Saturday, December 24, 2016

ఫేస్‌బుక్‌లో ‘దంగల్‌’ పూర్తి సినిమా లీక్‌!

 ఆమిర్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటించిన ‘దంగల్‌’ సినిమా పైరసీకి గురైంది. ఈ సినిమా పూర్తి వీడియోను ఓ వ్యక్తి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను బట్టి చూస్తే.. దుబాయ్‌కి చెందిన హష్మీ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ‘దంగల్‌’ పూర్తి వీడియోను పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారి, పోస్ట్‌ చేసిన 14 గంటల్లోనే 8,33,000 మంది చూశారు. అయితే కాపీ రైట్స్‌ కారణంగా ప్రస్తుతం ఆ వీడియోను డిలీట్‌ చేశాడు.
సాక్షి తన్వర్‌, ఫాతిమా సనా షేక్‌, సన్యా మల్హోత్రా, అపర్‌శక్తి ఖురానా, వివన్‌ భటేనా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. నితీష్‌ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రీతమ్‌ చక్రవర్తి స్వరాలు సమకూర్చారు.

Friday, December 23, 2016

తొలిప్రేమ జ్ఞాపకాలు

 జీవా, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ఎంత వరకు ఈ ప్రేమ. డీకే దర్శకుడు. డీవీ సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రమిది. తమిళంలో కావలైవేండాం పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండటం ఆనందంగా ఉంది. పెళ్లి తర్వాత ప్రేమలో పడిన ఓ జంట కథ ఇది.
అపార్థాలు, అపోహలతో విడిపోయిన వారు మళ్లీ ఏ విధంగా ఏకమయ్యారు? అనేది చక్కటి వినోదాన్ని పంచుతుంది. తొలి ప్రేమ జ్ఞాపకాలను అందంగా ఆవిష్కరించే చిత్రమిది. కాజల్ అగర్వాల్ నటన, గ్లామర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇటీవలే విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఏ సర్టిఫికెట్ లభించింది. సరికొత్త ప్రేమకథగా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అని తెలిపారు. బాబీసింహా, శృతిరామకృష్ణన్, సునయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్.

'వంగవీటి' మూవీ రివ్యూ

 చాలా కాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు తీయడంలో ఫెయిల్ అవుతున్న రామ్ గోపాల్ వర్మ.., ఇదే తెలుగులో నా ఆఖరి సినిమా.. ఈ సారి తప్పకుండా మెప్పిస్తానని చెప్పి మరీ తీసిన సినిమా వంగవీటి. గతంలో అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో రక్తచరిత్ర తీసిన వర్మ, పాత్రలను నిజజీవిత పేర్లతో కాకుండా ఆ భావం వచ్చేలా చూపించాడు. కానీ వంగవీటి విషయంలో మాత్రం మరో అడుగు ముందుకు వేసి.. నిజజీవితంలోని పేర్లతో యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన వంగవీటి వర్మ స్థాయిని ప్రూవ్ చేసిందా..?
కథ :
విజయవాడ రౌడీయిజం.. అందరికీ తెలిసిందే అయినా వర్మ తన మార్క్ సినిమాటిక్ టచ్ తో ఆ కథను మరింత ఎఫెక్టివ్ గా చూపించే ప్రయత్నం చేశాడు. ఎర్రపార్టీ నాయకుడు చలసాని వెంకటరత్నం విజయవాడ సిటీలో పేదలకు అండగా ఉంటూ లీడర్ గా ఎదుగుతాడు. అదే సమయంలో బస్టాండ్ లో చిన్న రౌడీగా ఉన్న వంగవీటి రాధ. వెంకటరత్నం దగ్గర పనిలో చేరి అతన్ని మించిపోయే స్థాయిలో పేరు తెచ్చుకుంటాడు. రాధ ఎదుగుదలను తట్టుకోలేని వెంకటరత్నం ఇంటికి పిలిచి రాధను అవమానిస్తాడు. తనకు జరిగిన అవమాన్ని జీర్ణించుకోలేని రాధ వెంకటరత్నాన్ని పక్కా ప్లాన్ తో దారుణంగా నరికి నరికి చంపుతాడు.

