Sunday, October 2, 2016

బికినీకి సై


నటి లక్ష్మీమీనన్ మైండ్‌సెట్ మారిందా? తన సహ నటీమణులకంటే వెనుక పడ్డానని గ్రహించిందా? అవకాశాలను పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చిందా? తన తాజా మాటల్లో ఇలాంటి ప్రశ్నలు సాధారణ ప్రేక్షకుడికి కూడా తెలెత్తకపోవు. కొండవాసి యువతిగా కుంకీ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ కేరళాకుట్టి ఆ చిత్ర విజయం తన జీవితాన్నే మార్చేసింది. ఆ తరువాత వరుస అవకాశాలు. వాటిలో తొంబై శాతం విజయాలు వరించడంతో తమిళచిత్ర పరిశ్రమలో ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకుంది. అలాంటి సమయంలో ఆపేసిన చదువును పూర్తి చేయాలంటూ నటనకు చిన్న విరామం తీసుకుంది. అది తనపై పెద్ద ప్రభావాన్నే చూపించిందనే చెప్పాలి.

  అజిత్‌కు చెల్లెలిగా వేదాళం చిత్రంలో నటించింది. ఆ చిత్రం విజయం సాధించింది. లక్ష్మీమీనన్‌కు మంచి పేరే వచ్చింది. అయినా అవకాశాలు తగ్గాయి. దీంతో కోలీవుడ్‌లో చిత్రాలను తగ్గించుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని ఈ మలయాళీ భామను అడిగితే అలాంటిదేమీ లేదని బదులిచ్చింది. అయితే ఇకపై నటనపై అధిక శ్రద్ధ చూపాలని నిర్ణయించుకన్నట్లు పేర్కొంది. విజయ్‌సేతుపతికి జంటగా నటించిన రెక్క చిత్రం ఏడో తేదీన తెరపైకి రానుందని, ఇందులో గ్లామరస్ పాత్రను పోషించానని తెలిపింది. అదే విధంగా విజయ్‌సేతుపతితో కలిసి నటించడం వినూత్న అనుభవంగా పేర్కొంది.

 తదుపరి జీవాకు జంటగా నెంజముండు నేర్మైయుండు చిత్రంలో నటించనున్నానని చెప్పింది. గ్లామర్‌కు సిద్ధం అయ్యానంటున్నారు ఈత దుస్తులు ధరించి నటిస్తారా? అన్న ప్రశ్నకు తాను స్విమ్మింగ్‌లో శిక్షణ పొందుతున్న సమయంలోనే ఈత దుస్తులు ధరించి స్మిమ్ చేశానని, అలాంటిది సినిమాల్లో ఈత దుస్తుల్లో నటించడం ఒక లెక్కా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.తనకు ఇప్పటి వరకూ ఈత దుస్తుల్లో నటించే అవకాశం రాలేదని, అలాంటి సందర్భం వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పింది. అయితే నిజ జీవితంలో ఇప్పటి వరకూ బికినీ ధరింలేదని, అందువల్ల సినిమాల్లోనూ అలాంటి దుస్తులు ధరించనని తెలిపింది. విశేషం ఏమిటంటే ఇంతకు ముందు మోడరన్ దుస్తులు తన శరీరాకృతికి నప్పవు అని చెప్పుకొచ్చిన ఈ కేరళాకుట్టి ఇప్పుడు అలాంటి పాత్రలకు సిద్ధపడింది.రేపు బికినీ ధరించినా ఆశ్చర్యపడనక్కర్లేదు

Saturday, October 1, 2016

నాకు పెళ్లి కాదన్నారు!

