Thursday, May 5, 2016

రివ్యూ.. సుప్రీమ్‌



 ‘పిల్లా నువ్వులేని జీవితం’.. ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ చిత్రాలతో తనని తాను నిరూపించుకొన్నాడు సాయిధరమ్‌ తేజ్‌. డ్యాన్సుల్లో.. ఫైటింగ్‌లలో తనదైన ముద్ర వేశాడు. మేనమామలైన చిరంజీవి.. పవన్‌కల్యాణ్‌లను అనుకరించడం సరేసరి. దాంతో సాయి సినిమా అంటే ఆసక్తి మొదలైంది. ఆ జోరుకి ‘పటాస్‌’తో ఆకట్టుకొన్న అనిల్‌ రావిపూడి తోడయ్యాడు. దీంతో ‘సుప్రీమ్‌’పై అంచనాలు పెరిగేలా చేశాయి. మరి ఆ అంచనాల్ని ఈ చిత్రం ఎంత వరకూ అందుకుందో చూస్తే..
 కథేంటి?: బాలు (సాయిధరమ్‌తేజ్‌) ఓ టాక్సీ డ్రైవర్‌. అతగాడి టాక్సీ పేరు సుప్రీమ్‌. నాన్నంటే (రాజేంద్రప్రసాద్‌) ప్రాణం. కానీ ఆయనేమో తాగుడుకి బానిస. బెల్లం శ్రీదేవి (రాశీఖన్నా) ఓ ఎస్సై. ఆమె బిల్డప్పులకు బాలు ఇట్టే పడిపోతాడు. ప్రేమించమంటూ వెంటపడతాడు. ఈలోగా బాలుకి రాజన్‌ అనే ఓ చిన్న కుర్రాడు పరిచయమవుతాడు. అతనో అనాధ. రాజన్‌ మాటలు.. చేష్టలు బాలుకి తెగ నచ్చేస్తాయి. దాంతో ఇంటికి తీసుకెళ్తాడు.
కాలక్రమంలో రాజన్‌ ఆ ఇంట్లో భాగమైపోతాడు. అయితే.. రాజన్‌ని వెదుక్కొంటూ ఓ ముఠా తిరుగుతుంటుంది. రాజన్‌పై పదిహేను వందల మంది ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంటారు. వాళ్లంతా ఎవరు? రాజన్‌ని వారందరూ ఎందుకు వెదుకుతున్నారు? అసలు రాజన్‌కి వచ్చిన సమస్యేంటి? బాలు ఆ సమస్యను పరిష్కరించాడా? లాంటి పశ్నలకు సమాధానం తెలియాలంటే ‘సుప్రీమ్‌’ను వెండితెర మీద చూడాల్సిందే.
ఎలా ఉందంటే?: తొలి సినిమా ‘పటాస్‌’తోనే తన పంథా చాటుకొన్న దర్శకుడు అనిల్‌ రావిపూడి. కథపై పెద్దగా దృష్టి పెట్టకపోయినా సరే.. వినోదంతో కాలక్షేపం చేయించే సత్తా అనిల్‌లో ఉందన్న విషయం తొలి సినిమాతోనే అర్థమైంది. ‘సుప్రీమ్‌’కీ అదే ఫాలో అయిపోయాడు. ప్రేక్షకులకు కావాల్సినవి పంచుకొంటూ వెళ్లాడు. కథలో విషయం లేదని తెలుస్తున్నా.. కామెడీ సన్నివేశాలతో సినిమాని నడిపించేశాడు.
వెన్నెల కిషోర్‌తో పోలీస్‌ స్టేషన్‌లో చేసిన కామెడీ ఆకట్టుకుంటుంది. బెల్లం శ్రీదేవి ఇంట్లో పాయసం చుట్టూ అల్లిన సన్నివేశం.. ఓ పాత్ర ‘కాఫీ.. కాఫీ’ అంటూ ఆ ఒక్క మాటతో ఇంట్లోవాళ్లని సతాయించడం, రఘుబాబు కామెడీ టైమింగ్‌లు పండాయి. దీంతో తొలి అర్థభాగం టైమ్‌ పాస్‌ అయిపోతుంది.
చిక్కంతా సెకండ్‌ హాఫ్‌తోనే. కథేంటో అప్పటికే తెలిసిపోతుంది. అది ఎక్కడ ఆగుతుందో అర్థమైపోతుంది. కాబట్టి.. సన్నివేశాల్ని ఆసక్తిగా రాసుకోవాల్సింది. కానీ అది సరిగా జరగలేదనిపిస్తుంది. తొలి భాగం పండిన వినోదం సెకండాఫ్‌లో మాయమైంది. కేవలం చైల్డ్‌ సెంటిమెంట్‌తోనే నడిపించే ప్రయత్నం జరిగింది. పోరాట ఘట్టాలు.. ఛేజింగులు ఎక్కువయ్యాయి. చివర్లో దివ్యాంగుల పోరాట సన్నివేశం ఒక్కటే.. కొత్తగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌ మామూలే.
 

