Wednesday, October 26, 2016

గాల్లో ఫీట్లు... ఖరీదు కోట్లు..!

 ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ 150 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇది భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ. యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయట. విశేషం ఏంటంటే... 150 కోట్లలో 30 కోట్లను గాల్లో తీయబోయే ఫైట్‌కి ఖర్చు పెట్టనున్నారట.

  హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లతో దుబాయ్‌లో ఈ స్కై ఫైట్‌ను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ రిస్కీ ఫైట్స్ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ‘రన్ రాజా రన్’తో దర్శకుడిగా పరిచయమైన సుజీత్, ఆ సినిమా తర్వాత రెండేళ్ల నుంచి ఈ సినిమా స్క్రిప్ట్‌పైనే వర్క్ చేస్తున్నారు.

త్వరలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై దృష్టి సారించనున్నారు. ‘బాహుబలి: ద కంక్లూజన్’ షూటింగ్ డిసెంబర్‌కి పూర్తి కానుంది. ఆ తర్వాత సుజీత్ సినిమా ప్రారంభమవుతుందని చిత్రబృందం చెబుతోంది.

మహేష్ మూవీకి భారీ ఆఫర్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్వకత్వంలో యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అదే స్థాయిలో భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్ లు క్రియేట్ చేస్తుంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు  ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంతేకాదు సినిమా ఆడియో రిలీజ్ తో పాటు శాటిలైట్ రైట్స్ ను కలిపి ఓ టీవీ ఛానల్ భారీ మొత్తానికి సొంతం చేసుకుందన్న ప్రచారం జరుగుతోంది. అది కూడా బాహుబలి రెండో భాగంగా కన్నా మహేష్ సినిమాకు ఎక్కువ మొత్తం ఆఫర్ చేసి రైట్స్ సొంతం చేసుకున్నారట.

ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్న మహేష్, మురుగదాస్ ల సినిమా ఆడియో, శాటిలైట్ రైట్స్ కోసం ఓ టీవీ ఛానల్ 26 కోట్లు ఆఫర్ చేసిందట. మహేష్, మురుగదాస్ ల కాంబినేషన్ పై ఉన్న అంచనాలతో పాటు ఈ సినిమా 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. సూపర్ స్టార్ అభిమానులు మాత్రం ఈ వార్తలతో పండుగ చేసుకుంటున్నారు.

Tuesday, October 25, 2016

గెడ్డం గీయించుకున్న హీరోయిన్

  హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. ఏ చిన్న లోపం కూడా కనిపించకుండా తెరమీద వీలైనంత అందంగా కనిపించాలని చూస్తారు. అందుకోసం మేకప్ నుంచి మేకోవర్ వరకు అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తుంటారు. హీరోయిన్లలో ఎవరికి వాళ్లకు వ్యక్తిగత మేకప్ మెన్ ఉంటారు. వాళ్లతో తమకు కావల్సినట్లుగా మేకప్ చేయించుకుంటూ ఉంటారు. బుజ్జిగాడులో సెకండ్ హీరోయిన్‌గా చేసి, నిన్న మొన్నటి సర్దార్ గబ్బర్‌సింగ్‌లో విలన్‌కు భార్యగా నటించిన సంజనా గల్రానీ కూడా ఇలాగే మేకప్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది. అయితే.. అందరిలా కేవలం మేకప్‌తోనే సరిపెట్టకుండా ఆమె గెడ్డం కూడా గీయించుకుంది!! అదేంటి, హీరోయిన్లు గెడ్డం గీయించుకోవడం ఏంటని మీకు అనుమానంగా వచ్చిందా? 
 
పురుషులకే కాదు, మహిళలలో కూడా కొంతమందికి ముఖం మీద అవాంఛిత రోమాలు వస్తుంటాయి. మామూలు వాళ్లు వాటిని పెద్దగా పట్టించుకోరు గానీ, సినిమా హీరోయిన్లు మాత్రం స్క్రీన్ మీద మెరిసిపోవాలనుకుంటారు కాబట్టి వాటిని పూర్తిగా తీయించేసుకుంటారు. కొంచెం పెరిగినా సరే.. వెండితెరమీద బాగోదన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు నీట్‌గా షేవ్ చేయించుకుంటారు. అలాగే సంజన కూడా తన వ్యక్తిగత మేకప్ మన్‌తో గెడ్డం గీయించుకుంది. ఎక్కడా చిన్న గాటు కూడా పడకుండా.. అలాగే రోమాలు ఏవీ మిగలకుండా జాగ్రత్తగా గీయాలంటూ అతడికి సూచనలు కూడా ఇచ్చింది. అంతా అయిపోయిన తర్వాత మరోసారి జాగ్రత్తగా చూసుకుని అప్పుడు సంతృప్తి పడింది. అయితే.. షేవింగ్ క్రీమ్ ఏదీ పూసుకోకుండానే ఆమె ఈ షేవింగ్ చేయించుకోవడం విశేషం.

