Wednesday, November 30, 2016

రజనీతో ఆ ఛాన్స్ ఎవరికో?

  రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శ్వాశత శత్రువులు ఉండరంటారు. ఈ నానుడి సినిమా రంగానికీ వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు పూసుకుని తిరిగిన వారు రేపు మాటల కత్తులు దూసుకుంటారు. ఇదీ ఇక్కడి నైజం. ఇక వృత్తి రీత్యా పోటీ అన్నది ఎటూ ఉంటుంది. ఈ విషయంలో సొంతం లేదు, స్నేహం లేదు. కథానాయికల విషయానికి వస్తే ఒకప్పుడు నటి విజయశాంతి చిత్రానికి పూజ జరిగిందంటే చాలు తెలుగు, తమిళ భాషల్లో బిజినెస్ జరిగిపోయేది. లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోయారు. ఆ స్టేజీకి నటి నయనతార చేరుకున్నారు. ఈ మాలీవుడ్ సంచలన నటి చిత్రం ప్రారంభ దశలోనే అన్ని ఏరియాలు వ్యాపారం పూర్తయిపోతోంది.
ఆరంభంలో అయ్యా, చంద్రముఖి చిత్రాల్లో పక్కింటి అమ్మారుు ఇమేజ్‌ను సంపాదించుకున్నా, ఆ తరువాత గజిని, వల్లవన్ చిత్రాల్లో అంగాంగ ప్రదర్శనలతో గ్లామర్ డాల్‌గా మారిపోయారు. అలా కమర్షియల్ చిత్రాల నాయకిగా పేరు తెచ్చుకున్న నయనతారను మాయ చిత్రం హీరోరుున్ ఓరియెంటెడ్ చిత్రాల నాయకిగా మార్చేసింది. అది మొదలు లేడీ సూపర్‌స్టార్ పట్టంతో వెలిగిపోతున్నారు.

ప్రస్తుతం దోర, ఇమైక్కా నోడిగళ్, ఆరమ్, కొలైదీర్ కాలం చిత్రాలన్నీ హీరోరుున్ సెంట్రిక్ కథా చిత్రాలే నయనను వరించడం విశేషం. అరుుతే స్టార్ హీరోల నుంచి యువ నటుల సరసనా నటిస్తూ ఆల్‌రౌండర్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. కోలీవుడ్‌లో తన రెండో చిత్రమే సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా నటించిన నయనతార, ఆ తరువాత శివాజీ చిత్రంలో బల్లేలక్క పాటలో మెరిశారు. తాను టాప్ హీరోరుున్‌గా వెలుగొందుతుండగానే మరోసారి సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రొమాన్స్‌ చేయాలని నయన్ ఆశపడుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.
అంతే కాదు కబాలి చిత్ర ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ధనుష్ నిర్మించనున్న తాజా చిత్రంలో చాన్స్‌ కొట్టేయడానికి ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. సూపర్‌స్టార్ సరసన ఒక్క చిత్రంలో అరుునా నటించాలని చాలా కాలంగా తహతహలాడుతున్న చెన్నై చిన్నది త్రిష ఈ సారి ఆయనతో నటించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. విశేషం ఏమిటంటే ఈ ముద్దుగుమ్మలిద్దరూ నటుడు ధనుష్‌కు సన్నిహితులే.
ఇంతకు ముందు నయనతార యారడీ నీ మోహినీ చిత్రంలో ధనుష్‌తో రొమన్స్‌ చేశారు. అంతే కాదు ఆయన నిర్మించిన నానుమ్ రౌడీదాన్ చిత్రంలో నాయకి నయనతారే. ఇక త్రిష ఇటీవలే ధనుష్‌తో కలిసి కొడి చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో వీరిద్దరిలో ఎవరిని రజనీకాంత్‌కు జంటగా ఎంచుకోవాలన్న విషయంలో ధనుష్ జుట్టు పీక్కుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏమిటంటే నయనతార, త్రిషలిద్దరూ నెచ్చెలిలే. అయినా వృత్తి విషయంలో పోటీనే అని ఈ ముద్దుగుమ్మలిద్దరి భావన.

ఇలాంటి పరిస్థితుల్లో ఇక సూపర్ చాన్స్‌ ఎవరు కొట్టేస్తారో చూద్దాం. నయనతార గురించిన కొత్త వార్త ఏమిటంటే ఇటీవలే స్థానిక ఎగ్మూర్‌లో పలు అంతస్తులు గల అధునాతన భవన సముదాయంలో ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న దర్శకుడు విఘ్నేశ్‌శివతో కలిసి అందులో నివసిస్తున్న నయనతార ఉదయం షూటింగ్‌కు బయలుదేరినప్పటి నుంచి మళ్లీ షూటింగ్ ముగించుకుని తిరిగి ఇంటికి చేరే వరకూ బాడీగార్డులు రక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారట. మధ్యలో ఈ బ్యూటీ దగ్గరకు ఎవరూ కూడా రాలేరట. ఈ ఏర్పాట్లను నయనతారను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారంలో ఉన్న యువ దర్శకుడు విఘ్నేశ్‌ శివనే చేశారన్నది కోలీవుడ్‌లో వినిపిస్తున్న గుసగుసలు.

Tuesday, November 29, 2016

నా మనసులో ప్రేమకు చోటు లేదు

  నా మనసులో ప్రేమకు చోటు లేదు అంటున్నారు నటి తమన్నా భాటియా. సాధారణంగా గాసిప్స్‌కు దూరంగా ఉండే ఈ మిల్కీబ్యూటీ ఇటీవల ప్రభుదేవాతో చెట్టాపట్టాల్ అంటూ వదంతులు హల్‌చల్ చేయడం చాలా మందికి ఆసక్తిని కలిగించింది. అయితే తాను మాత్రం ప్రస్తుతానికి ప్రేమ కోసం సమయాన్ని కేటాయించే పరిస్థితిలో లేనని తమన్నా అంటున్నారు.
 
దీని గురించి ఈ బ్యూటీ కాస్త విపులంగా తెలుపుతూ తాను ఇంకా పలు హీరోలతో నటించాల్సి ఉందన్నారు. అదే విధంగా తన బయోగ్రఫీ కథలో, మరిన్ని కథా బలం ఉన్న చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానని అన్నారు. స్టార్ హీరోలకు జంటగా, భారీ బడ్జెట్ కథా చిత్రాలలో నటిస్తున్నప్పటికీ, స్టార్‌డమ్ లేని నటులతో మంచి కథా చిత్రాలలో నటించాలన్న ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు. 
   తనకు తానే ఛాలెంజ్ చేసుకునే విధంగా నటించాలని, అప్పుడే తనలో నిద్రాణమై ఉన్న నటనా ప్రతిభను వెలికి తీసే అవకాశం ఉంటుందన్నారు. ఈ ఏడాదిలో నటించిన ఊపిరి, ధర్మదురై, దేవి చిత్రాలు ప్రత్యేకత సంతరించుకున్నాయని చెప్పారు. ఇక పోతే ఒకే ఛాయలున్న కథా పాత్రల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అదే విధంగా ద్విభాషా చిత్రాల్లో నటించడానికి తనకు అభ్యంతరం లేదు గానీ, త్రిభాషా చిత్రాల్లో నటించనని చెప్పారు. అలాంటి చిత్రాల్లో ఆయా భాషల నేటివిటీకి తగ్గట్టుగా నటించాల్సి ఉంటుందని, అలా నటించడం చాలా చాలా కష్టమని, అలసటకు గురి కావాల్సి ఉంటుందని అన్నారు.

