Monday, March 7, 2016

సమ్మర్‌లో సై!

 శత్రువులపై కన్నెర చేసే సింహం..  ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే ఆపద్బాంధవుడు.. సమాజం కోసం పాటుపడే మంచి సంఘ సంస్కర్త... టోటల్‌గా మంచితనానికి చిరునామా కబాలి. ఈ మాఫియా డాన్ లక్ష్యం ఏంటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. టైటిల్ రోల్‌లో రజనీకాంత్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో ‘కలైపులి’ ఎస్. థాను నిర్మిస్తున్న ‘కబాలి’ ఫస్ట్ లుక్‌కి భారీ ఎత్తున స్పందన లభించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా ‘కలైపులి’ ఎస్. థాను మాట్లాడుతూ - ‘‘రజనీకాంత్‌తో సినిమా నిర్మించాలన్న నా కల ఈ చిత్రంతో నెరవేరింది. మంచి కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రంలో ఆయన గెటప్ ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. రంజిత్ మంచి స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఏప్రిల్ మొదటి వారంలో టీజర్‌ను, రెండో వారంలో పాటలను, వేసవి కానుకగా మేలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. రాధికా ఆప్టే, ధన్సిక, కిశోర్, జాన్ విజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: సాహితి, సంగీతం: సంతోశ్ నారాయణ్, పాటలు: సిరివెన్నెల, చంద్రబోస్, అనంతశ్రీరామ్, కెమెరా: మురళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దేవి-శ్రీదేవి సతీశ్.

Sunday, March 6, 2016

సూపర్ స్టార్ భార్యకు బెదిరింపులు

 హాలీవుడ్ సూపర్ స్టార్ జార్జి క్లూనీ భార్య అమల్ అలముద్దీన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో ఇంగ్లండ్ లోని జార్జి ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అమల్.. అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది. జైలుపాలైన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ తరపున ఆమె వాదిస్తోంది. బెదిరింపులు రావడంతో అమల్ కు పూర్తిస్థాయి భద్రత ఏర్పాటు చేశారు.
సౌత్ ఆక్స్ ఫర్డ్ షైర్ డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ పాల్ హారిసన్ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. జార్జి ఇంటి వద్ద భద్రతతో పాటు నిఘా ఉంచారు. జార్కి ఎక్కువ భద్రత అవసరం లేదని, అమల్ కు పటిష్టమైన భద్రత కల్పించామని హారిసన్ చెప్పారు. అత్యున్నత స్థాయి కేసులు వాదిస్తున్నందున ఆమెకు బెదిరింపులు వచ్చాయని తెలిపారు. మాల్దీవులు అధ్యక్ష పదవి నుంచి 2012లో ఉద్వాసనకు గురైన మహ్మద్ నషీద్ కు.. ఉగ్రవాద నిర్మూలన చట్టం కింద గతేడాది 13 ఏళ్ల జైలు శిక్షపడింది. కాగా వెన్నెముకకు సర్జరీ చేయించుకునేందుకు గాను ఆయన ఇంగ్లండ్ కు వెళ్లేందుకు ఇటీవల అనుమతిచ్చారు.

రూపం ఒక్కటే!

 ఒకే గర్భం పంచుకొన్నారు. క్షణాల తేడాలో జన్మించారు. ఇద్దరి రూపం ఒక్కటే. మరివారిలో ఎవరేం చేశారో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు సూర్య. ఆయన కథా నాయకుడిగా నటించిన చిత్రం ‘24’. సమంత, నిత్య మేనన్‌ కథానాయికలు. విక్రమ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. తెలుగు ప్రచార చిత్రాన్ని యువ కథానాయకుడు నితిన్‌ ట్విట్టర్‌లో విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘సైన్స్‌ ఫిక్షన్‌ కథతో తెరకెక్కిన థ్రిల్లర్‌ చిత్రమిది. ఉన్నతమైన సాంకేతిక హంగులతో రూపుదిద్దుకొంది. ప్రేక్షకులను అడుగడుగునా థ్రిల్‌కి గురి చేసేలా ఉంటుంది. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం, తిరు కెమెరా పనితనం చిత్రానికి మరింత వన్నె తెచ్చేలా ఉంటాయి. దర్శకుడు విక్రమ్‌ చిత్రాన్ని దృశ్యకావ్యంలా తీర్చిదిద్దారు. టీజర్‌కి మంచి ఆదరణ లభిస్తోంద’’న్నారు. అజయ్‌ ఈ చిత్రంలో ముఖ్యభూమిక పోషించారు. సమర్పణ: శ్రేష్ఠ్‌ మూవీస్‌, గ్లోబల్‌ సినిమాస్‌

