Wednesday, January 4, 2017

ఒక్క రోజు... రెండు విశేషాలు!

నాగచైతన్య (చైతూ) జీవితంలో జనవరి 29 ఎప్పటికీ గుర్తు పెట్టుకునే రోజుగా మారనుందా? ... అవుననే చెప్పాలేమో! ఎందుకంటే... ఆ రోజు రెండు విశేషాలకు ముహూర్తాలు కుదిరాయని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. చైతూ, సమంతల నిశ్చితార్థం ఈ నెల 29న జరగనుందనే వార్త ఎప్పట్నుంచో షికారు చేస్తోంది. దీనికి తోడు చైతూ హీరోగా బావ దగ్గుబాటి రానా నిర్మించనున్న చిత్రం ప్రారంభోత్సవం కూడా ఆ రోజేనని సమాచారం. ఈ చిత్రంతో కృష్ణ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు. ఈ రెండు వార్తల్నీ అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించలేదు. ఒక తాతయ్య (అక్కినేని నాగేశ్వరరావు) సంస్థలో చైతూ సినిమాలు చేశారు. మరో తాతయ్య (రామానాయుడు) నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో మాత్రం ఇప్పటివరకూ ఒక్క చిత్రం కూడా చేయలేదు.
నిజానికి, కృష్ణ దర్శకత్వంలో చైతూ హీరోగా మేనమామ సురేశ్‌బాబు ఓ చిత్రం నిర్మించాలనుకున్నారు. ఇప్పుడా చిత్రాన్నే రానా నిర్మించాలను కుంటున్నారట! మరి.. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బేనర్లోనే నిర్మిస్తారా? రానా తన బేనర్‌కి వేరే పేరు పెట్టుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చైతూ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో మాతృసంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. గత ఏడాది రెండు చిత్రాలు ‘ప్రేమమ్‌’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ ద్వారా తెరపై కనిపించిన చైతూ ఈ ఏడాది కూడా లెక్క తగ్గకుండా చూసుకుంటున్నా రనుకోవచ్చు. అన్నట్లు.. ఈ నెల 29న అటు నిశ్చితార్థం.. ఇటు సినిమా ప్రారంభం... రెండూ  జరుగుతాయా? వెయిట్‌ అండ్‌ సీ.

అలాంటి సినిమాల్లో నటించను: హీరో

  ‘బేఫికర్‌ ’  సినిమాలో హీరోగా నటించే అవకాశం ముందుగా తనకే వచ్చిందన్న రూమర్లను బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ తోసిపుచ్చాడు. ఒకవేళ తనకు అవకాశం వచ్చినా అటువంటి సినిమాలో తాను నటించబోనని స్పష్టం చేశాడు. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసునని చెప్పాడు. ‘బేఫికర్‌ ’  సినిమా వాస్తవానికి దూరంగా ఉందని పేర్కొన్నాడు. ప్రేమ పట్ల భారతీయ యువత ఆలోచనలను ప్రతిబింబించలేదని వివరించాడు.
సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని అభిప్రాయపడ్డాడు. పింక్‌, నీర్జా, ధోని బయోపిక్‌ చిత్రాలు విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనమని చెప్పాడు. హిట్‌, మంచి సినిమాకు తేడా ఉందన్నాడు. భారీ అంచనాలతో విడుదలైన బేఫికర్‌’  బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడిన సంగతి తెలిసిందే.

రణవీర్‌ సింగ్‌ తో తనకు విభేదాలు లేవని స్పష్టం చేశాడు. ఒకే ఏజ్‌ గ్రూపుకు చెందిన తామిద్దరం తగిన కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నామని చెప్పాడు. రణ్‌వీర్‌ ప్రస్తుతం సంజయ్‌లీలా భన్సాలీ ’పద్మావతి’ సినిమాలో నటిస్తున్నాడు. సుశాంత్‌ తాజా చిత్రం ’రబ్తా’ ఫిబ్రవరిలో విడుదలకానుంది.

Tuesday, January 3, 2017

దెయ్యాలున్నాయి జాగ్రత్త!

‘ఈ సృష్టిలో దేవుళ్లు ఉన్నది నిజమైతే.. దెయ్యాలు ఉన్నాయన్నది కూడా అంతే నిజం’ అనే అంశంతో ‘హ్యాక్‌డ్‌ బై డెవిల్‌’ (హెచ్‌బిడి) తెరకెక్కించాం. హారర్‌ – థ్రిల్లర్‌లా సాగుతుందీ చిత్రం’’ అన్నారు దర్శకుడు కృష్ణకార్తీక్‌. మేఘన, సంతోషి, సల్మాన్ ముఖ్య పాత్రల్లో ఆయన దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్‌. వై ఈ చిత్రం నిర్మించారు. మహిమదన్ యం.యం. సంగీతం అందించిన పాటల సీడీలను మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌ విడుదల చేశారు.
‘‘కృష్ణకార్తీక్‌ పక్కా ప్లానింగ్‌ వల్ల సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. పోస్ట్‌ ప్రొడక్షన్  పనులు పూర్తయ్యాయి’’ అని నిర్మాత తెలిపారు. మహిమదన్, నిర్మాత లయన్‌ సాయివెంకట్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కన్నా కోటి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వినయ్‌ గౌడ్‌. వై.