Monday, October 24, 2016

అడుక్కోవలసిన ఖర్మ నాకు లేదు!

సౌతిండియాలో ఏడాదికి నాలుగైదు లేదా కనీసం రెండు సినిమాల చొప్పున రాకెట్ స్పీడుతో ఇలియానా నటించారు. ముంబై వెళ్లిన తర్వాత ఈ గోవా బ్యూటీలో అంత స్పీడు కనిపించడం లేదు. అక్కడ జోరు తగ్గడానికి కారణం... హిందీ సినిమాల్లో అవకాశాలు రాక కాదట, వచ్చిన వాటిలో మంచివి ఎంపిక చేసుకోవడమే అంటున్నారు. అంతే కాదండోయ్.. అవకాశాల కోసం ఎవ్వర్నీ అడుక్కోవలసిన ఖర్మ నాకు లేదని ఇలియానా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘‘ఇక్కడ (బాలీవుడ్‌లో) చాన్సులు, మీ సెలక్షనే కీ రోల్ పోషిస్తాయి. మీకో మంచి అవకాశం వచ్చిందనుకోండి.. నటించాలా? వద్దా? అనేది మీ చేతుల్లో ఉంటుంది.                   మీ సెలక్షన్ మంచిదయితే మీరు ఇండస్ట్రీలో ఉంటారు. చెత్తగా ఉంటే.. కెరీర్ క్లోజ్ అవుతుంది’’ అని ఇలియానా స్పష్టం చేశారు. బాలీవుడ్‌లో వచ్చిన అవకాశాలు, అందులో ఆమె సెలక్షన్ పట్ల హ్యాపీగా ఉన్నారట. ‘‘నా వరకూ నేను మంచి సినిమాలే సెలక్ట్ చేసుకున్నా. నా హార్డ్ వర్క్ వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని గర్వంగా చెప్పగలను. ఇప్పటివరకూ ఎవర్నీ ఫేవర్ చేయమని అడగలేదు. అవకాశాల కోసం ఎవర్నీ అడుక్కోను. నా డిగ్నిటీ నాకుంది’’ అన్నారామె. ప్రస్తుతం రెండు హిందీ సినిమాల్లో ఇలియానా నటిస్తున్నారు.

నాన్నకు ప్రేమతో...

మన కలలను నెరవేర్చుకోవడంలో ఆనందం ఉంటుంది. అయితే తల్లిదండ్రుల కలలను సాకారం చేయడంలో కలిగే సంతృప్తే వేరు. అందానికి ప్రతిరూపం లాంటి నటి త్రిష ఇప్పుడు రెండో రకం సంతోషాన్ని అనుభవించ డానికి దగ్గరగా ఉన్నారు. తొలి నుంచి కమర్శియల్ చిత్రాల్లో నటిస్తూ గ్లామర్‌తో నాయకిగా నెట్టుకొచ్చిన త్రిష ఇటీవల తన బాణిని మార్చారన్నది ఆమె చిత్రాల ఎంపిక చూస్తేనే అర్థం అవుతుంది. నాయకి చిత్రంతో హీరోయిన్ సెంటరిక్ పాత్రకు మారారు. ఆ చిత్రం నిరాశ పరచినా అదే బాణీలో మోహిని చిత్రంలో నటిస్తున్నారు.నాయకి చిత్రం అందించలేని ఆనందాన్ని మోహిని ఇస్తుందనే ఆశతో ఉన్నారు.
మోహిని చిత్ర ఫస్ట్‌లుక్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ధనుష్ జంటగా కొడి చిత్రంలో ప్రతినాయకి చాయలున్న పాత్ర దుమ్మురేపేలా నటించారనే టాక్ వినిపిస్తోంది. ఆ చిత్రం దీపావళి సందర్భంగా ఈ నెల 28న తెరపైకి రానుంది. ఈ చిత్ర విజయం నటి త్రిషతో పాటు, ధనుష్‌కు చాలా అవసరం. కాగా త్రిష ప్రస్తుతం మోహిని చిత్రంలో నటిస్తున్నారు. గర్జనై, చతురంగవేట్టై, సామి-2 చిత్రాల్లో నటించనున్నారు. ఇకపై వైవిధ్యభరిత కథా పాత్రల్లోనే నటించాలని ఈ బ్యూటీ నిర్ణయించుకున్నారట. కాగా ప్రముఖ హీరోయిన్లు ఇప్పుడు ఒక పక్క నటిస్తూనే మరో పక్క ఇతర వ్యాపారాల్లో ఆదాయాన్ని గడిస్తున్నారు.
  అదే విధంగా 14 ఏళ్ల సినీ వయసులోనూ నాయకిగా బిజీగా ఉన్న నటి త్రిష హోటల్ బిజినెస్‌లోకి దిగుతున్నారు. బెంగళూర్‌లో 60 గదులతో కూడిన ఆధునిక స్టార్ హోటల్‌ను నిర్మిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. త్రిష ఈ హోటల్ నిర్మించడానికి కారణం ఉందట. తన తండ్రి కృష్ణ ఒక నక్షత్ర హోటల్‌లో పని చేసేవారు. ఆయనకు తాను హోటల్ యజమానిని కావాలని కలల కనేవారట. అయితే ఆ కల నెరవేరకుండానే ఆయన తనువు చాలించారు. దీంతో తన తండ్రి కలను సాకారం చేయడానికే త్రిష స్టార్ హోటల్‌ను కట్టిస్తున్నారట.

