Monday, July 4, 2016

స్నేహం కోసం.. ప్రాణం ఇచ్చాడు


ఉగ్రవాదులు వెళ్లిపొమ్మని చెప్పినా కూడా తనతో పాటు వచ్చిన స్నేహితురాళ్ల కోసం అక్కడే ఉండి ఓ బంగ్లాదేశ్‌ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 20ఏళ్ల ఫరాజ్‌ ఆయాజ్‌ హొస్సైన్‌ అనే బంగ్లాదేశీ విద్యార్థిని ఇప్పుడు సోషల్‌ మీడియాలో హీరో అని పొగుడుతున్నారు. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా తనతో పాటు వచ్చిన స్నేహితురాళ్లను వదిలేసి వెళ్లకుండా ఫరాజ్‌ అక్కడే ఉన్నాడని ఇటీవల ఢాకాలోని రెస్టారెంట్‌లో జరిగిన ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి మీడియాకు వెళ్లడించారు. ఫరాజ్‌ స్నేహితురాళ్లలో భారతీయ యువతి తరుషి కూడా ఉంది.
ఫరాజ్‌ అమెరికాలోని ఎమ్రోయ్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు. వేసవి సెలవులకు అతడు బంగ్లాదేశ్‌ వచ్చాడు. సెలవులకు వచ్చిన తన స్నేహితురాళ్లు ఎమ్రోయ్‌ యూనివర్సిటీలో చదువుతున్న అమెరికాకు చెందిన అబింతా కబిర్‌, కాలిఫోర్నియా యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థిని తరుషి జైన్‌తో కలిసి దాడి జరిగిన రెస్టారెంట్‌కు వెళ్లారు. ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్నవారిలో ఈ ముగ్గురు ఉన్నారు. ఉగ్రవాదులు బంగ్లాదేశ్‌ వారిని వదిలేసి.. విదేశీయులను మాత్రమే హతమార్చారు. అయితే ఫరాజ్‌ను వెళ్లిపొమ్మని చెప్పినా.. తన స్నేహితురాళ్లను వదిలేస్తే వెళ్తానని.. లేదంటే వెళ్లనని చెప్పడంతో ఉగ్రవాదులు అతడిని కూడా చంపేశారు. గత వారం ఢాకాలో ఉగ్రవాదులు రెస్టారెంట్‌పై దాడి చేసి 20 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. భద్రతాసిబ్బంది దాడుల్లో ఉగ్రవాదులు కూడా హతమయ్యారు.

ధోనిని రజనీకాంత్ తో ఎందుకు పోల్చారంటే?

 టీమిండియా 'మిస్టర్ కూల్' ఎంఎస్ ధోనిని అభిమానులు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో పోలుస్తున్నారు. ధోని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన హెయిర్ కట్ ఫొటో చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కూల్ గా ఉండడంలోనే కాదు నిరాడంబరతలోనూ తనను తానే సాటి ధోని నిరూపించుకున్నాడని కితాబిచ్చారు. బుద్ధిగా కూర్చుని 'బెస్ట్ ఫినిషర్' సదాసీదాగా జుత్తు కత్తిరించుకుంటున్న ఫొటోను తన ఫేస్ బుక్ పెట్టిన వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు.                      ఏమాత్రం హంగు ఆర్భాటం లేకుండా ధోని హెయిర్ కట్ చేయించుకోవడం చూసి అభిమానులు అవాక్కయ్యారు. టీమిండియా కెప్టెన్ అంటే హై-ఫై సెలూన్ లో కటింగ్ చేయించుకుంటాడని భావించిన ఫ్యాన్స్ ధోని పెట్టిన ఫొటో చూసి అతడిపై ప్రశంసలు కురిపించారు. కింద నుంచి పైకి వచ్చాడు కాబట్టే అతడు నిరాడంబరంగా ఉంటాడని వ్యాఖ్యానించారు. ధోనికి ఈగో లేదని, చాలా సింపుల్ ఉంటాడని మరొకరు కామెంట్ చేశారు.              నిరాడంబరంగా ఉండేవాడే నిజమైన సూపర్ స్టార్, సూపర్ హీరో అని.. 'తలైవర్' రజనీకాంత్ తర్వాత ధోనిలో సింప్లిసిటీ చూశానని మరొక అభిమాని అన్నాడు. ధోని ఆటతో పాటు అతడి హెయిర్ స్టైల్ ఎప్పుడు వార్తాల్లో నిలుస్తుంటుంది. ఇప్పుడు హెయిర్ కట్ కూడా హాట్ టాఫిక్ గా మారింది.