Wednesday, May 4, 2016

బాలయ్యకు నో చెప్పిందా..?

 ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలకు హీరోయిన్ల కష్టాలు ఎక్కువవుతున్నాయి. తమ ఇమేజ్ కు, ఏజ్ కు తగ్గ హీరోయిన్లు తక్కువగా ఉండటంతో హీరోయిన్ల కోసం తిప్పలు తప్పడం లేదు. నయనతార, అనుష్క లాంటి ఒకరిద్దరు మాత్రమే సీనియర్ హీరోలకు సెట్ అవుతారని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ హీరోయిన్లు లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద కాన్సన్ ట్రేట్ చేస్తుండటంతో స్టార్ హీరోలకు ఎదురుచూపులు తప్పటం లేదు.
తాజాగా నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా విషయంలోనూ ఇదే సమస్య ఎదురైంది. ముందుగా ఈ సినిమా కోసం నయనతారను హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు. అయితే అదే సమయంలో చిరు 150వ సినిమాతో పాటు తమిళ్ లో కూడా మరికొన్ని సినిమాలు అంగీకరించి ఉండటంతో బాలయ్యకు నో చెప్పింది. ఇక అంజలీ విషయంలోనూ అదే జరిగింది.

తరువాత కాజల్ హీరోయిన్ గా ఫైనల్ చేయాలని భావించినా వర్క్ అవుట్ కాలేదు. చాలా రోజులుగా టాలీవుడ్ లో రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్న గోవా బ్యూటీ ఇలియానాకు ఛాన్స్ ఇద్దామని భావించినా ఈ అమ్మడు కూడా బాలయ్యకు నో చెప్పేసిందన్న టాక్ వినిపిస్తోంది. సీనియర్ హీరోల సరసన నటిస్తే కెరీర్ త్వరగా ముగిసిపోతుందన్న భయంతోనే ఇలియానా బాలయ్యకు నో చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. అసలే అవకాశాల్లేక కష్టాల్లో ఉన్న సమయంలో బాలయ్య లాంటి స్టార్ హీరో సరసన ఛాన్స్ వస్తే కాదనటం కర్టెక్ట్ కాదంటున్నారు విశ్లేషకులు.

Tuesday, May 3, 2016

మళ్లీ..అనుష్క వెనుక

 విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ మళ్లీ ఒక్కటవుతున్నారా..? తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది మరి. అనుష్క నుంచి విడిపోగానే కోహ్లి.. ఆమెను ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి మాధ్యమాల్లో అనుసరించడం మానేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆదివారం అనుష్క పుట్టిన రోజు సందర్భంగా విరాట్‌ మళ్లీ ఆ రెండు చోట్లా ఆమెను అనుసరించడం మొదలుపెట్టాడు. ఇటీవల అనుష్కను సామాజిక మాధ్యమాల్లో అభిమానులు తిట్టిపోస్తుండటంపై విరాట్‌ మండిపడుతూ ఆమెకు మద్దతుగా నిలవడం.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఓ విందులో పాల్గొనడం తెలిసిందే. తాజా పరిణామాలు కోహ్లి, అనుష్క మళ్లీ ఒక్కటవుతున్న సంకేతాల్నిస్తున్నాయి.

Saturday, April 30, 2016

రానాతో కాజల్‌?

