Tuesday, May 31, 2016

ఆ ఫస్ట్‌ పోస్టర్‌లో ఆమె ఎందుకు లేదంటే?



 భారీ అంచనాల మధ్య హాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది ప్రియాంక చోప్రా. ఆమె మొదటి హాలీవుడ్‌ చిత్రం 'బేవాచ్‌'. డ్వాయ్నె జాన్సన్‌, జాక్‌ ఎఫ్రాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగిసింది. ఇటీవల ఫస్ట్ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. కానీ ఈ పోస్టర్‌లో బాలీవుడ్ భామ ప్రియాంక లేకపోవడం ఆమె అభిమానుల్ని షాక్‌ గురిచేసింది.
'బేవాచ్‌' సినిమాలో ప్రియాంక నెగిటివ్‌ పాత్రలో విలన్‌గా కనిపిస్తుండటంతో ఆమెను ఫస్ట్ పోస్టర్‌లో చూపించలేదనే టాక్ వినిపించింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఈ చిత్ర యూనిట్‌ ప్రియాంక అభిమానుల్ని ఆనందంలో ముంచే విషయాన్ని తెలిపింది. ప్రియాంక కోసమే ఒక సెపరేట్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయనుందట. 'సినిమా ప్రమోషనల్‌ విషయంలో చిత్ర యూనిట్ ఒక ప్లాన్ ప్రకారం ముందుకువెళుతోంది. ప్రియాంకను యూనిట్‌ పెద్ద ఎత్తున లాంచ్ చేయాలని భావిస్తోంది. అందులోభాగంగా తదుపరి వచ్చే పోస్టర్‌లో ప్రియాంక మాత్రమే ఉంటుంది. ఆమె విలన్ పాత్ర పోషించడంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు దక్కేలా ఈ పోస్టర్‌ను ప్లాన్ చేశారు' అని 'బేవాచ్‌'  చిత్రయూనిట్‌కు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

'నేను యువరాజ్ కు పెద్ద అభిమానిని'

భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు తాను పెద్ద అభిమానినని ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా స్పష్టం చేశాడు. యువరాజ్ ఆటను ఎక్కువ ఇష్టపడటం కాకుండా, అతనినే ఆదర్శంగా తీసుకుంటానని పేర్కొన్నాడు.'నేను తరచు యువరాజ్ సింగ్ క్రికెట్ ను చూస్తూ ఉంటా. నేను యువరాజ్ కు అతి పెద్ద అభిమాని కావడంతోనే అతని ఆటపై మక్కువ పెంచుకున్నా. నాకు యువరాజ్ సింగే స్ఫూర్తి' అని  కృనాల్ తెలిపాడు. ఆల్ రౌండర్లలో ఎవర్నీ ఎక్కువ ఇష్టపడతారు అనే ప్రశ్నకు కృనాల్ పై విధంగా స్పందించాడు.
ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన గత మ్యాచ్ లో కృనాల్ 37 బంతుల్లో 86 పరుగులు చేసి ముంబై భారీ విజయంలో సహకరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, తన ప్రస్తుత ఐపీఎల్ ఆట తీరు పట్ల కృనాల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇప్పటివరకూ తనకు అప్పజెప్పిన పనిని సమర్ధవంతంగా నిర్వర్తించినట్లు కృనాల్ అభిప్రాయపడ్డాడు.  భవిష్యత్తులో కూడా ఇదే ఆట తీరును కొనసాగిస్తానని తెలిపాడు. మన ప్రతిభ బయట తీసిన మరుక్షణమే ఫలితం మనకు అనుకూలంగా వస్తుందని కృనాల్ వేదాంత ధోరణిలో మాట్లాడాడు.

Monday, May 30, 2016

నా తమ్ముడు అలా చేయడు: సల్మాన్ ఖాన్


జర్నలిస్టు పట్ల దరుసుగా ప్రవర్తించిన తమ్ముడు అర్బాజ్ ఖాన్ ను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వెనకేసుకొచ్చాడు. పెళ్లి వార్తల గురించి తన కుటుంబాన్ని వేధించొద్దని మీడియాను కోరారు. తన తమ్ముడు దురుసుగా ప్రవర్తించలేదని, అతడు ఎప్పుడూ అలా చేయడని అన్నాడు.
తల్లిదండ్రులతో కలిసి బాంద్రాలోని ఓ హోటల్ కు గురువారం రాత్రి డిన్నర్ కు వెళ్లిన అర్బాజ్ ఖాన్ ను జర్నలిస్ట్ ఒకరు సల్మాన్ పెళ్లి గురించి అడిగాడు. దీంతో సహనం కోల్పోయిన అర్బాజ్.. జర్నలిస్ట్ పట్ల పౌరుషంగా ప్రవర్తించాడు. తన తమ్ముడు స్థానంలో ఎవరు ఉన్నా అలాగే చేస్తారని సల్మాన్ సమర్థించాడు. తన పెళ్లి వార్తల గురించి తన కుటుంబ సభ్యులు, స్నేహితుల వెంట పడొద్దని విజ్ఞప్తి చేశాడు.