అప్పటి వరకు ఓ లీడర్ వెనుక అనుచరిడిగా ఉన్న రాధ, వెంకటరత్నం మరణంతో విజయవాడను శాసించే నాయకుడిగా మారతాడు. తనకు ఎదురొచ్చిన వారందరిని అడ్డుతప్పించుకుంటూ ఎవరూ ఎదిరించలేని స్థాయికి చేరుకుంటాడు. ఆ సమయంలో విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే దేవినేని గాంధీ, దేవినేని నెహ్రులు కాలేజీ గొడవలో పార్టీ ప్రమేయాన్ని ఆపాలంటూ రాధను కలుస్తారు. రాధ మంచితనం నచ్చి అతనితో కలిసి ఓ పార్టీని ఏర్పాటు చేసి విద్యార్థులతో కలిసి రాధకు అండగా నిలుస్తారు.
రాధ ఎదుగుదలతో విజయవాడ నగరంలో ఎర్ర పార్టీ ఆనవాళ్లు లేకుండా పోతాయన్న భయంతో ఆ పార్టీ పెద్దలు రాధ హత్యకు పథకం వేస్తారు. ఓ సెటిల్మెంట్ కోసం పిలిపించి ఒంటరిని చేసి చంపేస్తారు. అప్పటి వరకు రాజకీయం, రౌడీయిజం తెలియని రాధ తమ్ముడు రంగా., తప్పనిసరి పరిస్థితుల్లో అన్న బాటలోకి అడుగుపెడతాడు. అప్పటి వరకు అన్నకు అండగా ఉన్న దేవినేని సోదరులతో అభిప్రాయ భేదాలు రావటంతో వారు సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుంటారు. దేవినేని సోదరుల నుంచి రంగా ప్రాణానికి ముప్పు ఉందని భావించి ఆయన అనుచరులు గాందీని చంపేస్తారు. అన్న మరణంతో దేవినేని మురళి రగలిపోతాడు. ఎలాగైన రంగా మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. (శివ టు వంగవీటి.. ఫొటోలకు ఇక్కడ క్లిక్ చేయండి)
అప్పటి వరకు రౌడీగా ఉన్న రంగా ఓ జాతీయ పార్టీ నుంచి టికెట్ పొంది ఎమ్మెల్యేగా గెలుస్తాడు. అదే సమయంలో ఆంధ్రరాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఓ ప్రాంతీయ పార్టీలో చేరిన నెహ్రు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడు. నెహ్రు ఎమ్మెల్యే కావటంతో అతని తమ్ముడు మురళీకి పగ తీర్చుకునేందుకు కావాల్సిన అన్ని వనరులు అందుతాయి. దీంతో గాంధీ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఒక్కొక్కరిని వెతికి వెతికి చంపుతాడు. అంతేకాదు ఏకంగా రంగా.. ఇంటికే ఫోన్ చేసి ఆయన భార్య రత్న కుమారికి వార్నింగ్ ఇస్తాడు.మరోసారి మురళీ వల్ల రంగాకు ప్రమాదం ఉందని భావించి అతన్ని కూడా రంగా అనుచరులు చంపేస్తారు.
అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ విజయవాడలో పెరిగిపోతున్న రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని నిర్ణయించుకుంటుంది. ప్రజా సమస్యల కోసం తన ఇంటి ముందే నిరాహార దీక్ష చేస్తున్న రంగాను నల్ల బట్టల్లో వచ్చిన దుండగులు దీక్షా వేదిక మీద నరికి చంపేస్తారు. రంగ మరణంతో రగిలిపోయినా విజయవాడ కొద్ది రోజులకు సాధారణ స్థితికి చేరుకుంటుంది. అయితే రంగా మరణం వెనక ఉన్నది ఎవరు అన్నది మాత్రం వర్మ కూడా ప్రేక్షకులకు ప్రశ్నగానే వదిలేశాడు.