 చిన్న చిత్రాలతో విజయాలు సాధించిన దర్శకుడు తేజ. ఆయనకు గత కొంతకాలంగా సరైన విజయాల్లేవు. ఇటీవల ఆయన రూపొందించిన ‘హోరా హోరీ’ నిరాశపరిచింది. తేజ ఇప్పుడు మరో ప్రయత్నం చేయబోతున్నారు. ఆయన రానా కోసం కథ సిద్ధం చేశారని సమాచారం. రానా కూడా తేజతో పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ చిత్రంలో కథానాయికగా కాజల్‌ని ఎంచుకొన్నారట. ‘లక్ష్మీ కల్యాణం’తో కాజల్‌ని తెలుగు చిత్రసీమకు పరిచయం చేసింది తేజనే. ఆ తరవాత ఆయన దర్శకత్వంలో కాజల్‌ నటించలేదు. ప్రస్తుతం ‘బాహుబలి 2’, ‘ఘూజీ’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు రానా. త్వరలోనే తేజ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

Thursday, April 28, 2016

మంచి కథ దొరికితే ఒకే సినిమాలో ముగ్గురం..

   ఖరీదైన వస్తువులు, విలువైన ఆస్తులను కొనుగోలు చేయడం లాంటి విషయాలకు దూరంగా ఉండాలని తన పిల్లలకు తరచూ చెప్నేవాడినని బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ అంటున్నాడు. ఇప్పటికీ తన వయసు మీద పడ్డట్లు కనిపించకుండా చూసుకునే అనిల్, తన పిల్లలకు సలహాలు ఇస్తుంటానని చెప్పాడు. సోనమ్ కపూర్, హర్షవర్థన్ కపూర్,రియా కపూర్ లకు ఆరోగ్యానికి సంబంధించిన వాటిపై ఖర్చు చేయడంలో తప్పులేదన్నాడు. ఆస్తులు, ఆభరణాలు, విలువైన బ్యాగులు లాంటివి కోనుగోలు చేయడం వృథా అని ఆయన అభిప్రాయపడ్డాడు. తాను మాత్రం స్పా సెంటర్లలో ఎక్కువగా గడుపటానికి ఇష్టపడతానని, అందువల్లే చాలా అనందంగా, ఆరోగ్యంగానూ ఉంటానని అనిల్ హెల్త్ సీక్రెట్ బయటపెట్టాడు.
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) 17వ ఎడిషన్ వేడుకల నిర్వహణ స్పెయిన్ లోని మాడ్రిడ్ లో జరుగుతుందని తెలిపాడు. మెడికల్ స్పా ఎక్కడ ఉన్నా సరే వాటిలో అత్యుత్తమమైన వాటిలో కనీసం వారమైనా ఆరోగ్యం కోసం గడుపుతానని వెల్లడించాడు. ఇంకా చెప్పాలంటే చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు తమ బరువు సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆస్ట్రియాలోని 'స్పా' సెంటర్లకు తరచుగా వెళ్తుంటారని చెప్పుకొచ్చాడు. వారసుడు హర్షవర్ధన్, సోనమ్ లతో కలిసి నటించే ఆలోచన ఉందా అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ... మా ముగ్గురికి సమ ప్రాధాన్యం ఉండేలా ఏదైనా స్క్రిప్టుతో దర్శకుడు వస్తే  కచ్చితంగా ఇది నెరవేరుతుంది అంటూ అనిల్ కపూర్ నవ్వేశాడు.

Tuesday, April 26, 2016

అన్నదమ్ములిద్దరూ... ఒకేరోజు

 చిరంజీవి 150వ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ తరవాతి చిత్రాన్ని పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడు మొదలెడతారా అనే ఆసక్తి నెలకొంది. ఈ రెండు ప్రశ్నలకు ఒకేసారి సమాధానం దొరికిందిప్పుడు. చిరంజీవి - వినాయక్‌ల ‘కత్తి’ రీమేక్‌కి ఈనెల 29న లాంఛనంగా కొబ్బరికాయ కొట్టేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం. అదే రోజున పవన్‌ కల్యాణ్‌ - ఎస్‌.జె.సూర్యల సినిమా కూడా ముహూర్తం జరుపుకోనుందట. 29వ తారీఖు దాటితే మంచి ముహూర్తాలు లేవని వీరిద్దరూ అదే రోజున తమ సినిమాని లాంఛనంగా ప్రారంభించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. వచ్చే నెల చివరి వారంలో చిరు సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. పవన్‌ - సూర్యల చిత్రం కూడా వచ్చే నెలలోనే మొదలవుతుంది. ఈలోగా అటు వినాయక్‌, ఇటు ఎస్‌.జె సూర్య స్క్రిప్ట్‌పై కసరత్తులు ముమ్మరం చేశారు. చిరు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌, పవన్‌ సినిమాకి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.