మహానటి లిస్ట్ లో మరోపేరు

 దేశం గర్వించదగ్గ మహానటి సావిత్రి జీవితకథను సినిమాగా రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగఅశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలై చాలా కాలం అవుతున్న ఇంతవరకు పట్టా లెక్కలేదు. ముఖ్యంగా మహానటి సావిత్రి పాత్ర కోసం నటిని ఎంపిక చేయడమే యూనిట్ సభ్యులకు కష్టమవుతోంది.
ఇప్పటికే మహానటి పాత్రలో నటిస్తున్నట్టుగా చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్, మలయాళీ భామ నిత్యామీనన్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే యూనిట్ సభ్యులు మాత్రం ఎవరి పేరును అధికారికంగా ప్రకటించలేదు. ఈ లిస్ట్ లో మరో పేరు వినిపిస్తోంది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన కీర్తీ సురేష్ ను ఈ పాత్రకు తీసుకోవాలని భావిస్తున్నారట. మరి ఈ కీర్తీ పేరునైన యూనిట్ సభ్యులు ప్రకటిస్తారో లేక మరోసారి రూమర్స్ అంటూ కొట్టిపారేస్తారో చూడాలి.

Monday, January 2, 2017

పెళ్లి రోజే విడాకులు!

బాలీవుడ్‌లో విడాకుల పరంపర కొనసాగుతోంది. ‘హృతిక్‌ రోషన్‌–సుజానే ఖాన్, అర్భాజ్‌ ఖాన్‌–మలైకా ఆరోరా’ జంటలు ఇటీవలే విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ నటి, దర్శకురాలు నందితా దాస్, నిర్మాత సుభోద్‌ మస్కరా ఈ జాబితాలోకి చేరనున్నారు. ఈ ఇద్దరూ జనవరి 2న పెళ్లి చేసుకున్నారు. 2010లో వివాహం జరిగింది. కట్‌ చేస్తే... ఈ జనవరి 2కి తాము విడిపోతున్న విషయాన్ని ప్రకటించారు. అందరూ న్యూ ఇయర్‌ సంబరాల్లో ఉంటే.. నందిత మాత్రం భర్త నుంచి తాను విడిపోతున్న విషయం ప్రకటించి, కొత్త సంవత్సరంలో తాను తీసుకున్న కీలక నిర్ణయం గురించి పేర్కొన్నారు. ఏడేళ్లుగా కలసి ఉన్న ఈ జంట కొంత కాలంగా వేరుగా ఉంటున్నారు.
విడిపోతున్న విషయం గురించి నందిత మాట్లాడుతూ –‘‘అవును మేము విడిపోతున్నాం. ఈ విషయం చెప్పటం కొంచెం కష్టంగానే ఉంది. సుభోద్‌తో ఇక మీదట కలసి ఉండాలనుకోవడంలేదు. మేం స్నేహపూర్వకంగానే విడి పోవాలనుకుంటున్నాం. మా అబ్బాయి విహాన్‌ కంటే మాకేదీ ఎక్కువ కాదు. తన కోసమే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయం గురించి చిలవలు పలవలు చేసి, మాట్లాడొద్దని విన్నవించుకుంటున్నాను. నేను కూడా దీని గురించి మళ్లీ మాట్లాడదల్చుకోలేదు. ఇక మీదట నా కొడుకుతో, కుటుంబసభ్యులతో ఉండాలనుకుంటున్నాను’’ అన్నారు.

జన వరి 2... నందిత జీవితంలో మర్చిపోలేని రోజవుతుంది. పెళ్లి తాలుకు ఆనందాన్ని, విఫలమైన పెళ్లి తాలూకు చేదు అనుభవాన్ని మిగిల్చిన రోజుగా మిగిలిపోనుంది. నందిత సినిమా కెరీర్‌ విషయానికొస్తే.. ‘ఫైర్‌’, ‘ఎర్త్‌’, ‘బిఫోర్‌ ద రైన్స్‌’ వంటి ఆఫ్‌బీట్‌ చిత్రాల్లో నటించిన ఆమె ‘ఫిరాక్‌’తో పాటు పలు హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘ఫిరాక్‌’ చిత్రం ఆమెకు పలు ప్రతిష్టాత్మక అవార్డులు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఓ తమిళ చి్రతంలో నటిస్తున్నారు.

ఆయన అడిగితే కాదంటానా!