తాను ఎప్పుడు పెళ్లి చేసుకునేది ట్విటర్ ద్వారా వెల్లడిస్తానని చెప్పాడు. ప్రియురాలు లులియాను పెళ్లాడేందుకు సల్మాన్ సిద్ధమవుతున్నాడని బాలీవుడ్ లో ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. దీనిపై సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

నితిన్ కు పవన్ ప్రత్యేక కానుక

 పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి యువ హీరో నితిన్ కు మరోసారి ప్రత్యేక కానుక అందింది. పవన్ తన మామిడి తోటలో పండించిన తాజా మామిడి పండ్లను నితిన్ కు పంపారు. వీటిని ఓ పెట్టెలో పార్శిల్ చేసి పంపించారు. త్వరలో విడుదల కానున్న నితిన్ సినిమా 'అ ఆ' విజయవంతం కావాలని కోరుతూ పవన్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. పవన్ పంపిన మామిడి పండ్ల బుట్టను నితిన్ ఫొటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు.
ప్రతి ఏడాదీ వేసవిలో పవన్ కల్యాణ్ కొంతమందికి మామిడిపళ్లను పంపిస్తుంటాడు. పవన్ కల్యాణ్‌కి హైదరబాద్ శివార్లలో మామిడి తోట ఉంది. అందులో పండిన తాజా మామిడి పళ్లను ఆప్తులకు పంపిస్తుంటారు. ఇలా ప్రతి ఏడాదీ ఈ పళ్లు అందుకుంటున్నవారిలో నితిన్ కూడా ఉన్నాడు. గత రెండు వేసవుల్లో కూడా పవన్.. నితిన్ కు మామిడి పళ్లను పంపాడు.

గప్‌చుప్‌గా రణ్‌వీర్‌ని కలిసిందట

 బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె రహస్యంగా తన ప్రియుడు రణ్‌వీర్‌ సింగ్‌ని కలిసిందట. దీపిక హాలీవుడ్‌లోనటిస్తున్న ట్రిపులెక్స్‌-ది రిటర్న్‌ ఆఫ్‌ ది జాండర్‌ కేజ్‌ చిత్ర షూటింగ్‌ ఇటీవల పూర్తయింది. మరో పక్క రణ్‌వీర్‌ బేఫికర్‌ చిత్ర షూటింగ్‌ కోసంపారిస్‌లో ఉన్నాడు. ఎలాగూ షూటింగ్‌ పూర్తయింది కదా అని దీపిక వారం క్రితం రణ్‌వీర్‌ కోసం పారిస్‌ వెళ్లిందట.
కానీ అక్కడ దీపికకి నిరాశే ఎదురైంది. దీపిక తన పారిస్‌ ట్రిప్‌ని సీక్రెట్‌గా ఉంచాలనుకుంది. కానీ కొందరు అభిమానులు దీపికను గుర్తుపట్టి ఫొటోలు తీయబోతుంటే ఎవరూ దీపిక ఫొటోలు తీయడానికి వీల్లేదంటూ చిత్రబృందం హెచ్చరించినట్లు తెలుస్తోంది.
దీంతో దీపిక బేఫికర్‌ సెట్స్‌లో కాసేపు సరదాగా ఎంజాయ్‌ చేసిందే కానీ రణ్‌వీర్‌ని మాత్రం పర్సనల్‌గా కలవలేకపోయిందట. ‘దీపిక పని విషయంలో చాలా ప్రొఫెషనల్‌ కమిట్‌మెంట్‌తో ఉంటుంది. అదీ కాకుండా షూటింగ్‌ కోసం అటు రణ్‌వీర్‌ పారిస్‌లో, ఇటు దీపిక టొరంటోలో ఉన్నారు. కొన్ని నెలలుగా ఇద్దరూ కలుసుకోలేదు. ఎంత స్టార్‌ అయినా దీపిక కూడా ఓ ప్రేమలో ఉన్న ఆడపిల్లే. ఇంటికి వెళ్లే ముందు ఓసారి ప్రియుడిని కలవాలనుకోవడంలో తప్పేముంది’ అంటూ సినీ వర్గాలు దీపికకే మద్దతు ఇస్తున్నాయి.

