Tuesday, January 29, 2019

టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల


 ఆస్ట్రేలియాలో 2020లో నిర్వహించే పురుషుల, మహిళల ప్రపంచ కప్‌ టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ జట్లు ఉన్న కఠినమైన గ్రూప్‌ 2లో కోహ్లీ సేనను చేర్చారు. ఈ గ్రూప్‌లో ఆ మూడు జట్లతోపాటు మరో రెండు అర్హత సాధించే జట్లు ఉండనున్నాయి. దక్షిణాఫ్రికాతో టీమిండియా తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. మరో వైపు భారత మహిళల జట్టును గ్రూప్‌ ఏలో చేర్చారు. తొలి మ్యాచ్‌లోనే భారత్‌ కఠిన జట్టును ఎదుర్కోనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌, ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. 


             ఆస్ట్రేలియాలో తొలిసారిగా మహిళల, పురుషుల టీ20 ప్రపంచ కప్‌లను ఒకే ఏడాది, ఒకే దేశంలో నిర్వహిస్తున్నారు. ఈ రెండు టోర్నీల ఫైనల్‌ మ్యాచ్‌లను మెల్‌బోర్న్‌ స్టేడియంలోనే నిర్వహించనుండటం విశేషం. మహిళల ప్రపంచ కప్‌లో మొత్తం పది జట్లు 23 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భారత్‌ తలపడనున్నాయి. ఇక పురుషుల ప్రపంచకప్‌ అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు జరగనుంది.

Friday, January 25, 2019

గోవా బీచుల్లో మద్యపాన నిషేధం



 ఇకపై గోవా బీచుల్లో బహిరంగంగా మద్యం సేవించినా, వంటలు వండినా రూ.2000ల జరిమానా విధించనున్నారు. ఇందుకోసం అక్కడి రాష్ట్రప్రభుత్వం పర్యాటక చట్టాల్లో చేసిన మార్పులకు కేబినెట్‌ గురువారం ఆమోదముద్ర వేసింది. దీనిపై గోవా పర్యటకశాఖ మంత్రి మనోహర్‌ అజ్గోంకర్‌ మాట్లాడుతూ.. ఈ బిల్లును జనవరి 29 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదిస్తామని పేర్కొన్నారు. గోవాకు వచ్చే పర్యాటకుల్లో కొద్దిమంది పగిలిన మద్యం సీసాల్ని బీచ్‌లో విసురుతున్నారని, అక్కడే వంటలు కూడా వండుతున్నారని చెప్పారు. దీనిని నిషేధించే ఉద్దేశంతోనే ప్రస్తుతం ఈ బిల్లును తీసుకొచ్చామని చెప్పారు. ఇకపై బీచుల్లో బహిరంగంగా మద్యం సేవించడం నిషేధిస్తామని, అక్కడికి మద్యం సీసాలు తీసుకెళ్లేందుకు కూడా అనుమతించమని చెప్పారు. బహిరంగంగా వంటలు వండటాన్ని కూడా నిషేధిస్తున్నామని, ఒక వేళ ఎవరైనా అతిక్రమణలకు పాల్పడితే రూ.2000 జరిమానా విధిస్తామన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో వారిని అదుపులోకి తీసుకొని మూడు నెలల జైలు శిక్ష విధిస్తామని చెప్పారు. బృందాలుగా ఈ నిబంధనలను అతిక్రమించే వారికి రూ.10వేల వరకూ జరిమానా ఉంటుందని చెప్పారు. ఇటీవలి కాలంలో గోవాలో బీచ్‌ల నిర్వహణ సరిగాలేదని పర్యటక ప్రతినిధులు కొందరు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నూతన చట్టం అమల్లోకి వచ్చాక ప్రత్యేకంగా ఓ వాట్సప్‌ నెంబరు ద్వారా అతిక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించి, 12 గంటల్లోగా వారిపై చర్యలు తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి అజ్గోంకర్‌ తెలిపారు.

Thursday, January 24, 2019

మరో కట్టప్ప!

