Thursday, October 17, 2019

విడాకులు తీసుకున్న మనోజ్‌ దంపతులు

 ప్రముఖ నటుడు మంచు మోహన్‌ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్‌ తన భార్య ప్రణతీ రెడ్డితో విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. దీనిపై మనోజ్‌ ఓ లేఖను ట్విటర్లో పోస్ట్‌ చేశారు. ''నా వ్యక్తిగత జీవితం, కెరీర్‌ గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. నేను విడాకులు తీసుకున్న విషయాన్ని బాధతో మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఒక అందమైన, గొప్ప అనుబంధానికి ముగింపు పలికాం. మా ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో మానసికంగా ఎంతో ఇబ్బందిపడ్డాం. దీనిపై సుదీర్ఘమైన ఆత్మపరిశీలన చేసుకున్న తర్వాత విడివిడిగా జీవించాలని నిర్ణయించుకున్నాం. మున్ముందు కూడా మేమిద్దరం ఒకరినొకరు గౌరవించుకుంటూ సహకరించుకోవాలనుకుంటున్నాం. ఈ నిర్ణయాన్ని మీరంతా సమర్ధిస్తారని, మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు'' అని మనోజ్‌ భావోద్వేగంతో లేఖలో పేర్కొన్నాడు.

నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న మనోజ్‌, ప్రణతి మధ్య సరైన సంబంధాలు లేవని, ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో ఆమె తన పుట్టింటికి అమెరికా వెళ్లిపోయిందని గతేడాది వార్తలు వచ్చాయి. ఐతే అవన్నీ పుకార్లేననని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్‌ క్లారిటీ ఇచ్చారు. తాజాగా తామిద్దరం కలిసుండటం లేదని, విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా సోషల్‌మీడియాలో వెల్లడించారు మనోజ్‌. ఫ్యామిలీ ఫ్రెండ్‌ ప్రణతిని ప్రేమించిన మనోజ్‌ పెద్దల అంగీకారంతో 2015లో వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్ల నుంచే వీళ్లిద్దరూ విడివిడిగా ఉంటున్నారని కొన్నేండ్లు ప్రచారం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ప్రణతి చాలా రోజుల పాటు అమెరికాలోనే ఉన్నారు. వీరిద్దరి అంగీకారం, ఇరు కుటుంబాల మధ్య చర్చల అనంతరం లీగల్‌గా విడిపోయారు.

Friday, October 4, 2019

ఆర్టీసీ సమ్మె షురూ..