 హీరోయిన్‌లు భలే అందంగా ఉంటారే.. పుట్టుకతోనే ఇంత అందంగా పుడతారేమో... శరీరాకృతి మొదలు ఆకర్షణీయమైన మేని ఛాయ...చక్కటి జుత్తు అన్నీ వందశాతం వాళ్లకే బాగుంటాయి.. నా ముఖం ఏం బాగాలేదు. మంచి రంగు లేను.. జుత్తు సరిగా పెరగడం లేదు... ఇలా అర్ధరాత్రి అద్దం ముందు కూర్చొని ఏడ్చే టీనేజ్‌ అమ్మాయిలు చాలామంది ఉంటారు. కథానాయికలు ఇందుకు మినహాయింపు కాదని బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ సోనమ్‌కపూర్‌ మాటలు వింటే అనిపిస్తుంది. సోనమ్‌ పేరు గ్లామర్‌ ప్రపంచంలో ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. టీనేజ్‌ అమ్మాయిగా ఉన్నప్పుడు సోనమ్‌కపూర్‌ కూడా తన రూపం గురించి చాలా బాధపడేదట. ‘‘చాలామంది అమ్మాయిలు ఉదయం నిద్రలేవగానే తమ ముఖాన్ని చూసుకొని హీరోయిన్లలా లేదని బాధపడుతుంటారు. నిద్రలేవగానే హీరోయిన్లు సాధారణ అమ్మాయిల్లానే ఉంటారు. దానికి నేనూ మినహాయింపు కాదు. టీనేజర్‌గా ఉన్నప్పుడు అబ్బాయిల కంటే పొడుగ్గా.. లావుగా ఉండేదాన్ని. దానికి తోడు నేను పెద్ద రంగు ఉండేదాన్ని కాదు. కుటుంబ వేడుకలకు వెళ్లినపుడు ఈ అమ్మాయికి పెళ్లి అవుతుందా? అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేముందు చాలా ఆలోచించాను. నన్ను నేను మార్చుకున్నాను. తిండిమీద పూర్తి నియంత్రణ తెచ్చుకున్నాను. అయినా తొలి చిత్రంలో వీపు కనిపించేలా ఓ డ్రెస్‌ వేసుకోవాలంటే చాలా భయపడ్డాను’’అని చెప్పింది సోనమ్‌. ‘‘నేను ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి బయట కాలుపెట్టాలంటే ఓ గంటన్నర పాటు మేకప్‌ ఛైర్‌కు అతుక్కుపోవాల్సిందే. ఒక్క నా మేకప్‌ కోసమే ఆరుగురు పనిచేస్తారు’’అని చెప్పింది సోనమ్‌.

నా లవ్ గురించి...ఎప్పుడో క్లూ ఇచ్చా!


సెలబ్రిటీల జీవితంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా వాళ్ల లవ్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటారు. ఈ మధ్యకాలంలో తెలుగు పరిశ్రమలో అలా ఆసక్తిగా నిలిచిన జంట నాగచైతన్య, సమంత. వీళ్లిద్దరూ లవ్‌లో పడ్డారనే వార్త వచ్చినప్పట్నుంచీ రకరకాల వార్తలు వస్తున్నాయి. ‘అవును.. మేం లవ్‌లో ఉన్నాం’ అని బహిరంగంగా చెప్పినా, ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పడలేదు. ‘పెళ్లెప్పుడు’ అనే చర్చ జరుగుతోంది. దానికి ఇంకా టైమ్ ఉందని చెప్పేశారు.

 ఆ సంగతలా ఉంచితే.. అసలు వీళ్లిద్దరూ ఎప్పుడు లవ్‌లో పడ్డారబ్బా? అనే చర్చ జరుగుతోంది. ఇదే విషయం గురించి ఓ తాజా ఇంటర్వ్యూలో సమంత కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. మొదట్లో మంచి స్నేహితుల్లా ఉండేవాళ్లమనీ, ఆ తర్వాత అది ప్రేమగా మారిందనీ సమంత పేర్కొన్నారు. ఎప్పుడు లవ్‌గా టర్న్ అయిందనే విషయం మాత్రం ఆమె స్పష్టంగా చెప్పలేదు.

