించే పక్కా కమర్షియల్ సినిమా. బాస్ ఈజ్ బ్యాక్

Monday, January 9, 2017

ధోనీ రిటైర్మెంట్‌ పై వివాదం

  టీమిండియా వన్డే, టి-20 కెప్టెన్ గా మహేంద్ర సింగ్‌ ధోనీ తప్పుకోవడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వచ్చే వన్డే ప్రపంచ కప్‌ ను దృష్టిలో ఉంచుకుని కొత్త సారథిని ఎంపిక చేసేందుకు వీలుగా ధోనీ వైదొలగాడని పలువురు క్రికెటర్లు, మాజీలు అభిప్రాయపడగా.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని బీసీసీఐ అతనిపై ఒత్తిడి చేసినట్టు తాజాగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. మహీ స్వతహాగా రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకోలేదని కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటనపై వివాదం ఏర్పడటంతో భారత సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎంఎస్‌ కే ప్రసాద్‌ స్పందించాడు.
కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిందిగా ధోనీపై ఎవరూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, అతను స్వతహాగానే నిర్ణయం తీసుకున్నాడని ప్రసాద్‌ స్పష్టం చేశాడు. రంజీ ట్రోఫీ సెమీస్‌ మ్యాచ్‌ సందర్భంగా ధోనీ రిటైర్మెంట్‌ గురించి తనతో మాట్లాడినట్టు వెల్లడించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ పదవి నుంచి తాను వైదొలగాలని భావిస్తున్నానని, తన స్థానంలో మరొకరిని కెప్టెన్ గా ఎంపిక చేయాలని కోరినట్టు ప్రసాద్‌ తెలిపాడు. ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని ధోనీ తనతో చెప్పాడని ఎంఎస్ కే ప్రసాద్‌ వివరణ ఇచ్చాడు. ధోనీ నిజాయతీ గల వ్యక్తని, అతని నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పాడు. విరాట్‌ కోహ్లీకి జట్టు పగ్గాలు అప్పగించేందుకు ఇదే సరైన నిర్ణయమని, అతనికి ధోనీ గైడ్‌గా వ్యవహరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. త్వరలో ఇంగ్లండ్‌ తో జరిగే వన్డే, టి-20 సిరీస్ లకు విరాట్‌ కోహ్లీని కెప్టెన్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో ధోనీకి స్థానం కల్పించారు.

Saturday, January 7, 2017

‘దృశ్యం’ చూసి హత్య చేశారు..!

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం’ చిత్రాన్ని చూసి ప్రేరణ పొంది తండ్రీకొడుకులు ఓ వడ్డీ వ్యాపారిని హతమార్చారు. ఆ చిత్రంలో హత్య చేసిన తర్వాత పోలీసులకు దొరక్కుండా ఆధారాలు నాశనం చెయ్యాలని ప్రయత్నించారు.. కానీ వారి ప్రయత్నం బెడిసికొట్టి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. అసలేం జరిగిందంటే..
మహారాష్ట్రలోని కుదల్‌క్వాడి ప్రాంతానికి చెందిన సమిద్దుల్లాహ్‌ మనియార్‌, మెహబూబ్‌ మనియార్‌ తరచూ శ్రీరాం శివాజీ వాలేకర్‌ అనే వ్యక్తి దగ్గర రూ.5లక్షలు అప్పు చేశారు. అలా ప్రతి చిన్నదానికి అప్పులు చేస్తున్నారే కానీ వాటిని తీర్చడం లేదు. అప్పు తీర్చాల్సిందిగా వాలేకర్‌ వారిని హెచ్చరించడంతో ఆ తండ్రీకొడుకులు ఆయన్ని హతమార్చాలని భావించారు. అందుకోసం పక్కాగా ప్రణాళిక వేసుకున్నారు. చిక్లి ప్రాంతంలో ఓ ఫ్లాట్‌లో మనియార్‌, ఆయన కొడుకు మెహబూబ్‌ అద్దెకు ఉంటున్నారు. ఒకరోజు డబ్బులిస్తాం రమ్మని వాలేకర్‌ను పిలిచి తండ్రీకొడుకులిద్దరూ కలిసి హత్యచేశారు. ఎవరికీ తెలియకుండా ఉండేందుకు వాలేకర్‌ మృతదేహాన్ని నలుపురంగు ప్లాస్టిక్‌ సంచిలో కట్టేసి పెట్టి అక్కడి నుంచి ఉడాయించారు.
గతేడాది సెప్టెంబరు 28న వాలేకర్‌ కనిపించకుండా పోయినట్లు అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. వాలేకర్‌ కాల్‌ రికార్డులను పరిశీలించగా ఎక్కువసార్లు మనియార్‌ ఫోన్‌ నుంచి కాల్స్‌ ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో వారిని పట్టుకొని విచారించగా అసలు విషయం బయటపెట్టారు. మృతదేహాన్ని ఉంచిన ప్రదేశాన్ని పోలీసులకు తెలియజేయడంతో శుక్రవారం వాలేకర్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Friday, January 6, 2017

మళ్లీ జోడీ కడతారా?

