Thursday, February 23, 2017

ధోనీని తప్పించడంపై సెహ్వాగ్‌ హర్షం

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ పుణె సూపర్‌ జైంట్స్‌ ధోనీని తమ జట్టు కెప్టెన్‌గా తప్పించిన తర్వాత తదుపరి సారథిగా స్టీవ్‌ స్మిత్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే ధోనీని తప్పించడంపై అభిమానులంతా నిరాశగా ఉంటే వీరేంద్ర సెహ్వాగ్‌ మాత్రం తనకు సంతోషమని అంటున్నాడు. ‘ధోని కెప్టెన్‌గా లేకపోవడం నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే త్వరలో జరిగే ఐపీఎల్‌ పదో సీజన్‌లోనైనా మా జట్టు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌.. పుణెను ఓడించగలదని ఆశిస్తున్న’ట్లు సెహ్వాగ్‌ సరదా వ్యాఖ్యలు చేశాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్‌ మాట్లాడుతూ సారథ్య బాధ్యతల నుంచి అతన్ని తప్పించడం ఆ ఫ్రాంచైజీకి సంబంధించిన ఆంతరంగిక విషయమని, కానీ భారత్‌కు నాయకత్వం వహించిన అత్యుత్తమ కెప్టెన్లలో ధోని ఒకడని ప్రశంసించాడు. యాజమానులైన తమను పట్టించుకోకపోవడం, క్రికెటేతర విషయాల్లో కూడా అతడు జోక్యం చేసుకోవడం తదితర కారణాలను చూపుతూ అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించినట్లు పుణె యాజమాని సంజీవ్‌ గోయెంకా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.
సెహ్వాగ్‌ గతంలో పంజాబ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించి రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటికీ అతని సేవలను మాత్రం ఫ్రాంచైజీ ఉపయోగించుకుంటోంది. ఇటీవల పంజాబ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌ హెడ్‌గా బాధ్యతలు చేపట్టడంతో పాటు మెంటార్‌గా కూడా కొనసాగుతున్నాడు. ధోని సారథిగా లేనందున త్వరలో ఆరంభంకానున్న పదో సీజన్‌లో ఇరు జట్లు తలపడినప్పుడు పుణెపై తమ జట్టు గెలుపొందడం సులభమవుతుందని సెహ్వాగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Wednesday, February 22, 2017

ఆయన ప్రపోజ్‌ చేశారు: ఖుష్బూ

 అందం, చక్కటి అభినయంతో ఒకప్పుడు అగ్రకథానాయికగా రాణించిన నటి ఖుష్బూ తన ప్రేమ జీవితం గురించి సోషల్‌మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు. 22 ఏళ్ల క్రితం తీసిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ఆ సందర్భాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘22 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 22న నేను ‘మురైమమన్‌’ సినిమా షూటింగ్‌లో ఉన్నా.. ఆ సమయంలో ఆయన నాకు ప్రపోజ్‌ చేశారు. జంటగా ఇద్దరి ప్రయాణం అలా మొదలైంది’ అని ఖుష్బూ ట్వీట్‌ చేశారు.
2001లో ఖుష్బూ, సి. సుందర్‌ల వివాహం జరిగింది. వీరికి అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఖుష్బూ ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌- త్రివిక్రమ్‌ కలయికలో వస్తున్న మరో చిత్రంలోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tuesday, February 21, 2017

ఐపీఎల్‌ పదోసీజన్‌ లోగో ఆవిష్కరణ

 టోర్నీ ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొన్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫీవర్‌ సోమవారం ఆటగాళ్ల వేలం ప్రక్రియతో మొదలైంది. తాజాగా లీగ్‌ పదోసీజన్‌ లోగోను మంగళవారం ఆవిష్కరించారు. తొమ్మిది లీగ్‌లను విజయవంతంగా ముగించుకొని పదో సీజన్‌లోకి ఘనంగా అడుగుపెడుతున్నందున లోగోలో పది సంఖ్యను అందంగా తీర్చిదిద్దారు. సంఖ్య మధ్యలో బ్యాట్స్‌మన్‌ షాట్‌ ఆడుతున్న భంగిమను ఏర్పాటు చేశారు. పక్కనే ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ వివో, ఐపీఎల్‌ ఆంగ్ల అక్షరాలను డిజైన్‌ చేశారు. ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో తొలి మ్యాచ్‌ అట్టహాసంగా ప్రారంభంకానుంది. మరోవైపు దేశవ్యాప్తంగా 38 నగరాల్లో ఐపీఎల్‌ ఫ్యాన్‌పార్క్‌ల ద్వారా స్టేడియంలో ఉన్న అనుభూతిని అభిమానులకు కలిగించేలా ఏర్పాటు చేస్తున్నారు.