ప్లస్ పాయింట్స్ :
వర్మ మార్క్ టేకింగ్
సందీప్ ద్విపాత్రాభినయం
యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్ :
డైలాగ్స్
మితిమీరిన రక్తపాతం

Thursday, December 22, 2016

నన్ను దూరం పెట్టారు: హీరోయిన్‌

తనను దక్షిణాది సినీ పరిశ్రమ దూరం పెట్టిందనే ఆవేదనను నటి ఇలియానా వ్యక్తం చేశారు. ఇంతకు ముందు దక్షిణాది చిత్ర పరిశ్రమ ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఈ గోవా సుందరిని తలపై ఎక్కించుకొని మోసింది. నన్భన్‌ చిత్రంతో తమిళ సినీ ప్రేక్షకులను అలరించిన ఇలియానాకు ఆ సమయంలో పలు అవకాశాలు వచ్చాయి. అయితే అప్పుడు ఈ అమ్మడు బెట్టు చేశారు. బాలీవుడ్‌ మోజుతో దక్షిణాది చిత్రాలను తక్కువగా చూశారు. అయితే తాను ఊహించింది జరగలేదు. బాలీవుడ్‌ ఇలియానాను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మళ్లీ దక్షిణాదికే మకాం మార్చాలన్న ప్రయత్నాలు మొదలెట్టారు.
 
ఇటీవల ఈత దుస్తులతో అందాలారబోసిన ఫొటోలను ఇంటర్నెట్‌లో విడుదల చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలన్న సామెతను మరిచిన ఇలియానాకు ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమ షాక్‌ ఇచ్చింది. ఆమెను అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో దక్షిణాది సినిమా తనను పక్కన పెట్టేసిందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఇలియానా. ప్రస్తుతం ఈ భామ ఏమంటున్నారో చూద్దాం. ప్రస్తుతం హిందీలో ఒకటి రెండు చిత్రాలే చేస్తున్నాను. దక్షిణాదిలో ఒక్క అవకాశం కూడా రావడం లేదు. కారణం ఏమిటో తెలియడం లేదు. ఈ మధ్య ఒక తెలుగు దర్శకుడు వచ్చి కథ చెప్పారు. మా చిత్రంలో మీరే కథానాయకి అని నమ్మపలికారు. అంతే మళ్లీ కంట పడలేదు. ఇప్పుడా చిత్రంలో వేరే నటి నటిస్తున్నారు. నన్నెందుకు తొలగించారని నేనా దర్శకుడిని అడగ్గా సారీ అని ఫోన్‌ పెట్టేశారు.
 
నిజం చెప్పాలంటే నేను చేసిన చిత్రాలన్నీ ఇష్టపడి చేసినవే. అర్ధాంగీకారంతో ఏ చిత్రం చేయలేదు. హిందీలో బర్ఫీ చిత్రం నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. తర్వాత అక్షయ్‌కుమార్‌కు జంటగా నటించడం మంచి అనుభవం. నేను నటించిన ప్రతి చిత్రంతో చాలా నేర్చుకున్నాను. నటించిన సన్నివేశం పూర్తి కాగానే దర్శకుడి ముఖంలోకి చూస్తాను. ఆయనలో సంతోషం కనిపిస్తే నేను సంతృప్తి పడతాను. ఇక జయాపజయాల గురించి పెద్దగా పట్టించుకోను. దక్షిణాది దర్శక నిర్మాతల నుంచి మంచి పాత్రలో నటించే అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తున్నాను అని పేర్కొన్నారు. ఇది ఇలియానా ఎదురు చూపుల వేదన.

వాళ్ల కొడుకు పేరు వాళ్లిష్టం.. మీకెందుకు?



