Friday, February 17, 2017

రివ్యూ : ఘాజీ


  కథేంటంటే..?: 1971లో ఇండియన్‌ సబ్‌మెరైన్‌ ఎస్‌ 21కీ.. పాకిస్థానీ జలంతర్గామి ఘాజీకీ మధ్య జరిగే నీటి యుద్ధం ఈ కథ. లెఫ్టినెంట్‌ కమాండర్‌ అర్జున్‌ (రానా).. కెప్టెన్‌ రణ్‌ విజయ్‌సింగ్‌ (కె.కె.మీనన్‌)లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి విశాఖపట్నం తీరాన్ని ఎలా కాపాడారు? 18 రోజుల పాటు నీటిలో జరిపిన పోరాటంలో పాక్‌ జలాంతర్గామి ఘాజీని ఎలా మట్టికరిపించారు? అనేదే కథ.
ఎలా ఉందంటే..?: ఇండియా - పాక్‌ యుద్ధమంటే మనందరికీ కార్గిల్‌ యుద్ధం.. లేదంటే అంతకు ముందు జరిగిన కొన్ని యుద్ధాలే తెలుసు. సముద్ర గర్భంలోనూ ఇండియా - పాక్‌లు హోరాహోరీగా తలపడ్డాయని, ఆ యుద్ధంలో భారతీయ సైనికులు ధృఢచిత్తంతో శత్రువుల్ని ఎదుర్కొని విజయం సాధించారన్న చరిత్రకు ‘ఘాజీ’ అద్దం పట్టింది.
ఈ సినిమాలో దాదాపు 90 శాతం సన్నివేశాలు కేవలం సబ్‌మెరైన్‌లోనే తీశారు. కంటికి సబ్‌ మెరైన్‌ తప్ప ఇంకేం కనిపించదు. అయినా సరే.. విసుగు అనిపించదు. తరవాతేం జరుగుతుందన్న ఉత్కంఠ తప్ప. మనదేశం పాకిస్థాన్‌పై విజయం సాధిస్తుందన్న సంగతి తొలి సన్నివేశంలోనే అర్థమైపోతుంది. కానీ ‘ఎలా’ అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు సఫలీకృతమయ్యాడు. దేశభక్తి నేపథ్యంలో సాగే చిత్రాల్లో.. ప్రేక్షకుల్ని కనెక్ట్‌ చేయడం తప్పనిసరి. అప్పుడే తెరపై ప్రధాన పాత్రలు ఎంత భావోద్వేగంతో రగిలిపోతాయో.. ప్రేక్షకుల్లోనూ అలాంటి స్పందనే కలుగుతుంటుంది. ఈ విషయంలోనూ దర్శకుడు విజయం సాధించాడు. శత్రువుల నుంచి మన సబ్‌మెరైన్‌ని కాపాడుకొనే సందర్భంలో.. ఘాజీని మట్టుపెట్టినప్పుడు ప్రతి ప్రేక్షకుడూ మనసులో ‘జైహింద్‌’ అనుకోకుండా ఉండలేడేమో..?!
 
అతి తక్కువ పాత్రలతో.. ‘యుద్ధం’ అనే ఒకే లైన్‌తో రెండు గంటలు కూర్చోబెట్టడం.. పట్టుసడలని స్క్రీన్‌ప్లేతోనే సాధ్యమైంది. అక్కడక్కడ నేవీకి సంబంధించిన సాంకేతిక పదాలు ప్రేక్షకులకు అర్థం కావు. కానీ.. అవేవీ ఇబ్బందిని కలిగించవు. కథని.. తెరపై ఉన్న వాతావరణాన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఒక్కసారి వాతావరణం అలవాటైన తర్వాత.. శుభం కార్డు పడేంత వరకూ తెరపై నుంచి చూపు మరల్చకుండా చేయటంలో విజయవంతమైంది చిత్ర బృందం.
ఎవరెలా చేశారంటే..?: ఈ సినిమాలో పాత్రలు తప్ప పాత్రధారులెవ్వరూ కనిపించనట్లుగా ఉంది. రానా ఈ కథని.. ఈ పాత్రనీ ఏరికోరి ఎందుకు చేశాడో సినిమా చూస్తే అర్థమైపోతుంది. కెకె మీనన్‌ పాత్రని ప్రేమిస్తాం. అతను తెరపై ఇంకాసేపు ఉంటే బాగుణ్ణు అనుకొంటాం. తాప్సిని ఎందుకు తీసుకొన్నారో అర్థం కాదు. ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. ఓంపురి.. నాజర్‌లవి చాలా చిన్న పాత్రలు.
కె అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది. మనం కూడా నీటిలో ఉన్నామేమో అనే భావన కేవలం నేపథ్య సంగీతంతోనే కలిగించారు. మది కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న చిత్రమే అయినా... చిన్న సబ్‌మెరైన్‌ సెట్లో.. కెమెరాని పరుగులు పెట్టించాడు. సంకల్ప్‌ ఆలోచన.. అతని స్క్రీన్‌ ప్లే ‘ఘాజీ’ని ఓ మర్చిపోలేని చిత్రంగా మలిచాయి.
 

