Monday, June 6, 2016

రోజులు మారాయి..

 వరుస హిట్లతో దూసుకెళుతున్న దర్శకుడు మారుతి కథ, స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం ‘రోజులు మారాయి’. చేతన్ మద్దినేని, పార్వతీశమ్, కృతిక, తేజస్వి ప్రధాన పాత్రల్లో మురళీ కృష్ణ ముడిదానిని దర్శకునిగా పరిచయం చేస్తూ జి.శ్రీనివాసరావు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. జేబీ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ‘దిల్’రాజు మాట్లాడుతూ- ‘‘మారుతి కథలు ప్రధానంగా యువతను ఆకట్టుకుంటాయి. కానీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్నివర్గాల వారిని ఆకట్టుకుంటుంది.
ఇప్పటికే ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా బిజినెస్ ట్రేడ్‌లో సూపర్ క్రేజ్ రావడం విశేషం. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 7న సినిమా విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. అలీ, పోసాని కృష్ణమురళి, రాజారవీంద్ర, హర్ష, సంధ్యా జనక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ సారధ్యం: గుడ్ సినిమా గ్రూప్, సహ నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

Saturday, June 4, 2016

కావాలనే మాజీ లవర్‌తో ఫొటో దిగలేదు!

 'ఉడ్తా పంజాబ్‌' సినిమాతో మళ్లీ వెండితెర మీద కనిపించబోతున్నారు షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌. చాలాకాలం కిందటే విడిపోయిన ఈ మాజీ ప్రేమజంట.. గతంలో ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా విలేకరులు ఎంత కోరినా.. కలిసి ఫొటో దిగేందుకు ఒప్పుకోలేదు. ఇందుకు కారణం ఏమిటంటే.. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌ వెల్లడించాడు. కావాలనే తామిద్దరం కలిసి ఫొటో దిగలేదని, ఒకవేళ ఫొటో దిగితే అప్పట్లో మీడియా మొత్తం దీనిపైనే మాట్లాడేదని, అందుకే మేం కలిసి ఫొటో దిగకూడదని తాను భావించానని షాహిద్ చెప్పాడు.
ఎన్నో ఏళ్ల గ్యాప్‌ తర్వాత షాహిద్‌, కరీనా..  అభిషేక్ చుబే తెరకెక్కించిన 'ఉడ్తా పంజాబ్‌'లో నటించారు.  నిజానికి ఒకే సినిమాలో నటిస్తున్నారనే మాటే కానీ.. ఈ ఇద్దరు కలిసి కనిపించే సీన్‌ ఒక్కటి కూడా ఈ చిత్రంలో లేదట. అంతేకాకుండా మీ ఇద్దరు భవిష్యత్తులో కలిసి నటించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు వీరు సమాధానం దాటేశారు. సహ నటులు ఆలియా భట్‌, డైరెక్టర్‌ అభిషేక్‌ చుబే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఈ ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమంలో షాహిద్, కరీన చాలా ఇబ్బందిగా కనిపించారని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై స్పందిస్తూ 'మేం ఇబ్బందిగా ఫీలైనట్టు మీరు ఎలా నిర్ణయిస్తారు? మేం అలా కనిపించామా? అలా ఎలా రాస్తారు?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

బాహుబలితో బ్రిటిష్ బ్యూటీ

 బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్, బాహుబలి 2 సెట్స్ మీద ఉండగానే తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు, ఇప్పటికే ప్రభాస్ రెగ్యులర్ సినిమా చేసి చాలా కాలం అవుతోంది. అందుకే బాహుబలి పూర్తవ్వగానే గ్యాప్ తీసుకోకుండా మరో సినిమాను పట్టాలెక్కించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. చాలాకాలం క్రితమే రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో సినిమా ఉంటుందంటూ ప్రకటించాడు ప్రభాస్.

యువి క్రియేషన్స్ బ్యానర్.., ప్రభాస్, సుజిత్ ల సినిమాను భారీగా నిర్మించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే జాతీయస్థాయిలో ప్రభాస్ కు  ఫాలోయింగ్ రావటంతో ఈ సినిమాను కూడా మూడు భాషల్లో భారీగా నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అందుకు తగ్గట్టుగా నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా గుర్తింపు ఉన్న అమీజాక్సన్ ను ఈ సినిమాను హీరోయిన్ గా ఫైనల్ చేశారట. తొలిగా ఈ బ్రిటిష్ బ్యూటీ ప్రభాస్ పక్కన నటించటం సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్.