ఒక క్రేజీ జంటను సెట్‌ చేయడం అంత సులభం కాదు. నటుడు విక్రమ్, నటి నయనతార కలిసి నటించడానికి చాలా ఏళ్లే పట్టిందన్న సంగతి తెలిసిందే. చిన్న ఈగోనే ఇందుకు కారణం అనే ప్రచారం జోరుగా సాగింది. అలాంటిది ఎట్టకేలకు ఇరుముగన్ చిత్రంలో వీరి జత కుదిరింది.చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరోసారి ఈ హిట్‌ పెయిర్‌తో చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. అందుకోసం దర్శకుడు గౌతమ్‌మీనన్ చాలా ప్రయత్నిస్తున్నారనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. శింబు హీరోగా అచ్చయం ఎన్భదు మడమైయడా చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్‌మీనన్ తాజాగా ధనుష్‌తో ఇన్నై నోక్కి పాయుం తోటా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకోవడంతో తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. విక్రమ్‌ హీరోగా ధ్రువనక్షత్రం అనే చిత్రాన్ని చేయనున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. నిజానికి ఈ చిత్రం ఈ నెల రెండవ తేదీనే సెట్‌పైకి రావలసింది. కానీ అలా జరగలేదు. తాజా సమాచారం ఏమిటంటే ఇందులో విక్రమ్‌కు జంటగా నటి నయనతారను నటింపజేయాలని దర్శకుడు భావించారట.ఆ విషయమై నయనతారను సంప్రదించగా తను డిమాండ్‌ చేసిన పారితోషికం దర్శకుడు గౌతమ్‌మీనన్ కు ముచ్చెమటలు పట్టించిందని టాక్‌. అయినా ధ్రువనక్షత్రంలో నాయకి పాత్రకు నయనతారనే కరెక్ట్‌ అని భావించిన దర్శకుడు ఆమెను పారితోషికాన్ని తగ్గించుకోమని రిక్వెస్ట్‌ చేసే పనిలో ఉన్నారట.
అయితే ప్రస్తుతం లేడీఓరియెంటెడ్‌ చిత్రాలు, యువ హీరోలతో చిత్రాలు అంటూ యమ బిజీగా ఉన్న టాప్‌ నాయకి నయనతార గౌతమ్‌మీనన్ కోసం దిగి వచ్చి తన పారితోషికాన్ని తగ్గించుకుంటారా? మళ్లీ విక్రమ్‌తో జోడీ కుదురుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. ధ్రువనక్షత్రం చిత్రం అనుకున్నట్లు ప్రారంభం కాకుండా జాప్యం జరగడంతో అసహనానికి గురైన విక్రమ్‌ దుబాయ్‌కి చెక్కేసారని కోలీవుడ్‌లో టాక్‌. త్వరలో చిత్రం ప్రారంభం అయ్యిందా సరే. లేకుంటే ఈ నెల 26వ తేదీ నుంచి వాలు చిత్రం ఫేమ్‌ విజయ్‌చందర్‌ దర్శకత్వంలో నటించనున్న చిత్రానికి రెడీ అవుతారని సమాచారం.

ధోనికి పొగ పెట్టారా?

  భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోని ఆకస్మికంగా వైదొలగాడనికి ముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీవ్రస్థాయిలో కసరత్తు జరిపినట్లే కనబడుతోంది. ధోనిని నేరుగా పొమ్మనకుండా.. పొగ పెట్టి మరీ అతను కెప్టెన్సీ నుంచి సాగనంపారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత క్రికెట్ జట్టు పగ్గాలను ఉన్నపళంగా ధోని వదులుకోవడానికి కారణం మన సెలకర్లే అంటూ ఇప్పుడు చర్చ సాగుతోంది. ఇందుకు  బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎంఎస్ కే ప్రసాద్ వ్యవహరించిన తీరు కూడా బలాన్నిస్తోంది.