Saturday, November 26, 2016

చరణ్ కోసం చెమటోడుస్తోంది

 ధృవ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావటంతో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ లవ్ స్టోరి చేస్తున్నట్టుగా ప్రకటించాడు చరణ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా రాశీఖన్నాను ఫైనల్ చేయాలని భావిస్తున్నారు.
ఇప్పటికే రాశీఖన్నాతో ఫోటో షూట్ కూడా చేసిన సుకుమార్, బరువు తగ్గితే హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని కండిషన్ పెట్టాడట. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం కావటంతో ఎలాగైన సాధించాలని భావిస్తోంది రాశీ. అందుకే వీలైనంత త్వరగా బరువు తగ్గి, స్లిమ్ లుక్ లోకి మారేందుకు జిమ్ లో చెమటోడుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ధృవ డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ధృవ రిలీజ్ తరువాత సుకుమార్, చరణ్ ల కాంబినేషన్ లో సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Friday, November 25, 2016

ఇప్పుడు బాబాయ్‌తో?

 ‘ముకుంద’ చిత్రంలో అబ్బాయ్ వరుణ్‌తేజ్‌తో జతకట్టిన గోపికమ్మ పూజా హెగ్డే తాజాగా బాబాయ్ పవన్ కల్యాణ్ సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుందని ఫిల్మ్‌నగర్ టాక్. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఓ చిత్రం నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు పవన్‌తో జతకట్టనున్నారు. ఇప్పటికే కీర్తి సురేశ్ ఓ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. మరో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకోవాలనుకుంటున్నారట.
ఆ సంగతలా ఉంచితే ‘ముకుంద’ తర్వాత హిందీలో ‘మొహెంజోదారో’ చేసిన పూజా హెగ్డే ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ‘డీజే’(దువ్వాడ జగన్నాథమ్) చిత్రంలో నటిస్తోంది. ఇకపై తెలుగు సినిమాలపై ఆమె ఎక్కువగా దృష్టి సారించాలనుకుంటున్నారట.

Thursday, November 24, 2016

ఆగ్రహం వ్యక్తంచేసిన రకుల్‌

  కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి ఇంట వైభవంగా నిర్వహించిన కుమార్తె వివాహంపై ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలో టాలీవుడ్‌ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ డ్యాన్స్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు రకుల్‌ప్రీత్‌ ఇంటిపై కూడా దాడి చేశారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజంలేదని రకుల్‌ తాజా ఇంటర్వ్యూలో చెబుతూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘జనాలు ఈ విషయాన్ని ఎందుకు వదిలేయరో నాకు తెలియడం లేదు. తొలుత నేను డ్యాన్స్‌ చేయడానికి ఒకటికి మూడింతలు పారితోషికం తీసుకున్నానన్నారు. తర్వాత ఐటీ దాడి జరిగిందని ప్రచారం చేశారు. ఇలా చేయడం చాలా కోపాన్ని తెప్పిస్తోంది. ఈ పుకార్లతో మా నాన్న చాలా బాధపడుతున్నారు. ఎవరూ నిజానిజాలను పరిశీలించడం లేదు, కనీసం నన్ను అడగడం లేదు. నేను మీడియాతో చాలా ఓపెన్‌గా ఉంటాను. నాజీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని వారితో పంచుకుంటాను’ అని రకుల్‌ అన్నారు.

Wednesday, November 23, 2016

ఫ్లాప్ డైరెక్టర్ తో ఎన్టీఆర్..?

 జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్ అయి రెండున్నర నెలలు దాటిపోయినా ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమాను ఇంత వరకు ఎనౌన్స్ చేయలేదు. జనతా గ్యారేజ్ తో కెరీర్ లో బిగెస్ట్ హిట్ సాధించిన జూనియర్ నెక్ట్స్ సినిమా ఏ జానర్ లో చేయాలో తేల్చుకోలేకపోతున్నాడు. దీంతో చాలా మంది దర్శకులు జూనియర్ తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నా.. ఎవరికీ ఓకె చెప్పటం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా డైరెక్టర్స్ లిస్ట్ లో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించగా.. తాజాగా ఓ ఫ్లాప్ సినిమా దర్శకుడితో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఉంటుదన్న టాక్ వినిపిస్తోంది.
పవర్ సినిమాతో ఇండస్ట్రీలోకి పవర్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు బాబీ. తొలి సినిమాతోనే మంచి విజయం సాధించిన బాబీ రెండో సినిమాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశాడు. పవన్ హీరోగా సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాను తెరకెక్కించిన బాబీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.  ఆ సినిమాకు డిజాస్టర్ టాక్ రావటంతో బాబీ కెరీర్ కష్టాల్లో పడింది. ఆ సమయంలో తన తొలి సినిమా హీరో రవితేజతో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు.

రవితేజ ప్రస్తుతం సినిమా చేసే మూడ్ లో లేకపోవటంతో ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఎన్టీఆర్ కు లైన్ కూడా వినిపించిన బాబీ ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. జనతా గ్యారేజ్ లాంటి భారీ హిట్ తరువాత జూనియర్, బాబీతో సినిమాకు అంగీకరిస్తాడా..? లేక ఇది కూడా గతంలో వచ్చిన వార్తల్లాగే గాసిప్ అని కొట్టి పారేస్తారా..? చూడాలి.