Sunday, May 29, 2016

కొత్త చాంపియన్‌ ఎవరో


నువ్వా.. నేనా..
ఇద్దరూ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఒంటి చేత్తో తమ జట్లను గెలిపిస్తున్నారు. ఆయా జట్ల తరఫున వారే టాప్‌ స్కోరర్లు. కెప్టెన్లుగా జట్లను అద్భుతంగా నడిపిస్తున్నారు. అందుకే ఫైనల్‌ పోరులో విరాట్‌ కోహ్లి, డేవిడ్‌ వార్నర్‌ మధ్య పోరాటం అత్యంత ఆసక్తి రేపిస్తోంది. అసాధ్యమనుకున్న దశ నుంచి బెంగళూరును కోహ్లి తన అద్భుత బ్యాటింగ్‌, నాయకత్వంలో ప్లేఆఫ్స్‌కు చేరిస్తే.. వార్నర్‌ ఆరంభం నుంచి తన జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిచాడు. కోహ్లి విధ్వంస విన్యాసాల వల్ల మరుగుపడిపోయాడు కానీ..వార్నర్‌ కూడా ఎంతో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మరి తుది పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.


బెంగళూరుకు బ్యాటింగే బలం
రెండు జట్లూ తొలి టైటిల్‌ కోసం ఆరాటపడుతున్నవే. రెండూ స్ఫూర్తిదాయక విజయాలతో ముందంజ వేసినవే. ఎవరి బలం వారిది. కోహ్లి రూపంలో బెంగళూరుకు, వార్నర్‌ రూపంలో సన్‌రైజర్స్‌కు స్ఫూర్తిదాయక నాయకులున్నారు. ఐతే ఫైనల్లో ఆర్‌సీబీదే పైచేయిగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ జట్టుకు రెండు సార్లు 2009, 2011లో ఫైనల్‌ ఆడిన అనుభవం ఉంది. ఇప్పటివరకు సన్‌రైజర్స్‌ అత్యుత్తమ ప్రదర్శన ప్లేఆఫ్‌ (2013) మాత్రమే. పైగా బెంగళూరు భీకర ఫామ్‌తో ఫైనల్‌ చేరింది. ఆరంభంలో తడబడ్డ బెంగళూరు ఫ్లేఆఫ్‌ ముంగిట అత్యుత్తమ ఫామ్‌ను అందుకుంది. ప్లేఆఫ్స్‌ చేరాలంటే నెగ్గాల్సిన చివరి నాలుగు లీగ్‌ మ్యాచ్‌ల్లోనూ తిరుగులేని ప్రదర్శనతో ప్రత్యర్థులను మట్టికరిపించింది. ఆ జట్టు ఇప్పుడు జోరుమీదుంది. ముఖ్యంగా బ్యాటింగే బెంగళూరు ప్రధాన బలం. కెప్టెన్‌ కోహ్లి, డివిలియర్స్‌లు భయంకరమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో కోహ్లి ఏకంగా నాలుగు సెంచరీలు బాదేశాడు. గేల్‌ కూడా టచ్‌లోనే ఉన్నాడు. కేఎల్‌ రాహుల్‌ నిలకడగా రాణిస్తున్నాడు. తీవ్రంగా తడబడ్డ బౌలర్లు గత కొన్ని మ్యాచ్‌ల్లో కుదురుకోవడం, ఫామ్‌ను అందుకోవడం బెంగళూరుకు సంతోషాన్నిచ్చే అంశం. లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌ 12 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్‌ వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్‌ వాట్సన్‌ కూడా 15 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసుకున్నాడు. బౌలర్లు ఈ మ్యాచ్‌లోనూ సమష్టిగా రాణించాలని బెంగళూరు ఆశిస్తోంది.

