Thursday, November 10, 2016

శతకాలే శభాష్ అనేలా..


ఇంగ్లండ్ ఆటగాళ్లు సింహనాదం చేశారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు ఆటగాళ్లు శతకాల మోత మోగించారు. తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న రాజ్ కోట్ స్టేడియం దద్దరిల్లేలా భారత్ పని పట్టారు. తొలి రోజు పూర్తి ఆధిపత్యం కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు.. రెండో రోజు కూడా అదే ఊపును ప్రదర్శించి శతకాలతో శభాష్ అనిపించింది.
జో రూట్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ లు శతకాలు సాధించి భారత్ బౌలింగ్ ను తీవ్రంగా గాయపరిచారు. బుధవారం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టులో జో రూట్(124) సెంచరీ చేయగా, ఈ రోజు ఆట ఆరంభంలో మొయిన్ అలీ(117) శతకం పూర్తి చేశాడు. ఆ తరువాత మిడిల్ ఆర్డర్ ఆటగాడు బెన్ స్టోక్స్ మరో శతకం సాధించడంతో  ఇంగ్లండ్ భారీ స్కోరు నమోదు చేసింది.
311/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ జట్టులో మొయిన్ అలీ(117) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం బెన్ స్టోక్స్-బెయిర్ స్టోల జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను తీసుకుంది. ఈ జోడి ఆరో వికెట్ కు 99 పరుగులు జోడించిన తరువాత బెయిర్ స్టో(46)అవుటయ్యాడు. దాంతో లంచ్ సమయానికి ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసింది. ఆపై ఇంగ్లండ్ ఆటగాడు వోక్స్(4)కూడా తొందరగా అవుట్ కావడంతో భారత్ శిబిరంలో కాస్త ఆనందం చోటు చేసుకుంది.

 అయితే భారత్ ఆనందానికి బెన్ స్టోక్స్ (128)చెక్ పెట్టాడు. ఒక క్లాసికల్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించాడు. దాంతో ఇంగ్లండ్ సునాయాసంగా 500 పరుగుల మార్కును చేరుకుంది. టెయిలెండర్ అన్సారీ(37) ఫర్వాలేదనించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో  537 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా, భారత్ లో సిరీస్ లో ఒక ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్ లో మూడు శతకాలు నమోదు చేయడం 2009 తరువాత ఇదే తొలిసారి. 2009లో మోతేరాలో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో శ్రీలంక మూడు శతకాలు సాధించింది.

Wednesday, November 9, 2016

రూ.2వేల నోటులో అది లేదట!


