నోట్ల కష్టాలు తొలగించేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) మరిన్ని
ఉపశమన చర్యలు ప్రకటించింది. కరెంట్, ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్
ఖాతాలు కలిగిన వారికి నగదు విత్ డ్రా పరిమితిని వారంలో రూ. 50 వేలకు
పెంచింది. వీరికి రూ. 2 వేల నోట్లు ఇస్తారు. కనీసం మూడు నెలల నుంచి ఈ
ఖాతాలు నిర్వహిస్తున్న వారికే వారంలో రూ. 50 వేలు తీసుకునే అవకాశం
కల్పిస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. వ్యక్తిగత ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలు
కలిగిన వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది.
రైతులకు కూడా ఊరట కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దుకాణాల్లో రద్దు
చేసిన పాత 500 నోట్లతో రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు అనుమతి
ఇచ్చింది. ధ్రువీకృత గుర్తింపు కార్డు చూపించి అన్నదాతలు విత్తనాలు
కొనుగోలు చేయొచ్చు. కేంద్ర, రాష్ట్ర విత్తన సంస్థలు, వ్యవసాయ
యూనివర్సిటీలు, ఐసీఏఆర్ సంస్థల నుంచి విత్తనాలు కొనుక్కోవచ్చు. వివాహాలకు
రేపటి నుంచి రూ. 2.5 లక్షల విత్ డ్రా సదుపాయం కల్పించనున్నట్టు ఆర్బీఐ
తెలిపింది. ఇంతకుముందే ఈ ప్రకటన చేసినప్పటికీ నగదు లేకపోవడంతో ఇప్పటివరకు
ఇది అమలు కాలేదు. కాగా, నవంబర్ 10 నుంచి 18 వరకు బ్యాంకు ఖాతాల నుంచి
ప్రజలు 1.03 లక్షల కోట్లు విత్ డ్రా చేశారని ఆర్బీఐ వెల్లడించింది.
తమిళనాట త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఓ చిన్న సినిమాతో హీరోయిన్ గా
పరిచయం అవుతుంది మేఘా ఆకాష్. ఒరు పాక్క కథై అనే సినిమాతో తొలిసారిగా
వెండితెర మీద మెరిసేందుకు ప్లాన్ చేసుకుంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా
కాకుండానే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మను క్రేజీ ఆఫర్స్ ఉక్కిరి బిక్కిరి
చేస్తున్నాయి. ఇప్పటికే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా
తెరకెక్కుతున్న తమిళ సినిమాకు మేఘాను హీరోయిన్ గా తీసుకున్నారు.
అదే సమయంలో నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న
సినిమాకు కూడా మేఘానే హీరోయిన్ అంటూ ఎనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు మరో
భారీ చిత్రంలో అమ్మడి ఛాన్స్ వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. అక్కినేని
నటవారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న రెండో సినిమాలో మేఘాను హీరోయిన్ గా
తీసుకోవాలని భావిస్తున్నారట. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ
రొమాంటిక్ ఎంటర్ టైనర్ జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అఖిల్ సినిమా కూడా
మేఘా ఖాతాలో పడితే ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోవడం
ఖాయం.
హీరోగా మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని, త్వరలో పర్సనల్ లైఫ్ లో కూడా
ప్రమోషన్ పొందబోతున్నాడు. ఇటీవల వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్న ఈ హీరో
పర్సనల్ లైఫ్ లో అంతకన్నా ఎక్కువ ఆనందంగా ఉన్నాడు. ప్రస్తుతం నేను లోకల్
సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ నేచ్యురల్ యాక్టర్ త్వరలో తండ్రిగా
ప్రమోషన్ తీసుకుంటున్నాడు.
ఈ జనరేషన్ హీరోల్లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, అల్లరి నరేష్, ఆది లాంటి
హీరోలు ఇప్పటికే ఫాదర్స్ లిస్ట్ లో చేరిపోగా తాజాగా నాని కూడా ఆ లిస్ట్ లో
అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. మరికొద్ది నెలల్లో నాని భార్య అంజన
తొలి బిడ్డకు జన్మనివ్వబోతోంది. నాని, అంజనాల కుటుంబ సభ్యులు తన
కుటుంబంలోకి రానున్న కొత్త వెలుగుకు స్వాగతం పలకటానికి ఇప్పటినుంచే
ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆలియా భట్.. చిన్న
వయసులోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టి అనతికాలంలోనే అభిమానుల్ని సంపాదించుకుంది.
అయితే.. తోటి నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు బీటౌన్‌లో
వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా తన టీనేజీ లవ్ బ్రేకప్ గురించి.. ఆసక్తికరమైన
విషయాలు చెప్పుకొచ్చింది.
