Tuesday, October 18, 2016

ఒక్క హిట్టులేక డబ్బులన్నీ పొగొట్టుకున్నా!

 ఇటీవలికాలంలో ఒక్క హిట్టు సినిమా కూడా లేదు. బాక్సాఫీస్‌ వద్ద నేను ఎంతో డబ్బు పోగొట్టుకున్నా. ఈ సినిమా హిట్‌ అయితే.. జైలు నుంచి విడుదలైన భావన కలుగుతుంది. కొంచెం ఉపశమనంతో, ప్రశాంతతతో రాబోయే సినిమాల్లో పనిచేస్తా.. ఇది బాలీవుడ్‌ రణ్‌బీర్‌ కపూర్‌ ఆవేదన. ఒకప్పుడు వరుస విజయాలతో ఖాన్‌ త్రయంతో తర్వాత ఆ స్థాయి బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌గా రణ్‌బీర్‌ ఎదుగుతాడని అందరూ భావించారు. కానీ ఊహించనిరీతిలో ఎదురైన వరుస పరాజయాలు రణ్‌బీర్‌ కెరీర్‌ను తీవ్రంగా కుంగదీశాయి.
ఈ నేపథ్యంలో తన తాజా సినిమా ‘యే దిల్‌ హై ముష్కిల్‌’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పాకిస్థాన్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ ఉండటంతో విడుదల కోసం అనేక చిక్కులు ఎదుర్కొంటున్నది. దీపావళి కానుకగా మరో పది రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమాపై కొన్ని థియేటర్ల సంఘాలు నిషేధం విధించాయి.

ఈ పరిణామాలు ఇలా ఉండగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన రణ్‌బీర్‌ ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ హిట్‌ కోసం తానెంత ఆశగా ఎదురుచూస్తున్నాడో తెలిపాడు. ‘నా గత సినిమాకు ఈ సినిమాకు మధ్య చాలా గ్యాప్‌ వచ్చింది. నా చివరి సినిమా ’తమాషా’ గత ఏడాది నవంబర్‌లో విడుదల కాగా.. ఇప్పుడు తాజా సినిమా వస్తోంది. నా సినిమాలు బాగా ఆడటం లేదన్న అభిప్రాయం కారణంగా ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ విషయంలో ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటున్నా. నేను బాక్సాఫీస్‌ వద్ద ఎంతో డబ్బు పోగొట్టుకున్నా. ఒక హిట్టు వస్తే నాకు ఉపశమనం లభిస్తుంది. జైలు నుంచి విడుదలైన భావన కలుగుతుంది. ప్రశాంతంగా రాబోయే సినిమాల కోసం పనిచేస్తా’ అని రణ్‌బీర్‌ వివరించాడు. కాగా, ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఐశ్యర్యరాయ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ సాన్నిహిత్యంగా ఉన్న హాట్‌హాట్‌ ఫొటోలను విడుదల చేశారు.

'శ్రీమంతుడు'కి మరో రికార్డ్

 టాలీవుడ్ ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డ్ లన్నింటిని తిరగరాసిన సూపర్ హిట్ సినిమా శ్రీమంతుడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయం నమోదు చేసింది. మహేష్ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అతి పెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిన ఈసినిమా ఇప్పటికీ తన రికార్డ్ ల హవా కొనసాగిస్తూనే ఉంది.

తాజాగా శ్రీమంతుడు ఆడియో యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన శ్రీమంతుడు ఆడియో సాంగ్స్ ను అదే కంపెనీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లోనూ రిలీజ్ చేసింది. దాదాపు ఏడాదిన్నర క్రితం రిలీజ్ అయిన ఈ పాటలను ఇప్పటి వరకు 80 లక్షల మందిపైగా వినటంతో అరుదైన రికార్డ్ శ్రీమంతుడు సొంతమయ్యింది. ఈ విజయం పై ఆదిత్య మ్యూజిక్ కంపెనీతో పాటు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.

Monday, October 17, 2016

విరాట్ కోహ్లీ గాళ్ ఫ్రెండ్ ఎవరు?