Monday, April 25, 2016

అనుష్క గురించి కోహ్లి ఏం చెప్పాడంటే!

 విరాట్‌ కోహ్లి కెరీర్‌ మంచి జోరుమీద ఉంది. అటు మైదానంలోనూ, అటు వ్యక్తిగత జీవితంలోనూ అతను దూసుకుపోతున్నాడు. ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ కెప్టెన్‌గా దూకుడు మీదున్న కోహ్లి తాజాగా టీ-20లో సెంచరీ కూడా కొట్టాడు. క్రికెట్‌లో అసాధారణమైన పరుగుల ప్రవాహాన్ని సృష్టిస్తున్న కోహ్లి వ్యక్తిగత జీవితంలోనూ హ్యాపీగా కనిపిస్తున్నాడు. గతంలో బ్రేకప్‌ చేసుకున్నట్టు భావిస్తున్న కోహ్లి-అనుష్క శర్మ మళ్లీ ఒక్కటైనట్టు వార్తలు వచ్చాయి. ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో ఈ ప్రేమజంట డిన్నర్ చేస్తూ కనబడింది.                        ఈ నేపథ్యంలో కోహ్లి సోమవారం ముంబైలో తన అభిమానులతో పిచ్చాపాటిగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా మీరు మీ ప్రియురాలు అనుష్క శర్మతో మళ్లీ కలిసిపోయారా? ఒకరు ప్రశ్నించగా.. 'అదిమాత్రం ఎవరికీ తెలియకూడదు. ఆ విషయంపై నేనేమీ మాట్లాడను' అంటూ దాటవేశారు. దీంతో ఓ మహిళా జర్నలిస్టు 'మీ వ్యక్తిగత జీవితం ఎలా సాగుతుంది' అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నతో కనుబొమ్మలు ముడేసిన కోహ్లి 'నా వ్యక్తిగత జీవితం గురించి కొంతవరకు తెలుసుకొనేందుకు ఫ్యాన్స్‌కు అవకాశముందని చెప్పాను. దానర్థం నా వ్యక్తిగత జీవితం గురించి ప్రతి విషయాన్ని చెప్తానని కాదు' అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చారు.