Monday, November 21, 2016

గుడ్‌ న్యూస్‌; విత్‌ డ్రా పరిమితి పెంపు

  నోట్ల కష్టాలు తొలగించేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) మరిన్ని ఉపశమన చర్యలు ప్రకటించింది. కరెంట్‌, ఓవర్‌ డ్రాఫ్ట్‌, క్యాష్‌ క్రెడిట్‌ ఖాతాలు కలిగిన వారికి నగదు విత్‌ డ్రా పరిమితిని వారంలో రూ. 50 వేలకు పెంచింది. వీరికి రూ. 2 వేల నోట్లు ఇస్తారు. కనీసం మూడు నెలల నుంచి ఈ ఖాతాలు నిర్వహిస్తున్న వారికే వారంలో రూ. 50 వేలు తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. వ్యక్తిగత ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాలు కలిగిన వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది.
రైతులకు కూడా ఊరట కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దుకాణాల్లో రద్దు చేసిన పాత 500 నోట్లతో రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ధ్రువీకృత గుర్తింపు కార్డు చూపించి అన్నదాతలు విత్తనాలు కొనుగోలు చేయొచ్చు. కేంద్ర, రాష్ట్ర విత్తన సంస్థలు, వ్యవసాయ యూనివర్సిటీలు, ఐసీఏఆర్‌ సంస్థల నుంచి విత్తనాలు కొనుక్కోవచ్చు. వివాహాలకు రేపటి నుంచి రూ. 2.5 లక్షల విత్‌ డ్రా సదుపాయం కల్పించనున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఇంతకుముందే ఈ ప్రకటన చేసినప్పటికీ నగదు లేకపోవడంతో ఇప్పటివరకు ఇది అమలు కాలేదు. కాగా, నవంబర్‌ 10 నుంచి 18 వరకు బ్యాంకు ఖాతాల నుంచి ప్రజలు 1.03 లక్షల కోట్లు విత్‌ డ్రా చేశారని ఆర్బీఐ వెల్లడించింది.

Sunday, November 20, 2016

తొలి సినిమా రిలీజ్ కు ముందే క్రేజీ ఆఫర్స్


  తమిళనాట త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఓ చిన్న సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతుంది మేఘా ఆకాష్. ఒరు పాక్క కథై అనే సినిమాతో తొలిసారిగా వెండితెర మీద మెరిసేందుకు ప్లాన్ చేసుకుంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకుండానే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మను క్రేజీ ఆఫర్స్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమాకు మేఘాను హీరోయిన్ గా తీసుకున్నారు.

అదే సమయంలో నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు కూడా మేఘానే హీరోయిన్ అంటూ ఎనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు మరో భారీ చిత్రంలో అమ్మడి ఛాన్స్ వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. అక్కినేని నటవారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న రెండో సినిమాలో మేఘాను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అఖిల్ సినిమా కూడా మేఘా ఖాతాలో పడితే ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోవడం ఖాయం.

Saturday, November 19, 2016

నాని కూడా ఆ లిస్ట్ లో చేరబోతున్నాడు..!

హీరోగా మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని, త్వరలో పర్సనల్ లైఫ్ లో కూడా ప్రమోషన్ పొందబోతున్నాడు. ఇటీవల వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్న ఈ హీరో పర్సనల్ లైఫ్ లో అంతకన్నా ఎక్కువ ఆనందంగా ఉన్నాడు. ప్రస్తుతం నేను లోకల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ నేచ్యురల్ యాక్టర్ త్వరలో తండ్రిగా ప్రమోషన్ తీసుకుంటున్నాడు.

ఈ జనరేషన్ హీరోల్లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, అల్లరి నరేష్, ఆది లాంటి హీరోలు ఇప్పటికే ఫాదర్స్ లిస్ట్ లో చేరిపోగా తాజాగా నాని కూడా ఆ లిస్ట్ లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. మరికొద్ది నెలల్లో నాని భార్య అంజన తొలి బిడ్డకు జన్మనివ్వబోతోంది. నాని, అంజనాల కుటుంబ సభ్యులు తన కుటుంబంలోకి రానున్న కొత్త వెలుగుకు స్వాగతం పలకటానికి ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.

Friday, November 18, 2016

ప్రేమలో విఫలమైతే విహారయాత్రలకు వెళ్తా

 ఆలియా భట్‌.. చిన్న వయసులోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టి అనతికాలంలోనే అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే.. తోటి నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు బీటౌన్‌లో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా తన టీనేజీ లవ్‌ బ్రేకప్‌ గురించి.. ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది.
‘‘నేను పదహారేళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రేమలో విఫలమయ్యా. ఆ బ్రేకప్‌ బాధలోంచి తేరుకోవడానికి స్నేహితులతో ఎక్కువగా గడిపేదాన్ని. కానీ ఇప్పుడు అలాంటిది జరిగితే విహార యాత్రలకు వెళ్తా లేదా నా పనిపై ఇంకాస్త ఎక్కువ దృష్టిపెడతా. ఓ వ్యక్తి నాకోసమే ఎక్కడైనా ఉంటే.. ఎప్పటికైనా తిరిగొస్తాడని నమ్ముతా. నా దృష్టిలో ప్రేమ అనే భావన రోజూ మారుతుంటుంది. ప్రేమ అనేది ఇద్దరు ప్రేమికుల మధ్యలో ఉన్నదే కాదు. స్నేహితుల మధ్య ఉండొచ్చు. నాకు నా పెంపుడు పిల్లిపై.. కాఫీపై కూడా ప్రేమ ఉంది’’ అంటూ తనదైన ప్రేమపాఠాలు చెప్పుకొచ్చింది ఆలియా.

దేవుడే మళ్లీ ఆహ్వానించాడు!

 ‘‘బైబిల్ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రమిది. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే చిత్రం అవుతుందనుకుంటున్నా. ‘కరుణామయుడు’ రేంజ్‌లో ఈ చిత్రం ఆడాలి’’ అని నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. సీనియర్ నటి దివ్యవాణి ప్రధానపాత్రలో ‘తొలి కిరణం’ జాన్‌బాబు దర్శకత్వంలో డి.శ్రీధర్‌రెడ్డి నిర్మిస్తున్న ‘నీ దేవుడే నా దేవుడు’ చిత్రం ఇటీవల ప్రారంభమైంది.
‘‘చారిత్రక చిత్రమిది. క్రీస్తు పూర్వం ఇజ్రాయిల్ దేశంలో జరిగిన అత్తాకోడళ్ల కథ’’ అని దర్శకుడు అన్నారు. ‘‘పదిహేనేళ్ల వయసు నుంచి సినిమాల్లో నటిస్తున్న నేను పెళ్లయ్యాక ఏడేళ్లు గ్యాప్ తీసుకున్నా. నాకిష్టమైన ఈ రంగానికి దేవుడు నన్ను మళ్లీ ఆహ్వానించాడు. నయోని అనే పాత్రలో కనిపిస్తా’’ అని దివ్యవాణి  చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: స్రవంతి.

Thursday, November 17, 2016

ఆ పెళ్లిలో రకుల్‌ డ్యాన్స్‌ చేసిందా?

 మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె బ్రహ్మణి వివాహం బుధవారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఆడిపాడినట్లు తెలుస్తోంది. రకుల్‌ వేదికపై డ్యాన్స్‌ చేస్తుండగా తీసిన వీడియోలను అభిమానులు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె పెళ్లిలో రకుల్‌ప్రీత్‌ అద్భుతంగా డ్యాన్స్‌ చేసిందని ట్వీట్‌ చేశారు. ఇలా పెళ్లిలో డ్యాన్స్‌ చేయడానికి ఆమె పెద్ద మొత్తంలో తీసుకున్నారని టాక్‌. ఇంతేకాదు ఇదే పెళ్లిలో ప్రియమణి, తమన్నా చిందేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Wednesday, November 16, 2016

పవన్‌ సరసన ఛాన్స్‌ కొట్టేసింది

  ‘నేను శైలజ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కథానాయిక కీర్తీసురేశ్‌ పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఈ విషయాన్ని కీర్తీసురేశ్‌ స్వయంగా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ప్రకటించారు. తన తర్వాతి చిత్రం పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌లతో కావడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగులో ఆయన స్వరాలు అందిస్తున్న తొలి చిత్రమిది. పవన్‌-త్రివిక్రమ్‌ కలయికలో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ ఘన విజయాలు సాధించడంతో ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. డిసెంబరు నుంచి ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ ‘కాటమరాయుడు’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కీర్తీసురేశ్‌ ‘భైరవ’, ‘నేను లోకల్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Monday, November 14, 2016

మహేష్ మూవీకి ఏ టైటిల్‌ పెడతారో?


  ప్రిన్స్‌ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్‌ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కున్న సినిమాకు టైటిల్‌ ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ పలుపేర్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా మరో రెండు పేర్లు విన్పిస్తున్నాయి. చట్టంలో పోరాటం, ఎనిమీ(శత్రువు) టైటిల్స్‌ పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే చిత్రయూనిట్ అధికారికంగా టైటిల్‌ ప్రకటించలేదు.

తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాకు ఇంతకుముందు వాస్కోడిగామా, అభిమన్యుడు, ఏజెంట్ శివ అనే పేర్లు వినిపించాయి. మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్ సింగ్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. హరీష్ జైరాజ్‌ సంగీతం అందిస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏ పేరు పెడతారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Saturday, November 12, 2016

కొత్త రూ.2వేల నోటుపై షాకింగ్ న్యూస్‌& కొత్త నోట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?

కొత్త రూ.2వేల నోటుపై షాకింగ్ న్యూస్‌

ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్‌.. ఉర్జిత్ ప‌టేల్ సంత‌కంతో  ప్రజల చేతుల్లో మిలమిలాడుతున్న 2వేల రూపాయ‌ల నోటుపై  షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.  నకిలీ  నోట్లకు చెక్ పెట్టేలా అత్యంత జాగ్రత్తగా  డిజైన్ చేసిన ఈ తాజా నోట్లలో అదనపు సెక్యూరిటీ ఫీచర్స్  పొందుపరచలేదన్న  వార్త కలకలం రేపుతోంది. సరిపడా సమయంలేక  భద్రతా లక్షణాలను పాత రూ. 500 నుంచి రూ. 1,000 నోట్ల మాదిరిగా ఉంచినట్టు సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.  హై సెక్యూరిటీ ఫీచర్స్ ను   జోడించడానికి పెద్ద కసరత్తు చేయాల్సి వస్తుందని,  ఈ  ప్ర్రక్రియకు కనీసం ఐదు నుంచి ఆరు సంవత్సరాల సమయం పడుతుందని ఆయన వివరించారు. 
ఇలాంటి ఎక్స్ ర్ సైజ్   చివరిసారి 2005 లో చేపట్టారన్నారు. వాటర్ మార్క్స్,  సెక్యూరిటీ థ్రెడ్, ఫైబర్,  గుప్త చిత్రం లాంటి  ఇతర భద్రతా ఫీచర్స్ చేర్చడానికి   అనేక అనుమతులు, ఫైనల్ గా క్యాబినెట్ ఆమోదం అవసరమని తెలిపారు.  నూతన నోట్ల నిర్ణయం  ఆరు నెలల క్రితం జరిగిందనీ , దీంతో భద్రతా లక్షణాలు మార్చే  సమయం  చాలక,  డిజైన్ మార్చినా, భద్రతా లక్షణాలను పాత నోట్ల మాదిరిగానే ఉంచినట్టు ఆ  అధికారి తెలిపారు.

మరోవైపు కొత్త కరెన్సీ నోట్లకు పాకిస్తాన్ నుంచి పొంచి వున్న నకిలీ  ముప్పుపై  ప్రశించినపుడు.. అసాధ్యమని తేల్చి పారేశారు..డిజైన్ మాత్రమే మార్చబడింది తప్ప భద్రతా లక్షణాలు అలాగే ఉన్నాయన్నారు. పాకిస్థాన్  ప్రభుత్వ ముద్రణాలయంలో నకిలీ నోట్లు   ప్రింట్ అవుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

కొత్త నోట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?

 కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికే రిజర్వు బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్.. కొత్త 2వేలు, 500 రూపాయల నోట్లను చూపించారు. అప్పటికే భారీ మొత్తంలో ఈ నోట్లు రిజర్వు బ్యాంకుకు చేరుకున్నాయి. కానీ వీటన్నింటినీ ఎక్కడ ముద్రించారు, ఎలా తీసుకొచ్చారు? ఇదంతా ఆసక్తికరమే. గత ఆరు నెలలుగా ఒక చార్టర్డ్ విమానం నిండా కొత్త నోట్లను మైసూరులోని ప్రభుత్వ ప్రెస్ నుంచి ఢిల్లీలోని రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయానికి తరలిస్తూనే ఉన్నారు.


ఇన్నాళ్లుగా అసలు మైసూరులో విమానాశ్రయం ఎందుకు, అక్కడ అనవసరం అని భావించినవాళ్లు ఇప్పుడు ఈ విషయం తెలిసి నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఇక్కడ ఒకే ఒక్క రన్‌వే ఉంది. అక్కడి నుంచే కొత్త నోట్లన్నీ సురక్షితంగా, అత్యంత రహస్యంగా ఢిల్లీకి, పలు నగరాల్లో ఉన్న రిజర్వు బ్యాంకు శాఖలకు చేరుకున్నాయి. మూడోకంటికి తెలియకుండా కేవలం అతి కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా పూర్తిచేయడంలో మైసూరు విమానాశ్రయానిది కూడా ప్రధాన పాత్రే. 
500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించేసరికే ఈ నోట్లన్నీ వివిధ నగరాల్లో ఉన్న రిజర్వు బ్యాంకు శాఖలకు చేరిపోయాయి. తర్వాత అక్కడి నుంచి వివిధ బ్యాంకులకు వాటిని తరలించారు. మైసూరులో ఉన్న భారతీయ రిజర్వు బ్యాంకు నోటు ముద్రణ్ లిమిటెడ్ సంస్థలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ నోట్లను ముద్రించారు. ఆ ప్రెస్‌కు ప్రత్యేకమైన రైల్వేలైను, నీళ్ల పైపులైన్ కూడా ఉన్నాయి. రెండు దశాబ్దాల నాటి ఈ ప్రపెస్‌ ప్రపంచంలోనే అత్యుత్తమమైన ప్రింటింగ్ ప్రెస్‌లలో ఒకటిగా పేరొందింది. ఇక్కడే ప్రత్యేకంగా కరెన్సీ ముద్రణకు కావల్సిన పేపర్ తయారీ విభాగం కూడా ఉంది. 
ఆరు నెలల క్రితమే రెండు వేల రూపాయల నోట్ల ముద్రణ మొదలైనా, ఆ విషయం ఎవరికీ తెలియలేదు. ఒక్కో బ్యాంకుకు రూ. 20 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు వాటివాటి సామర్థ్యాన్ని బట్టి ఈ కొత్త నోట్లను పంపిణీ చేశారు. కేవలం డబ్బుల రవాణా కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు చార్టర్డ్ విమానాన్ని అద్దెకు తీసుకుంది. ఇందుకోసం ఈ విమానానికి రూ. 73.42 లక్షలు చెల్లించారు.