Saturday, March 5, 2016

రివ్యూ: గుంటూర్ టాకీస్


            కొద్ది కాలంగా తెలుగు తెరపై క్రైమ్ కామెడీ చిత్రాల సంద‌డి ఎక్కువైంది.  ఇలాంటి చిత్రాల్లో ఆస‌క్తిక‌ర‌మైన క‌థాంశం, క‌థ‌ను వేగంగా న‌డిపించే స్ర్కీన్‌ప్లే,  సంద‌ర్భోచిత హాస్యాన్ని అందించే సంభాష‌ణ‌లు ఉంటే చాలు, తారాగ‌ణంతో సంబంధం లేకుండానే ప్రేక్ష‌కులు విజ‌యాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈకోవ‌లోనే తెర‌కెక్కిన చిత్రం గుంటూర్ టాకీస్‌. జాతీయ పుర‌స్కారం సాధించిన చంద‌మామ క‌థ‌లు చిత్రాన్ని తెర‌కెక్కించిన ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌కుడు కావ‌డం, బుల్లితెర యాంక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ర‌ష్మి నాయిక‌గా న‌టించ‌డం, శ్ర‌ద్ధ‌దాస్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌టంతో ఈ చిత్రంపై ప్రేక్ష‌కులు మంచి అంచ‌నాలు పెట్టుకున్నారు.