Wednesday, June 1, 2016

పండుగొచ్చింది..

 
అంతటా పండుగ వాతావరణం, విద్యుత్ కాంతుల్లో నగరం, స్పెషల్ అట్రాక్షన్‌గా, అతిపెద్ద జెండా ఆవిష్కరణ, ఆవిర్భావ వేడుకలకు హైదరాబాద్ ముస్తాబు
కోట్ల కళ్లు ఎదురుచూస్తున్న పండుగ..అరవై ఏండ్ల కొట్లాట..వేయి మంది అమరుల బలిదాన ఫలితమైన రాష్ర్టావతరణ ఉత్సవం వచ్చేసింది. ఈ సంబురాలను అంబరాన్నంటేలా చేసుకునేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. నభూతో..నభవిష్యత్ అనే రీతిలో సిటీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతోపాటు ప్రధాన కూడళ్లు విద్యుత్ కాంతులు, త్రీడీ లైటింగ్‌తో ధగధగలాడుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివళ్లు, జెండావిష్కరణలతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహించడానికి నగరం సిద్ధమైంది.

తెలంగాణ జాతికి పెద్ద పండుగొచ్చింది. రాష్ట్రం రెండు వసంతాలు పూర్తి చేసుకొని మూడోఏట అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లతో పాటు ట్యాంక్‌బండ్, పర్యాటక ప్రాంతాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అసెంబ్లీ, సచివాలయం, నెక్లెస్‌రోడ్, హుస్సేన్‌సాగర్ తీరం, ైఫ్లె ఓవర్లు విద్యుత్ వెలుగులతో జిగేల్‌మంటున్నాయి. అమరవీరుల స్తూపాలను పూలతో అలంకరించారు. ప్రధానంగా నగర వీధుల్లో ఎక్కడచూసినా దసరా, దీపావళి లెక్కన ఉత్సాహం కనిపిస్తున్నది. 
 
నగరం..సప్తవర్ణశోభితం..
పురివిప్పిన నెమళ్లు, కనువిందు చేసే పూలు ఇంకా అనేక రకాల అలంకారాలతో నగర కూడళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. రాష్ట్ర అవతరణ వేడుకలకు ముస్తాబైన నగరం సప్తవర్ణ శోభతో అలరారుతోంది. మరోపక్క పరేడ్ మైదానంలో వేడుకలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. వేడుకలకు స్వాగతం పలుకుతూ హెచ్‌ఎండీఏ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. సంజీవయ్య పార్కులో ఎత్తైన జాతీయ పతాకం ఎగురవేయడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. దసరా, దీపావళి కలిసి వచ్చినట్టు నగరమంతా పండుగశోభను సంతరించుకుంది. 











 

ముచ్చటగా మూడో నెల?

 ‘‘నేను ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు? రెండేళ్ల వరకూ పిల్లలు వద్దనుకున్నాం. అసలు ఎక్కణ్ణుంచి ఇలాంటి వార్తలు పుట్టుకొస్తాయో అర్థం కావడంలేదు’’ అని కరీనా కపూర్ ఆ మధ్య పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. దాంతో ఇప్పట్లో కరీనా, సైఫ్ అలీఖాన్ తల్లిదండ్రులయ్యే అవకాశం లేదని చాలామంది ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో తాజాగా ఓ వార్త ప్రచారంలోకొచ్చింది. కరీనా ప్రెగ్నెంట్ అన్నది ఆ వార్త సారాంశం.

ఆమెకు మూడో నెల అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇటీవలే కరీనా, సైఫ్ లండన్ వెళ్లారు. హాలిడేస్‌ని ఎంజాయ్ చేసి, మంగళవారం ఇండియా వచ్చారు. కరీనా ప్రెగ్నెంట్ అనే వార్త బుధవారం గుప్పుమంది. బాలీవుడ్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్. దీనికి ఈ భార్యభర్తల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మౌనం అర్ధాంగీకారం అంటారు. సో.. కరీనా నిజంగానే తల్లి కాబోతున్నారా? లేక గతంలో ప్రచారం అయినట్లుగా ఇది కూడా వదంతిగా మిగిలిపోతుందా? వేచి చూడాల్సిందే.
 