 


 

 

Friday, November 11, 2016

పాత నోట్లతో చెల్లింపులకు గడువు పెంపు



పాత నోట్లతో ప్రజా వినియోగ సేవల బిల్లుల చెల్లింపునకు గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 14వ తేదీ అర్థరాత్రి వరకు పాత రూ.500, 1000 నోట్లతో విద్యుత్‌, నీటి బిల్లులు, ఆస్తిపన్ను, తదితర ప్రజా వినియోగ పన్నులు చెల్లించ వచ్చు. తొలుత 11వ తేదీ అర్థరాత్రి వరకే అవకాశం ఇచ్చినప్పటికీ ప్రజల నుంచి అనూహ్య స్పందన రావటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ రాత్రి 7గంటల వరకు దాదాపు రూ.40కోట్ల పన్నులు వసూలయ్యాయని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. మరో 72గంటల పాటు గడువు పొడిగించినందున నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రివ్యూ: సాహసం శ్వాసగా సాగిపో

 కథేంటంటే?: లీలా (మంజిమ మోహన్‌)కి సినిమాలంటే ఇష్టం. వైజాగ్‌కి చెందిన తన స్నేహితురాలు మైత్రేయితో కలిసి స్క్రిప్ట్‌ రైటర్‌గా చిత్ర పరిశ్రమలో స్థిరపడాలని ప్లాన్‌ చేస్తుంది. కొన్ని రోజులు గడిపేందుకు మైత్రేయి ఇంటికి వస్తుంది. అక్కడే మైత్రేయి సోదరుడైన రజనీకాంత్‌(నాగచైతన్య)కి దగ్గరవుతుంది. రజనీకాంత్‌కు బైక్‌పై ప్రయాణమంటే చాలా ఇష్టం. కన్యాకుమారికి బైక్‌పై వెళ్లాలనుకొంటాడు. అది తెలిసి లీలా కూడా ప్రయాణమవుతుంది. ఇద్దరూ కన్యాకుమారి వెళ్లి తిరిగొచ్చే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురవుతారు. ఆస్పత్రిలో రజనీకాంత్‌ని చేర్పించిన లీలా.. మహారాష్ట్రలో ఉన్న తన అమ్మానాన్నలపై జరిగిన హత్యాయత్నం గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లిపోతుంది. అయితే రజనీ, లీలా కన్యాకుమారి నుంచి తిరిగి వస్తుండగా జరిగింది ప్రమాదం కాదని, లీలాని అంతం చేయాలనే పథకం అని ఆ తర్వాత తెలుస్తుంది. మరి రజనీకాంత్‌ అప్పుడెలా స్పందించాడు? ఇంతకీ లీలాని చంపాలనుకొన్నది ఎవరు? రజనీకాంత్‌.. మహేష్‌గా ఎలా మారాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 ఎలా ఉందంటే?: గౌతమ్‌మేనన్‌ మార్క్‌ సినిమా ఇది. తొలి సగభాగం ‘ఏమాయ చేసావె’ తరహాలోనే ఓ పక్కింటి కుర్రాడి ప్రేమకథని చూపించారు. కానీ ఇక్కడ ఆ ప్రేమకథని ఓ రోడ్‌ట్రిప్‌ నేపథ్యంలో చూపించడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. రోడ్డుపై ప్రమాదం జరగడం, అది కూడా ఓ పథకం ప్రకారమే అన్న విషయం తెలియడంతోనే అసలు కథ మొదలవుతుంది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ తిరిగిన ఓ కుర్రాడికి అనుకోని కష్టం ఎదురైనప్పుడు ఎలా స్పందించాడు? ఎలా ధైర్యం కూడగట్టుకొన్నాడు? అనే విషయాల్ని సహజంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మలి సగభాగమంతా శత్రువుల నుంచి లీలా అమ్మానాన్నల్ని కాపాడటం నేపథ్యంలోనే సాగుతుంది. ఆ భాగమంతా కూడా యాక్షన్‌, ఛేజింగ్‌ సన్నివేశాలే ఎక్కువగా ఉండటంతో పాటల్ని కూడా పక్కనపెట్టారు. చివరి పదిహేను నిమిషాలు కథ మరింత ఆసక్తికరంగా సాగుతుంది. కథానాయకుడు కేసులోని చిక్కు ముడులను విప్పేది అప్పుడే. అయితే అంతకుముందు సుదీర్ఘంగా సాగిన యాక్షన్‌ ఘట్టాలే ప్రేక్షకులకు బోర్‌ కొట్టినట్టు అనిపిస్తాయి. లీలాని ఎందుకు చంపాలనుకొంటున్నారనే విషయాన్ని చివరి వరకు కూడా బయటపెట్టక పోవడంతో ప్రేక్షకులు అసహనానికి గురవుతారు. కానీ చివరి పది నిమిషాల్లోనే ఆ చిక్కుముడినంతా మాటలతోనే చెప్పిస్తారు. థ్రిల్లింగ్‌తో కూడిన ఈ కథకి విలనిజం ప్రధానం. కానీ అది కూడా బలంగా ఏమీ పండలేదు. బాబా సెహగల్‌ బాగానే నటించాడు కానీ... ఆ పాత్రలో విలనిజం మాత్రం పండలేదు. తాను... నేను, చకోరి... పాటలు బాగున్నాయి. వెళ్లిపోమాకే పాట బాగున్నప్పటికీ అది ప్లేస్‌మెంట్‌ సరిగ్గా కుదర్లేదనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే?: నాగచైతన్య తన పాత్రలో ఒదిగిపోయాడు. ప్రేమ సన్నివేశాలతో పాటు, యాక్షన్‌ ఘట్టాల్లో కూడా చక్కటి భావోద్వేగాలు పండించాడు. మంజిమ మోహన్‌ తొలి సగభాగంలో అందంగా కనిపించింది. ముఖ కవళికల్లో సమంతని అనుసరించినట్టు అనిపిస్తుంది. ఆమె సంభాషణలు చెప్పేటప్పుడు సమంతే గుర్తుకొస్తుంది. కామత్‌ అనే పోలీసు పాత్రలో బాబా సెహగల్‌ ఒదిగిపోయాడు. రాకేందుమౌళి ప్రాధాన్యమున్న స్నేహితుడి పాత్ర చేశాడు. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకోదగినంత ఏమీ లేదు. సాంకేతికంగా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం బాగుంది. ఛాయాగ్రహణం కూడా సహజంగా ఉంది. ‘ద గాడ్‌ఫాదర్‌’ స్ఫూర్తితో కథ రాసుకొన్నట్టు టైటిల్‌ కార్డ్స్‌లో వేశారు గౌతమ్‌మేనన్‌. కథానాయకుడి పాత్ర అందుకు స్ఫూర్తి ఇచ్చుండొచ్చేమో కానీ... ఈ తరహా కథలు తెలుగుకి కొత్తేమీ కాదు.
చివరిగా: కాసేపు కాలక్షేపమే ఆశించి సాగిపో..  