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గాళ్ ఫ్రెండ్ ఎవరు? (ఎ) ప్రియాంక చోప్రా (బి) అనుష్క శర్మ (సి) దీపికా పదుకోన్ (డి) తెలియదు. ఇంతకీ ఈ ప్రశ్న ఏంటని వింతగా ఉందా? మహారాష్ట్రలోని భివండి హైస్కూల్ ఉపాధ్యాయుల లీల ఇది.
తొమ్మిదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన పీటీ పరీక్ష ప్రశ్నాపత్రంలో ఈ ప్రశ్న ఉంది. ఇది చూసి విద్యార్థులు షాకయ్యారు. ఈ విషయం స్థానిక మీడియాలో రావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. విరాట్ కోహ్లీ గాళ్ ఫ్రెండ్ ఎవరయితే విద్యార్థులకు ఏంటి? ఇది కోహ్లీ వ్యక్తిగత విషయం.. ఫిజికల్ ట్రైనింగ్ పరీక్షకు, ఈ ప్రశ్నకు ఏమైనా సంబంధముందా? అంటూ విమర్శలు గుప్పించారు. విరాట్ నటి అనుష్క శర్మతో డేటింగ్ చేస్తుండటం ఆయన వ్యక్తిగత విషయం.. ఈ విషయాన్ని పరీక్షల్లో ఎలా అడుగుతారని మండిపడ్డారు.

గత నెలలో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. బాలీవుడ్ నటి దీపిక పదుకోన్ కు సంబంధించిన ప్రశ్న పరీక్షలో రావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తమిళనాడులో కూడా ఇంజనీరింగ్ విద్యార్థులకు సినిమా తెలివితేటలను పరీక్షించారు. వేలూరు ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ పరీక్షలో బాహుబలి సినిమాకు సంబంధించిన ప్రశ్న కనిపించింది. విద్యాశాఖ అధికారుల తీరు చూస్తుంటే మార్కుల కోసం పాఠ్యాంశాలతో పాటు క్రికెట్, సినిమాలు, ఎఫైర్ల గురించి తెలుసుకోవాలేమో అనే సందేహం విద్యార్థులకు రాకమానదు.

Sunday, October 16, 2016

అంతా అయిపోయాకా ఏం చేస్తాం?

 సినిమా విడుదలయ్యేంత వరకూ కష్టానికి తగిన ఫలితం వస్తుందా? హిట్‌ అవుతుందా, లేదా? అంటూ సవాలక్ష సందేహాలుంటాయి. విడుదలయ్యాక ఫలితం గురించి విశ్లేషణలూ ఉంటాయి. బాగా ఆడినా, ఆడకపోయినా కారణాలు అన్వేషించాల్సిందే. అయితే వీటి గురించి మరీ అతిగా ఆలోచించడం అనవసరం అంటోంది రాశీ ఖన్నా. ‘‘ఫలితంపై ఆరా అవసరమే. ఎందుకంటే ఎక్కడ తప్పు చేశామో ఓసారి పునః సమీక్షించుకొనే అవకాశం ఉంటుంది. అయితే మరీ వాటి గురించే ఎక్కువ ఆలోచించకూడదు. అంతా అయిపోయాక తీరిగ్గా కూర్చుని ఫలితాల్ని విశ్లేషించుకొంటూ బాధపడితే లాభం లేదు. కాలాన్ని వెనక్కి తిప్పి ఆ తప్పులు సరిదిద్దుకోలేం కూడా. అయ్యిందేదో అయిపోయింది. జరగాల్సిన విషయం ఆలోచించాలి. ఈ విషయంలో నా ఆలోచనలు అలానే ఉంటాయి. నిన్నటి గురించి, రేపటి గురించీ అతిగా ఆలోచించడం వల్ల ఒరిగేదేం ఉండదు. ప్రస్తుతం చేస్తున్న పనిపై కూడా మనసు లగ్నం చేయలేం’’ అంది రాశీ ఖన్నా.

బంగారు నాణేలు.. తవ్వుకునేందుకు జనాల పోటీ!