 అయితే, ముందు నుంచీ నాగచైతన్యతో తన లవ్ గురించి క్లూ ఇస్తూ వచ్చానని, ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదనీ సమంత పేర్కొనడం విశేషం. ఆ విషయం గురించి సమంత మాట్లాడుతూ - ‘‘నా మొదటి సినిమా ‘ఏ మాయ చేసావె’ అప్పట్నుంచీ మా గురించి ‘హింట్’ ఇస్తూ వస్తున్నాను. కానీ, ఎవరూ ఆ విషయాన్ని గ్రహించలేదు.

 మొదట్లో నేను ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ‘మీతో కలసి యాక్ట్ చేసిన హీరోల గురించి వన్ వర్డ్‌లో చెప్పండి’ అని రిపోర్టర్లు అడిగితే, నాగచైతన్య గురించి చెప్పేటప్పుడు ‘ఫస్ట్ లవ్’ అనేదాన్ని. ఆ క్లూని ఎవరూ పట్టుకోలేకపోయారు. నా జీవితంలో నాగచైతన్య ముఖ్యమైన వ్యక్తి. ఇండస్ట్రీలో నా మొదటి స్నేహితుడు తనే. ఎప్పటికీ తను నాకు బెస్ట్ ఫ్రెండే. ఇండస్ట్రీలో ఒకటిగా ఎదిగాం. ఒకవేళ మేమిద్దరం కలసి ఉండలేకపోతే.. ఇక ఎవరితోనూ ఉండలేం అనిపించింది. దాంతో ఒక నిర్ణయానికి వచ్చేశాం’’ అని పేర్కొన్నారు.