Thursday, November 10, 2016

శతకాలే శభాష్ అనేలా..


ఇంగ్లండ్ ఆటగాళ్లు సింహనాదం చేశారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు ఆటగాళ్లు శతకాల మోత మోగించారు. తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న రాజ్ కోట్ స్టేడియం దద్దరిల్లేలా భారత్ పని పట్టారు. తొలి రోజు పూర్తి ఆధిపత్యం కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు.. రెండో రోజు కూడా అదే ఊపును ప్రదర్శించి శతకాలతో శభాష్ అనిపించింది.
జో రూట్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ లు శతకాలు సాధించి భారత్ బౌలింగ్ ను తీవ్రంగా గాయపరిచారు. బుధవారం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టులో జో రూట్(124) సెంచరీ చేయగా, ఈ రోజు ఆట ఆరంభంలో మొయిన్ అలీ(117) శతకం పూర్తి చేశాడు. ఆ తరువాత మిడిల్ ఆర్డర్ ఆటగాడు బెన్ స్టోక్స్ మరో శతకం సాధించడంతో  ఇంగ్లండ్ భారీ స్కోరు నమోదు చేసింది.
311/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ జట్టులో మొయిన్ అలీ(117) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం బెన్ స్టోక్స్-బెయిర్ స్టోల జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను తీసుకుంది. ఈ జోడి ఆరో వికెట్ కు 99 పరుగులు జోడించిన తరువాత బెయిర్ స్టో(46)అవుటయ్యాడు. దాంతో లంచ్ సమయానికి ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసింది. ఆపై ఇంగ్లండ్ ఆటగాడు వోక్స్(4)కూడా తొందరగా అవుట్ కావడంతో భారత్ శిబిరంలో కాస్త ఆనందం చోటు చేసుకుంది.

 అయితే భారత్ ఆనందానికి బెన్ స్టోక్స్ (128)చెక్ పెట్టాడు. ఒక క్లాసికల్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించాడు. దాంతో ఇంగ్లండ్ సునాయాసంగా 500 పరుగుల మార్కును చేరుకుంది. టెయిలెండర్ అన్సారీ(37) ఫర్వాలేదనించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో  537 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా, భారత్ లో సిరీస్ లో ఒక ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్ లో మూడు శతకాలు నమోదు చేయడం 2009 తరువాత ఇదే తొలిసారి. 2009లో మోతేరాలో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో శ్రీలంక మూడు శతకాలు సాధించింది.

Wednesday, November 9, 2016

రూ.2వేల నోటులో అది లేదట!


 
రూ.500, రూ.1000 నోట్ల స్థానంలో కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. మరింత భద్రతతో కూడిన నోట్లను ఆర్‌బీఐ మార్కెట్లోకి విడుదల చేస్తుంది. కొత్తగా రానున్న రూ.500 నోటు పాత రూ.500 నోటుకు పూర్తి భిన్నంగా ఉంటుందని, దీంతో పాటు రూ.2000 నోటుకు 17 ప్రధాన లక్షణాలు ఉన్నాయి.
కొత్త రూ.500నోటు గురించి ఆసక్తికర విషయాలు.
* మహాత్మాగాంధీ కొత్త నోట్లగా పిలిచే వీటిపై నంబర్‌ ప్యానెల్స్‌ మధ్యలో ‘ఈ’ లెటర్‌ ఉంటుంది.
* కొత్త నోట్లపై 2016 ముద్రణ, ఆర్‌బీఐ గవర్నర్‌ డా.ఉర్జిత్‌ ఆర్‌ పటేల్‌ సంతకం, స్వచ్ఛభారత్‌ లోగో ముద్రించబడి ఉంటుంది.
* నోటు వెనుక భాగంలో చారిత్రక కట్టమైన ఎర్రకోట, దానిపై జాతీయ జెండా ఉంది.
* 66మి.మి×150మి.మి పరిమాణం, బూడిద రంగు వర్ణంలో కొత్త నోట్లు ఉండనున్నాయి.
* కంటిచూపు లేని వారు సునాయాసంగా గుర్తుపట్టే విధంగా ప్రత్యేక గుర్తులను పెట్టారు. గాంధీ ముఖచిత్రం, అశోక చిహ్నం, ఐదు బ్లీడ్‌ లైన్స్‌, చేతికి తగిలే విధంగా ఉండే చిన్న సర్కిల్‌ నోటుకు కుడివైపు ఉంటాయి.
కొత్త రూ.2000 నోటు విషయాలు
* 2000 సంఖ్యారూపంతో పాటు.. దేవనాగరి లిపిలో 2000 సంఖ్య
* నోటుకు మధ్యలో మహాత్ముడి ముఖచిత్రం
* ఎడమవైపు ఆర్‌బీఐ, 2000 చిన్న అక్షరాలు
* నోటు మధ్యలో ఉండే ఆర్‌బీఐ మార్కు థ్రెడ్‌ రంగు ఆకుపచ్చ బదులుగా నీలం రంగు.
* కుడివైపు అశోక చిహ్నం.. మహాత్మాగాంధీ ముఖచిత్రంతో పాటు 2000 ఎలక్ట్రోటైప్‌ వాటర్‌మార్క్‌.
* నోటుకు కుడి, ఎడమ వైపు ఉండే బ్లీడ్‌ లైన్స్‌ ఏడు ఉంటాయి.
* వెనుక భాగంలో స్వచ్ఛభారత్‌ లోగో
* భారత్‌ ప్రయోగించిన అంగారక ఉపగ్రహం మంగళయాన్‌ చిహ్నం
* దేవనాగరి లిపిలో 2000 సంఖ్య
ఈనెల 11వ తేదీ నుంచి అన్ని ఏటీఎంలలో కొత్త నోట్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి కార్యదర్శి అశోక్‌ లవాస ప్రకటించారు. నల్లధనాన్ని నిరోధించేందుకు పెద్ద నోట్ల చలామణీని రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నారు. కొత్తగా వచ్చే రూ.2000నోట్లలో నానో జీపీఎస్‌ సిస్టమ్‌ను అమర్చనున్నట్లు వస్తున్న వార్తలపై ఆర్‌బీఐ స్పందించింది. కొత్త నోట్లపై నానో జీపీఎస్‌ సిస్టమ్‌ పెడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని వాటిని నమ్మవద్దని ప్రకటించింది.