నెటిజన్లను హెచ్చరించిన రిషికపూర్‌
బాలీవుడ్‌ జంట సైఫ్‌అలీ ఖాన్‌, కరీనా కపూర్‌లు తమ చిన్నారికి తైమూర్‌ అలీఖాన్‌ పటౌడీ అని పేరుపెట్టుకున్నారు. అయితే ఈ పేరు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొందరు బాబుకు ఈ పేరు ఎందుకు పెట్టారో చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. దీనికి కారణం ఉంది.. తైమూర్‌ అనే పేరున్న మంగోల్‌ రాజు 14వ శతాబ్దంలో భారతదేశంపై దాడిచేశాడు. దిల్లీపై దాడి చేసి వందల మంది ప్రాణాలను బలిగొన్నాడు. ఇది పక్కనపెడితే తైమూర్‌ అంటే.. ఉక్కు మనిషి, ధీరత్వం గల రాజు అని అర్థం వస్తుంది. నెటిజన్లు చేసిన కామెంట్స్‌ చూసిన నటుడు, కరీనా కపూర్‌ బాబాయి రిషి కపూర్‌ ట్విట్టర్‌ వేదికగా వారిని హెచ్చరించారు. గతంలో దేశాన్ని ఆక్రమించిన వ్యక్తి పేరును ఇప్పుడు బాబు పేరుతో పోల్చడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘తల్లిదండ్రులు తమ కుమారుడికి పేరు పెట్టుకోవాలనుకుంటే.. జనాలు ఎందుకింత బాధపడిపోతున్నారో తెలియడం లేదు. మీ పని మీరు చూసుకోండి. పిల్లలకి ఏ పేరు పెట్టాలనేది తల్లిదండ్రుల ఇష్టం’ అని ట్వీట్‌ చేశారు.
తర్వాత ఇంకా కోపంతో ‘మీ పని మీరు చూసుకోండి. మీ పిల్లల పేర్లు మీరు పెట్టలేదా? కామెంట్‌ చేయడానికి మీరెవరు?’ అని ట్వీట్‌ చేశారు. ఇకపై ఈ విషయంపై వాదనలు చేస్తే చాలా మంది బ్లాక్‌(ట్విట్టర్‌లో) అయిపోతారని హెచ్చరించారు.

Wednesday, December 21, 2016

ఆ సినిమాకు టికెట్‌ ధరలు పెంచొద్దు..

  త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘దంగల్‌’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘దంగల్‌’ సినిమా టికెట్‌ ధరలను పెంచొద్దని డిస్ట్రిబ్యూటర్లను ఆమిర్‌ఖాన్‌ కోరాడు. పెద్ద సినిమాలు విడుదలైన సందర్భంగా తొలి వారంలో టికెట్‌ ధరలు పెంచడం సాధారణమే. అయితే ఇతర సినిమాల మాదిరిగా దీనికి ధరలను పెంచవద్దని కోరుతున్నాడు ఆమిర్‌.
‘అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా చేరాలి. టికెట్‌ ధరలు పెంచొద్దని థియేటర్‌ యజమానులను కోరుతున్నా. పన్ను మినహాయింపు కూడా లభిస్తే ఇంకా బాగుంటుంది. ప్రేక్షకులకు లాభం కూడా చేకూరుతుంది. పన్ను మినహాయింపు కోసం 12 రాష్ట్రాలకు దరఖాస్తు చేసుకున్నాం’ అని చెప్పాడు ఈ బాలీవుడ్‌ మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌. హరియాణా మల్లయోధుడు మహావీర్‌ ఫొగట్‌ జీవిత కథ ఆధారంగా రెజ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో


ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్, ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమాను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది.

పవన్ సరసన కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యూల్ లను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో మరో కీలక పాత్రకు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించనున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించిన ఉపేంద్ర మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

Tuesday, December 20, 2016

కరీనా ఇంట బుల్లి నవాబు


బాలీవుడ్‌ జంట కరీనా కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌ ఇంట ఆనందం వెల్లివెరిసింది. కరీనా ఓ బుల్లి నవాబుకు జన్మనిచ్చి తల్లిగా మారింది. మంగళవారం ఉదయం ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరీనాకు మగబిడ్డ పుట్టాడు. కరీనా దంపతులు తమ బిడ్డకు తైమూర్‌ అలీఖాన్‌ పటౌడీ అని పేరుపెట్టారు. కుమారుడు పుట్టిన వెంటనే అతని పేరు మీద ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ప్రారంభించి అందులో తమ ఆనందం పంచుకున్నారు. ‘‘మాకు కుమారుడు పుట్టాడన్న శుభవార్తను అందరితో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. మాపై ఎంతో ప్రేమ చూపిస్తున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతల’’ని కరీనా దంపతులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ శుభసందర్భంలో కరీనా సోదరి కరిష్మా కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌ సోదరి సోహా అలీఖాన్‌తో పాటు కరణ్‌ జోహార్‌, సోనమ్‌ కపూర్‌, కాజల్‌ అగర్వాల్‌, అమృతా అరోరా తదితర బాలీవుడ్‌ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.