Sunday, February 19, 2017

జీవితం అంటే ఆట!

  పేరు ఉంగరాలు రాంబాబు. ఓహో.. ఉంగరాల వ్యాపారం చేస్తాడేమో అనుకుంటున్నారా? అబ్బే అలాంటిదేం లేదు. మనోడికి జాతకాలంటే మహా నమ్మకం. అందుకే ఆ రాయి.. ఈ రాయి.. అంటూ రాళ్ల ఉంగరాలతో వేళ్లను నింపేసుకున్నాడు. కామెడీ హీరో సునీల్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న ‘ఉంగరాల రాంబాబు’. పేరుకే కామెడీ హీరో కానీ.. రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోలు చేసే రేంజ్‌లో సునీల్‌ డాన్సులు చేస్తారు. అందుకే ఈ సినిమాలో ఆయన ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని భారీగానే ప్లాన్‌ చేశారు.
అన్నపూర్ణ స్టూడియోలో స్పెషల్‌ సెట్‌లో ఈ సాంగ్‌ షూటింగ్‌ జరుగుతోంది. ‘లైఫ్‌ అంటే ఆట..’ అంటూ సాగే ఈ పాటకు డాన్స్‌ మాస్టర్‌ భాను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆయన చెప్పిన కొత్త స్టెప్పులను సునీల్‌ ట్రై చేస్తున్నారు. ‘‘ఇది పెప్పీ నంబర్‌. సినిమాలో మొదటి సాంగ్‌. చాలా సై్టల్‌గా ఉండటం కోసం సెపరేట్‌ లైటింగ్‌ స్కీమ్‌తో సెట్‌ వేసాం’’ అని ఆర్ట్‌ డైరక్టర్‌ ఏయస్‌ ప్రకాష్‌ చెప్పారు. అన్నట్లు రాంబాబుకి లవర్‌ లేదా? లేకేం. ఉందండి. ఇందులో మియా జార్జ్‌ కథానాయికగా నటిస్తున్నారు. రాంబాబు ఈవిడగారికి ఉంగరం తొడగటానికి చాలా ఫీట్లే చేస్తాడేమో. ఈ సమ్మర్‌లోనే రాంబాబు సందడి చేయడానికి రాబోతున్నాడు.

Saturday, February 18, 2017

హీరోయిన్‌ను కారులో బందీగా చేసి..

  దక్షిణాది హీరోయిన్ భావనను కొందరు దుండగులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. శుక్రవారం రాత్రి కేరళలోని కోచిలో ఈ ఘటన జరిగింది. చివరకు ఆమె సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఈ కేసులో పోలీసులు భావన కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
నిన్న కేరళలోని త్రిస్సూర్ నుంచి కోచికి భావన కారులో బయల్దేరింది. కొంతమంది ఓ టెంపులో భావన కారును ఫాలో అయ్యారు. కోచిలోని నెడుంబస్సెరీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు రాగానే భావన కారును టెంపుతో ఢీకొట్టారు. ఆ తర్వాత టెంపులో ఉన్నవారు కారు డ్రైవర్ మార్టిన్‌ను బయటకు లాగి కారులో కూర్చున్నారు. దుండగులు భావనను బందీగా చేసుకుని కారును నగరంలో గంటన్నర పాటు తిప్పారు. ఆ సమయంలో దుండగులు భావన పట్ల అనుచితంగా ప్రవర్తించి ఆమెతో ఫొటోలు, వీడియోలు దిగారు. ఆ తర్వాత పలరివట్లోమ్ జంక్షన్ వద్ద కారును, ఆమెను వదిలి పారిపోయారు. భావన కారును నడుపుకొంటూ దగ్గరలో ఉన్న ఓ నిర్మాత ఇంటికి వెళ్లి విషయం చెప్పింది.