Tuesday, November 8, 2016

అతడి సంపాదన.. వారానికి రూ. 3 కోట్లు!

  స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో పేరు చెబితే చాలు.. సాకర్ అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతారు. అలాంటి రొనాల్డోకు ఇప్పుడు బంపర్ ఆఫర్ తగిలింది. రియల్ మాడ్రిడ్ క్లబ్‌తో అతడికి ఐదేళ్ల కాంట్రాక్టు కుదిరింది. మరో పదేళ్ల పాటు తాను ఆడుతూనే ఉంటానని ఒప్పందం సందర్భంగా అతడు చెప్పాడు. దీని ప్రకారం అతడికి అక్కడ వారానికి దాదాపు రూ. 3 కోట్లకు పైగా చెల్లిస్తారు. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రొనాల్డో నిలిచిపోతాడు. తన జీవితంలో మిగిలిన కాలమంతా తాను ఆటను ఎంజాయ్ చేస్తూనే ఉంటానని.. మరో పదేళ్ల పాటు ఆడతానని స్పష్టం చేశాడు. ఈ కాంట్రాక్టుతో.. సంపాదన విషయంలో బార్సిలోనా ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ కంటే అగ్రస్థానంలోకి రొనాల్డో దూసుకెళ్లాడు. 
 
'వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' టైటిల్‌ను ఇప్పటికి మూడుసార్లు గెలుచుకున్న రొనాల్డో.. ఈ ఏడాది కూడా చాలా విజయాలు సాధించాడు. అతడి పెనాల్టీ షూటవుట్ షాట్‌తో మాడ్రిడ్ 11వ సారి చాంపియన్స్ లీగ్‌ను గెలుచుకుంది. అంతకుముందు యూరో 2016ను పోర్చుగల్ గెలుచుకోవడంలో కూడా రొనాల్డోదే కీలక పాత్ర. ఇటీవలి కాలంలో రియల్ మాడ్రిడ్ కాంట్రాక్టులను పునరుద్ధరించుకున్నవాళ్లలో రొనాల్డో లేటెస్ట్ స్టార్ అయ్యాడు. అతడి కంటే ముందు  గరెత్ బేల్, లుకా మాడ్రిక్, టోనీ క్రూస్ కూడా మంచి ఆకర్షణీయమైన కాంట్రాక్టులే పొందినట్లు సమాచారం.
 
రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ నుంచి మాడ్రిడ్‌కు మారిన తర్వాత 8 సీజన్లలో 360 గేమ్స్ ఆడి 371 గోల్స్ సాధించాడు. ఈ క్లబ్‌లో ఇంతవరకు ఎవరూ చేయనన్ని గోల్స్ చేయడంతో 2009లోనే రికార్డు స్థాయి ఫీజు పొందాడు. ఇక ముందు ఎవరు ఏం చెప్పాలన్నా.. రొనాల్డో కంటే ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుందని మాడ్రిడ్ ప్రెసిడెంట్ ఫ్లోరెంటినో పెరెజ్ వ్యాఖ్యానించారు. రొనాల్డోను ప్రశంసల్లో ముంచెత్తారు.

Sunday, November 6, 2016

ఇది జూనియర్‌ అక్కినేని ‘ఫ్యామిలీ’

 అక్కినేని నాగార్జున కుమారులు అఖిల్‌, నాగచైతన్య త్వరలో ఓ ఇంటివారు కాబోతున్న సంగతి తెలిసిందే. అక్కినేని అఖిల్‌.. ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రియ భూపాల్‌ని, అక్కినేని నాగచైతన్య.. సమంతని వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటివరకు ఈ కాబోయే జంటలు విడివిడిగా దిగిన ఫొటోలే సోషల్‌మీడియాలో కనిపించాయి కానీ తొలిసారి నలుగురూ కలసి ఒకే ఫొటో దిగారు. సమంత, నాగచైతన్య, అఖిల్‌, శ్రియలు కలిసి దిగిన ఫొటోని సమంత ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఫ్యామిలీ’ అని హ్యాష్‌టాగ్‌ ఇచ్చింది. అఖిల్‌, శ్రియల వివాహం ఇటలీలో జరగబోతున్నట్లు సమాచారం. సమంత, నాగచైతన్యలు వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నారు.

Saturday, November 5, 2016

రానే వచ్చింది ఆ రోజు

 అల్లు అర్జున్‌ రంగంలోకి దిగాడు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘డీజే... దువ్వాడ జగన్నాథమ్‌’ కోసం శుక్రవారమే సెట్లోకి అడుగుపెట్టాడు. ఈ రోజు కోసం ఎదురు చూశానని... సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సెట్లోకి అడుగుపెట్టడం బాగుందని అల్లు అర్జున్‌ ట్విట్టర్‌లో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘సరైనోడు’ తర్వాత బన్నీ కెమెరా ముందుకు రాలేదు. కుటుంబంతో గడుపుతూ, కొత్త కథల్ని వింటూ గడిపారు. కొంత కాలం కిందటే ‘డీజే’కి పచ్చజెండా వూపారు. అల్లు అర్జున్‌, పూజ హెగ్డే జంటగా దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. అయితే అల్లు అర్జున్‌పై శుక్రవారం నుంచి చిత్రీకరణ మొదలుపెట్టారు. ఈ సినిమాలోని పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా సన్నద్ధమైనట్టు తెలిసింది. రెండు కోణాల్లో సాగే ఆ పాత్ర కోసం శారీరకంగా కసరత్తులు చేయడంతోపాటు, హావభావాల విషయంలోనూ ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నట్టు తెలిసింది. ‘‘ఆర్య’ చూసినప్పట్నుంచి అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనేది నా కల. ఆ రోజు వచ్చింది’’ అని హరీష్‌ శంకర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Friday, November 4, 2016

లంబు పెళ్లి వచ్చే నెల 9న

 టీమ్‌ఇండియా పేసర్‌ ఇషాంత్‌శర్మ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి ప్రతిమసింగ్‌ను డిసెంబర్‌ 9న పెళ్లి చేసుకోబోతున్నాడు. జూన్‌ 19న ఈ జోడీకి నిశ్చితార్థం జరిగింది. వారణాసికి చెందిన ప్రతిమ.. పలు అంతర్జాతీయ టోర్నీలతో పాటు ఆసియాకప్‌లోనూ భారత బాస్కెట్‌బాల్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ‘సింగ్‌ సిస్టర్స్‌’గా పేరు సంపాదించిన ఐదుగురు అక్కాచెల్లెళ్లలో ప్రతిమ చిన్నది. ఆమె అక్కలందరూ జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణులే.