సన్‌రైజర్స్‌కు బౌలింగే ఆశ
సన్‌రైజర్స్‌ కూడా చక్కని విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. బెంగళూరు.. విరాట్‌ కోహ్లిపై ఆధారపడ్డట్లే సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌లో తన కెప్టెన్‌ వార్నర్‌పై బాగా ఆధారపడి ఉంది. 16 మ్యాచ్‌ల్లో 779 పరుగులు చేసిన వార్నర్‌ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. క్వాలిఫయర్‌-2లో ఛేదనలో జట్టును దాదాపుగా ఒంటి చేత్తో గెలిపించాడు. మరో ఓపెనర్‌ ధావన్‌ కూడా అతడికి చక్కని సహకారాన్నిస్తున్నాడు. ఐతే కొన్ని విలువైన ఇన్నింగ్స్‌లు ఆడిన యువరాజ్‌ ఫైనల్లో తన అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించాలని, హెన్రిక్స్‌ మరోసారి ఆల్‌రౌండ్‌ సత్తా చాటాలని సన్‌రైజర్స్‌ ఆశిస్తోంది. బెంగళూరుతో తలపడ్డ గత మ్యాచ్‌లో గెలవడం సన్‌రైజర్స్‌కు సానుకూలాంశమే. ఐతే సన్‌రైజర్స్‌ అసలు బలం మాత్రం బౌలింగ్‌లోనే ఉంది. ఫైనల్‌ మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌ బౌలింగ్‌కు, బెంగళూరు బ్యాటింగ్‌కు మధ్య పోరుగా అభివర్ణించవచ్చు. సీమర్లు భువనేశ్వర్‌ (16 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు), ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (15 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు) అద్భుతమైన బౌలింగ్‌తో ఈ సీజన్‌లో హైదరాబాద్‌ విజయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఎంత గొప్ప బ్యాట్స్‌మన్‌కైనా వారి బౌలింగ్‌లో పరుగులు చేయడం కష్టమవుతోంది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో వారి బౌలింగ్‌ అద్భుతం. నెహ్రా గాయంతో దూరమైనా భువి, ముస్తాఫిజుర్‌ తమ జట్టు పదును తగ్గకుండా చూశారు. బరిందర్‌ శరణ్‌ కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఐతే ముస్తాఫిజుర్‌ ఫిట్‌నెస్‌ సన్‌రైజర్స్‌కు ఆందోళన కలిగిస్తోంది. అతడు ఫిట్‌గా లేకపోతే బౌల్ట్‌ మ్యాచ్‌ ఆడతాడు. 
తుది జట్లు(అంచనా)

ఆర్సీబీ: విరాట్ కోహ్లి(కెప్టెన్), క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్, కేఎల్ రాహుల్, స్టువర్ట్ బిన్నీ, సచిన్ బేబీ, జోర్డాన్, ఇక్బాల్ అబ్దుల్లా, ఎస్ అరవింద్, చాహాల్

హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్),శిఖర్ ధవన్, హెన్రీక్యూస్,యువరాజ్ సింగ్,దీపక్ హూడా,కట్టింగ్,నమాన్ ఓజా,బిపుల్ శర్మ, భువనేశ్వర్ కుమార్,బరిందర్ శ్రవణ్, ట్రెంట్ బౌల్ట్

Saturday, May 28, 2016

నాగశౌర్య ఏం రాశాడో చూడండి!

 శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య, నారా రోహిత్‌ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘జ్యో అచ్యుతానందా’. ఈ చిత్రం సెట్‌లో యూనిట్‌ సభ్యులు చాలా సరదాగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా దిగిన ఒక ఫొటోను శ్రీనివాస్‌ అవసరాల తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అందులో నాగశౌర్య స్కెచ్‌లు పట్టుకుని ఉండగా.. శ్రీనివాస్‌ అవసరాల చేతికి కట్టుకట్టి ఉంది. ఈ కట్టుపై ‘సువర్ణ’ అని రాసి ఉంది. దీనికి శ్రీనివాస్‌ క్యాప్షన్‌గా... ‘నేను అతడి కోసం రెండు స్క్రిప్టులు రాశాను. నా కోసం అతడు ఇది రాశాడు’ అని పోస్ట్‌ చేశారు. మరి ఆ ‘సువర్ణ’ అనే పేరు సినిమాలో హీరోయిన్‌దా.. లేక మరేదైనా ఉందా అన్న విషయం తెలియాల్సి ఉంది.

'బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ కు నాదే బాధ్యత'


ప్రిన్స్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు భారీ విజయం తర్వాత విడుదలైన ఆయన సినిమా బ్రహ్మోత్సవంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మహేష్ అభిమానుల అంచనాలను బ్రహ్మోత్సవం అందుకోలేకపోయింది. అభిమానులను నిరాశపరిచిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది.
బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ కు దర్శకుడిని నిందించరాదని మహేష్ బాబు అన్నాడు. ఓ జాతీయ వార్త సంస్థతో మహేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా పరాజయానికి పూర్తిగా తనదే బాధ్యతని చెప్పాడు. ఓ సినిమా హిట్ కావడానికి, కాకపోవడానికి ఎన్నో కారణాలుంటాయని అన్నాడు. దర్శకుడిని ఎంచుకోవడమన్నది తన నిర్ణయమని, నా అభిప్రాయం తప్పుకావచ్చని మహేష్ చెప్పాడు.

మహేష్ సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇంకా సత్యారాజ్, రావు రమేష్, నరేశ్, రేవతి, సాయాజీ షిండే తదితర భారీ తారగణం నటించారు.