Wednesday, February 15, 2017

లేడీ గెటప్.. నాకు అన్నం పెట్టింది


సినిమాలపై మోజుతో ఓ యువకుడు ఇంట్లో చెప్పకుండా కృష్ణానగర్‌ వచ్చి అనేక కష్టాలకు ఓర్చి ఓ సినిమా కార్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌గా చేరి తన లక్ష్యానికి చేరువయ్యాడు. ఈ ప్రస్థానంలో ఆ యువకుడు లేడీ గెటప్‌తో ఆకట్టుకుంటూ బుల్లితెరపై వెలుగుతున్నాడు. నటనపై మక్కువతో 15 ఏళ్లుగా సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తనకు అచ్చొచ్చిన ఆడపాత్రలో బుల్లితెరపై నవ్వులు పూయిస్తున్నాడు. అతడే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన కె.శాంతికుమార్‌. వాస్తవంగా శాంతికుమార్‌ అంటే ఎవరికీ తెలియదు. లేడీ గెటప్‌లో ‘శాంతి స్వరూప్‌’గా మాత్రమే సుపరిచితుడు. తనదైన మేనరిజంతో సందడి చేస్తూ అలరిస్తున్న ఈ బక్కపల్చటి యువకుడు తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. ఆ వివరాలు అతడి మాటల్లోనే.. 
  అర్ధాకలితో అలమటించా..
సినిమా మోజుతో కృష్ణానగర్‌లో మకాం పెట్టి చాలా కష్టాలు ఎదుర్కొన్నా. కొన్ని రోజులు నీళ్లతోతోనే కడుపు నింపుకోవాల్సి వచ్చింది. తర్వాత ఓ సినిమా కార్యాలయంలో రూ.1000 జీతంతో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తూ స్టూడియోల చుట్టూ ఒక్కచాన్స్‌ అంటూ తిరిగాను. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తచ్చాడుతున్న నన్ను జబర్దస్త్‌ కమెడియన్స్‌ రాఘవ, రచ్చ రవి చూశారు. నటనపై నాకున్న మక్కువను వారి దృష్టికి తీసుకెళితే.. తమ జట్టులో ఓ అవకాశం ఇచ్చారు. శాంతిగా కామెడీ టైమింగ్‌తో మంచి మార్కులు పడ్డాయి. దాంతో అవకాశాలు వచ్చాయి.
ఇప్పటి వరకూ 80 స్కిట్స్‌..
వచ్చేవన్నీ లేడీ గెటప్‌లే. అయినా సరే.. ఈ శాంతి ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. దాదాపు అన్ని చానళ్లలోనూ ఆ గెటప్‌లోనే కనిపిస్తున్నా. మొన్నటి దసరా మహోత్సవం స్కిట్‌లో యాంకర్‌ శ్రీముఖిని అనుసరిస్తూ చేసిన డ్రామా ప్రేక్షకులకు ఆకట్టుకుంది. నా శరీరతత్వం.. లేడీ గెటప్‌లో నా వేషధారణతో అన్ని టీంలవారు ప్రోత్సహిస్తూ వారి స్కిట్‌లో అవకాశం ఇస్తున్నారు. ఒక్కసారి మొహానికి రంగు వేసుకున్నాక.. ఏ నటుడన్నా ఏ పాత్ర వేయడానికైనా సిద్ధంగా ఉంటాడు.. నేనూ అంతే. 
  నా చీరలు బాగుంటాయట.. 
ఇటీవల ప్రైవేట్‌ ప్రోగ్రామ్స్‌ ఇవ్వడానికి వెళుతున్నా. అక్కడ నన్ను చూసిన చాలామంది మగవాళ్లే మీ చీరలు బాగుంటాయని కితాబిస్తున్నారు. నా భార్యకు కూడా చీరల సెలక్షన్‌లో ఇంత ప్రావీణ్యం లేదంటూ వాళ్ల ముందే నన్ను పొగుడుతుంటారు. అది  నాకు చాలా సంతోసంగా ఉంటుంది.
ఆడీ లేదు.. ఆనందం ఉంది
నాకు ఆడీ కారుందని, పెద్ద ఇల్లు ఉందని ఇటీవల సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అవన్నీ నిజం కాదు.. ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తున్నప్పుడు పైసాపైసా దాచుకుని ఓ స్కూటీ కొనుకున్నా. నాకున్నది అదొక్కటే. ఆడి కారు లేదు కానీ నా కష్టాలు మరిచిపోయేలా రెండు పూటలా తిండికి, ఇంటి అద్దె చెల్లించే స్తోమత మాత్రం జబర్దస్త్‌ ఇచ్చింది. 