దీంతో దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో విధులు నిర్వహిస్తున్న వారు శుక్రవారం మధ్యాహ్నం ఉన్న పళంగా విధుల నుంచి వైదొలిగారు. దూరప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసుల డ్రైవర్లు విధులు బహిష్కరించారు. దీంతో శుక్రవారమే సమ్మె మొదలైనట్లయింది. శుక్రవారం నాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొలిక్కి రాకపోవటంతో ఈ సర్వీసులు నడిపే పరిస్థితి లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాకపోతే కొన్ని ప్రాంతాలకు ఏపీ బస్సులు రావటంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు.
బుధ, గురువారాల్లో జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనటంతో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన చర్చలపై అందరి దృష్టి నిలిచింది. ఇటు కార్మిక సంఘాలు బెట్టు వీడటమో, అధికారుల కమిటీ మెట్టు దిగటమో జరిగి సమ్మె తప్పుతుందని ప్రయాణికులు ఎదురు చూశారు. ఆదివారం సద్దుల బతుకమ్మ కావడంతో లక్షల మంది సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో జనం ఊళ్లకు వెళ్లినా, ఉద్యోగులు శనివారమే పయనమవుతున్నారు. సరిగ్గా అదే రోజు సమ్మె మొదలు కానుండటంతో శుక్రవారం టెన్షన్‌తో గడిపారు. సమ్మె లేదనే శుభవార్త కోసం ఎదురు చూశారు.  కాగా, నిర్ధారిత సమయంలో హామీలు నెరవేరుస్తామంటూ లిఖిత పూర్వకంగా స్పష్టమైన హామీ ఇస్తే సమ్మె యోచన విరమణపై ఆలోచిస్తామని కార్మిక సంఘాలు గట్టిగా డిమాండ్‌ చేశాయి. కానీ ఆర్థిక పరమైన అంశంతో ముడిపడ్డ డిమాండ్లపై ఉన్నఫళంగా లిఖిత పూర్వక హామీ సాధ్యం కాదని, దసరా తర్వాత మళ్లీ చర్చలు ప్రారంభిద్దామని, అప్పటి వరకు సమ్మెను వాయిదా వేసుకోవాలని అధికారుల కమిటీ స్పష్టం చేసింది. దీంతో కమిటీ తమ మాట వినదని, కార్మిక సంఘాల జేఏసీ చర్చలను బహిష్కరించి అక్కడి నుంచి నిష్కమించింది.
ప్రైవేటు డ్రైవర్ల చేతికి స్టీరింగ్‌ 
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డ్రైవర్ల గుర్తింపు బాధ్యతను గురువారమే ఐఏఎస్‌ అధికారుల కమిటీ రవాణ శాఖకు అప్పగించింది. స్థానిక మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు తమ వద్ద ఉన్న డ్రైవర్ల వివరాల ఆధారంగా వారికి సమాచారం అందించి పిలిపించారు. 18 నెలలు, అంత కంటే ఎక్కువ కాలం క్రితం హెవీ మోటార్‌ వెహికిల్‌ లైసెన్సు తీసుకుని ఉన్న వారిని అర్హులుగా పేర్కొన్నారు. వారి డ్రైవింగ్‌ నైపుణ్యాన్ని పరిశీలించి, గతంలో యాక్సిడెంట్‌ కేసులు లేకుంటే వారి పేరును ఆర్టీసీ అధికారులకు సిఫారసు చేస్తున్నారు.
            అలా వచి్చన డ్రైవర్లు శనివారం ఉదయం 4 గంటల కల్లా డిపోలకు రావాల్సి ఉంది. పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని కండక్టర్లుగా తీసుకుంటున్నారు. ఈ తాత్కాలిక డ్రైవర్లకు రోజుకు రూ.1,500, కండక్టర్లకు రూ.వెయ్యి చెల్లించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అయితే వారి చేతికి పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సులు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. డీలక్స్‌ బస్సులపై తర్జనభర్జన పడుతున్నారు. వేగంగా వెళ్లటంతోపాటు ఖరీదు కూడా ఎక్కువ ఉండే సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్‌ బస్సులను వారి చేతికి ఇవ్వొద్దని నిర్ణయించారు.

