Sunday, March 20, 2016

ఔను... నేనంతే!

 సినిమాల్లో తప్ప నయనతార విడిగా కనిపించరు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరు. యాడ్స్‌లో నటించరు. అప్పుడెప్పుడో ఓ యాడ్‌లో నటించారంతే. పబ్లిక్ దర్శనాలు ఎక్కువ ఇవ్వకపోవడానికి నయనతార కారణాలు నయనతారకున్నాయి. అయితే, ఇలా చేయడం వల్ల నయనతార ఫ్రెండ్లీ టైప్ కాదనీ, గర్వం అనీ, పొగరనీ చాలామంది అనుకుంటారు. ఈ విషయం గురించి నయనతార ప్రస్తావిస్తూ, ‘‘అవును. నేను పొగరుబోతునే! అహంకారిని కూడా! అయితే, నాతో వేళాకోళంగా ప్రవర్తించే వాళ్ల దగ్గరే అలా ఉంటాను. మిగతావాళ్ల దగ్గర అలా ఉండాల్సిన అవసరం నాకేంటి?’’ అన్నారు. తమిళ, తెలుగు, మలయాళ భాషా చిత్రాలతో తెగ బిజీగా ఉన్న ఈ మలయాళ సుందరి తన స్వభావం గురించి ఇంకా చాలానే చెప్పారు.            ‘‘నాతో సినిమాలు చేసినవాళ్లకూ, చేసేవాళ్లకూ నేనెంత ఫ్రెండ్లీగా ఉంటానో తెలుసు! నా గురించి నేను ఎక్కువ చెప్పుకుంటున్నానని అనుకోకపోతే ఒక్క మాట. నాది చాలా స్వీట్ నేచర్! షూటింగ్ లొకేషన్లో చాలా సరదాగా ఉంటాను. అందరితోనూ మాట్లాడుతుంటాను’’ అని ఆమె తన వాదన వినిపించారు. ఇన్నీ చెబుతూనే, ఒక్క విషయం కుండబద్దలు కొట్టారు. ‘‘ఏమైనా, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. నాకు మర్యాద ఇస్తే... నేనూ వాళ్ళకు మర్యాద ఇస్తా. ఒకవేళ నా దగ్గర మర్యాదగా నడుచుకోకూడదని ఎవరైనా నిశ్చయించుకుంటే, నా నుంచి కూడా ఇక మర్యాద ఎక్స్‌పెక్ట్ చేయొద్దు’’ అన్నారు.

No comments:

Post a Comment