Sunday, October 23, 2016

డార్లింగ్‌ ప్రభాస్‌ పూర్తి పేరు ఏంటో తెలుసా?

  తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్‌. ’బాహుబలి’ సినిమాతో జాతీయ స్టార్‌గా ఎదిగిన ఆయన ఆదివారం 37వ వసంతంలో అడుగుపెట్టారు. ఆయన జన్మదిన కానుకగా ఇప్పటికే ’బాహుబలి-2’ పోస్టర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌ విడుదల సందర్భంగా 18వ ముంబై చిత్రోత్సవం సందర్భంగా ప్రభాస్‌కు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చి గౌరవించారు.
14 ఏళ్ల నట ప్రస్థానంలో అసాధారణమైన అద్భుతాలను ఈ యంగ్‌ హీరో సొంతం చేసుకున్నాడు. ప్రభాస్‌ ఖాతాలో పలు విజయవంతమైన సినిమాలు ఉన్నప్పటికీ ‘బాహుబలి’ ప్రాంచైజ్‌తో ఒక్కసారిగా గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిపోయాడు. వంద కోట్లు వసూళ్లు సాధించడమే కష్టం అనుకునే టాలీవుడ్‌ రేంజ్‌ ను దాటి ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి’  సినిమా ఏకంగా రూ. 600 కోట్లు వసూలు చేసింది. ’బాహుబలి-2’ మీద అనేక అంచనాలు ఉన్నాయి. ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఆసక్తికరమైన కబుర్లు ఇవి..
  • ప్రభాస్‌ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు ఉప్పలపాటి. చెన్నైలో సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించారు. టాలీవుడ్‌ రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు ప్రభాస్‌కు పెద్దనాన్న.
     
  • ’బాహుబలి’  సూపర్‌ సక్సెస్‌తో ఇక ప్రభాస్‌ బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తాడని వినిపిస్తోంది. కానీ, 2014లోనే ప్రభాస్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. అజయ్‌ దేవగణ్‌ హీరోగా ప్రభుదేవా తెరకెక్కించిన ‘యాక‌్షన్‌ జాక్సన్‌’ సినిమాలో అతిథి పాత్ర పోషించాడు.
     
  • ప్రభాస్‌కు ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థినితో నిశ్చితార్థం అయింది. తల్లిదండ్రులు సెలెక్ట్‌ చేసిన అమ్మాయినే ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ అమ్మాయి గురించి పెద్దగా వివరాలు తెలియదు. గత ఏడాది డిసెంబర్‌లోనే ప్రభాస్‌ పెళ్లి జరగాల్సి ఉండగా.. ’బాహుబలి’ ప్రాజెక్టు కారణంగా వాయిదా వేసుకున్నాడు. అది ప్రభాస్‌కు పనిపట్ల అంకితభావమని సన్నిహితులు చెప్తారు.
     
  • ప్రభాస్‌ బాగా నచ్చిన సినిమా తన పెద్దనాన్న కృష్ణంరాజు నటించిన 'భక్తకన్నప్ప'. బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీ సినిమాలు అన్నా పడిచస్తాడు. మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌, త్రి ఇడియట్స్‌ సినిమాలను 20సార్లకుపైగా చూశాడట. ఇక హాలీవుడ్‌ విషయానికొస్తే రాబర్ట్‌ డీనీరో నటన అంటే ఇష్టం.
     