Tuesday, February 14, 2017

‘సింగం-4’ చేస్తా: సూర్య

 సూర్య కథానాయకుడిగా ‘సింగం’ సిరీస్‌లో వచ్చిన చిత్రం ‘ఎస్‌3’. అనుష్క, శ్రుతిహాసన్‌ కథానాయికలు. హరి దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్‌. ఎందుకంటే విడుదల తేదీ ఇప్పటికే చాలా సార్లు మారింది. సినిమా ఎప్పుడు విడుదలవుతుందనేది మన చేతుల్లో లేదు. నేను చాలా కంగారు పడ్డాను. కానీ ప్రేక్షకుల చిత్రాన్ని ఆదరించారు. దక్షిణాదిన ఏటా సుమారు వెయ్యికు పైగా సినిమాలు విడుదలవుతుంటాయి. అందులో ఏడు శాతం మాత్రమే విజయం సాధిస్తుంటాయి. అందుకే ప్రతి నటుడికీ హిట్‌ అనేది ప్రత్యేకం. మా నాన్నగారు నన్ను ఆలింగనం చేసుకొని అభినందించటం చాలా అరుదైన విషయం. అలాంటిది ఆయన ఈ సినిమా చూసి నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. అంతకంటే సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది. అందుకే దర్శకుడు హరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఆయనతో మరో సినిమా చేస్తాను. సింగం సిరీస్‌ను కొనసాగించే అవకాశాలూ ఉన్నాయి. అన్నీ కుదిరితే ‘సింగం 4’తో వస్తాం. కానీ దానికి ఐదారేళ్లు పట్టొచ్చు.’ అన్నారు.
దర్శకుడు హరి మాట్లాడుతూ.. ‘గతంలో వచ్చిన ‘సింగం’ చిత్రాలలాగానే దీనికి కూడా చాలా కష్టపడినట్లు తెలిపారు. తనకు ఎన్టీఆర్‌ నటించిన ‘టెంపర్‌’ చిత్ర‌మంటే ఎంతో ఇష్టమని అన్నారు. ఆయనతో కలిసి ఓ పవర్‌ఫుల్‌ చిత్రాన్ని చేయాలనుకొంటున్నట్లు వెల్లడించారు.

Monday, February 13, 2017

రేపు తేలనున్న శశికళ రాజకీయ భవితవ్యం!

  అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ రాజకీయ భవితవ్యం మంగళవారం తేలనుంది. శశికళపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు రేపు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఈ కేసులో శశికళ నిర్దోషిగా తేలితే ముఖ్యమంత్రి కావడానికి న్యాయపరమైన చిక్కులు ఉండవు. ఒకవేళ శశికళకు శిక్షపడితే ముఖ్యమంత్రి కావాలన్న ఆశలు ఆవిరైనట్టే. ఆమె జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మరో ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హురాలవుతారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత జయలలితతో పాటు ఆమె నెచ్చెలి శశికళ కూడా నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో జయలలిత, శశికళను కర్ణాటకలోని దిగువ కోర్టు దోషులుగా ప్రకటించింది. దీంతో జయలలిత అప్పట్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. వీరిద్దరూ కొన్ని రోజులు జైల్లో గడిపారు. తర్వాత ఈ తీర్పును సవాల్‌ చేస్తూ జయలలిత  కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కిందికోర్టు తీర్పును హైకోర్టు కొట్టేయడంతో జయలలిత మళ్లీ సీఎం అయ్యారు. కాగా హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ నేపథ్యంలో రేపు సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుపై తమిళనాట ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Saturday, February 11, 2017

ఒక్క సినిమాలో 29 పాటలు

 ప్రస్తుతం సినిమా స్టైల్, ఆడియన్స్ టేస్ట్ పూర్తిగా మారిపోయింది. గతంలోలా ఆరుపాటలు, ఐదు ఫైట్లు అన్న కాన్సెప్ట్ మారిపోయింది. అవసరం ఉంటేనే సినిమాల్లో పాటలు పెడుతున్నారు. అది కూడా మూడు నిమిషాలకే ముగించేస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో కూడా పాటల పందిరి లాంటి సినిమా ఒకటి ప్రేక్షకుల ముందుకు రానుంది.
కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదరుచూస్తున్న బాలీవుడ్ యువ నటుడు రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జగ్గా జాసూస్. రణబీర సరసన కత్రినాకైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఏకంగా 29 పాటలున్నాయట. గతంలో 'హమ్ ఆప్ కే హై కౌన్' సినిమాలో 14 పాటలుండగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి జగ్గా జాసూస్ లో 29 పాటలు పెట్టారు మేకర్స్. ఈ సినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు.

Friday, February 10, 2017

ఓం నమో వేంకటేశాయ


మర్షియల్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తూ వచ్చిన కె.రాఘవేంద్రరావు తనలోని మరో కోణాన్ని చూపిస్తూ భక్తి ప్రధానమైన చిత్రాల్ని తెరకెక్కిస్తున్నారు. వాటిలోనూ తనదైన మార్క్‌ని చూపిస్తూ ఆబాల గోపాలాన్ని అలరిస్తున్నారు. అందులో భాగంగా రూపుదిద్దుకొన్న చిత్రమే ‘ఓం నమో వేంకటేశాయ’. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడిసాయి’ చిత్రాల తర్వాత రాఘవేంద్రరావు-నాగార్జున కలయికలో వస్తున్న చిత్రమిది. వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన హథీరాం బాబాజీ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాను తీస్తే రాఘవేంద్రరావే తీయాలి.. చేస్తే నాగార్జునే చేయాలి అన్నట్టుగా ఆ ఇద్దరూ భక్తి ప్రధానమైన చిత్రాలపై ఓ ప్రత్యేకమైన ముద్రవేశారు. అందుకే ‘ఓం నమో వేంకటేశాయ’కి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే అంచనాలు షురూ అయ్యాయి. మరి ఆ మేజిక్‌ మరోసారి తెరపై కనిపించిందా? శ్రీవారి భక్తుడు ‘అన్నమయ్య’గా ఒదిగిపోయిన నాగార్జున, హథీరాం బాబాగా ఎలా నటించాడు.. లాంటి ప్రశ్నలకు సమాధానాలు..
కథేంటంటే?: దేవుడిని చూసే విద్య నేర్చుకోవాలంటూ బాల్యంలోనే ఇంటి నుంచి బయటకొస్తాడు రామ(నాగార్జున). వేద పాఠశాలలో విద్యనభ్యసిస్తూ గురువు(సాయికుమార్‌) చెప్పిన మాటతో తపస్సుకు పూనుకుంటాడు. ఆ తర్వాత తిరుమల చేరతాడు. కానీ స్వామి దర్శనం మాత్రం కాదు. దేవుడ్నే చూడాలంటూ అన్న, పానీయాలు లేకుండా అయిదురోజుల పాటు గుడిముందే కూర్చుంటాడు. స్వామికోసమే ఈ జీవితం అంటూ సదా ఆయన ఆరాధనలో మునిగి తేలుతుంటాడు. అలాంటి పరమ భక్తుడికి స్వామి దర్శన భాగ్యం కలిగిందా? లేదా? తిరుమలలో ఆలయ అధికారి గోవిందరాజులు(రావు రమేష్‌) రామపై ఎందుకు కక్ష కట్టాడు? రామను పరీక్షించేందుకు స్వామి ఏం చేశాడు? ఆ ప్రయత్నంలో రామ జీవితంలో ఎదురైన అనుభవాలు ఎలాంటివి? ఆయన్ని మనువాడాలనుకొన్న భవానీ (ప్రగ్యాజైస్వాల్‌) కథేంటి? రామ కోసం ఆమె చేసిన త్యాగం ఎలాంటిది? శ్రీవారికి మరో భక్తురాలైన కృష్ణమ్మ(అనుష్క)కి రామకి మధ్య సంబంధం ఏమిటి? రామ.. హథీరాం బాబాగా ఎలా మారాడు? తదితర విషయాల్ని తెలుసుకోవాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.