Thursday, November 3, 2016

ఇటలీలో పెళ్లి.. అతిథులెందరంటే..


  సినీ నటుడు అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రియాభూపాల్‌ల నిశ్చితార్థం డిసెంబరు 9న జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగార్జున ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించే పనిలో ఉన్నారు. అయితే వీరి వివాహాన్ని విదేశంలో నిర్వహించాలని, ఇటలీ అయితే బావుంటుందని కుటుంబ సభ్యులు అనుకుంటున్నట్లు సమాచారం. ఘనంగా జరగనున్న ఈ వివాహ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 600 మంది అతిథులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య, సమంతల వివాహం వచ్చే ఏడాది జరగనున్నట్లు నాగార్జున ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అఖిల్‌ ‘అఖిల్‌’ చిత్రం తర్వాత విక్రమ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటించనున్నారు.

Wednesday, November 2, 2016

విడిపోవడంపై ఇప్పుడేం చెప్పను

  గౌతమితో విడిపోవడం విషయంపై ఇప్పట్లో తానేం చెప్పబోనని నటుడు కమల్‌ హాసన్‌ ప్రకటించారు. గౌతమి ప్రకటనపై కమల్‌ స్పందించి ప్రకటన విడుదల చేశారని వార్తలు వచ్చాయి. అయితే తాను ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదని కమల్‌హాసన్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తాజాగా స్పష్టం చేశారు. ‘ఇలాంటి సమయంలో.. కొందరు నా పేరుతో నకిలీ ప్రకటనను ప్రచారం చేస్తున్నారు. అది అనాగరిక చర్య, అసంబద్ధమైనది. ఇప్పట్లో నేను ఏ ప్రకటనను జారీ చేయడం లేదు’ అని కమల్‌హాసన్‌ తమిళంలో ట్వీట్‌ చేశారు.
విడిపోవడానికి కారణం అదేనా?
కమల్‌హాసన్‌, నటి గౌతమి తమ 13 ఏళ్లసహజీవన బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. కమల్‌హాసన్‌తో విడిపోతున్నట్లు మంగళవారం సోషల్‌మీడియా ద్వారా చెప్పిన గౌతమి అందుకు కారణం చెప్పలేదు. అయితే ఇటీవల ‘శభాష్‌నాయుడు’ చిత్రం షూటింగ్‌ సమయంలో కమల్‌హాసన్‌ కుమార్తె శ్రుతిహాసన్‌, గౌతమిల మధ్య విబేధాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా శ్రుతిహాసన్‌ వస్త్రధారణ తదితర విషయాల్లో గౌతమి కల్పించుకోవడం ఆమెకు నచ్చలేదని, ఈ విషయంలో కమల్‌ తన కుమార్తె వైపు నిలిచారని సమాచారం. కమల్‌, గౌతమి విడిపోవడానికి ఇదో కారణం అని కొన్ని పత్రికలు రాశాయి. అయితే అలాంటిదేం లేదని శ్రుతి అధికార ప్రతినిధి తాజాగా ప్రకటించారు. ఆమె ఇతరుల వ్యక్తిగతవిషయాల్లో జోక్యం చేసుకోరని స్పష్టంచేశారు.
అయితే మరో కారణం కూడా వీరిద్దరు వేరుకావడానికి దారితీసిందని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. కమల్‌హాసన్‌ కాలికి కొన్నాళ్ల క్రితం ప్రమాదవశాత్తు గాయమైంది. ఈ విషయాన్ని కమల్‌హాసన్‌ కుమార్తెలు శ్రుతిహాసన్‌, అక్షరా హాసన్‌లకు గౌతమి వెంటనే తెలియజేయలేదట. దీంతో ఇద్దరు కుమార్తెలకు, గౌతమికి మధ్య మాటామాటా పెరిగిందని, ఆ సంఘటనే గౌతమి నిర్ణయానికి కారణమని వార్తలు వస్తున్నాయి.

Tuesday, November 1, 2016

నేనంటే యువరాజ్‌ తల్లికి హడల్‌


టీమిండియా క్రికెటర్‌ యువరాజ్ సింగ్ కుటుంబం గురించి అతని సోదరుడు జొరావర్ భార్య ఆకాంక్ష శర్మ రోజుకో బాంబు పేలుస్తోంది. యువీ కుటుంబంపై వరుసగా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. యువీ తల్లి షబ్నం సింగ్‌ కు తానంటే భయమని, వాళ్ల కుటుంబం గురించి తాను ఏమి చెబుతానోనని హడలిపోతోందని ఆకాంక్ష చెప్పింది. అయితే తాను జొరావర్‌ నుంచి విడాకులు మాత్రమే కోరుకుంటున్నానని వెల్లడించింది.
జొరావర్, ఆకాంక్ష రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. కాగా మనస్ఫర్థల కారణంగా పెళ్లయిన నాలుగు నెలలకే విడిపోయారు. రియల్టీ టీవీ షో బిగ్ బాస్ లో పాల్గొన్న ఆకాంక్ష సంచలన విషయాలు వెల్లడించింది. జొరావర్ కు, తనకు విభేదాల్లేవని, షబ్నం కారణంగానే తాము విడిపోయామని ఇటీవల ఆకాంక్ష ఆరోపించింది. ఇదే షోలో ఆమె మాట్లాడుతూ యువరాజ్ సింగ్ గంజాయి తాగేవాడంటూ మరో బాంబు పేల్చింది. 'నేను చేస్తున్న ఆరోపణలు నిజంకాబట్టే షబ్నం భయపడుతోంది. నేను అబద్ధాలు చెప్పినట్టయితే ఆమె అంత తీవ్రంగా స్పందించేది కాదు. షబ్నం కుటుంబం నుంచి నేనేమీ కోరుకోవడం లేదు. కేవలం విడాకులు ఇవ్వాలని చెబుతున్నా. నా జీవితం నేను గడపాలని భావిస్తున్నా' అని ఆకాంక్ష చెప్పింది.

కాగా ఆకాంక్ష ఆరోపణల్ని యువీ కుటుంబం ఖండించింది. ఆకాంక్ష తప్పుడు ఆరోపణలు చేస్తోందని, తమ కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేస్తోందని షబ్నం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆకాక్ష ఆరోపణలపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పింది.