  • ప్రభాస్‌కు వాలీబాల్‌ అంటే ఇష్టం. బాహుబలి సినిమా కోసం మిస్టర్‌ వరల్డ్‌ 2010 లక్ష్మణ్‌ రెడ్డి ప్రత్యేకంగా దేహాదారుఢ్యంపై ప్రభాస్‌కు శిక్షణ ఇచ్చారు. కండలు తిరిగిన దేహసౌష్ఠవం కోసం చిత్ర నిర్మాతలు ప్రత్యేకంగా రూ. 1.5 కోట్లు విలువచేసే జిమ్‌ ఎక్విప్‌మెంట్స్‌ ఇచ్చారు.
     
  • చాలామంది నటులు వరుసగా సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపుతుండగా ప్రభాస్‌ మాత్రం ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాపై దృష్టి పెడుతున్నాడు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. 'బాహుబలి' సముద్రం లాంటి సినిమా. ఒక్క బాహుబలి వంద సినిమాలతో సమానం. కాబట్టి మధ్యలో నదిలాంటి సినిమాలను ఇవ్వడం ఆయనకు ఇష్టంలేదు.

Saturday, October 22, 2016

‘మ‌హేంద్ర బాహుబ‌లి’వ‌స్తున్నాడు

 తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన చిత్రం ‘బాహుబలి’. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజువల్‌ వండర్‌ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ప్రస్తుతం ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’ సిద్ధమవుతోంది. కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడు? సగటు సినీ ప్రేక్షకుడి మదిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది. ఈ నేపథ్యంలో బాహుబలి-2లో ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘మహేంద్ర బాహుబలి వస్తున్నాడు’ అంటూ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. చేతికి గొలుసులు చుట్టుకుని సిక్స్‌ప్యాక్‌తో ఉన్న ప్రభాస్‌ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తొలిభాగాన్ని మరిపించేలా రెండో భాగం ఉంటుందని ఇటీవల రానా చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు తగినట్లు చిత్ర బృందం రెండో భాగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రలు పోషించారు.
‘బాహుబలి: ద బిగినింగ్‌’కు కొనసాగింపు ‘కన్‌క్లూజన్‌’ను తీసుకువస్తున్నట్లే దర్శకుడు రాజమౌళి 2015లో చేసిన ట్వీట్‌ను కొనసాగింపు ఇచ్చారు. ‘ప్రతి కథలోనూ అంతర్లీనంగా ఒక ప్రత్యేక సందర్భం ఉంటుంది. అది మొత్తం కథను నిర్వచించి, ముందుకు నడిపిస్తుంది. అదే బాహుబలి ద బిగినింగ్‌’ అనే ట్వీట్‌కు కొనసాగింపుగా, ‘ఇప్పుడు అతడు తన అనితరశక్తితో ఎలా మాహిష్మతి రాజ్యాన్ని గెలుస్తాడో.. అదే బాహుబలి2 ద కన్‌క్లూజన్‌’ అంటూ ట్వీట్‌ చేశారు.