  ఎలా ఉందంటే: భక్తికున్న శక్తితో వేంకటేశ్వరస్వామిని మురిపించిన మరో పరమ భక్తుడు హథీరాం బాబా కథ ఇది. బాల్యంలోనే స్వామిని ప్రత్యక్షంగా చూడాలంటూ బయటకొచ్చిన హథీరాం తిరుమలను కలియుగ వైకుంఠంగా మార్చడంలో కృషి ఎలాంటిది? స్వామి వారి చేతుల మీదుగానే సజీవ సమాధి ఎలా అయ్యాడు? తదితర విషయాలతో ఈ చిత్రం సాగుతుంది. వేంకటాచల స్థలపురాణం, హథీరాంబాబా, కృష్ణమ్మల భక్తి నేపథ్యంలో తొలిసగ భాగం సాగుతుంది. భక్తులపై జరుగుతున్న దోపిడీని అడ్డుకుంటూ తిరుమలను పరమ పవిత్రంగా ఉంచేందుకు హథీరాం బాబా ప్రయత్నించడం, స్వామి భక్తులకు పుణ్య క్షేత్రం విశిష్టతను చాటిచెప్పడం తదితర సన్నివేశాలతో చిత్రం సాగుతుంది. అధికారి గోవిందరాజులు, ఆయన బృందం చేసే అరాచకాలను అడ్డుకుంటూ హథీరాం బాబా స్వామి సేవలో పునీతమయ్యే తీరును తెరపై కళ్లకు కట్టారు.
ఎవరెలా: ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’లా భక్తుల పాత్రలో ఒదిగిపోయిన నాగార్జున హథీరాం బాబాగా నటించి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సౌరభ్‌జైన్‌ వేంకటేశ్వరుడిగా చక్కగా నటించాడు. కృష్ణమ్మగా అనుష్క పాత్ర చాలా కీలకం. పతాక సన్నివేశాల వరకూ ఆమె తెరపై కనిపిస్తూనే ఉంటుంది. వేంకటేశ్వరస్వామి భక్తురాలిగా పవిత్రత ఉట్టిపడేలా తెరపై కన్పించింది. నాగార్జున కూడా పాత్రలో లీనమై నటించారు. పతాక సన్నివేశాల్లో ఆయన నటన మరోస్థాయికి చేరిందనే చెప్పాలి. జగపతిబాబు, ప్రగ్యాజైస్వాల్‌లాంటి నటులు తెరపై కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. రావురమేష్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌ తదితర పాత్రలు వినోదాన్ని పంచుతాయి.
సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. ఎస్‌.గోపాల్‌రెడ్డి కెమెరా పనితనం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. ముఖ్యంగా శేషగిరులను చూపించిన విధానం, ప్రతీ సన్నివేశం వర్ణ రంజితంగా ఉంటుంది. కీరవాణి సంగీతం కథకు ప్రాణం పోసింది. చాలా వరకూ కథ పాటల రూపంలోనే చెప్పారు. ఆ సమయంలో కీరవాణి అందించిన స్వరాలు కీలక పాత్ర పోషించాయి. నేపథ్య సంగీతం కథను మరింత గుండెకు హత్తుకునేలా మార్చింది. కిరణ్‌కుమార్‌ కళా ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. దర్శకుడిగా కె.రాఘవేంద్రరావు మరోసారి తనదైన మేజిక్‌ను ప్రదర్శించారు. నాగార్జున-ప్రగ్యాజైస్వాల్‌, జగపతిబాబు-అనుష్కలపై తెరకెక్కించిన సన్నివేశాలు భక్తిరస చిత్రంలోనూ కె. రాఘవేంద్రరావు మార్కు కమర్షియల్‌ ఛాయలు స్పష్టంగా కనిపించేలా చేస్తాయి. మిగిలిన చోట్ల కూడా పండ్లు, దీపాలు, పుష్పాలతో తెరను వర్ణ శోభితం చేశారు. కథను చెప్పిన విధానం కూడా చాలా బాగుంది. హథీరాం, కృష్ణమ్మల జీవితాలతో పాటు ఆలయ స్థలపురాణం, వరాహమూర్తి దర్శనం, స్వామివారికి చేసే సేవల విశిష్టతలను సినిమాలో చూపించిన విధానం తెలియని వారికి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది.
 