 నది ఒడ్డున ఉన్న ఆ ప్రాంతంలో మైనింగ్‌ జరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ కొందరికి బంగారు నాణేలు దొరికియట. ప్రాచీనకాలంలో పాతిపెట్టిన గుప్తనిధికి సంబంధించిన ఆ బంగారు నాణెముల్లో రాజు లేదా దేవుడి ప్రతిమ, మహిళ, నెమలీ ప్రతిమలు ఉన్నాయని, అవి మాకు దొరికాయంటూ కొందరు వాట్సప్‌లో ఆ ఫొటోలు కూడా పెట్టారు. ఇంకేముంది ఆ నోటా ఈ నోటా ఈ వార్త దావాహనంలా పాకింది.
తెల్లారిలేచేసరికి స్థానిక గ్రామస్తులు అంతా ఆ నది ఒడ్డుకు వెళ్లి ఉత్త చేతులతో తవ్వడం మొదులుపెట్టారు. దీంతో ఆ నది ప్రాంతమంతా జాతరలా మారిపోయింది. ఎటుచూసినా ప్రజలు రోజుల తరబడి గుంతలు తవ్వుతూనే ఉన్నారు. బంగారు నాణెలు తమకు దొరకకపోతాయా అన్న ఆశతో గ్రామస్తులు తవ్వుతూనే ఉన్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని టాంక్‌ అనే మారుమూల గ్రామంలో జరిగింది. ఈ గ్రామ సమీపంలో ఉన్న నది ఒడ్డున బంగారు నాణేలు దొరుకుతున్నాయన్న వదంతులు వచ్చాయి. ఈ బంగారు నాణెలకు సంబంధించిన ఫొటోలు సైతం వాట్సాప్‌లో దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు జరిపారు. గ్రామస్తులందరినీ వాకబు చేసినా.. ఎవరూ తమకు బంగారు నాణెం దొరికిందని చెప్పలేదు. ఎవరో దుండగులు కావాలని వదంతులు రేపినట్టు గుర్తించిన పోలీసులు.. వాట్సాప్‌లో ఫొటోలు పెట్టిన నలుగురు వ్యక్తుల్ని అరెస్టుచేశారు. అయినా.. ఆ నది ఒడ్డున గత మూడు రోజులుగా గ్రామస్తులు తవ్వడం మాత్రం ఆపలేదు.

Saturday, October 15, 2016

సెట్లో పవన్‌కల్యాణ్‌ ఏంచేశారో తెలుసా?

 పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ని అభిమానులు విపరీతంగా ఆరాధిస్తుంటారు. అభిమానులే కాదు తోటి నటులూ ఆయనను అంతగానే ఇష్టపడతారు. తాజాగా నటుడు శివబాలాజీ పవన్‌ మంచితనం గురించి మరోసారి తెలియజేశారు. డాలీ దర్శకత్వంలో పవర్‌స్టార్‌ నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రంలో శివబాలాజీ పవన్‌ సోదరుడి పాత్రలో నటిస్తున్నారు. శుక్రవారం శివబాలాజీ పుట్టినరోజు. ఆరోజు సెట్‌లో ఏం జరిగిందో శివబాలాజీ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వివరించారు.
 