ప్రధానంగా త్వరలో ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ నేపథ్యంలో తగినంత ప్రాక్టీస్ చేసుకోవాలని భావించిన ధోని.. గుజరాత్-జార్ఖండ్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ కు హాజరయ్యాడు. ఆ మ్యాచ్ లో ధోని ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, జార్ఖండ్ జట్టుకు అనధికార మెంటర్ గా వ్యహరించాడు. తన రాష్ట్ర జట్టులోని సభ్యులకు కొన్ని విలువైన సలహాలిస్తూ వారితో తన అనుభవాల్ని పంచుకున్నాడు. ఇదే క్రమంలో ఆ జట్టు ప్రాక్టీస్ లో కూడా పాల్గొన్నాడు. అయితే  గడిచిన బుధవారం నాల్గో రోజు ఆటలో అక్కడ ఉన్నట్టుండి చీఫ్ సెలక్టర్ ఎంఎస్ కే ప్రసాద్ దర్శనమిచ్చారు. ధోనితో కూడా సమావేశమైన ఎంఎస్ కే.. సుదీర్ఘంగా చర్చించారు. ఇదంతా ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని ముందస్తు వ్యూహంలో భాగంగానే జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇంగ్లండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ కు కోహ్లికి జట్టు పగ్గాలు అప్పచెప్పాలని ఉద్దేశంతోనే ఐదుగురు సభ్యులతో కూడిన మన సెలక్టర్లు వ్యూహాత్మకంగా పావులు కదిపినట్లు కనబడుతోంది. ఆ క్రమంలోనే ఎంఎస్ కే అక్కడకు వెళ్లి ధోనికి అసలు విషయం చెప్పినట్లు సమాచారం. ఎంఎస్ కే తో సమావేశమైన అదే రోజు ధోని తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించడం కూడా అందుకు మరింత బలాన్నిస్తోంది. మరొకవైపు ధోని కెప్టెన్సీ నుంచి నిర్ణయం తీసుకున్న తరువాత ఎంఎస్ కే ఇచ్చిన ప్రకటన అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నిర్ణయాన్ని ఏడాది క్రితం కానీ, ఆరు నెలల క్రితం కానీ ధోని తీసుకుని ఉంటే తాము తప్పకుండా బాధపడేవాళ్లమంటూ ఎంఎస్ కే పేర్కొన్నాడు. ధోని సరైన సమయంలోనే కెప్టెన్సీ నుంచి వైదొలగాడంటూ ప్రశంసించాడు. అంటే ఇప్పుడు ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే తమకు ఏమీ అభ్యంతరం లేదనే విషయాన్ని ఎంఎస్కే  చెప్పకనే చెప్పేశాడు. అయితే చీఫ్ సెలక్టర్ గా ఎంఎస్ కే చేసిన ప్రకటనపై మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ అనుమానం వ్యక్తం చేశాడు. విరాట్ కు పరిమిత ఓవర్ల పగ్గాలు అప్పజెప్పాలనే సెలక్టర్లు భావించి ముందుగా ధోనికి ఆ విషయాన్ని తెలిపి ఉండవచ్చని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఏది ఏమైనా భారత జట్టుకు ఎన్నో విజయాల్ని అందించిన  ధోని ఈ నిర్ణయాన్ని స్వతహాగా తీసుకున్నాడా? లేక సెలక్టర్లే పొగ పెట్టారా?అనేది మాత్రం కచ్చితంగా మిలియన్ డాలర్ల ప్రశ్నే.

Thursday, January 5, 2017

ఆ పాట వింటే నా వెంటే!

  ‘డాడీస్‌ లిల్‌ గర్ల్‌’... ఇది ప్రియాంకా చోప్రా చేతి మీద ఉన్న టాటూ. తండ్రి అంటే ఆమెకు పిచ్చి ప్రేమ. అందుకే ఇలా పచ్చ బొట్టు పొడిపించుకున్నారు. మూడేళ్ల క్రితం ప్రియాంక తండ్రి అశోక్‌ చోప్రా చనిపోయారు. భౌతికంగా మాత్రమే ఆయన దూరమయ్యారని ఆమె అంటున్నారు. అప్పట్లో  అశోక్‌ చోప్రా ఓ పాట పాడారు. ఆ పాటను రిలీజ్‌ చేద్దామని  ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురి కావడం, చివరికి తిరిగి రాని లోకాలకు వెళ్లడం జరిగిపోయాయి.
ఇప్పుడా పాటను తాను నిర్మించి న తాజా పంజాబీ చిత్రం ‘శర్వాణ్‌’లో వాడారు ప్రియాంక. ‘‘మా నాన్నంటే చాలా ఇష్టం. ఆయనే నాకు రోల్‌ మోడల్‌. నాన్న పాడిన పాట వింటున్నపుడు ఆయన నాతో ఉన్నారన్న భావన కలుగుతుంది. మా నాన్న మీద ఉన్న ప్రేమతోనే ‘శర్వాణ్‌’ నిర్మించా. ఆయన పాడిన పాటను ఈ సినిమాలో ఉపయోగించడం ఆనందంగా ఉంది’’ అని ప్రియాంక పేర్కొన్నారు. ఈ నెల 13న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Wednesday, January 4, 2017

ఒక్క రోజు... రెండు విశేషాలు!

