Friday, February 10, 2017

ఓం నమో వేంకటేశాయ


మర్షియల్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తూ వచ్చిన కె.రాఘవేంద్రరావు తనలోని మరో కోణాన్ని చూపిస్తూ భక్తి ప్రధానమైన చిత్రాల్ని తెరకెక్కిస్తున్నారు. వాటిలోనూ తనదైన మార్క్‌ని చూపిస్తూ ఆబాల గోపాలాన్ని అలరిస్తున్నారు. అందులో భాగంగా రూపుదిద్దుకొన్న చిత్రమే ‘ఓం నమో వేంకటేశాయ’. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడిసాయి’ చిత్రాల తర్వాత రాఘవేంద్రరావు-నాగార్జున కలయికలో వస్తున్న చిత్రమిది. వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన హథీరాం బాబాజీ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాను తీస్తే రాఘవేంద్రరావే తీయాలి.. చేస్తే నాగార్జునే చేయాలి అన్నట్టుగా ఆ ఇద్దరూ భక్తి ప్రధానమైన చిత్రాలపై ఓ ప్రత్యేకమైన ముద్రవేశారు. అందుకే ‘ఓం నమో వేంకటేశాయ’కి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే అంచనాలు షురూ అయ్యాయి. మరి ఆ మేజిక్‌ మరోసారి తెరపై కనిపించిందా? శ్రీవారి భక్తుడు ‘అన్నమయ్య’గా ఒదిగిపోయిన నాగార్జున, హథీరాం బాబాగా ఎలా నటించాడు.. లాంటి ప్రశ్నలకు సమాధానాలు..
కథేంటంటే?: దేవుడిని చూసే విద్య నేర్చుకోవాలంటూ బాల్యంలోనే ఇంటి నుంచి బయటకొస్తాడు రామ(నాగార్జున). వేద పాఠశాలలో విద్యనభ్యసిస్తూ గురువు(సాయికుమార్‌) చెప్పిన మాటతో తపస్సుకు పూనుకుంటాడు. ఆ తర్వాత తిరుమల చేరతాడు. కానీ స్వామి దర్శనం మాత్రం కాదు. దేవుడ్నే చూడాలంటూ అన్న, పానీయాలు లేకుండా అయిదురోజుల పాటు గుడిముందే కూర్చుంటాడు. స్వామికోసమే ఈ జీవితం అంటూ సదా ఆయన ఆరాధనలో మునిగి తేలుతుంటాడు. అలాంటి పరమ భక్తుడికి స్వామి దర్శన భాగ్యం కలిగిందా? లేదా? తిరుమలలో ఆలయ అధికారి గోవిందరాజులు(రావు రమేష్‌) రామపై ఎందుకు కక్ష కట్టాడు? రామను పరీక్షించేందుకు స్వామి ఏం చేశాడు? ఆ ప్రయత్నంలో రామ జీవితంలో ఎదురైన అనుభవాలు ఎలాంటివి? ఆయన్ని మనువాడాలనుకొన్న భవానీ (ప్రగ్యాజైస్వాల్‌) కథేంటి? రామ కోసం ఆమె చేసిన త్యాగం ఎలాంటిది? శ్రీవారికి మరో భక్తురాలైన కృష్ణమ్మ(అనుష్క)కి రామకి మధ్య సంబంధం ఏమిటి? రామ.. హథీరాం బాబాగా ఎలా మారాడు? తదితర విషయాల్ని తెలుసుకోవాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.