భావన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో ఆమె కారు డ్రైవర్ మార్టిన్ పాత్ర ఉండొచ్చని భావిస్తున్నారు. భావన వద్ద గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన సునీల్ కుమార్ ఆమెను కిడ్నాప్ పథకం వేసినట్టు పోలీసులు చెప్పారు. అతనిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడనే కారణంతో భావన అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. మార్టిన్‌కు తెలిసే సునీల్ భావనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినట్టు పోలీసులు చెప్పారు.

భావన తెలుగులో ఒంటరి, హీరో, మహాత్మా, నిప్పు సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మొత్తం 70 సినిమాల్లో నటించింది.

Friday, February 17, 2017

రివ్యూ : ఘాజీ


  కథేంటంటే..?: 1971లో ఇండియన్‌ సబ్‌మెరైన్‌ ఎస్‌ 21కీ.. పాకిస్థానీ జలంతర్గామి ఘాజీకీ మధ్య జరిగే నీటి యుద్ధం ఈ కథ. లెఫ్టినెంట్‌ కమాండర్‌ అర్జున్‌ (రానా).. కెప్టెన్‌ రణ్‌ విజయ్‌సింగ్‌ (కె.కె.మీనన్‌)లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి విశాఖపట్నం తీరాన్ని ఎలా కాపాడారు? 18 రోజుల పాటు నీటిలో జరిపిన పోరాటంలో పాక్‌ జలాంతర్గామి ఘాజీని ఎలా మట్టికరిపించారు? అనేదే కథ.
ఎలా ఉందంటే..?: ఇండియా - పాక్‌ యుద్ధమంటే మనందరికీ కార్గిల్‌ యుద్ధం.. లేదంటే అంతకు ముందు జరిగిన కొన్ని యుద్ధాలే తెలుసు. సముద్ర గర్భంలోనూ ఇండియా - పాక్‌లు హోరాహోరీగా తలపడ్డాయని, ఆ యుద్ధంలో భారతీయ సైనికులు ధృఢచిత్తంతో శత్రువుల్ని ఎదుర్కొని విజయం సాధించారన్న చరిత్రకు ‘ఘాజీ’ అద్దం పట్టింది.
ఈ సినిమాలో దాదాపు 90 శాతం సన్నివేశాలు కేవలం సబ్‌మెరైన్‌లోనే తీశారు. కంటికి సబ్‌ మెరైన్‌ తప్ప ఇంకేం కనిపించదు. అయినా సరే.. విసుగు అనిపించదు. తరవాతేం జరుగుతుందన్న ఉత్కంఠ తప్ప. మనదేశం పాకిస్థాన్‌పై విజయం సాధిస్తుందన్న సంగతి తొలి సన్నివేశంలోనే అర్థమైపోతుంది. కానీ ‘ఎలా’ అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు సఫలీకృతమయ్యాడు. దేశభక్తి నేపథ్యంలో సాగే చిత్రాల్లో.. ప్రేక్షకుల్ని కనెక్ట్‌ చేయడం తప్పనిసరి. అప్పుడే తెరపై ప్రధాన పాత్రలు ఎంత భావోద్వేగంతో రగిలిపోతాయో.. ప్రేక్షకుల్లోనూ అలాంటి స్పందనే కలుగుతుంటుంది. ఈ విషయంలోనూ దర్శకుడు విజయం సాధించాడు. శత్రువుల నుంచి మన సబ్‌మెరైన్‌ని కాపాడుకొనే సందర్భంలో.. ఘాజీని మట్టుపెట్టినప్పుడు ప్రతి ప్రేక్షకుడూ మనసులో ‘జైహింద్‌’ అనుకోకుండా ఉండలేడేమో..?!
 