‘‘నేను పదహారేళ్ల
వయసులో ఉన్నప్పుడు ప్రేమలో విఫలమయ్యా. ఆ బ్రేకప్ బాధలోంచి తేరుకోవడానికి
స్నేహితులతో ఎక్కువగా గడిపేదాన్ని. కానీ ఇప్పుడు అలాంటిది జరిగితే విహార
యాత్రలకు వెళ్తా లేదా నా పనిపై ఇంకాస్త ఎక్కువ దృష్టిపెడతా. ఓ వ్యక్తి
నాకోసమే ఎక్కడైనా ఉంటే.. ఎప్పటికైనా తిరిగొస్తాడని నమ్ముతా. నా దృష్టిలో
ప్రేమ అనే భావన రోజూ మారుతుంటుంది. ప్రేమ అనేది ఇద్దరు ప్రేమికుల మధ్యలో
ఉన్నదే కాదు. స్నేహితుల మధ్య ఉండొచ్చు. నాకు నా పెంపుడు పిల్లిపై..
కాఫీపై కూడా ప్రేమ ఉంది’’ అంటూ తనదైన ప్రేమపాఠాలు చెప్పుకొచ్చింది
ఆలియా.
‘‘బైబిల్ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రమిది. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే
చిత్రం అవుతుందనుకుంటున్నా. ‘కరుణామయుడు’ రేంజ్‌లో ఈ చిత్రం ఆడాలి’’ అని
నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. సీనియర్ నటి దివ్యవాణి ప్రధానపాత్రలో
‘తొలి కిరణం’ జాన్‌బాబు దర్శకత్వంలో డి.శ్రీధర్‌రెడ్డి నిర్మిస్తున్న ‘నీ
దేవుడే నా దేవుడు’ చిత్రం ఇటీవల ప్రారంభమైంది.
‘‘చారిత్రక చిత్రమిది. క్రీస్తు పూర్వం ఇజ్రాయిల్ దేశంలో జరిగిన
అత్తాకోడళ్ల కథ’’ అని దర్శకుడు అన్నారు. ‘‘పదిహేనేళ్ల వయసు నుంచి
సినిమాల్లో నటిస్తున్న నేను పెళ్లయ్యాక ఏడేళ్లు గ్యాప్ తీసుకున్నా.
నాకిష్టమైన ఈ రంగానికి దేవుడు నన్ను మళ్లీ ఆహ్వానించాడు. నయోని అనే పాత్రలో
కనిపిస్తా’’ అని దివ్యవాణి చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: స్రవంతి.
మాజీ
మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె బ్రహ్మణి వివాహం బుధవారం జరిగిన సంగతి
తెలిసిందే. ఈ పెళ్లిలో కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్ ఆడిపాడినట్లు తెలుస్తోంది.
రకుల్ వేదికపై డ్యాన్స్ చేస్తుండగా తీసిన వీడియోలను అభిమానులు సోషల్‌మీడియాలో
పోస్ట్ చేశారు. గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె పెళ్లిలో రకుల్‌ప్రీత్ అద్భుతంగా
డ్యాన్స్ చేసిందని ట్వీట్ చేశారు. ఇలా పెళ్లిలో డ్యాన్స్ చేయడానికి ఆమె పెద్ద
మొత్తంలో తీసుకున్నారని టాక్. ఇంతేకాదు ఇదే పెళ్లిలో ప్రియమణి, తమన్నా
చిందేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘నేను శైలజ’ చిత్రంతో తెలుగు
ప్రేక్షకులకు పరిచయమైన కథానాయిక
కీర్తీసురేశ్ పవర్‌స్టార్
పవన్‌కల్యాణ్ సరసన నటించే
ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని
కీర్తీసురేశ్ స్వయంగా తన ట్విట్టర్
ఖాతా ద్వారా ప్రకటించారు. తన
తర్వాతి చిత్రం పవన్‌కల్యాణ్,
త్రివిక్రమ్‌లతో కావడం చాలా
సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్
పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న
ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం
సమకూరుస్తున్నారు. తెలుగులో
ఆయన స్వరాలు అందిస్తున్న తొలి
చిత్రమిది. పవన్-త్రివిక్రమ్
కలయికలో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి
దారేది’ ఘన విజయాలు సాధించడంతో
ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు
ఉన్నాయి. డిసెంబరు నుంచి ఈ చిత్రం
షూటింగ్ ప్రారంభించనున్నట్లు
సమాచారం.
ప్రస్తుతం
పవన్‌కల్యాణ్ ‘కాటమరాయుడు’
చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
కీర్తీసురేశ్ ‘భైరవ’, ‘నేను
లోకల్’ చిత్రాల్లో నటిస్తున్నారు.
ప్రిన్స్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కున్న సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు
కాకపోయినప్పటికీ పలుపేర్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా మరో రెండు పేర్లు
విన్పిస్తున్నాయి. చట్టంలో పోరాటం, ఎనిమీ(శత్రువు) టైటిల్స్
పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే చిత్రయూనిట్ అధికారికంగా
టైటిల్ ప్రకటించలేదు.
తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాకు ఇంతకుముందు
వాస్కోడిగామా, అభిమన్యుడు, ఏజెంట్ శివ అనే పేర్లు వినిపించాయి. మహేష్
ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్
హీరోయిన్ గా నటిస్తోంది. హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. క్రేజీ
కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏ పేరు పెడతారోనని అభిమానులు
ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.