 

Thursday, February 9, 2017

రివ్యూ: ఎస్‌3 (యముడు 3)


కథేంటంటే?: సింగం సిరీస్‌ తొలి భాగం ‘సింగం’ పల్లెటూరి నేపథ్యంలో సినిమా సాగుతుంది. తర్వాత భాగం ‘సింగం 2’ సింగం (సూర్య) పట్టణానికి వస్తాడు. మూడో భాగం ‘సింగం 3’లో పట్టణం నుంచి ఆస్ట్రేలియా వెళ్తాడు. ఒక పోలీసు కమిషనర్‌ హత్యకు సంబంధించిన విచారణ చుట్టూ సాగే కథ ఇది. నిజాయతీ గల పోలీసు అధికారి సిడ్నీలో ఇండియన్‌ పోలీసు పవర్‌ ఎలా చూపించాడన్నది కథ. కథలో కావ్య (అనుష్క).. విద్య (శ్రుతిహాసన్‌)ల మధ్య ఉన్న సంబంధం ఏంటి అన్నది కూడా ఆసక్తికరంగా ఉంటుంది.
ఎలా ఉందంటే?: ఈ సినిమా కేవలం యాక్షన్‌ ప్రియుల్ని దృష్టిలో ఉంచుకునే తీర్చిదిద్దారు దర్శకుడు హరి. అందుకు సంబంధించిన సన్నివేశాలు మాస్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. సూర్య పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు.. మేనరిజం.. ఫైట్లపై దర్శకుడు దృష్టి పెట్టారు. తొలి భాగం నిదానంగా సాగుతుంది. అనవసరంగా ఇరికించిన కామెడీ సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెడతాయి. అనుష్క.. సూర్యల మధ్య నడిపించిన ట్రాక్‌ కూడా కథలో ఇమడనట్లుగా ఉందనిపిస్తుంది.
విశ్రాంతికి 20 నిమిషాల ముందు నుంచి థ్రిల్‌ కలిగించే సన్నివేశాలు మొదలవుతాయి. దాంతో ప్రేక్షకుడికి ఆసక్తి మొదలవుతుంది. ఆ నేపథ్యంలో వచ్చే పోరాట ఘట్టాలు అలరిస్తాయి. ద్వితీయార్ధం ప్రారంభంలో సన్నివేశాల్ని పరుగులు పెట్టించాడు దర్శకుడు. సిడ్నీ నేపథ్యంలో సాగిన యాక్షన్‌ ఘట్టాలు ఆకట్టుకుంటాయి. ఛేజింగ్‌లు.. సూర్య చేసిన ఫైట్లు.. పోలీసు పవర్‌ను చూపించిన డైలాగ్‌లు ఇవన్నీ కలిసి ఓ యాక్షన్‌ ప్యాకేజీలా దర్శకుడు చూపించాడు.
 ఆస్ట్రేలియాలో జరిగే సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం పట్టుగా సాగింది. కాకపోతే దర్శకుడు తొలి రెండు భాగాల్లో చూపించిన చాకచక్యం ఈ సినిమాలో చూపించలేకపోయాడు. కథ బలహీనంగా ఉండటం.. హీరో పాత్రపై తప్ప మరే పాత్రపైనా దృష్టి పెట్టకపోవడం నిరాశకు గురి చేస్తాయి. ‘వైఫై..’ పాట కోసం మాత్రమే శ్రుతిహాసన్‌ను తీసుకున్నారా.. అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు మామూలుగా సాగాయి.
 