ఓడినా ‘కప్’ ఇచ్చారు!

 ఏడు పదుల వయసులో ఏ ఆర్టిస్ట్ అయినా శరీరాన్ని కష్టపెట్టుకునే పాత్రలు చేయడానికి వెనకాడతారు. కానీ, అమితాబ్ బచ్చన్ వంటి కొంతమంది తారలు రిస్క్‌లు తీసుకోవడానికి రెడీ అయిపోతారు. ప్రస్తుతం నటిస్తున్న ఓ చిత్రంలో ఈ బిగ్ బి బాక్సర్‌గా కనిపిస్తారు. ఈ చిత్రం కోసం జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న బాక్సర్లతో తలపడుతున్నారు. వాళ్ల ఉత్సాహం, ప్రతిభ చూస్తుంటే ఆశ్చర్యం వేసిందనీ, వాళ్లతో బాక్సింగ్ రింగ్‌లో తలపడటం సవాల్‌గా అనిపించిందనీ అమితాబ్ అన్నారు. ఈ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు నా చిన్ననాటి విశేషాలు గుర్తొచ్చాయని అమితాబ్ చెబుతూ - ‘‘ఇష్టం ఉన్నా లేకపోయినా మా స్కూల్లో బాక్సింగ్ నేర్చుకోవాల్సిందే.

 పోటీల్లో ఒకే ఒక్క పాయింట్‌తో గెలుపోటములు ఆధారపడి ఉన్నప్పుడు భలే మజాగా ఉండేది. ఆ ఒక్క పాయింట్ దక్కించుకుని, ఆనందపడేవాణ్ణి. ఓసారి మాత్రం బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఓడిపోయాను. అయినా కప్ ఇచ్చారు. గెలుపు కోసం ధైర్యసాహసాలను మెండుగా ప్రదర్శించినందుకుగాను ఆ కప్ గెల్చుకున్నా. వాస్తవానికి నా ఎత్తు నాకు మైనస్ అయ్యింది.

 నా బరువేమో లోయర్ కేటగిరీ వాళ్లకు సమానంగా ఉండేది. ఎత్తు మాత్రం హయర్ కేటగిరీకి సమానంగా ఉండేది. దాంతో నన్ను హయర్ కేటగిరీకే ఎంపిక చేసేవాళ్లు. వాళ్లేమో ‘ఆలోచించుకో. విరమించుకుంటేనే నీకు మంచిది. లేకపోతే దెబ్బలు తగలడం ఖాయం’ అని హెచ్చరించేవాళ్లు. కానీ, నేను మాత్రం ఆ హెచ్చరికను ఖాతరు చేసేవాణ్ణి కాదు. మొండిగా తలపడేవాణ్ణి. ఇప్పడు సినిమా కోసం బాక్సింగ్ చేస్తుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి’’ అని చెప్పారు.

Sunday, July 3, 2016

నాకు బాయ్‌ఫ్రెండ్స్ లేరు..

6
తనకు మగ మిత్రులే లేరంటోంది నటి లావణ్యత్రిపాఠి. ఏమిటీ నమ్మశక్యంగా లేదా? ఈ మధ్య కథానాయికలు ఏమి చెప్పినా అవునా? నిజమా? అనుకునే పరిస్థితి నెలకొంది. లావణ్య త్రిపాఠి మాటల్ని అలానే అనుకుందాం బ్రహ్మన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి లావణ్య త్రిపాఠి. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఓకే అన్నా ఈ అమ్మడిని మాత్రం చిత్ర పరిశ్రమ నోనో అన్నదనే చెప్పాలి.అయితే చిన్న గ్యాప్ తరువాత లావణ్య త్రిపాఠి ప్రయత్నాలు టాలీవుడ్‌లో ఫలించాయి.

అక్కడ కుర్ర హీరోలతో నటించిన చిత్రాలు మంచి విజయాలను పొందడంతో తాజాగా కోలీవుడ్‌లో ఒక అవకాశం వచ్చింది. నిర్మాత సీవీ.కుమార్ దర్శకుడిగా మోగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న మాయాన్ చిత్రంలో లావణ్యత్రిపాఠిని నాయకిగా ఎంచుకున్నారు.ఈ చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్న ఈ బ్యూటీని పలకరించగా మాయాన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రం అని తెలిపింది.