Wednesday, October 2, 2019

‘సైరా నరసింహారెడ్డి’ మూవీ రివ్యూ

 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ కొత్తది కాదని అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల కథలను వెండితెరపై చూశాం. అయితే మొట్టమొదటి యోధుడు.. రేనాటి వీరుడైన నరసింహా రెడ్డి గురించి ఇంతవరకు ప్రపంచానికి అంతగా తెలీదు. ఇదే ఈ సినిమాకు కొత్త పాయింట్. ఈ పాయింటే మనల్ని సినిమా చూసేలా చేస్తుంది. 61 మంది పాలేగాళ్ల ను ఏకం చేసి బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురు వెళ్లాలని ప్రయత్నిస్తుంటాడు నరసింహా రెడ్డి. ఈ కథలో సిద్దమ్మ, లక్ష్మీ పాత్ర ఏంటి? స్వాతంత్ర్య సమరం కోసం అందరినీ నరసింహారెడ్డి ఏకతాటి పైకి ఎలా తెచ్చాడు? ఆ క్రమంలో అతనికి ఎదురైన సంఘటనలు ఏంటి? అన్నదే మిగతా కథ.
 చిరంజీవి తరువాత అంతగా పండిన పాత్ర అంటే అవుకు రాజు కిచ్చా సుదీప్‌దే. విభిన్న కోణాలను చూపిస్తూ.. అవసరమున్న చోట ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌కు గురి చేస్తారు. గురువు పాత్రలో గోసాయి వెంకన్నగా అమితాబ్‌ గౌరవ పాత్రలో నటించారు. కనిపించింది కొన్ని సీన్స్‌లోనైనా.. తెరపై అద్భుతంగా పడించారు. వీరా రెడ్డిగా జగపతి బాబు చక్కగా నటించాడు. క్లైమాక్స్‌లో జగపతి బాబు కంటతడి పెట్టిస్తాడు. విజయ్‌ సేతుపతి పాత్ర నిడివి తక్కువే అయినా రాజా పాండిగా నమ్మిన బంటు పాత్రలో ఒదిగిపోయాడు. సిద్దమ్మ పాత్రలో నయనతార.. కనిపించింది ఐదారు సీన్లే అయినా.. తన ముద్ర కనిపిస్తుంది. ఇక లక్ష్మీ పాత్రలో నటించిన తమన్నా అందర్నీ ఆకట్టుకుంటుంది. తన పాత్ర ముగింపు సినిమాను మలుపు తిప్పుతుంది. ఇక రవికిషన్‌, బ్రహ్మాజి, అనుష్క, ఇలా అందరూ తమ పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ
అందరికీ తెలిసిన కథనే ప్రేక్షకలక నచ్చే, మెచ్చే విధంగా తీయడంలోనే దర్శకుడి ప్రతిభ కనబడుతుంది. అందులోనూ చరిత్ర పుటల్లో అంతగా లేని నరసింహా రెడ్డి కథను, నేటి తరానికి దగ్గరయ్యేలా తీశాడు సురేందర్‌ రెడ్డి. నరసింహా రెడ్డి గురించి చెప్పడానికి, బ్రిటీష్ వాళ్ళ ఆగడాలు, అప్పటి జనాల స్థితిగతులు చెప్పడానికే ఫస్ట్ హాఫ్‌ను ఎక్కువగా వాడుకున్నాడు దర్శకుడు. ప్రతీ షాట్‌లో క్యారెక్టర్‌ ఎలివేట్ అయ్యేలా చిత్రీకరించాడు. ప్రతీ సీన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేసాడు. ఈ కథ చెప్పడానికి దర్శకుడు ఎంచుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. మొదటి సీన్‌ నుంచి చివరి వరకు తాను రాసుకున్న కథనం ఆకట్టుకుంటుంది.
 ద్వేషం కోసం కాదు దేశం కోసం నిలబడు లాంటి ఎన్నో అద్భుతమైన, అర్థవంతమైన మాటలను సాయి మాధవ్‌ బుర్రా  రాశాడు.  సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. అమిత్‌ త్రివేది అందించిన పాటలు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. ఉన్నవి రెండు పాటలే అయినా.. వాటిని తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు ముగ్దులు కావాల్సిందే. సైరా క్యారెక్టర్‌ అంతగా ఎలివేట్‌ అయిందంటే.. ప్రతీ సీన్‌తో ప్రేక్షకులు ఎమోషన్‌గా కనెక్ట్‌ అయ్యారంటే జూలియస్‌ ప్యాకియమ్‌ అందించిన నేపథ్య సంగీతమే అందుకు కారణం. రత్నవేలు పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. తన తండ్రి కోరిక నేరవేర్చేందుకు రామ్‌ చరణ్‌ పడిన కష్టం, చేసిన ఖర్చు తెరపై కనపిస్తుంది. చిరంజీవి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా చెప్పుకునే ఈ సైరాను.. విజువల్‌ వండర్‌గా తెరకెక్కించిన తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. నిర్మాణంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఖర్చు పెట్టాడు. దానికి తగ్గ ఫలితం వెండితెరపై కనబడుతుంది. ఎడిటింగ్‌, క్యాస్టూమ్‌, ఆర్ట్‌ ఇలా అన్ని విభాగాలు సినిమాను విజయవంతం చేయడంలో సహాయపడ్డాయి