 
రూ.500, రూ.1000 నోట్ల స్థానంలో కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. మరింత భద్రతతో కూడిన నోట్లను ఆర్‌బీఐ మార్కెట్లోకి విడుదల చేస్తుంది. కొత్తగా రానున్న రూ.500 నోటు పాత రూ.500 నోటుకు పూర్తి భిన్నంగా ఉంటుందని, దీంతో పాటు రూ.2000 నోటుకు 17 ప్రధాన లక్షణాలు ఉన్నాయి.
కొత్త రూ.500నోటు గురించి ఆసక్తికర విషయాలు.
* మహాత్మాగాంధీ కొత్త నోట్లగా పిలిచే వీటిపై నంబర్‌ ప్యానెల్స్‌ మధ్యలో ‘ఈ’ లెటర్‌ ఉంటుంది.
* కొత్త నోట్లపై 2016 ముద్రణ, ఆర్‌బీఐ గవర్నర్‌ డా.ఉర్జిత్‌ ఆర్‌ పటేల్‌ సంతకం, స్వచ్ఛభారత్‌ లోగో ముద్రించబడి ఉంటుంది.
* నోటు వెనుక భాగంలో చారిత్రక కట్టమైన ఎర్రకోట, దానిపై జాతీయ జెండా ఉంది.
* 66మి.మి×150మి.మి పరిమాణం, బూడిద రంగు వర్ణంలో కొత్త నోట్లు ఉండనున్నాయి.
* కంటిచూపు లేని వారు సునాయాసంగా గుర్తుపట్టే విధంగా ప్రత్యేక గుర్తులను పెట్టారు. గాంధీ ముఖచిత్రం, అశోక చిహ్నం, ఐదు బ్లీడ్‌ లైన్స్‌, చేతికి తగిలే విధంగా ఉండే చిన్న సర్కిల్‌ నోటుకు కుడివైపు ఉంటాయి.
కొత్త రూ.2000 నోటు విషయాలు
* 2000 సంఖ్యారూపంతో పాటు.. దేవనాగరి లిపిలో 2000 సంఖ్య
* నోటుకు మధ్యలో మహాత్ముడి ముఖచిత్రం
* ఎడమవైపు ఆర్‌బీఐ, 2000 చిన్న అక్షరాలు
* నోటు మధ్యలో ఉండే ఆర్‌బీఐ మార్కు థ్రెడ్‌ రంగు ఆకుపచ్చ బదులుగా నీలం రంగు.
* కుడివైపు అశోక చిహ్నం.. మహాత్మాగాంధీ ముఖచిత్రంతో పాటు 2000 ఎలక్ట్రోటైప్‌ వాటర్‌మార్క్‌.
* నోటుకు కుడి, ఎడమ వైపు ఉండే బ్లీడ్‌ లైన్స్‌ ఏడు ఉంటాయి.
* వెనుక భాగంలో స్వచ్ఛభారత్‌ లోగో
* భారత్‌ ప్రయోగించిన అంగారక ఉపగ్రహం మంగళయాన్‌ చిహ్నం
* దేవనాగరి లిపిలో 2000 సంఖ్య
ఈనెల 11వ తేదీ నుంచి అన్ని ఏటీఎంలలో కొత్త నోట్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి కార్యదర్శి అశోక్‌ లవాస ప్రకటించారు. నల్లధనాన్ని నిరోధించేందుకు పెద్ద నోట్ల చలామణీని రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నారు. కొత్తగా వచ్చే రూ.2000నోట్లలో నానో జీపీఎస్‌ సిస్టమ్‌ను అమర్చనున్నట్లు వస్తున్న వార్తలపై ఆర్‌బీఐ స్పందించింది. కొత్త నోట్లపై నానో జీపీఎస్‌ సిస్టమ్‌ పెడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని వాటిని నమ్మవద్దని ప్రకటించింది.

Tuesday, November 8, 2016

అతడి సంపాదన.. వారానికి రూ. 3 కోట్లు!

  స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో పేరు చెబితే చాలు.. సాకర్ అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతారు. అలాంటి రొనాల్డోకు ఇప్పుడు బంపర్ ఆఫర్ తగిలింది. రియల్ మాడ్రిడ్ క్లబ్‌తో అతడికి ఐదేళ్ల కాంట్రాక్టు కుదిరింది. మరో పదేళ్ల పాటు తాను ఆడుతూనే ఉంటానని ఒప్పందం సందర్భంగా అతడు చెప్పాడు. దీని ప్రకారం అతడికి అక్కడ వారానికి దాదాపు రూ. 3 కోట్లకు పైగా చెల్లిస్తారు. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రొనాల్డో నిలిచిపోతాడు. తన జీవితంలో మిగిలిన కాలమంతా తాను ఆటను ఎంజాయ్ చేస్తూనే ఉంటానని.. మరో పదేళ్ల పాటు ఆడతానని స్పష్టం చేశాడు. ఈ కాంట్రాక్టుతో.. సంపాదన విషయంలో బార్సిలోనా ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ కంటే అగ్రస్థానంలోకి రొనాల్డో దూసుకెళ్లాడు. 
 
'వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' టైటిల్‌ను ఇప్పటికి మూడుసార్లు గెలుచుకున్న రొనాల్డో.. ఈ ఏడాది కూడా చాలా విజయాలు సాధించాడు. అతడి పెనాల్టీ షూటవుట్ షాట్‌తో మాడ్రిడ్ 11వ సారి చాంపియన్స్ లీగ్‌ను గెలుచుకుంది. అంతకుముందు యూరో 2016ను పోర్చుగల్ గెలుచుకోవడంలో కూడా రొనాల్డోదే కీలక పాత్ర. ఇటీవలి కాలంలో రియల్ మాడ్రిడ్ కాంట్రాక్టులను పునరుద్ధరించుకున్నవాళ్లలో రొనాల్డో లేటెస్ట్ స్టార్ అయ్యాడు. అతడి కంటే ముందు  గరెత్ బేల్, లుకా మాడ్రిక్, టోనీ క్రూస్ కూడా మంచి ఆకర్షణీయమైన కాంట్రాక్టులే పొందినట్లు సమాచారం.
 
రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ నుంచి మాడ్రిడ్‌కు మారిన తర్వాత 8 సీజన్లలో 360 గేమ్స్ ఆడి 371 గోల్స్ సాధించాడు. ఈ క్లబ్‌లో ఇంతవరకు ఎవరూ చేయనన్ని గోల్స్ చేయడంతో 2009లోనే రికార్డు స్థాయి ఫీజు పొందాడు. ఇక ముందు ఎవరు ఏం చెప్పాలన్నా.. రొనాల్డో కంటే ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుందని మాడ్రిడ్ ప్రెసిడెంట్ ఫ్లోరెంటినో పెరెజ్ వ్యాఖ్యానించారు. రొనాల్డోను ప్రశంసల్లో ముంచెత్తారు.

Sunday, November 6, 2016

ఇది జూనియర్‌ అక్కినేని ‘ఫ్యామిలీ’

 అక్కినేని నాగార్జున కుమారులు అఖిల్‌, నాగచైతన్య త్వరలో ఓ ఇంటివారు కాబోతున్న సంగతి తెలిసిందే. అక్కినేని అఖిల్‌.. ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రియ భూపాల్‌ని, అక్కినేని నాగచైతన్య.. సమంతని వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటివరకు ఈ కాబోయే జంటలు విడివిడిగా దిగిన ఫొటోలే సోషల్‌మీడియాలో కనిపించాయి కానీ తొలిసారి నలుగురూ కలసి ఒకే ఫొటో దిగారు. సమంత, నాగచైతన్య, అఖిల్‌, శ్రియలు కలిసి దిగిన ఫొటోని సమంత ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఫ్యామిలీ’ అని హ్యాష్‌టాగ్‌ ఇచ్చింది. అఖిల్‌, శ్రియల వివాహం ఇటలీలో జరగబోతున్నట్లు సమాచారం. సమంత, నాగచైతన్యలు వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నారు.

Saturday, November 5, 2016

రానే వచ్చింది ఆ రోజు

 అల్లు అర్జున్‌ రంగంలోకి దిగాడు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘డీజే... దువ్వాడ జగన్నాథమ్‌’ కోసం శుక్రవారమే సెట్లోకి అడుగుపెట్టాడు. ఈ రోజు కోసం ఎదురు చూశానని... సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సెట్లోకి అడుగుపెట్టడం బాగుందని అల్లు అర్జున్‌ ట్విట్టర్‌లో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘సరైనోడు’ తర్వాత బన్నీ కెమెరా ముందుకు రాలేదు. కుటుంబంతో గడుపుతూ, కొత్త కథల్ని వింటూ గడిపారు. కొంత కాలం కిందటే ‘డీజే’కి పచ్చజెండా వూపారు. అల్లు అర్జున్‌, పూజ హెగ్డే జంటగా దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. అయితే అల్లు అర్జున్‌పై శుక్రవారం నుంచి చిత్రీకరణ మొదలుపెట్టారు. ఈ సినిమాలోని పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా సన్నద్ధమైనట్టు తెలిసింది. రెండు కోణాల్లో సాగే ఆ పాత్ర కోసం శారీరకంగా కసరత్తులు చేయడంతోపాటు, హావభావాల విషయంలోనూ ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నట్టు తెలిసింది. ‘‘ఆర్య’ చూసినప్పట్నుంచి అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనేది నా కల. ఆ రోజు వచ్చింది’’ అని హరీష్‌ శంకర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Friday, November 4, 2016

లంబు పెళ్లి వచ్చే నెల 9న

 టీమ్‌ఇండియా పేసర్‌ ఇషాంత్‌శర్మ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి ప్రతిమసింగ్‌ను డిసెంబర్‌ 9న పెళ్లి చేసుకోబోతున్నాడు. జూన్‌ 19న ఈ జోడీకి నిశ్చితార్థం జరిగింది. వారణాసికి చెందిన ప్రతిమ.. పలు అంతర్జాతీయ టోర్నీలతో పాటు ఆసియాకప్‌లోనూ భారత బాస్కెట్‌బాల్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ‘సింగ్‌ సిస్టర్స్‌’గా పేరు సంపాదించిన ఐదుగురు అక్కాచెల్లెళ్లలో ప్రతిమ చిన్నది. ఆమె అక్కలందరూ జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణులే.