అతి తక్కువ పాత్రలతో.. ‘యుద్ధం’ అనే ఒకే లైన్‌తో రెండు గంటలు కూర్చోబెట్టడం.. పట్టుసడలని స్క్రీన్‌ప్లేతోనే సాధ్యమైంది. అక్కడక్కడ నేవీకి సంబంధించిన సాంకేతిక పదాలు ప్రేక్షకులకు అర్థం కావు. కానీ.. అవేవీ ఇబ్బందిని కలిగించవు. కథని.. తెరపై ఉన్న వాతావరణాన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఒక్కసారి వాతావరణం అలవాటైన తర్వాత.. శుభం కార్డు పడేంత వరకూ తెరపై నుంచి చూపు మరల్చకుండా చేయటంలో విజయవంతమైంది చిత్ర బృందం.
ఎవరెలా చేశారంటే..?: ఈ సినిమాలో పాత్రలు తప్ప పాత్రధారులెవ్వరూ కనిపించనట్లుగా ఉంది. రానా ఈ కథని.. ఈ పాత్రనీ ఏరికోరి ఎందుకు చేశాడో సినిమా చూస్తే అర్థమైపోతుంది. కెకె మీనన్‌ పాత్రని ప్రేమిస్తాం. అతను తెరపై ఇంకాసేపు ఉంటే బాగుణ్ణు అనుకొంటాం. తాప్సిని ఎందుకు తీసుకొన్నారో అర్థం కాదు. ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. ఓంపురి.. నాజర్‌లవి చాలా చిన్న పాత్రలు.
కె అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది. మనం కూడా నీటిలో ఉన్నామేమో అనే భావన కేవలం నేపథ్య సంగీతంతోనే కలిగించారు. మది కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న చిత్రమే అయినా... చిన్న సబ్‌మెరైన్‌ సెట్లో.. కెమెరాని పరుగులు పెట్టించాడు. సంకల్ప్‌ ఆలోచన.. అతని స్క్రీన్‌ ప్లే ‘ఘాజీ’ని ఓ మర్చిపోలేని చిత్రంగా మలిచాయి.
 

Wednesday, February 15, 2017

లేడీ గెటప్.. నాకు అన్నం పెట్టింది


సినిమాలపై మోజుతో ఓ యువకుడు ఇంట్లో చెప్పకుండా కృష్ణానగర్‌ వచ్చి అనేక కష్టాలకు ఓర్చి ఓ సినిమా కార్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌గా చేరి తన లక్ష్యానికి చేరువయ్యాడు. ఈ ప్రస్థానంలో ఆ యువకుడు లేడీ గెటప్‌తో ఆకట్టుకుంటూ బుల్లితెరపై వెలుగుతున్నాడు. నటనపై మక్కువతో 15 ఏళ్లుగా సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తనకు అచ్చొచ్చిన ఆడపాత్రలో బుల్లితెరపై నవ్వులు పూయిస్తున్నాడు. అతడే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన కె.శాంతికుమార్‌. వాస్తవంగా శాంతికుమార్‌ అంటే ఎవరికీ తెలియదు. లేడీ గెటప్‌లో ‘శాంతి స్వరూప్‌’గా మాత్రమే సుపరిచితుడు. తనదైన మేనరిజంతో సందడి చేస్తూ అలరిస్తున్న ఈ బక్కపల్చటి యువకుడు తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. ఆ వివరాలు అతడి మాటల్లోనే.. 
  అర్ధాకలితో అలమటించా..
సినిమా మోజుతో కృష్ణానగర్‌లో మకాం పెట్టి చాలా కష్టాలు ఎదుర్కొన్నా. కొన్ని రోజులు నీళ్లతోతోనే కడుపు నింపుకోవాల్సి వచ్చింది. తర్వాత ఓ సినిమా కార్యాలయంలో రూ.1000 జీతంతో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తూ స్టూడియోల చుట్టూ ఒక్కచాన్స్‌ అంటూ తిరిగాను. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తచ్చాడుతున్న నన్ను జబర్దస్త్‌ కమెడియన్స్‌ రాఘవ, రచ్చ రవి చూశారు. నటనపై నాకున్న మక్కువను వారి దృష్టికి తీసుకెళితే.. తమ జట్టులో ఓ అవకాశం ఇచ్చారు. శాంతిగా కామెడీ టైమింగ్‌తో మంచి మార్కులు పడ్డాయి. దాంతో అవకాశాలు వచ్చాయి.
ఇప్పటి వరకూ 80 స్కిట్స్‌..
వచ్చేవన్నీ లేడీ గెటప్‌లే. అయినా సరే.. ఈ శాంతి ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. దాదాపు అన్ని చానళ్లలోనూ ఆ గెటప్‌లోనే కనిపిస్తున్నా. మొన్నటి దసరా మహోత్సవం స్కిట్‌లో యాంకర్‌ శ్రీముఖిని అనుసరిస్తూ చేసిన డ్రామా ప్రేక్షకులకు ఆకట్టుకుంది. నా శరీరతత్వం.. లేడీ గెటప్‌లో నా వేషధారణతో అన్ని టీంలవారు ప్రోత్సహిస్తూ వారి స్కిట్‌లో అవకాశం ఇస్తున్నారు. ఒక్కసారి మొహానికి రంగు వేసుకున్నాక.. ఏ నటుడన్నా ఏ పాత్ర వేయడానికైనా సిద్ధంగా ఉంటాడు.. నేనూ అంతే. 
  నా చీరలు బాగుంటాయట.. 
ఇటీవల ప్రైవేట్‌ ప్రోగ్రామ్స్‌ ఇవ్వడానికి వెళుతున్నా. అక్కడ నన్ను చూసిన చాలామంది మగవాళ్లే మీ చీరలు బాగుంటాయని కితాబిస్తున్నారు. నా భార్యకు కూడా చీరల సెలక్షన్‌లో ఇంత ప్రావీణ్యం లేదంటూ వాళ్ల ముందే నన్ను పొగుడుతుంటారు. అది  నాకు చాలా సంతోసంగా ఉంటుంది.
ఆడీ లేదు.. ఆనందం ఉంది
నాకు ఆడీ కారుందని, పెద్ద ఇల్లు ఉందని ఇటీవల సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అవన్నీ నిజం కాదు.. ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తున్నప్పుడు పైసాపైసా దాచుకుని ఓ స్కూటీ కొనుకున్నా. నాకున్నది అదొక్కటే. ఆడి కారు లేదు కానీ నా కష్టాలు మరిచిపోయేలా రెండు పూటలా తిండికి, ఇంటి అద్దె చెల్లించే స్తోమత మాత్రం జబర్దస్త్‌ ఇచ్చింది. 