ఈ మెగా సెల్ఫీ చాలా అరుదు గురూ

 ఒక సాధారణ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటేనే ఒక వార్తగా నిలుస్తుంది. అలాంటిది ఓ ఐదుగురు ప్రముఖులు ఓ చోట చేరి సెల్ఫీ తీసుకుంటే ఎలా ఉంటుంది. అది కూడా ఒకరిని ఒకరు చూసుకుంటూ పట్టరాని సంతోషంతో.. ఇంకా ఆసక్తిగా చెప్పాలంటే ఒకే రకమైన వస్త్రాలు వేసుకొని.. ఎవరి మొఖంలో నవ్వుచూసినా అదే పరిమాణంలో ఉండి.. ఈ అరుదైన సెల్ఫీ తిరుపతిలో ఆవిష్కృతమైంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ చెరిగిపోని చరిత్రను లిఖించుకున్న ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి, నట సామ్రాట్ అక్కినేని నాగార్జున, గీతా ఆర్ట్స్ సారధి అల్లు అరవింద్.. వీళ్లందరికీ ఒక్కసారిగా అదనపు రంగు అద్దినట్లుగా మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, వ్యాపార ప్రముఖుడు నిమ్మగడ్డ ప్రసాద్ కలిసి ఈ స్వీయ చిత్రాన్ని తీసుకున్నారు. బయటకు వచ్చిన ఈ ఫొటోను చూసిన వారంతా కూడా వావ్ వాట్ ఏ సెల్ఫీ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు.

Tuesday, May 31, 2016

బడ్జెట్ 4కోట్లు, కలెక్షన్లు 75 కోట్లు

 అంఛనాలను తలకిందులు చేస్తూ ఓ మరాఠీ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. స్టార్ హీరోలు కూడా వంద కోట్ల కలెక్షన్ల కోసం అష్టకష్టాలు పడుతుంటే.. ఓ చిన్న సినిమా శరవేగంగా వందకోట్ల మార్క్ వైపు అడుగులు వేస్తుంది. నూతన నటీనటులు ఆకాష్ తోసర్, రింకూ రాజ్ గురు హీరో హీరోయిన్లుగా మరాఠీలో తెరకెక్కిన చిన్న సినిమా సైరత్. నాగరాజ్ మంజులే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది.
కేవలం 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్, 63వ జాతీయ అవార్డుల వేదిక మీద కూడా సత్తా చాటింది. ఎలాంటి అంఛనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా స్పెషల్ జ్యూతీ అవార్డు ను సొంతం చేసుకుంది. సాధారణంగా అవార్డు సినిమాలకు కలెక్షన్లు రావన్న అపవాదు ఉంది. అలాంటి అనుమానాలను కూడా దూరం చేస్తూ సైరత్ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 31 రోజుల్లో 75 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తుండటంతో వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

తన ప్రేమ వ్యవహారంపై ఇలియానా త్వరలో గుడ్‌న్యూస్ తెలియజేస్తానని ...


 
ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూనీబోన్‌తో గోవా భామ ఇలియానా ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే. ముంబయిలో జరిగిన అనేక సినీ వేడుకల్లో ఈ జంట కలిసి సందడి చేశారు. తన ప్రేమ వ్యవహారంపై ఇలియానా ఇంతవరకు పెదవి విప్పలేదు. 
వ్యక్తిగత విషయాల్ని బహిర్గతం చేయడం తనకు ఇష్టం వుండదని, సమయం వచ్చినప్పుడు తన లవ్‌ఎఫైర్ గురించి తెలియజేస్తానని చెప్పింది ఇలియానా. ఆమె మాట్లాడుతూ ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలతో ముడిపడి వుంటుంది. పరస్పర సమ్మతి వున్నప్పుడే అలాంటి సున్నితమైన విషయాల గురించి బయట ప్రపంచానికి తెలియజెప్పాలి. నేను వ్యక్తిగత స్వేచ్ఛకు ఎంతో విలువిస్తాను. అనుమతి లేనిదే ఇతరుల పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడను. సెలబ్రిటీల ప్రేమ వ్యవహారాలపై ప్రజలకు ఆసక్తి వుండటం సహజం. దానిని అలుసుగా తీసుకొని అదే పనిగా గాసిప్స్ ప్రచారం చేయడం మంచిది కాదు. సరైన సమయంలో కాబోయే జీవిత భాగస్వామి ఎవరనేది అభిమానులకు తెలియజేస్తాను. కొద్దిరోజులు ఓపికి పడితే అందరికీ శుభవార్త చెబుతాను అని తెలిపింది. ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ సరసన రుస్తుం చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.