Friday, September 30, 2016

రివ్యూ: ఎం.ఎస్‌.ధోనీ


 ధోనీ.. ఈ పేరు వింటే క్రికెట్‌ మైదానంలో పరుగుల వరద గుర్తొస్తుంది. బ్యాట్స్‌మెన్‌గా.. వికెట్‌ కీపర్‌గా.. టీమిండియా కెప్టెన్‌గా ఆయన తిరగ రాసిన రికార్డులు కళ్లముందు కదలాడతాయి. టీమిండియా కూల్‌ కెప్టెన్‌గా ధోనీకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి.. భారత క్రికెట్‌ గర్వించే ఆటగాడిగా ధోనీ సాధించిన ఘనత అందరికీ తెలుసు. కానీ.. ఇంత గొప్ప స్థాయికి చేరడానికి ధోనీ చేసిన ప్రయాణమెలాంటిదో.. అందులోని మలుపులేంటో అంతగా తెలియదు.
ఆ విషయాలన్నీ ‘ఎం.ఎస్‌.ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ చిత్రంలో చూడొచ్చని స్వయంగా ధోనీనే చెప్పారు. భారీ బడ్జెట్‌.. తెరపై రియల్‌ ధోనీలా హావభావాలు పండించేందుకు సుశాంత్‌సింగ్‌ చేసిన కసరత్తులు.. ప్రచార కార్యక్రమాల్లోనూ ధోనీ పాల్గొనడం ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాయి. మరి.. ఇన్ని అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటి?: ధోనీ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన అందరిలాంటి పిల్లాడు. ఫుట్‌బాల్‌.. బ్యాడ్మింటన్‌.. టెన్నిస్‌ ఆటలంటే ఆసక్తి. కానీ.. అతని గురువు (రాజేశ్‌శర్మ) ధోనిలో మంచి క్రికెటర్‌ దాగి ఉన్నాడని గుర్తించి ప్రోత్సహిస్తాడు. ధోని తండ్రి(అనుపమ్‌ ఖేర్‌)కి మాత్రం కుమారుడు క్రీడల్లో కంటే బాగా చదివి ఏదైనా ఉద్యోగం చేయాలని అనుకుంటాడు. అతని తల్లి.. సోదరి(భూమికా చావ్లా).. స్నేహితులు మాత్రం ధోనీని క్రీడల వైపు ప్రోత్సహిస్తారు. అయితే అతను విఫలమవుతూ.. తిరిగి ప్రయత్నాలు మొదలెడుతూ ఉంటాడు. మరి.. భారత్‌ తరఫున ఆడాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలాంటి అవరోధాలను అధిగమించాడు? అందుకోసం ఏం చేశాడు? రైల్వేలో ఉద్యోగం.. భారత క్రికెట్‌ టీంలో అవకాశం ఎలా వచ్చింది? ప్రేమ.. పెళ్లి వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
 ఎలా ఉందంటే?: ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన పిల్లాడు.. దేశం తరఫున క్రికెట్‌ ఆడాలనుకోవడం.. లక్ష్యాన్ని చేరుకునేందుకు పడిన కష్టాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు కాస్త తడబడినా ప్రేక్షకులను మెప్పించగలిగాడు. ప్రథమార్ధంలో ధోనీ బాల్యానికి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. స్కూలు.. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనటం.. రైల్వే ఉద్యోగంలో చేరి కొన్నాళ్లకు రాజీనామా చేయడం ఉంటుంది. ఇందులో కొత్తదనం లోపించినట్లు అనిపిస్తుంది.
ద్వితీయార్ధంలో ప్రియాంక (దిశా పటానీ)తో ప్రేమాయణం.. సాక్షితో పెళ్లి.. అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ విజయాలు ఉంటాయి. చిత్రంలో అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు సంబంధించిన ఫుటేజీలనే ఎక్కువగా చూపించారు.
చిత్రంలో ప్రధానంగా లోపించే అంశం.. కథ మొత్తం ధోనీ చుట్టూ తిప్పే ప్రయత్నంలో దర్శకుడు భారత క్రికెట్‌ దిగ్గజాలను పూర్తిగా పక్కన పెట్టేయటం పెద్ద కొరతగా చెప్పాలి. తెలియని విషయాల్ని చెబుతామని సినిమా ఉపశీర్షికలో చెప్పినా.. అలాంటివేమీ సినిమాలో కనిపించకపోవటంతో సగటు ప్రేక్షకుడు అసంతృప్తికి గురి అవుతాడు. ప్రియాంకతో ప్రేమాయణం తప్ప.. దాదాపు అందరికీ తెలిసిన ధోనీ విషయాలనే తెరపై చూపించారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల జోలికే వెళ్లలేదు. బెట్టింగుల లాంటి వివాదాస్పద అంశాలను ఎక్కడా టచ్‌ చేయలేదు.
బయోపిక్‌ అంటే.. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటేనే ఆ చిత్రం బాగా రూపుదిద్దుకుంటుంది. కానీ.. ఇందులో అది లోపించిన వైనం ఇట్టే అర్థమవుతుంది. దర్శకుడు నీరజ్‌ పాండే పూర్తిగా ధోనీ చెప్పినట్లుగానే నడుచుకున్నట్లు చిత్రం చూస్తుంటే అర్థమవుతోంది. సినిమాటోగ్రఫీ.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.
ఎవరెలా?: ధోని పాత్రలో సుశాంత్‌ సింగ్‌ జీవించాడు. రియల్‌ ధోనీలా హావభావాలు పలికించేందుకు అతను చేసిన కసరత్తు ఆకట్టుకోవటం ఖాయం. ధోనీ తొలి ప్రేయసి ప్రియాంక(దిశా పటానీ), రెండో ప్రేయసి.. భార్య సాక్షి(కైరా అడ్వాణీ)లను క్యూట్‌గా చూపించారు. ఇద్దరూ తమ పాత్రల్లో బాగానే మెప్పించారు. ధోనీకి తండ్రి పాత్రలో ‘అనుపమ్‌ఖేర్‌’ కనిపించరు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
 
చివరగా.. తెర మీదా తెలిసిన ‘ధోనీ’నే కనిపిస్తాడు. 