Tuesday, February 14, 2017

‘సింగం-4’ చేస్తా: సూర్య

 సూర్య కథానాయకుడిగా ‘సింగం’ సిరీస్‌లో వచ్చిన చిత్రం ‘ఎస్‌3’. అనుష్క, శ్రుతిహాసన్‌ కథానాయికలు. హరి దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్‌. ఎందుకంటే విడుదల తేదీ ఇప్పటికే చాలా సార్లు మారింది. సినిమా ఎప్పుడు విడుదలవుతుందనేది మన చేతుల్లో లేదు. నేను చాలా కంగారు పడ్డాను. కానీ ప్రేక్షకుల చిత్రాన్ని ఆదరించారు. దక్షిణాదిన ఏటా సుమారు వెయ్యికు పైగా సినిమాలు విడుదలవుతుంటాయి. అందులో ఏడు శాతం మాత్రమే విజయం సాధిస్తుంటాయి. అందుకే ప్రతి నటుడికీ హిట్‌ అనేది ప్రత్యేకం. మా నాన్నగారు నన్ను ఆలింగనం చేసుకొని అభినందించటం చాలా అరుదైన విషయం. అలాంటిది ఆయన ఈ సినిమా చూసి నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. అంతకంటే సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది. అందుకే దర్శకుడు హరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఆయనతో మరో సినిమా చేస్తాను. సింగం సిరీస్‌ను కొనసాగించే అవకాశాలూ ఉన్నాయి. అన్నీ కుదిరితే ‘సింగం 4’తో వస్తాం. కానీ దానికి ఐదారేళ్లు పట్టొచ్చు.’ అన్నారు.
దర్శకుడు హరి మాట్లాడుతూ.. ‘గతంలో వచ్చిన ‘సింగం’ చిత్రాలలాగానే దీనికి కూడా చాలా కష్టపడినట్లు తెలిపారు. తనకు ఎన్టీఆర్‌ నటించిన ‘టెంపర్‌’ చిత్ర‌మంటే ఎంతో ఇష్టమని అన్నారు. ఆయనతో కలిసి ఓ పవర్‌ఫుల్‌ చిత్రాన్ని చేయాలనుకొంటున్నట్లు వెల్లడించారు.