ఎవరెలా చేశారంటే: సూర్య కోసమే ఈ సినిమా తీశారా.. అనేలా ఉంది. మరోసారి శక్తిమంతమైన పోలీసు పాత్రలో సూర్య రాణించారు. సూర్య గెటప్‌.. తను చేసిన పోరాట దృశ్యాలు ఆకట్టుకుంటాయి. అనుష్క మరీ లావుగా కనిపించింది. ఈ విషయంలో తాను జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆమె పాత్రకు అంత ప్రాముఖ్యత లేదు. శ్రుతిహాసన్‌ది కేవలం గ్లామర్‌ పాత్ర మాత్రమే. విలన్‌ పాత్రల్ని పోషించిన వారిని దర్శకుడు స్టైలిష్‌గా చూపించాడు. రాధిక నటన ఆకట్టుకుంటుంది.
చివరగా.. యాక్షన్‌ ప్రియులకు ‘ఎస్‌’3 

Tuesday, February 7, 2017

‘నేను లోకల్‌’


వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్నాడు నాని. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, కృష్ణగాడివీర ప్రేమ‌గాథ‌, జెంటిల్‌మ‌న్‌, మజ్ను... ఇలా ఆయ‌న జోరు కొన‌సాగుతూఉంది. ప‌లువురు స్టార్ ద‌ర్శ‌కులు నానితో క‌లిసి ప‌నిచేయ‌డానికి ఉత్సాహం చూపించినా ఆయ‌న మాత్రం మ‌ళ్లీ త‌న‌దైన శైలిలోనే కంటెంట్‌కి ప్రాధాన్య‌మిస్తూ నేను లోక‌ల్‌` చేశాడు. వ‌రుస విజ‌యాల నాని.. దిల్‌రాజు నిర్మాణ సంస్థ‌... దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం... ఇలా విడుద‌ల‌కి ముందే ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షిస్తూ అంచ‌నాల్ని పెంచిందీ చిత్రం. మ‌రి సినిమా అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగానే ఉందా? నాని విజ‌యాల జోరు కొన‌సాగిన‌ట్టేనా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటేరివ్యూలోకి వెళ్లాల్సిందే...
కథేంటి: ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, సరదా సరదాగా తిరిగే కుర్రాడు బాబు(నాని). తనలాగే తాను జీవించాలనే భావాలున్న వ్యక్తి. ఎవరికోసం తనని తాను మార్చుకోడు. కీర్తి(కీర్తిసురేష్‌)ని తొలిసారి చూడగానే మనసు పారేసుకుంటాడు. తన ప్రేమ విషయం చెబితే అందుకు కీర్తి నో చెబుతుంది. ‘నువ్వు ప్రేమించే వరకూ విసిగిస్తా’నని బాబు ఆమె వెంటపడుతుంటాడు. ఈ క్రమంలో అతని మనసును తెలుసుకున్న కీర్తి ప్రేమలో పడుతుంది. ఆ విషయం రేపు ‘మనం కలుసుకున్నప్పుడు’ చెబుతానని బాబుతో అంటుంది. ఈ నేపథ్యంలో కీర్తి కిడ్నాప్‌నకు గురవుతుంది. ఈ విషయం తెలుసుకున్న బాబు ఆమెను రక్షించేందుకు వెళ్లగా, అక్కడ అప్పటికే పోలీస్‌ అధికారి సిద్ధార్థ వర్మ (నవీన్‌ చంద్ర) రౌడీలను చితకబాదుతాడు. కీర్తిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని, ఆమె జోలికి ఎవరైనా వస్తే చంపేస్తానంటూ వార్నింగ్‌ ఇస్తాడు. అప్పుడే అక్కడకు వచ్చిన బాబు రియాక్షన్‌ ఏంటి? బాబు, కీర్తిల ప్రేమ కథ సుఖాంతం అయిందా? పోలీస్‌ అధికారి