రివ్యూ: హైపర్‌


 కథేంటంటే?: నిజాయతీ గల ఓ ప్రభుత్వాధికారి నారాయణమూర్తి (సత్యరాజ్‌). ఆయన కొడుకే సూర్య (రామ్‌). తండ్రి అంటే సూర్యకి ప్రేమే కాదు తండ్రి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఓ బిల్డింగ్‌ నిర్మాణానికి అనుమతినిస్తూ సంతకం చేయమని మంత్రి రాజప్ప (రావు రమేష్‌) నారాయణమూర్తి దగ్గరికి ఫైల్‌ పంపుతాడు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆ నిర్మాణాన్ని చేపడుతున్నారని.. సంతకం పెట్టనని నారాయణమూర్తి ఆ ఫైల్‌ని తిరస్కరిస్తాడు.
 దీంతో నారాయణమూర్తిపై కక్ష పెంచుకొన్న మంత్రి రాజప్ప సామదాన భేద దండోపాయాల్ని ప్రదర్శిస్తాడు. మంత్రి బెదిరింపులకు నారాయణ మూర్తి తన నిజాయతీని వదలుకున్నాడా? తన తండ్రిని మంత్రి టార్గెట్‌ చేశాడని తెలిశాక సూర్య ఏం చేశాడు? మంత్రికీ, సూర్యకీ మధ్య జరిగిన పోరాటంలో గెలుపెవరిది? సూర్యపై మనసుపడ్డ భానుమతి (రాశిఖన్నా) కథేమిటి? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే?: తెలుగు చిత్రసీమ కొత్తదనం వైపు పరుగులు పెడుతున్న సమయమిది. ప్రేక్షకుడు చూడని ఓ కొత్త విషయాన్ని చూపించాలనే ప్రయత్నం తరచూ జరుగుతోంది. కొత్త రకమైన సినిమాలు రావటం వెనక ప్రధాన కారణం అదే. అలాగని మనకు అలవాటైన కమర్షియల్‌ ఫార్ములా కథలు ఇంకా దూరం కావడం లేదు. ఆ తరహా చిత్రాలకి బీ.. సీ కేంద్రాల నుంచి ఇప్పటికీ మంచి ఆదరణ లభిస్తుండడంతో దర్శకనిర్మాతలు ఆ కథల్ని నమ్ముతూ తెరకెక్కిస్తున్నారు.

‘హైపర్‌’ కూడా ఆ కోవకి చెందినదే. ఇందులోని కథ.. కథనం కొత్తదనం లేకున్నా కమర్షియల్‌ అంశాలకు కొరత లేకుండా చూశారు. పాటలు.. ఫైట్లు.. రొమాన్స్‌.. వాటి మధ్య ఓ రివెంజ్‌ డ్రామా.. ఇలా మాస్‌ ప్రేక్షకులకు కాలక్షేపాన్నిచ్చే అన్ని అంశాల్ని పక్కాగా ఉండేలా చూశారు. కొత్తదనం ఆశించే ప్రేక్షకుడికి కాస్త ఇబ్బందే. తొలి సగం సరదా సన్నివేశాలతో తీర్చిదిద్దారు. రామ్‌.. రాశిఖన్నాల మధ్య వినోదం- రొమాన్స్‌.. కుటుంబ నేపథ్యంతోనే సాగిపోతుంది.
 