Saturday, April 23, 2016

రివ్యూ: సరైనోడు

 ఆరు పాటలు.. నాలుగు ఫైటింగ్‌లు.. కొంచెం ఎమోషన్‌.. అన్నిటికంటే మించి హీరోయిజం. ఇవి ఉంటే చాలు.. కమర్షియల్‌ సినిమా తయారైపోతోందిప్పుడు. ఈ నాలుగూ ఏ స్థాయిలో ఉన్నాయన్న దాని మీదనే సినిమా జయాపజయాలు ఆధారపడుతున్నాయి. బోయపాటి శ్రీను సినిమాలూ వాటినే నమ్ముకొన్నాయి. ఈసారి ఆయనకు.. స్టైల్‌ జోడించే కథానాయకుడు దొరికాడు. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రమే ‘సరైనోడు’. బోయపాటి శైలికి.. అల్లు అర్జున్‌ స్టైల్‌కీ లింకు ఎలా కుదిరింది? ‘సరైనోడు’ ఎలా ఉంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.. పదండి.
కథేంటి?: గణ (అల్లుఅర్జున్‌) కళ్ల ముందు అన్యాయం జరిగితే సహించడు. ఎంతటివాడికైనా ఎదురెళ్తాడు. స్థానిక ఎమ్మెల్యే దివ్య (కేథరిన్‌)ని తొలి చూపులోనే ఇష్టపడతాడు. ఇంట్లో వాళ్లు కూడా వీరిద్దరి ప్రేమని అంగీకరిస్తారు. అయితే.. ఎవరితోనూ గొడవ పెట్టుకోననే మాటిస్తేనే పెళ్లిచేసుకొంటానని షరతు విధిస్తుంది దివ్య. అమ్మవారి ముందు ప్రమాణం చేయబోతుండగా.. అక్కడికి మహాలక్ష్మి(రకుల్‌ ప్రీత్‌ సింగ్‌) వస్తుంది.
ఆమె కోసం మళ్లీ బరిలోకి దిగుతాడు గణ. మహాని వెంటాడుతున్న సమస్య పేరు.. వైరం ధనుష్‌ (ఆది పినిశెట్టి). అతను ముఖ్యమంత్రి కొడుకు. పర్ణశాల అనే గ్రామంలోని పంటపొలాల్ని బలవంతంగా లాక్కుని అక్కడ వ్యాపారం చేయాలనుకొంటాడు. అడ్డొచ్చినవాళ్లని చంపుతూ పోతుంటాడు. ఆ పర్ణశాలకీ మహాకీ సంబంధం ఏమిటి? ధనుష్‌ని గణ ఎలా ఎదిరించాడు? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది?: కమర్షియల్‌ సూత్రాలకు అనుగుణంగా అల్లుకొన్న కథ ఇది. దుర్మార్గుడైన ప్రతినాయకుడు. అతన్ని ఎదిరించే కండబలం ఉన్న కథానాయకుడు. వారిద్దరి మధ్య పోరు. తెలిసిన చిన్న కథనే తీసుకున్న దర్శకుడు తనదైన శైలిలో కథనాన్ని నడిపించారు.
హీరోయిజం.. పోరాటాలు.. పాటలు.. బిల్డప్‌ షాట్స్‌.. ఇలా మాస్‌కి నచ్చే అంశాల్ని రంగరించారు బోయిపాటి. మాస్‌తో పాటు.. అల్లుఅర్జున్‌ అభిమానులకు ఈ చిత్రం బాగా నచ్చే అవకాశం ఉంది. ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం విడివిడిగా చూస్తే బాగానే ఉన్నట్టు అనిపించినా వాటిని కలిపే బలమైన కథ లేకపోవడం ‘సరైనోడు’లో కనిపించే ప్రధానమైన లోటు.
విశ్రాంతి ముందొచ్చే పోరాట ఘట్టం ఆకట్టుకుంటుంది. కోర్టు సన్నివేశంలో ఎమోషన్‌ని బాగా పండించారు. ద్వితీయార్థంలో అనుకోని మలుపులు పెద్దగా కనిపించవు. కామెడీని నమ్ముకున్నా ఆశించినంతగా పండలేదు. అయితే.. పతాక ఘట్టాలు మాత్రం ఆకట్టుకొంటాయి. అదే.. ‘సరైనోడు’ అనుకునేలా చేస్తుంది.
ఎవరెలా?: ఈ సినిమా కోసం అల్లుఅర్జున్‌ బాడీ పెంచాడు. కండ బలం చూపించాడు. మాస్‌కి నచ్చేలా మారిపోయాడు. యాక్షన్‌ ఘట్టాల్లో చాలా చురుగ్గా కనిపించాడు. తనకు అలవాటైన డాన్సుల్లో మరింత అలరించేలా చేశాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని లాగించే ప్రయత్నం చేశాడు.
కేథరిన్‌ ఓకే అనిపిస్తుంది. రకుల్‌కి అంత స్కోప్‌ లేదు. ఆది పినిశెట్టి నటన ఆకట్టుకుంటుంది. ప్రతినాయకుడిగా బన్నీకి దీటుగా కనిపించాడు. బ్రహ్మానందం అప్పుడప్పుడు కాస్త నవ్విస్తాడు. శ్రీకాంత్‌కి ఇలాంటి పాత్రలు అలవాటే. మిగిలినవాళ్లంతా తమ అనుభవంతో బండి లాగించేశారు.
తమన్‌ అందించిన బాణీల్లో రెండు బాగున్నాయి. ‘తెలుసా.. తెలుసా’ మంచి మెలోడీ. యాక్షన్‌ ఘట్టాల్ని తన నేపథ్య సంగీతంతో మరింత ఎలివేట్‌ చేశాడు. ద్వితీయార్థానికి కాస్త కత్తెర పడాల్సింది.. సినిమా అంతా స్టైలిష్‌గా తీశారు. రత్నం డైలాగులు అక్కడక్కడ పేలాయి. కథకుడిగా బోయపాటి కొత్తగా ఏం చేయకున్నా.. తన బలాలపైనే దృష్టి పెట్టాడు. బోయపాటి సినిమాల్లో ఏవైతే హైలైట్స్‌గా కనిపిస్తాయో.. సరైనోడులోనూ రిపీట్‌ అయ్యాయి.. మారింది హీరో మాత్రమే.
చివరిగా.. మాస్‌కి వీడు.. ‘సరైనోడు’