           క‌థేంటంటే: గుంటూర్ టాకీస్ మెడిక‌ల్ షాపులో చిరుద్యోగులుగా  ప‌నిచేసే హ‌రి(సిద్ధు), గిరి(న‌రేష్‌) రాత్రివేళ చిల్ల‌ర‌దొంగ‌త‌నాలు చేస్తుంటారు.  ఓరోజు రాత్రి దొంగ‌త‌నానికి వెళ్లిన‌ప్పుడు ఓ ఇంట్లో హ‌రికి రూ. ఐదు ల‌క్ష‌లు దొరుకుతుంది. ఆ విష‌యం గిరికి చెప్ప‌డు. మ‌రో ఇంట్లో గిరికీ రూ.ఐదుల‌క్ష‌లు దొరుకుతాయి. ఆ విష‌యం హ‌రికి చెప్ప‌కుండా దాస్తాడు.  అయితే ఆ రెండిళ్లు సీఐ ర‌ఘ‌బాబువ‌న్న విష‌యం వారికి తెలియ‌దు. హ‌రి ఆ డ‌బ్బుతో త‌ను ప్రేమించే ర‌ష్మితో క‌ల‌సి ఎంజాయ్ చేయ‌డానికి గోవా వెళ్లిపోతాడు.  అక్క‌డ ఓ రౌడీ బ్యాచ్ హ‌రిని బంధిస్తారు. అప్ప‌టికే గిరినీ వారు బ‌ల‌వంతంగా తీసుకొచ్చుంటారు.  వారు తాము దొంగ‌లించిన డ‌బ్బు తాలుకు మ‌నుషులేమో అని హ‌రి, గిరి అనుకుంటారు. అయితే వారు మాత్రం కోటి రూపాయ‌లు విలువ చేసే ఓ డ‌బ్బా గురించి అడుగుతూ ఎక్క‌డ దాచారంటూ తీవ్రంగా కొడ‌తారు.  మ‌రోవైపు సీఐ ఇంట్లో దొంగ‌త‌నం చేసిన హ‌రి, గిరిల‌ను పోలీసులు వెంబ‌డిస్తుంటారు. ఇలా ఇద్ద‌రి మ‌ధ్య చిక్కుకున్న హ‌రి, గిరి ప‌రిస్థితి ఏంటి? అస‌లు ఆ డ‌బ్బా సంగ‌తేంటి? హ‌రికి, రివాల్వ‌ర్ రాణి(శ్ర‌ద్ధ‌దాస్‌)కు సంబంధ‌మేంటి?  ఇంత‌కూ ఆ కోటి రూపాయ‌ల డ‌బ్బా ఎవ‌రి సొంత‌మైంది? త‌దిత‌ర విషయాలు తెర‌పై చూడాలి.
            ఎలా ఉందంటే:  ఇలాంటి క‌థ‌ల‌కు ఉండాల్సిన ప్ర‌ధాన ల‌క్ష‌ణం వేగం. అయితే ప్ర‌థ‌మార్ధంలో అది క‌ర‌వైంది. గంట నిడివికే సాగ‌తీత ఎక్కువైన‌ట్లు అనిపిస్తుంది.  విశ్రాంతి సమ‌యం నుంచే అస‌లైన క‌థ మొద‌లైన అభిప్రాయం క‌లుగుతుంది.  అప్ప‌టి వ‌ర‌కూ సిద్దు, న‌రేష్ పాత్ర‌లే ఎక్కువ‌గా క‌నిపించిన ప్రేక్ష‌కుల‌కు,   ద్వితీయార్ధంలో మ‌హేష్ మంజ్రేక‌ర్‌, ర‌ఘుబాబు త‌దిత‌రుల ప్ర‌వేశంతో  కొత్త‌ద‌నం ఉంటుంద‌న్న ఆశ క‌లుగుతుంది. గిలిగింత‌లు పెట్టే సంభాష‌ణ‌లు కాకుండా సంద‌ర్భోచిత హాస్యాన్ని పండించ‌డం బాగుంది.  అయితే శ్ర‌ద్ధాస్ చేసిన రివాల్వ‌ర్ రాణి పాత్ర‌ను కుటుంబ ప్రేక్ష‌కులు జీర్ణించుకోవ‌డం క‌ష్టం. మ‌హేష్ మంజ్రేక‌ర్, ఫిష్ వెంక‌ట్‌,ర‌విప్ర‌కాష్‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు న‌వ్విస్తాయి.  మ‌హేష్ మంజ్రేక‌ర్ పాత్ర‌తో  ప‌లికించిన సంభాష‌ణ‌లు కొంద‌రికి రుచించ‌క‌పోవ‌చ్చు. మొత్తంగా ఇది  యువ ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో ఉంచుకుని చేసిన సినిమా క‌నుక వారికి న‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌.
            ఎవ‌రెలా:  సిద్ధు, న‌రేష్ పాత్ర‌ల‌కు ప్రాధాన్య‌మెక్కువ‌.  సుల‌భంగా డ‌బ్బు సంపాదించాల‌నుకునే పైలా ప‌చ్చీస్ యువ‌కుడిగా సిద్దు ఒదిగిపోయాడు. న‌రేష్ అనుభ‌వం ముందు ఇలాంటి పాత్ర‌లు కొట్టిన పిండి. ర‌ష్మి క‌నిపించే స‌మయం  ఎక్కువైనా ప‌లికే సంభాష‌ణలు చాలా త‌క్కువ‌. ఓ పాట‌తో పాటు మ‌రికొన్ని స‌న్నివేశాల్లో గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంటుంది. శ్ర‌ద్ద‌దాస్ చేయ‌డానికి పెద్ద‌గా స్కోప్ లేదు.  మ‌హేష్ మంజ్రేక‌ర్ వైవిధ్య‌మైన డైలాగ్ డెలివ‌రీతో ఆక‌ట్టుకుంటాడు. ఇత‌రులు వారి పాత్ర‌ల మేర‌కు న‌టించారు.  పాత్ర‌ల రూప‌క‌ల్ప‌న‌పై శ్ర‌ద్ధ పెట్టే ద‌ర్శ‌కుడిగా పేరున్న ప్ర‌వీణ్ స‌త్తారు ఇందులో ఆ విషయాన్ని మ‌రిచాడు.  పాత్ర‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నా వాటి ప్ర‌భావం అంత‌గా క‌నిపించ‌దు.  శ్రీ చ‌ర‌ణ్‌కు పాట‌లతో ప్ర‌తిభ నిరూపించుకోవ‌డానికి ఇందులో అవ‌కాశం లేదు. నేపథ్య సంగీతంలో ఫ‌ర్వాలేద‌నిపించాడు.  ద‌ర్శ‌కుడు బిగువైన క‌థ‌నంపై దృష్టి పెట్టి ఉంటే బాగుండ‌నిపిస్తుంది.