ఇందులో తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది. తెలుగు, తమిళ భాషల్లో నటించడంలో తనకెలాంటి వ్యత్యాసం అనిపించడం లేదని అంది. కమర్శియల్ కథా చిత్రాలకు, ప్రేమ కథా చిత్రాలకు ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణ ఉంటోందని చిప్పింది. ఇక నటన విషయానికి వస్తే ఏ భాషలోనైనా ఒకటేనని పేర్కొంది. తనకు మాత్రం అన్ని భాషల్లోనూ నటించాలని ఆశ అని అంది. అదే విధంగా తానెవరినీ పోటీగా భావించడం లేదని చెప్పింది.

అనుష్క, సమంత, నిత్యామీనన్‌ల నటనంటే తనకు ఇష్టం అని చెప్పింది. ప్రేమలో పడ్డారా? అని చాలా మంది అడుగుతున్నారని, తానెవరినీ ప్రేమించలేదని చెప్పింది. ఇంకా చెప్పాలంటే తనకు మగ మిత్రులే లేరనీ అంది. ఈ మధ్యనే సినిమాల్లోకి వచ్చానని, తన దృష్టి అంతా నటనపైనేనని చెప్పుకొచ్చింది. అన్నట్టు ఈ జాన నటనానుభవం ఏమీ తక్కువకాదు. దశాబ్దం పూర్తి చేసుకుంది. తను నటించిన బ్రహ్మన్ చిత్రం 2006లో విడుదలైందన్నది గమనార్హం.

ఔను.. అమ్మా నాన్న కాబోతున్నాం

కరీనా కపూర్ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె భర్త సైఫ్ అలీఖాన్ శనివారం ధ్రువీకరించారు. ఈ ఇద్దరికీ పెళ్లై దాదాపు నాలుగేళ్లయింది. అప్పట్నుంచీ కరీనా తల్లి కాబోతోందనే వార్తలు అడపా దడపా హల్ చల్ చేశాయ్. అవన్నీ పుకార్లని సైఫ్, కరీనా స్పష్టం చేసుకుంటూ వచ్చారు. ఆ మధ్య ఓ సందర్భంలో కరీనా తాను తల్లి కావాలనుకుంటున్నట్లు చూచాయగా చెప్పారు.
 
 ఇప్పుడు ఆ కోరికను నిజం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సైఫ్ మాట్లాడుతూ- ‘‘ఔను.. కరీనా గర్భవతి. డిసెంబర్‌లో డెలివరీ డేట్ ఇచ్చారు. కరీనా ప్రెగ్నెన్సీ గురించి తెలియగానే శ్రేయోభిలాషులందరూ శుభాకాంక్షలు చెప్పారు. అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. కరీనా కపూర్‌కు ఇది తొలి సంతానం కాగా...మాజీ భార్య అమృతాసింగ్‌తో సైఫ్‌కు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. 1991లో అమృతా సింగ్‌ను పెళ్లి చేసుకున్న సైఫ్... పదమూడేళ్ల కాపురం తర్వాత విడాకులు తీసుకున్నారు.

అలా చేస్తే అవకాశాలెన్నో..


అలా నటిస్తే అవకాశాలెన్నో అంటోంది నటి చాందిని. ఇంతకీ ఆ అమ్మడు ఏమంటుందో ఒకసారి చూస్తే పోలా. సిద్ధు ప్లస్‌టూ చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి ప్రవేశించిన భామ చాందిని. ఆ తరువాత ఒకటి రెండు చిత్రాల్లో నటించి కనిపించకుండా పోయిన ఈ జాణ ఇటీవల నయాపుడై, విల్‌అంబు చిత్రాలతో రీఎంట్రీ అయ్యింది.
 
 అయితే ఈ సారి ఏకంగా అరడజను చిత్రాలకు పైగా అవకాశాలను చేజిక్కించుకున్న చాందినిని మధ్యలో చాలా గ్యాప్‌నకు కారణం ఏమిటన్న ప్రశ్నకు అందాలారబోత పాత్రలకు ఓకే చెబితే ఈ పాటికి ఎన్ని చిత్రాలు చేసి ఉండేదాన్నో అయితే అలా నటించడం తన కిష్టం లేదని బదులిచ్చింది. నటనకు అవకాశం ఉన్న పాత్రల కోసం ఎదురు చూస్తున్నానంటున్న ఈ బ్యూటీ నీకు పోటీ ఎవరన్న ప్రశ్నకు తనెవరినీ పోటీగా భావించడం లేదని సమాధానమిచ్చింది.
 
  ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి చెబుతూ భూపతిపాండియన్ దర్శకత్వంలో మన్నన్ వగైయరా,ి సబిరాజ్‌కు జంటగా కట్టప్ప కానోమ్, భరత్ సరసన ఇన్నోడు విళైయాడు, అంజనా దర్శకత్వంలో పల్లాండు వాళ్గా, నృత్యదర్శకుడు గౌతమ్ దర్శకత్వంలో కన్నుల కాసు కాట్టప్పా, అమీర్ నిర్మిస్తున్న డాలర్ దేశం చిత్తాలతో పాటు నాన్ అవళై సందిత్తపోదు చిత్రంలో నటిస్తున్నానని పెద్ద లిస్ట్‌నే చెప్పింది. అంతే కాదు తెలుగులోనూ ఒక చిత్రం చేస్తున్నట్లు తెలిపింది. మరి ఈ సారన్నా తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందో లేదో చూద్దాం.

Saturday, July 2, 2016

'ఆ రోజు నన్ను చూసి అందరూ నవ్విన వాళ్లే'

 ఆయన తొలి రోజుల్లో చదువుల్లో అంత ఘనాపాటేం కాదు. ఒకానొక సందర్భంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో కూడా తొలిసారి ఫెయిలయ్యాడు. అలాంటి వ్యక్తి చేతుల్లో ఇప్పుడు మూడు పీహెచ్ డీలు. ఆ మూడు ఓ ముగ్గురు ప్రముఖ వ్యక్తులకు అంకితాలు. ఈ రోజుల్లో ఒక్క డాక్టరేట్ ఉండటమే కష్టమవుతుండగా ఆయన మాత్రం ఏకంగా మూడు డాక్టరేట్ లు పొందాడు. ఆయనే జగదీశ్ త్రివేది(49).

గుజరాత్ లోని సురేంద్రనగర్ కు చెందిన ఆయన మూడు పీహెచ్ డీలు పూర్తి చేసి ప్రముఖ నవలా రచయిత దేవ్ శంకర్ మెహతా, ప్రముఖ హాస్యకారుడు షాబుద్దిన్ రాథోడ్, ప్రముఖ మత గురువు మోరారీ బాపునుకు ఈ మూడింటిని అంకితం చేశాడు. అంతేకాదు.. జగదీశ్ త్రివేది కూడా ఒక పెద్ద హాస్యకారుడు. 'నేను ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో ఫెయిలయిన తర్వాత ప్రతి ఒక్కరు నన్ను ఎగతాళి చేశారు నవ్వారు. నేను సైన్స్ చదవలేనని నాకు తెలుసు. అందుకే వెంటనే ఆర్ట్స్ కు మారిపోయాను. నేను ఇంటర్ ఒకసారి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. రెండు పీహెచ్ డీలు పూర్తి చేసి నేను డల్ స్టూడెంట్ కాదని నిరూపించాను' అని ఆయన చెప్పాడు.

బొద్దుగా ఉండడమే వరమైంది...

‘నా శరీరాకృతి హీరోయిన్‌ కావడానికి సహకరించదేమో అని కొంచెం ఆందోళన పడేదాన్ని. హీరోయిన్‌కు నడుము నాజుకుగా ఉండాలని నిర్మాతలు, దర్శకులు భావించేవారు. నేను బొద్దుగా ఉంటానని నాపై విమర్శలు వచ్చాయి. కానీ అవేవీ నాకు ప్రతిబంధకం కాలేదు’ అంటోంది మాధురీ దీక్షిత్‌. తన అందంతో 1980-90 దశకాలలో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన హీరోయిన్‌ మాధురి. ఆమె మంచి నాట్యకళాకారిణి కూడా. 1988లో వచ్చిన ‘తేజాబ్‌’ సినిమాలో ‘ఏక్‌ దో తీన్‌ చార్‌ పాంచ్‌ ఛే సాథ్‌ ఆఠ్‌ నౌ... దస్‌ గ్యారా బారా తేరా’ పాటకు మాధురీ వేసిన స్టెప్పులకు ఆరోజుల్లో యువ ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. అటువంటి మాధురి ఏకంగా ఆరు ఫిలింఫేర్‌ బహుమతులు గెలుచుకోవడమే కాకుండా ‘పద్మశ్రీ’ బిరుదు కూడా సొంతం చేసుకుంది, మాధురీ దీక్షిత్‌ 1999లో కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు శ్రీరాం మాధవ్‌ను వివాహమాడి అక్కడే స్థిరపడింది. ఇప్పుడు మాధురీ మకాం ముంబైకి మార్చివేసింది. నాట్యమంటే అభిమానించే మాధురి ‘డాన్స్‌ విత్‌ మాధురి’ పేరుతో ఆన్‌ లైన్‌ డ్యాన్స్‌ అకాడెమీని నిర్వహిస్తోంది.