  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రంలో కీలక పాత్ర చేస్తావా? అని దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి అడగ్గానే వెంటనే ఒప్పుకొన్నానని అంటున్నారు ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రెండో భారీ షెడ్యూల్‌ ఇటీవల ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లోనే సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారట. ఈ విషయాన్ని ఆయన ఓ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘నేను దర్శకత్వం వహించిన ‘నాడోడిగల్‌’ సినిమా చూసి రాజమౌళి సర్‌ నాకు ఓ పెద్ద మెసేజ్‌ పెట్టారు. అప్పటినుంచి నేను రాజమౌళి సర్‌తో టచ్‌లో ఉన్నాను. ఇటీవల ఆయన నన్ను తన ఇంటికి ఆహ్వానించారు. తన కుటుంబీకుల్ని పరిచయం చేశారు. అప్పుడే నాకు ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా గురించి తెలిసింది. ఇందులో ఓ కీలక పాత్ర ఉంది చేస్తావా? అని అడిగారు. నేను క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకున్నాను. అయితే ముందు ఆయన స్క్రిప్ట్‌ చదవాలని చెప్పారు. సరేనన్నాను’ అని వెల్లడించారు.
             ప్రస్తుతం చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో ముగ్గురు కథానాయికలకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. సమంత, కీర్తి సురేశ్, ప్రియమణి, అదితిరావు హైదరి పేర్లు వినపడుతున్నాయి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్‌ హక్కులు రికార్డు స్థాయిలో రూ.132 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

Wednesday, January 23, 2019

చక్కర్లు కొట్టిన కోహ్లి, ధోని

Virat Kohli And MS Dhoni Enjoyed Riding A Segway - Sakshi

 న్యూజిలాండ్‌ గడ్డపై శుభారంభం చేసిన టీమిండియా మంచి ఊపుమీద ఉంది. బుధవారం జరిగిన మొదటి వన్డేలో కివీస్‌ను చిత్తుగా ఓడించి కోహ్లి సేన భారీ విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత మెక్‌లీన్‌ మైదానంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని కాసేపు సందడి చేశారు. సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ టూవీలర్‌ ‘సెగ్‌వే’పై చక్కర్లు కొట్టారు. (కివీస్‌ గడ్డపై తొలి వన్డే మనదే!)

ముందుగా కోహ్లి దీనిపై హుషారుగా ప్రయాణించాడు. రకరకాల విన్యాసాలు చేస్తూ అక్కడున్నవారిని అలరించాడు. తర్వాత ధోని కూడా తనదైన శైలిలో కూల్‌గా చక్కర్లు కొట్టాడు. బీసీసీఐ ట్వీట్‌ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా మైదానం సిబ్బంది సులువుగా ప్రయాణించేందుకు ‘సెగ్‌వే’ను వినియోగిస్తారు. కాగా, భారత్‌-న్యూజిలాండ్‌ రెండో వన్డే ఈనెల 26న జరగనుంది.

Tuesday, January 22, 2019

‘మా ఇద్దరినీ అంతం చేయాలని చూస్తున్నారు’

 గ్లామరస్‌ మాఫియా కారణంగానే తమ సినిమాకు థియేటర్లు దొరకలేదని, అందుకే పరాజయం చవిచూడాల్సి వచ్చిందని బాలీవుడ్‌ మూవీ ‘రంగీలా రాజా’ నిర్మాత, సెంట్రల్‌ బోర్డు ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(సీబీఎఫ్‌సీ) మాజీ చైర్మన్‌ పహ్లజ్‌ నిహలానీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘ సెన్సార్‌ బోర్డు చైర్మన్‌గా ఉన్న సమయంలో కఠినంగా వ్యవహరించినందు వల్లే కొంతమంది నన్ను టార్గెట్‌ చేశారు. నా కారణంగా హీరో గోవిందాను ఇబ్బంది పెడుతున్నారు. నన్ను, గోవిందాను అంతం చేయాలని చూస్తున్న ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలుసు. ఇండస్ట్రీ మొత్తం కొంతమంది చేతుల్లో చిక్కుకుపోయింది. కార్పోరైటేజషన్‌ పేరుతో నా వంటి నిర్మాతలను అణగదొక్కాలని చూస్తున్నారు. అయినా భయపడేది లేదు. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధిస్తా’ అని వ్యాఖ్యానించారు.
ఇక ఈ విషయం గురించి మాట్లాడిన గోవిందా.. ‘ గత తొమ్మిదేళ్లుగా పరిస్థితి ఇలాగే ఉంది. నా సినిమాలకు థియేటర్లు దొరకకుండా కొంతమంది అడ్డుతగులుతున్నారు. నేనేమీ రాజకీయాల్లో లేనుకదా. దయచేసి నా పనిని సక్రమంగా చేసుకోనివ్వండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా గోవిందా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రంగీలా రాజా’ సినిమా శుక్రవారం విడుదలైంది.