Friday, March 4, 2016

'శౌర్య' మూవీ రివ్యూ


కరెంటు తీగ లాంటి హిట్ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ సరికొత్త అవతారంలో శౌర్యగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఎక్కువగా ఎనర్జిటిక్ రోల్స్ లోనే కనిపించిన మనోజ్, ఈ సినిమాలో డీసెంట్ లుక్ తో, సెటిల్డ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పటి వరకు ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్స్ మాత్రమే తీసిన దర్శకుడు దశరథ్ కూడా ఈ సినిమాతో రూటు మార్చే ప్రయత్నం చేశాడు. తొలిసారిగా ఓ క్రైమ్ థ్రిల్లర్ తో అభిమానుల మెప్పించడానికి ప్రయత్నించాడు. మనోజ్ లుక్ తో పాటు ప్రమోషన్ పరంగా ఆకట్టుకున్న శౌర్య థియేటర్స్ కు వచ్చిన ఆడియన్స్ ను ఆ స్ధాయిలో థ్రిల్ చేశాడా..?
కథ :
శౌర్య( మంచు మనోజ్), నేత్ర (రెజీనా) చాలా కాలంగా ప్రేమించుకుంటుంటారు. వీరి పెళ్లికి నేత్ర తండ్రి సత్యమూర్తి(నాగినీడు), బాబాయి కృష్ణమూర్తి(సుబ్బరాజు) ఒప్పుకోలేదన్న కారణంతో తన గోల్ ను కూడా వదులుకొని యుకె వెళ్లి సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్న శౌర్య, చివరిసారిగా నేత్ర మొక్కు చెల్లించటం కోసం శివరాత్రి జాగరం చేయటానికి ఆమె సొంత ఊరికి వస్తారు. ఇద్దరు నిద్రపోయిన సమయంలో నేత్ర మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది.


శౌర్య పక్కన ఉండగానే ఎవరో నేత్ర గొంతుకోసి పారిపోతారు. ఆ నేరం, ఆమెతోనే ఉన్న శౌర్య మీద పడుతుంది. నేత్ర తండ్రి ఎంపీ కావటంతో పోలీసులు కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకుంటారు. ఇంతకీ నేత్ర మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు..? ఆ కేసు శౌర్య మీదకు ఎందుకు వచ్చింది..? శౌర్య ఈ కేసు నుంచి బయటపడి అసలు నేరస్థులను ఎలా పట్టించాడు..? అన్న అంశాన్ని ఆసక్తి కరమైన మలుపులతో, థ్రిల్లింగ్ ట్విస్ట్ లతో తెరకెక్కించారు.
 
నటీనటులు :
ప్రతీ సినిమాలో ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించే మనోజ్ ఈ సినిమాతో సెటిల్డ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో తనదైన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు. పాజిటివ్, నెగెటివ్ రెండు యాంగిల్స్ ను పర్ఫెక్ట్ గా చూపించి సినిమాకు ప్లస్ అయ్యాడు. రెజీనా కూడా తన పాత్ర మేరకు ఆకట్టుకుంది. నాచురల్ యాక్టింగ్ తో కథను ముందుకు నడిపించింది. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రకాష్ రాజ్ మరోసారి తన మార్క్ చూపించాడు. హీరో పాత్రకు ధీటుగా పోలీస్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో నాగినీడు, సుబ్బరాజు, శియాజీ షిండే లు తమ పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ శీను కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది.

Thursday, March 3, 2016

నేను షారుక్ అభిమానిని!

 ఆ మధ్య వరకూ షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఆ తర్వాత సీన్ మారింది. సల్మాన్ చెల్లెలు అర్పితా ఖాన్ పెళ్లి నుంచి ఈ ఇద్దరి మధ్య మళ్లీ స్నేహం చిగురించింది. ఆ తర్వాత తమ మధ్య ఉన్న విభేదాలన్నింటినీ మరిచిపోయి ఇద్దరూ హ్యాపీగా ఉంటున్న సంగతి తెలిసిందే.