Friday, October 21, 2016

రివ్యూ: ఇజం



పూరి జగన్నాథ్‌ గొప్ప కథకుడు. చిన్న పాయింట్‌ అయినా ఆసక్తికరమైన కథలుగా మలచి ప్రేక్షకుల్ని రెండు గంటల పాటు కూర్చోబెట్టే సమర్థుడు. అందుకే పూరి సినిమాల్లో కథ కంటే.. వేగంగా పరిగెట్టే కథనం.. పసందైన మాటలు ప్లస్‌ పాయింట్లుగా మారతాయి. పూర్తి స్థాయి పూరీ స్టైల్‌లో తీసిన సినిమా ‘ఇజం’. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటిస్తూ.. నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ‘ఇజం’ ఎలా ఉంది? ఇందులో పూరి ఏ ‘ఇజం’ గురించి చెప్పాడన్నది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే..: కల్యాణ్‌రామ్‌ (కల్యాణ్‌రామ్‌) ఓ స్ట్రీట్‌ ఫైటర్‌. బ్యాంకాక్‌లోని ఓ దీవిలో డబ్బుల కోసం ఫైట్‌ చేస్తుంటాడు. కష్టపడకుండా డబ్బులు సంపాదించే మార్గం అన్వేషిస్తుంటాడు. సరిగ్గా అప్పుడే అలియా (అదితి ఆర్య)ని చూసి మనసు పడతాడు. ఆమె.. చీకటి సామ్రాజ్యానికి అధినేత అయిన జావేద్‌ భాయ్‌ (జగపతిబాబు) కూతురు. దేశాన్ని తన తండ్రి భయపెట్టిస్తుంటే.. తన తండ్రినే భయపెట్టించే మగాడ్ని పెళ్లి చేసుకోవాలనుకొంటుంది. ఆ లక్షణాలు చూసే కల్యాణ్‌రామ్‌ని ప్రేమిస్తుంది. అయితే కల్యాణ్‌రామ్‌ అసలు పేరు సత్య మార్తాండ్‌ అని.. తన తండ్రి భాగోతాన్ని బయటపెట్టడానికి వచ్చిన ఓ జర్నలిస్ట్‌ అని తెలుస్తుంది. ఇంతకీ ఈ సత్యమార్తాండ్‌ ఎవరు? తను అలియా ప్రేమని అడ్డు పెట్టుకొని ఏం సాధించాలనుకొన్నాడు? జర్నలిజం గొప్పతనాన్ని సత్య ఎలా చాటి చెప్పాడు? అనేది వెండితెర మీద చూడాల్సిందే.
ఎలా ఉందంటే..: పూరి మార్క్‌ కమర్షియల్‌ హంగులతో సాగే సినిమా ఇది. ముందే చెప్పినట్టు పూరి ఓ చిన్న పాయింట్‌ని నమ్ముకొన్నాడు. అయితే ఆ పాయింట్‌ బలంగా ఉంది. వికీలీక్స్‌ లాంటి బలమైన నెట్‌వర్క్‌ని స్థాపించి.. విదేశాల్లో నలధనం దాచుకొంటున్న ‘నల్ల దొరల’ గుట్టురట్టు చేసి.. ఆ డబ్బుని పేద ప్రజలకు పంచి పెట్టడం అన్నదే ఆ పాయింట్‌. ఇలాంటి కథలు సామాన్య ప్రేక్షకుడికి ఈజీగా కనెక్ట్‌ అయిపోతాయి. అయితే.. అసలు విషయం పది నిమిషాలే. సినిమా రెండు గంటలకు పైగా. అంటే.. మిగిలిన రెండు గంటలూ దర్శకుడు ఏం నడిపాడన్నది కీలకం.
సినిమా ప్రారంభానికి ముందే.. కల్యాణ్‌రామ్‌ ఓ జర్నలిస్ట్‌ అనే హింట్‌ దొరికేస్తుంది ప్రేక్షకులకు. దాన్ని ఇంట్రవెల్‌ వరకూ దాచి పెట్టి.. దాన్నో బ్యాంగ్‌ అన్నట్టు చూపించడం అతికినట్లుగా అనిపించదు. తొలి సగం.. కథ కంటే మిగిలిన విషయాలే సాగిపోతుంటాయి. హీరోయిన్‌ వెనుక పడటం.. ఆమెతో డ్యూయెట్లతో తొలి భాగం ముగిస్తే.. ద్వితీయార్థంలో హీరోని వెదుక్కొంటూ హీరోయిన్‌ వస్తుంది. ఆ సన్నివేశాలు అలా సాగుతున్న వేళ.. సినిమా చివర్లో ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది. కోర్టు సీన్‌తో తన ఉద్దేశం.. లక్ష్యాన్ని చాటి చెప్పాడు దర్శకుడు. కోర్టు సీన్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. దర్శకుడి ఉద్దేశం గొప్పగా ఉన్నా.. ఆ విషయాన్ని ఆసక్తికరంగా చెప్పటంలో తడబాటు కనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే..: గత సినిమాల్లో కల్యాణ్‌ రామ్‌కు ఇందులో పాత్రకు తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పూరి సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో.. అలానే కనిపిస్తారు కల్యాణ్‌ రామ్‌. కోర్టు సన్నివేశంలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. అదితి ఆర్యకి ఇదే తొలి సినిమా. ఆమె ఓకే. జగపతిబాబుని విలన్‌ అనుకోవడానికి వీల్లేదు. బీడీ ప్రేమికుడిగా.. కొన్ని సన్నివేశాల్లో రక్తి కట్టించాడు. అయితే డాన్‌ పాత్రపై మరింత దృష్టి పెట్టాల్సింది. గొల్లపూడి కనిపించేది ఒక్క సన్నివేశమైనా బాగుంది. అనూప్‌ బాణీల్లో మెలోడీ గీతం బాగుంది. ‘ఇజం.. ఇజం’ అంటూ పూరి పాడిన పాట ఆకట్టుకునేలా ఉంటుంది. పూరి డైలాగుల్లో మరిన్ని మెరుపులు ఉంటే బాగుండేది. కథ విషయంలో మరికాస్త కసరత్తు చేయాల్సింది.చివరిగా.. జర్నలిజానికి జాతీయవాదం తోడైతే ఈ ‘ఇజం’