విరామానికి ముందే ఓ మలుపు వస్తుంది. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. అయితే ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడు వూహించినట్టే సాగుతాయి. తన తండ్రిని కాపాడినందుకు రౌడీషీటర్‌ గజ (మురళీశర్మ)తో సూర్య ఫ్రెండ్‌షిప్‌ చేయడం.. మంత్రి రాజప్ప ఫోన్లో చెప్పినట్టుగా చేస్తూ సూర్య కార్లు మారుస్తూ వెళ్లిపోయే సీన్లలో పాత వాసన కనిపిస్తుంది. రామ్‌లోని హైపర్‌ యాక్టివ్‌నెస్‌ని అభిమానులకి చూపించాలనే ప్రయత్నంగా కనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే?: చిత్రంలో రామ్‌.. రాశిఖన్నా.. రావు రమేష్‌ల పాత్రలే కీలకం. ముగ్గురూ బాగా నటించారు. ముఖ్యంగా రామ్‌ ఎప్పట్లాగే హుషారైన కుర్రాడిగా సందడి చేశాడు. డ్యాన్సులు.. ఫైట్లు చక్కటి ఈజ్‌తో చేసేశాడు. రాశిఖన్నా అందంగా కనిపించింది. రావు రమేష్‌ మంత్రి రాజప్ప పాత్రలో ఒదిగిపోయారు. సత్యరాజ్‌ పాత్రకు తగ్గట్టుగా నటించారు. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకొనేంత ఏమీ లేదు. సాంకేతికంగా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి. జిబ్రాన్‌ పాటలు.. మణిశర్మ నేపథ్య సంగీతం పర్వాలేదు. అబ్బూరి రవి కలం అక్కడక్కడా మెరిసింది. రిమోట్‌తో ముడిపెడుతూ అమ్మాయిల జీవితం గురించి రాసిన మాటలు బాగున్నాయి.
 
చివరగా.. ఇది తెలిసిన ‘హైపర్‌’ 

Thursday, September 29, 2016

ఏడేళ్ల ప్రేమకు బ్రేకప్?

 అటు తమిళంలో, ఇటు తెలుగులో (డబ్బింగ్) వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న కథానాయకుడు విశాల్. నటుడు శరత్‌కుమార్ కుమార్తెగానే కాకుండా హీరోయిన్‌గానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరలక్ష్మి. విశాల్, వరలక్ష్మి ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారని గుసగుసలు వినిపించాయి. ‘‘తమిళ నడిగర్ సంఘం ఆధ్వర్యంలో కల్యాణ మండపం కడుతున్నాం. అది పూర్తి కాగానే అందులో జరిగే మొదటి పెళ్లి నాదే’ అని విశాల్ చెబుతూ వచ్చారు.

ఆయన పెళ్లాడనున్నది వరలక్ష్మీనే అని చాలామంది ఫిక్సయ్యారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమతో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. ‘‘ప్రేమ ఇటీవల పరిహాసంగా మారుతోంది. ఓ వ్యక్తి ఏడేళ్ల బంధాన్ని తేలిగ్గా వద్దనుకున్నాడు. అది కూడా తన మేనేజర్ ద్వారా ఆ అమ్మాయికి ఆ విషయం తెలియజేశాడు. ప్రపంచంలో ప్రేమ ఏమైపోతోందో? ఎక్కడుందో?’’ అంటూ ఆమె ఆవేదనగా ట్వీట్ చేశారు.

విశాల్‌ని ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. విశాల్‌ను వరలక్ష్మి ప్రేమించడం ఆమె తండ్రి శరత్‌కుమార్‌కి నచ్చలేదని, పెళ్లికి ఆయన సమ్మతం వ్యక్తం చేయలేదని ఓ టాక్ ఉంది. దానికి తోడు నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్, శరత్‌కుమార్ మధ్య మనస్పర్థలు వచ్చాయి కూడా. ఒకవేళ విశాల్-వరలక్ష్మి బ్రేకప్ వెనక శరత్‌కుమార్ హస్తం ఉండి ఉంటుందేమోనన్నది కొందరి ఊహ. ఇంతకీ వరలక్ష్మి ట్వీట్ వెనక ఆంతర్యం ఏంటో ఆ పెరుమాళ్లకే ఎరుక.

రాజకీయాల్లోకి మహేష్‌బాబు?