  ఇప్పుడు సల్మాన్‌ఖాన్ తాను షారుక్‌ఖాన్ అభిమానిని అని పేర్కొనడం బాలీవుడ్ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. షారుక్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యాన్’ ప్రచార చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా కండలవీరుడు సల్మాన్ ‘‘బీయింగ్ ఎ ఫ్యాన్ ఆఫ్ షారుక్’’ అంటూ ‘ఫ్యాన్’ ట్రైలర్ లింక్‌ను తన ట్విటర్‌లో షేర్ చేశారు. గత ఏడాది సల్మాన్ నటించిన ‘బజరంగీ భాయ్‌జాన్’ చిత్రం ఫస్ట్ లుక్‌ను షారుక్ ట్విట్టర్‌లో ఆవిష్కరిస్తే, ఆ తర్వాత షారుక్ నటించిన ‘దిల్‌వాలే’ చిత్రం డైలాగ్స్‌తో సల్మాన్ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ టీమ్ డబ్‌స్మాష్ చేసింది.

  ఇదంతా చూస్తుంటే, ఎలాంటి ఈగోలు లేకుండా సల్మాన్, షారుక్‌లు చాలా ఫ్రెండ్లీగా ఉంటూ, ఒకరి చిత్రాలను మరొకరు ప్రమోట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద పోటీ పోటీనే... స్నేహం స్నేహ మే అన్న మాట. సల్మాన్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. షారుక్ కూడా అంతే. కొత్తగా చిగురించిన ఈ ఇద్దరి స్నేహం ఎందాకా కొనసాగుతుందో కాలమే చెప్పాలి.

మహిళలకు శ్రుతిహాసన్‌ ప్రత్యేక బహుమతి

 నటి శ్రుతిహాసన్‌ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఓ పాటను అంకితం చేయనున్నారట. సంగీత దర్శకులు ఎహ్‌సాన్‌ నూరానీ, లాయ్‌ మెన్‌డోన్కాలతో కలిసి ఆమె ఈ పాటను విడుదల చేస్తున్నారు. మహిళలను చైతన్య పరిచే దిశగా ఈ పాటను రచించినట్లు శ్రుతి పేర్కొన్నారు. స్త్రీలకు కలలు కనే శక్తి నిస్తూ... ఆత్మహత్యలకు పాల్పడాలనే ఆలోచనలు రాకుండా చేసే దిశగా పాట ఉంటుందని తెలిపారు. ఈ పాటలోని సంగీతం చక్కగా ఉంటుందని, పాట అందరికీ నచ్చుతుందని అభిప్రాయపడ్డారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్న శ్రుతి ఇలా సమయం కేటాయించి మరీ మహిళల కోసం పాట విడుదల చేయడం విశేషమే కదా.
         ప్రస్తుతం శ్రుతిహాసన్‌ తెలుగులో నాగచైతన్యతో ‘ప్రేమమ్‌’లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో ఆమె నటించిన ‘రాకీ హ్యాండ్సమ్‌’ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్‌ అబ్రహం కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి నిశికాంత్‌ కామత్‌ దర్శకత్వం వహించారు.

Wednesday, March 2, 2016

విడాకులు కోరుతున్న నటి

 తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రేమ తన జీవిత భాగస్వామి జీవన్‌ అప్పచ్చు నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో బుధవారం పిటిషన్‌ దాఖలు చేశారు. విడాకులు తీసుకోవడానికి తన భర్త అంగీకరించినట్లు ఆమె పేర్కొన్నారు. అభిప్రాయబేధాల కారణంగా వీరిద్దరూ కొద్దికాలంగా విడిగా ఉంటున్నారు.
బెంగుళూరులోని కొడగు ప్రాంతానికి చెందిన ప్రేమ 2006లో పారిశ్రామిక వేత్త జీవన్‌ అప్పచ్చును వివాహం చేసుకున్నారు. 1995లో ‘సవ్యసాచి’ అనే కన్నడ చిత్రం ద్వారాప్రేమ తెరంగేట్రం చేశారు. వెంకటేశ్‌ సరసన ‘ధర్మచక్రం’ చిత్రంతో తెలుగు సినీపరిశ్రమకు పరిచయమయ్యారు.