  ‘‘చెప్పలేను! ఎందుకంటే... చెప్పడం మొదలుపెడితే బోలెడు సినిమాల గురించి చెప్పాలి. అందుకే, నాకు ఆఫర్‌ చేసిన హిందీ సినిమాల గురించి మాట్లాడం ఇష్టం లేదు. ఆ లిస్ట్‌ చాలా పెద్దది’’ అన్నారు ప్రియాంకా చోప్రా. గతేడాది మార్చిలో విడుదలైన ‘జై గంగాజల్‌’ తర్వాత ఆమె హిందీ సినిమాలేవీ అంగీకరించలేదు. ఎప్పుడెప్పుడు ప్రియాంకా చోప్రా హిందీ సినిమా చేస్తారా? అని ఎదురు చూస్తున్న హిందీ సినిమా ప్రేక్షకుల కోసమే అన్నట్టు... ముంబయ్‌ మీడియాలో ఓ వార్త షికారు చేస్తోంది. ఉర్దూ రచయిత సాహిర్‌ లుధియాన్వీ జీవిత కథతో షారుఖ్‌ఖాన్‌ హీరోగా సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో ప్రియాంక హీరోయిన్‌గా నటించనున్నారనేది ఆ వార్తల సారాంశం.
నిజమేనా ప్రియాంకా? అనడిగితే... ‘‘హిందీ చిత్రాల గురించి నేనింకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ, నా సినిమాలో నటించమంటూ సంజయ్‌ సర్‌ అడిగితే ‘నో’ చెప్పలేను. ఆయన అడిగితే కాదనలేను. ఆయనకు నా బలం ఏంటో.. నేను ఎలాంటి సినిమాలు చేయాలను కుంటున్నానో తెలుసు. మేమిద్దరం కలుస్తుంటాం. సినిమాల గురించి డిస్కస్‌ చేస్తుంటాం’’ అని చెప్పారామె. రెండు మూడు నెలలుగా పలువురు దర్శక–నిర్మాతలు ప్రియాంకకు కథలు వినిపించారట. అందులో నచ్చినవి చాలా ఉన్నాయనీ, ఈ నెలాఖరున కొత్త హిందీ సినిమా కబురు చెబుతాననీ ఆమె అన్నారు.

Sunday, January 1, 2017

షారూఖ్ రిలీజ్ చేసిన బయోపిక్ పోస్టర్

 ప్రస్తుతం సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవితాలను వెండితెర మీద ఆవిష్కరించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు ఫిలింమేకర్స్. అదే బాటలో దక్షిణ భారత క్రీడాకారుడు మరియప్పన్ తంగవేళు జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు.
2016 సమ్మర్ లో రియోలో జరిగిన పారాఒలింపిక్స్ లో భారత్ తరుపున హై జంప్ లో స్వర్ణపతకం సాధించిన మరియప్పన్ జీవితకథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమా పోస్టర్ ను తన ట్విట్టర్ లో రిలీజ్ చేసిన కింగ్ ఖాన్ ' భారత హీరో మరియప్పన్ తంగవేళు జీవితకథతో తెరకెక్కిన మరియప్పన్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్. ఆల్ ద బెస్ట్ ఐశ్వర్య ధనుష్' అంటూ కామెంట్ చేశాడు.

Friday, December 30, 2016

మూడో చిత్రం స్టైలిష్‌గా?

తెలుగు చిత్రసీమలో స్టైలిష్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నాడు సురేందర్‌రెడ్డి. ఆయన ఎవరితో సినిమా చేసినా సరే, ఆ కథానాయకుడు స్టైలిష్‌గా కనిపించబోతున్నాడని ఖచ్చితంగా ఫిక్స్‌ అయిపోతారు ప్రేక్షకులు. నిజంగానే సురేందర్‌ రెడ్డి కథానాయకుల్ని అలా ఆవిష్కరిస్తుంటారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ధృవ’ సినిమాతోనూ అదే రుజువైంది. రామ్‌చరణ్‌ ఇన్నాళ్లూ తెరపై కనిపించింది ఒకెత్తైతే, ‘ధృవ’ సినిమాలో కనిపించింది మరో ఎత్తు అన్నట్టుగా ఆ సినిమా అభిమానుల్ని అలరిస్తోంది. విజయోత్సాహంలో ఉన్న సురేందర్‌ రెడ్డి తదుపరి అఖిల్‌ అక్కినేనితో సినిమా చేయబోతున్నాడనే ప్రచారం వూపందుకొంది. అఖిల్‌ ప్రస్తుతం తన రెండో చిత్రంపై దృష్టిపెట్టారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించనున్న ఆ చిత్రం వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఆ తర్వాత సినిమా సురేందర్‌రెడ్డితోనే అని, సూరి స్టైలిష్‌ హీరోల జాబితాలో అఖిల్‌ కూడా చేరబోతున్నాడని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు గట్టిగానే చెప్పుకొంటున్నాయి. అదంతా ఒకెత్తైతే, ఆ చిత్రాన్ని రామ్‌చరణ్‌ నిర్మించబోతున్నారనే ప్రచారం మరో ఎత్తు. రామ్‌చరణ్‌, అఖిల్‌ మంచి స్నేహితులు. వాళ్లిద్దరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. మరికొన్ని రోజులు తర్వాత ఆ చిత్రంపై స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశాలున్నాయి.