 సినిమాలు - రాజకీయాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. సినిమాల్లో స్టార్‌ డమ్‌ అనుభవించి రాజకీయాల్లో ఓ మెరుపులా వచ్చిన తారలు ఎంతోమంది. ఆ లిస్టులో మహేష్‌బాబు చేరుతున్నాడా.. అని డౌటు పడొద్దు. ఇది వేరే మేటర్‌. మహేష్‌ బాబు - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతోందన్న సంగతి తెలిసిందే. మురుగదాస్‌ సినిమా పూర్తయ్యాక ‘శ్రీమంతుడు’ కాంబోలో సినిమా మొదలవుతుంది. ఈ కథా నేపథ్యం రాజకీయాల చుట్టూ తిరగబోతోందని టాక్‌. మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడని చెప్పుకొంటున్నారు. ‘దూకుడు’లో మహేష్‌ ఎమ్‌.ఎల్‌.ఏ పాత్రలో కనిపించాడు కదా? ఇప్పుడు సీఎమ్‌గా ప్రమోషన్‌ వచ్చిందన్నమాట. 2017 జనవరిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ స్క్రిప్టుని తీర్చిదిద్దే పనిలో ఉన్నారని టాక్‌.

Wednesday, September 28, 2016

రాడనుకున్నారు.. రాలేడనుకున్నారు..!


మ్యాచ్‌ ఎలాంటి స్థితిలో ఉన్నా.. ఒత్తిడి అతని దరి చేరదు. సెహ్వాగ్‌ లాంటి భీకర ఓపెనర్‌ విఫలమైన చోట కూడా అతను అవలీలగా భారీ స్కోర్లు చేయగలడు. స్వలాభం కోసం శతకాలు బాదాలని అతను ఎప్పుడూ కోరుకోలేదు. జట్టు కోసం అవసరమైతే సమిధలా మారి 90ల్లో ఔటైన సందర్భాలు కోకొల్లలు. అందుకేనేమో భారత్‌ చరిత్రాత్మక విజయాలు కొన్ని అతని భీకర పోరాటంతోనే సాధ్యమైనా.. సరైన గుర్తింపులేక అవి తెరవెనుకే కనుమరుగైపోయాయి. కానీ అతను పోరాటం ఆపలేదు.. ఎందుకంటే మైదానంలో పట్టుదలకు, బ్యాటింగ్‌లో తెగువకు అతను నిలువుటద్దం. ‘చివరి అవకాశం ఇవ్వండి సగర్వంగా క్రికెట్‌ను నుంచి తప్పుకొంటాం’ అంటూ జట్టులో స్థానం కోల్పోయి సీనియర్‌ క్రికెటర్లు అభ్యర్థిస్తున్న వేళ.. జట్టులో స్థానం కోసం బ్యాట్‌తోనే పోరాడతాను అంటూ ధైర్యంగా ప్రకటించి మళ్లీ టెస్టు జట్టులో తాజాగా స్థానం పొందిన ఆ క్రికెటరే గౌతమ్‌ గంభీర్‌.
2007లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి ప్రపంచకప్‌ ఫైనల్లో గంభీర్‌ 75 పరుగులు చేయడంతోనే భారత్‌ భారీ స్కోరు చేయగలిగింది.. తొలి టీ20ప్రపంచకప్‌ విజేతగా అవతరించింది. 2011లో భారత్‌ 28 ఏళ్ల తర్వాత గెలిచిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో కూడా గంభీర్‌ భీకరంగా పోరాడి 97 పరుగులతో టీమిండియా విజయానికి బాటలు వేశాడు. ఓపెనర్‌గా వచ్చిన అతను 41.2 ఓవర్‌ వరకూ క్రీజులో నిలిచి భారత్‌ విజయం దాదాపు ఖరారైన దశలో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతను శతకం చేసినట్లయితే చరిత్రలో నిలిచిపోయేవాడే కానీ.. అప్పుడు జట్టు అవసరాల మేరకు 90లో కూడా హిట్టింగ్‌ చేయడానికి మొగ్గుచూపాడు. అయితే అందరూ చివర్లో సిక్స్‌ బాదిన ధోనీ(91 నాటౌట్‌)నే ఆకాశానికి ఎత్తేశారు. దీంతో గంభీర్‌ పోరాటం కనుమరుగైపోయింది. ఇక్కడ ధోనీ పోరాటాన్ని తక్కువ చేయడం కాదు గానీ.. 275 పరుగుల లక్ష్య ఛేదనలో 31 పరుగులకే సీనియర్లు సెహ్వాగ్‌, సచిన్‌ పెవిలియన్‌ చేరిన దశలో గంభీర్‌ అసాధారణ పోరాటానికి సరైన గుర్తింపు దక్కలేదనేది గత కొంతకాలంగా అతను జట్టుకు దూరమైన తీరే చెప్తోంది..!
కెరీర్‌ సాగిందిలా..!
2003లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన గంభీర్‌ అతి తక్కువ కాలంలో నమ్మదగిన బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు. కెరీర్‌లో 56 టెస్టులాడి అందులో ఒక ద్విశతకం, 9 శతకాలు, 21 అర్ధశతకాలు సాధించాడు. 147 వన్డేల్లో 11 శతకాలు, 31 అర్ధశతకాలు.. టీ20 కెరీర్‌లో 37 మ్యాచ్‌లాడి 7 అర్ధశతకాలు చేశాడు. అయితే 2014లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన గంభీర్‌ ఐపీఎల్‌లో మాత్రం తన బ్యాటింగ్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ముందుండి నడిపిస్తూ విజయవంతమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.