నాగచైతన్య (చైతూ) జీవితంలో జనవరి 29 ఎప్పటికీ గుర్తు పెట్టుకునే రోజుగా మారనుందా? ... అవుననే చెప్పాలేమో! ఎందుకంటే... ఆ రోజు రెండు విశేషాలకు ముహూర్తాలు కుదిరాయని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. చైతూ, సమంతల నిశ్చితార్థం ఈ నెల 29న జరగనుందనే వార్త ఎప్పట్నుంచో షికారు చేస్తోంది. దీనికి తోడు చైతూ హీరోగా బావ దగ్గుబాటి రానా నిర్మించనున్న చిత్రం ప్రారంభోత్సవం కూడా ఆ రోజేనని సమాచారం. ఈ చిత్రంతో కృష్ణ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు. ఈ రెండు వార్తల్నీ అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించలేదు. ఒక తాతయ్య (అక్కినేని నాగేశ్వరరావు) సంస్థలో చైతూ సినిమాలు చేశారు. మరో తాతయ్య (రామానాయుడు) నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో మాత్రం ఇప్పటివరకూ ఒక్క చిత్రం కూడా చేయలేదు.
నిజానికి, కృష్ణ దర్శకత్వంలో చైతూ హీరోగా మేనమామ సురేశ్‌బాబు ఓ చిత్రం నిర్మించాలనుకున్నారు. ఇప్పుడా చిత్రాన్నే రానా నిర్మించాలను కుంటున్నారట! మరి.. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బేనర్లోనే నిర్మిస్తారా? రానా తన బేనర్‌కి వేరే పేరు పెట్టుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చైతూ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో మాతృసంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. గత ఏడాది రెండు చిత్రాలు ‘ప్రేమమ్‌’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ ద్వారా తెరపై కనిపించిన చైతూ ఈ ఏడాది కూడా లెక్క తగ్గకుండా చూసుకుంటున్నా రనుకోవచ్చు. అన్నట్లు.. ఈ నెల 29న అటు నిశ్చితార్థం.. ఇటు సినిమా ప్రారంభం... రెండూ  జరుగుతాయా? వెయిట్‌ అండ్‌ సీ.

అలాంటి సినిమాల్లో నటించను: హీరో

  ‘బేఫికర్‌ ’  సినిమాలో హీరోగా నటించే అవకాశం ముందుగా తనకే వచ్చిందన్న రూమర్లను బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ తోసిపుచ్చాడు. ఒకవేళ తనకు అవకాశం వచ్చినా అటువంటి సినిమాలో తాను నటించబోనని స్పష్టం చేశాడు. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసునని చెప్పాడు. ‘బేఫికర్‌ ’  సినిమా వాస్తవానికి దూరంగా ఉందని పేర్కొన్నాడు. ప్రేమ పట్ల భారతీయ యువత ఆలోచనలను ప్రతిబింబించలేదని వివరించాడు.
సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని అభిప్రాయపడ్డాడు. పింక్‌, నీర్జా, ధోని బయోపిక్‌ చిత్రాలు విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనమని చెప్పాడు. హిట్‌, మంచి సినిమాకు తేడా ఉందన్నాడు. భారీ అంచనాలతో విడుదలైన బేఫికర్‌’  బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడిన సంగతి తెలిసిందే.

రణవీర్‌ సింగ్‌ తో తనకు విభేదాలు లేవని స్పష్టం చేశాడు. ఒకే ఏజ్‌ గ్రూపుకు చెందిన తామిద్దరం తగిన కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నామని చెప్పాడు. రణ్‌వీర్‌ ప్రస్తుతం సంజయ్‌లీలా భన్సాలీ ’పద్మావతి’ సినిమాలో నటిస్తున్నాడు. సుశాంత్‌ తాజా చిత్రం ’రబ్తా’ ఫిబ్రవరిలో విడుదలకానుంది.