‘పవన్‌కల్యాణ్‌ గారు లొకేషన్‌కి వచ్చారు. వెంటనే లేచి గుడ్‌ మార్నింగ్‌ సర్‌ అన్నాను. ఆయన నన్ను పలకరిస్తున్నంతలోనే దర్శకులు డాలీ, పవన్‌కల్యాణ్‌ గారితో ఇవాళ శివ పుట్టినరోజు సర్‌ అని చెప్పారు. వెంటనే పవన్‌గారు నా భుజంమీద చెయ్యివేసి నీ కోసం ఏమన్నా చెయ్యాలోయ్‌ అని, ప్రొడక్షన్‌ అని పిలిచారు. వెంటనే ప్రొడక్షన్‌ చీఫ్‌ ఆయన ముందు హాజరు. నా కొక కేక్‌ కావాలి.. పెద్దదిగా ఉండాలి.. ఏం శివా బ్లాక్‌ ఫారెస్ట్‌ కేక్‌ నచ్చుతుందా? అన్నారు.. నేను అలాగే కళ్ళప్పగించి ఎస్‌ సర్‌ అన్నాను. కొద్దిసేపటిలో అన్నీ అమరిపోయాయ్‌. మధు(నా భార్య, నటి)ని పిలవచ్చా అని అడిగాను. పిల్లల్ని, ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా రమ్మనవోయ్‌ అన్నారు. పవన్‌ గారి మానవత్వానికి, ఆయన చేసే కొన్ని వేల సేవలలో.. నా పుట్టినరోజునాడు చేసింది చాలా చిన్నదై ఉండొచ్చు. కానీ అంతటి మహామనిషి నాకు ఇంత విలువనివ్వటం!!! విలువకట్టలేని, మాటలలో చెప్పలేని మహదానుభూతి. నా జీవితంలో ఈ పుట్టినరోజును మధురానుభూతిగా నిలిపిన దర్శకుడు డాలీ(కిషోర్‌కుమార్‌ పార్ధసాని)కి ధన్యవాదాలు’ అని శివబాలాజీ పోస్ట్‌ చేశారు. దీంతోపాటు కేక్‌ కట్‌ చేసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

Friday, October 14, 2016

ఆమె ‘బాహుబలి’లో నటించనందట!

 ‘బాహుబలి’ చిత్రం విడుదలై సంచలన విజయం సాధించి.. ప్రపంచ వ్యాప్తంగా భారత చిత్ర పరిశ్రమ ఖ్యాతిని చాటింది. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం కోసం దాదాపు అందరు నటీనటులు ఎదురుచూస్తుంటారు. అయితే ఈ చిత్రంలోని రమ్యకృష్ణ పాత్రలో నటించేందుకు శ్రీదేవి నిరాకరించిన సంగతి తెలిసిందే. కేవలం ఆమే కాదు మరో నటి కూడా ‘బాహుబలి’లో నటించేందుకు ఒప్పుకోలేదట. ఆమె ఎవరో కాదు బాలీవుడ్‌ కథానాయిక సోనమ్‌ కపూర్‌. ఇటీవల చాట్‌ షో కార్యక్రమంలో ‘బాహుబలి’ చిత్రంపై తన అభిప్రాయం గురించి అడిగిన ప్రశ్నకు సోనమ్‌ కపూర్‌ షాకింగ్‌ సమాధానం ఇచ్చారు.
‘ఆ సినిమా(బాహుబలి) చూడలేదు. నేను ఆ చిత్రం కథ విన్నాను, అందులో నటించే అవకాశం వచ్చింది. కథ అద్భుతంగా ఉంటుంది’ అని సోనమ్‌ అన్నారు. ఈ విషయాన్ని ఆమె బయటపెట్టగానే ఇంత చక్కటి అవకాశాన్ని సోనమ్‌ ఎందుకు వదులుకుంది? అని ఆశ్చర్యపోయారట. మరి ఏ కారణంగా ఈ అవకాశం వద్దనుకుందో, ఏ పాత్రలో తనను నటించమన్నారో సోనమ్‌ చెప్పలేదు.

దీపావళికి చూపిస్తారా?

 మహేష్‌బాబు, మురుగదాస్‌ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌సింగ్‌ కథానాయిక. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ దీపావళికి టీజర్‌ని విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం. డిసెంబరు నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. చెన్నైలోనూ కొంత మేర షూటింగ్‌ జరిగింది. ప్రస్తుతం చిత్రబృందం టైటిల్‌ వేటలో ఉంది. ‘వాస్కోడిగామా’, ‘ఎనిమీ’, ‘అభిమన్యుడు’ ఇలా చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇవేం కాదని చిత్రబృందం స్పష్టం చేసింది. తెలుగు, తమిళ భాషలు రెండింటికీ సరిపోయేలా టైటిల్‌ ఉండాలని మహేష్‌ భావిస్తున్నారట. దీపావళిలోగా టైటిల్‌ విషయంలోనూ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.