సహచరులైనా తగ్గేది లేదు..!
ఆటలో దూకుడుగా ఉండే గంభీర్‌ ప్రత్యర్థి క్రికెటర్లతోనే కాదు.. సహచర క్రికెటర్లపైనా తరచూ గొడవకు దిగడం అతని కెరీర్‌ను కొంత మసకబార్చింది. భారత టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో 2013లో జరిగిన ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌లో ప్రత్యక్షంగా గొడవకు దిగి అప్పట్లో సంచలనానికి తెరలేపగా.. వన్డే, టీ20 కెప్టెన్‌ ధోనితో గత కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధాన్నే నడిపిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ధోని బ్యాటింగ్‌ చేస్తుండగా టెస్టు తరహాలో ‘అటాకింగ్‌ ఫీల్డింగ్‌’ ఈ వాదనకు మరింత బలం చేకూర్చాడు గంభీర్‌. కెప్టెన్లతో ఈ స్థాయిలో విభేదాలు ఉన్న అతను ఇక భారత్‌ జట్టులోకి రావడం దాదాపు అసాధ్యంగానే క్రికెట్‌ పండితులు తేల్చేశారు. కానీ నిలకడైన అతని ఆటతీరు, భారత్‌ కోచ్‌ కుంబ్లే, సెలెక్టర్ల చొరవతో మళ్లీ అతను టీమిండియాలోకి పడిలేచిన కెరటంలా అడుగుపెట్టాడు. ‘సమర యోధుడు భగత్‌సింగ్‌ నాకు ఆదర్శం. ఆయన స్ఫూర్తితోనే చివరివరకూ పోరాడుతాను’ అంటూ జట్టులోకి ఎంపికైన అనంతరం గంభీర్‌ ప్రకటించాడు. స్వదేశంలో భారత్‌ ఇంకా 12 టెస్టులు ఆడనున్న నేపథ్యంలో వివాదాల జోలికి వెళ్లకుండా గంభీర్‌ ఆటతో అందర్నీ మెప్పిస్తాడా లేదా మళ్లీ పాత గొడవలకు ఆజ్యం పోసి కెరీర్‌ను ముగిస్తాడో మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.