  ఎలా ఉందంటే: భక్తికున్న శక్తితో వేంకటేశ్వరస్వామిని మురిపించిన మరో పరమ భక్తుడు హథీరాం బాబా కథ ఇది. బాల్యంలోనే స్వామిని ప్రత్యక్షంగా చూడాలంటూ బయటకొచ్చిన హథీరాం తిరుమలను కలియుగ వైకుంఠంగా మార్చడంలో కృషి ఎలాంటిది? స్వామి వారి చేతుల మీదుగానే సజీవ సమాధి ఎలా అయ్యాడు? తదితర విషయాలతో ఈ చిత్రం సాగుతుంది. వేంకటాచల స్థలపురాణం, హథీరాంబాబా, కృష్ణమ్మల భక్తి నేపథ్యంలో తొలిసగ భాగం సాగుతుంది. భక్తులపై జరుగుతున్న దోపిడీని అడ్డుకుంటూ తిరుమలను పరమ పవిత్రంగా ఉంచేందుకు హథీరాం బాబా ప్రయత్నించడం, స్వామి భక్తులకు పుణ్య క్షేత్రం విశిష్టతను చాటిచెప్పడం తదితర సన్నివేశాలతో చిత్రం సాగుతుంది. అధికారి గోవిందరాజులు, ఆయన బృందం చేసే అరాచకాలను అడ్డుకుంటూ హథీరాం బాబా స్వామి సేవలో పునీతమయ్యే తీరును తెరపై కళ్లకు కట్టారు.
ఎవరెలా: ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’లా భక్తుల పాత్రలో ఒదిగిపోయిన నాగార్జున హథీరాం బాబాగా నటించి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సౌరభ్‌జైన్‌ వేంకటేశ్వరుడిగా చక్కగా నటించాడు. కృష్ణమ్మగా అనుష్క పాత్ర చాలా కీలకం. పతాక సన్నివేశాల వరకూ ఆమె తెరపై కనిపిస్తూనే ఉంటుంది. వేంకటేశ్వరస్వామి భక్తురాలిగా పవిత్రత ఉట్టిపడేలా తెరపై కన్పించింది. నాగార్జున కూడా పాత్రలో లీనమై నటించారు. పతాక సన్నివేశాల్లో ఆయన నటన మరోస్థాయికి చేరిందనే చెప్పాలి. జగపతిబాబు, ప్రగ్యాజైస్వాల్‌లాంటి నటులు తెరపై కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. రావురమేష్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌ తదితర పాత్రలు వినోదాన్ని పంచుతాయి.
సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. ఎస్‌.గోపాల్‌రెడ్డి కెమెరా పనితనం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. ముఖ్యంగా శేషగిరులను చూపించిన విధానం, ప్రతీ సన్నివేశం వర్ణ రంజితంగా ఉంటుంది. కీరవాణి సంగీతం కథకు ప్రాణం పోసింది. చాలా వరకూ కథ పాటల రూపంలోనే చెప్పారు. ఆ సమయంలో కీరవాణి అందించిన స్వరాలు కీలక పాత్ర పోషించాయి. నేపథ్య సంగీతం కథను మరింత గుండెకు హత్తుకునేలా మార్చింది. కిరణ్‌కుమార్‌ కళా ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. దర్శకుడిగా కె.రాఘవేంద్రరావు మరోసారి తనదైన మేజిక్‌ను ప్రదర్శించారు. నాగార్జున-ప్రగ్యాజైస్వాల్‌, జగపతిబాబు-అనుష్కలపై తెరకెక్కించిన సన్నివేశాలు భక్తిరస చిత్రంలోనూ కె. రాఘవేంద్రరావు మార్కు కమర్షియల్‌ ఛాయలు స్పష్టంగా కనిపించేలా చేస్తాయి. మిగిలిన చోట్ల కూడా పండ్లు, దీపాలు, పుష్పాలతో తెరను వర్ణ శోభితం చేశారు. కథను చెప్పిన విధానం కూడా చాలా బాగుంది. హథీరాం, కృష్ణమ్మల జీవితాలతో పాటు ఆలయ స్థలపురాణం, వరాహమూర్తి దర్శనం, స్వామివారికి చేసే సేవల విశిష్టతలను సినిమాలో చూపించిన విధానం తెలియని వారికి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది.
 
 

No comments:

Post a Comment