Thursday, November 3, 2016

ఇటలీలో పెళ్లి.. అతిథులెందరంటే..


  సినీ నటుడు అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రియాభూపాల్‌ల నిశ్చితార్థం డిసెంబరు 9న జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగార్జున ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించే పనిలో ఉన్నారు. అయితే వీరి వివాహాన్ని విదేశంలో నిర్వహించాలని, ఇటలీ అయితే బావుంటుందని కుటుంబ సభ్యులు అనుకుంటున్నట్లు సమాచారం. ఘనంగా జరగనున్న ఈ వివాహ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 600 మంది అతిథులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య, సమంతల వివాహం వచ్చే ఏడాది జరగనున్నట్లు నాగార్జున ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అఖిల్‌ ‘అఖిల్‌’ చిత్రం తర్వాత విక్రమ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటించనున్నారు.

Wednesday, November 2, 2016

విడిపోవడంపై ఇప్పుడేం చెప్పను

  గౌతమితో విడిపోవడం విషయంపై ఇప్పట్లో తానేం చెప్పబోనని నటుడు కమల్‌ హాసన్‌ ప్రకటించారు. గౌతమి ప్రకటనపై కమల్‌ స్పందించి ప్రకటన విడుదల చేశారని వార్తలు వచ్చాయి. అయితే తాను ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదని కమల్‌హాసన్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తాజాగా స్పష్టం చేశారు. ‘ఇలాంటి సమయంలో.. కొందరు నా పేరుతో నకిలీ ప్రకటనను ప్రచారం చేస్తున్నారు. అది అనాగరిక చర్య, అసంబద్ధమైనది. ఇప్పట్లో నేను ఏ ప్రకటనను జారీ చేయడం లేదు’ అని కమల్‌హాసన్‌ తమిళంలో ట్వీట్‌ చేశారు.
విడిపోవడానికి కారణం అదేనా?
కమల్‌హాసన్‌, నటి గౌతమి తమ 13 ఏళ్లసహజీవన బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. కమల్‌హాసన్‌తో విడిపోతున్నట్లు మంగళవారం సోషల్‌మీడియా ద్వారా చెప్పిన గౌతమి అందుకు కారణం చెప్పలేదు. అయితే ఇటీవల ‘శభాష్‌నాయుడు’ చిత్రం షూటింగ్‌ సమయంలో కమల్‌హాసన్‌ కుమార్తె శ్రుతిహాసన్‌, గౌతమిల మధ్య విబేధాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా శ్రుతిహాసన్‌ వస్త్రధారణ తదితర విషయాల్లో గౌతమి కల్పించుకోవడం ఆమెకు నచ్చలేదని, ఈ విషయంలో కమల్‌ తన కుమార్తె వైపు నిలిచారని సమాచారం. కమల్‌, గౌతమి విడిపోవడానికి ఇదో కారణం అని కొన్ని పత్రికలు రాశాయి. అయితే అలాంటిదేం లేదని శ్రుతి అధికార ప్రతినిధి తాజాగా ప్రకటించారు. ఆమె ఇతరుల వ్యక్తిగతవిషయాల్లో జోక్యం చేసుకోరని స్పష్టంచేశారు.
అయితే మరో కారణం కూడా వీరిద్దరు వేరుకావడానికి దారితీసిందని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. కమల్‌హాసన్‌ కాలికి కొన్నాళ్ల క్రితం ప్రమాదవశాత్తు గాయమైంది. ఈ విషయాన్ని కమల్‌హాసన్‌ కుమార్తెలు శ్రుతిహాసన్‌, అక్షరా హాసన్‌లకు గౌతమి వెంటనే తెలియజేయలేదట. దీంతో ఇద్దరు కుమార్తెలకు, గౌతమికి మధ్య మాటామాటా పెరిగిందని, ఆ సంఘటనే గౌతమి నిర్ణయానికి కారణమని వార్తలు వస్తున్నాయి.