సిద్ధార్థ వర్మ కథ ఏమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 ఎలా ఉందంటే?: నాని సినిమా అంటే కుటుంబం మొత్తం హాయిగా చూసే సినిమా అని ఓ మార్కు ఉంది. ఈసారి కూడా అదే ట్రాక్‌లో నడిచాడు నాని. ప్రథమార్ధం నాని-కీర్తి సురేష్‌ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలతో సరదా సరదాగా గడిచిపోతుంది. ఇక నాని తల్లిదండ్రుల పాత్రలను పోసాని కృష్ణమురళి, ఈశ్వరిరావు పోషించారు. ఈ ముగ్గురి మధ్య వచ్చే సన్నివేశాలూ కడుపుబ్బా నవ్విస్తాయి. కీర్తి సురేష్‌ తన అందాలతో మరోసారి అలరించింది. సిద్ధార్థ వర్మ పాత్ర ప్రవేశంతో సరదాగా సాగే కథ ఓ కీలక మలుపు తీసుకుంటుంది. విరామానంతరం వచ్చే సన్నివేశాలు అన్నీ సిదార్థ వర్మ, బాబు నేపథ్యంలో సాగుతాయి. కీర్తిని ప్రేమించిన ఇద్దరూ వాళ్ల మనసుల్లో ప్రేమను ఎలా బయట పెట్టారు? కీర్తి ఎవరిపై ఎలా మొగ్గు చూపుతుంది అనే విషయాలు ఆకట్టుకునేలా సాగిపోతాయి. అయితే ఎవరి ప్రేమలో ఎంత బలముందో నిరూపించాల్సిన సమయంలో సిద్థార్థ వర్మ ప్రయత్నాలు పెద్ద ఎత్తున సాగగా, బాబు ‘నేనేం చేయను’ అంటూ చెప్పే సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి. కథ ఎంతకీ ముందుకు సాగకపోవడంతో ప్రేక్షకుడిని ఒకింత అసహనానికి గురిచేస్తాయి. మళ్లీ పతాక సన్నివేశాల రాకతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ద్వితీయార్ధం నుంచి ముక్కోణపు ప్రేమ కథలా ఒక అమ్మాయి.. ఇద్దరు అబ్బాయిల మధ్య సాగేపోయేలా సన్నివేశాలు ఉన్నాయి. చివరిలో కూడా ఓ కీలకమైన మలుపు ఉండటంతో కథ రక్తి కట్టిస్తుంది. కథ కొత్తది కాకపోయినా కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం తెరపై కనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే: నాని తన నటనతో వన్‌మ్యాన్‌ షోలా ఆకట్టుకున్నాడు. సంభాషణలు పలికే సమయంలో తనకున్న ఈజీనెస్‌ను మరోసారి ప్రదర్శించాడు. ప్రతీ సన్నివేశంలోనూ సంభాషణలు పలికే విధానంలోనూ రజనీకాంత్‌ను అనుసరించినట్టు స్పష్టంగా అర్థమవుతుంటుంది. ఇదో ప్రేమ కథ అయినా మాస్‌ అంశాలు ఉండటంతో నాని రజనీని అనుసరించే ప్రయత్నం చేశాడు. కీర్తి అందంగా కన్పించింది. ఆమెకు నటనా ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించింది. సిద్ధార్థ వర్మగా నవీన్‌చంద్ర ద్వితీయార్థంలో కనిపిస్తాడు. అతనికీ మంచి పాత్రే దక్కింది. సాంకేతికంగా మంచి మార్కులు పడతాయి. ప్రసన్నకుమార్‌ మాటలు, త్రినాథరావు దర్శకత్వం వారి వారి శైలిలో సాగుతాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చింది. పాటలన్నీ అలరిస్తాయి. ‘దిల్‌’రాజు నిర్మాణ విలువలు అడుగడుగునా కనిపిస్తాయి.
చివరిగా: ‘లోకల్‌’ కుర్రాడి ప్రేమకథ