Monday, June 6, 2016

నేటినుండి రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభం


నేటినుండి ఉపవాస దీక్షలు ప్రారంభం
               రంజాన్‌కా చాంద్‌ నజర్‌ ఆగయా అంటూ ముస్లింసోదరులు ఒకరికొకరు ముబారక్‌ (శుభాకాం క్షలు) తెలుపుకున్నారు. ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం ఉపవాస దీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆధ్యాత్మిక, సోదరభావాన్ని పరిమ ళింపజేసే పవిత్రమాసంగా రంజాన్‌ను భావిస్తారు. ముస్లింల దైవం అల్లా తన దివ్య సందేశాన్ని మానవాళికి అందించిన దైవ సందే శాన్ని దూత అందరికీ చేరవేసిన మాసంగా భావిస్తారు. ప్రవక్త హజ్రత్‌ మహ్మద్‌ (సల్లలాహు వాలిహి వసల్లం) ద్వారా దివ్య ఖురాన్‌ దివినుండి భువికి దిగివచ్చిన పవిత్ర మాసంగా రంజాన్‌ మాసాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో గడుపుతారు. ఈ మాసంలో ముస్లింలు నిష్టతో కూడిన ఉపవాస దీక్షలు పాటిస్తారు, ఉర్దూ క్యాలండర్‌ ప్రకారం సంవత్సరంలోని 9వ మాసంలో రంజాన్‌ నెల వస్తుంది. మొత్తం 29 రోజులపాటు ఉపవాస దీక్షలు చేపడ తారు. ఈ దీక్షలను తెల్లవారు జామున సూర్యోదయానికి ముందు, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత నియమ నిష్టలతో పూర్తిచేస్తారు. దీక్షాసమయంలో సత్యసం భాషణ, నైతిక ధర్మాచారాలతో దైవవిశ్వాసాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. ఉపవాసంచేసేవారు సాయంత్రం దీక్ష విరమించే వరకూ నీటినికూడా తాగరు. కనీసం లాలా జలాన్ని కూడా గొంతుదాటి లోనికి వెళ్ల కుండా జాగ్రత్త పడతారు. తెల్లవారు జామున లేచి అల్పాహారం తీసుకుని దీక్షను ప్రారంభి స్తారు. దీనిని సహార్‌ అంటారు. సూర్యో దయానికి ఫజర్‌ నమాజ్‌, మధ్యాహ్నం జోహర్‌ నమాజ్‌, సాయంత్రం 4నుండి 5వరకు అసర్‌ నమాజ్‌ చేస్తారు. సాయంత్రం 6గంటలకు ప్రార్థనా మందిరాలు (మజీద్‌)కు చేరుకుని ఉపవాస దీక్షలను విడుస్తారు. తమవెంట తెచ్చుకున్న పండ్లతో దీక్షను విరమించి మగ్రీభ్‌ నమాజ్‌ చేస్తారు. అనంతరం భోజనా లు ముగించుకుని ఇషా నమాజ్‌ తర్వా త తరావీ నమాజ్‌కు సిద్ధమవుతారు.
సోదరభావాన్ని పెంపొందించే ఇఫ్తార్‌ ..

              రంజాన్‌ ఉపవాస దీక్షల్లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6నుండి 6.30లోపు దీక్షలు విరమించే సమయాన్ని ఇఫ్తార్‌ అంటారు. చిన్నాపెద్ద, ధనికపేద తేడా లేకుండా ఒకేచోట వరుసగా మస్‌జిద్‌ కూర్చుని సామూహిక ఇఫ్తార్‌ చేస్తారు. ఈ సమయాల్లో మస్‌జిద్‌లు కొత్త కాంతులు సంతరిం చుకుంటాయి. ముస్లింలతోపాటు హిందువులు, క్రైస్తవులు ఇఫ్తార్‌ విందులో పాల్గొని మతసామరస్యా న్ని చాటుతారు. నెలరోజులపాటు ఇఫ్తార్‌ విందులు కొనసాగుతాయి.
దైవభక్తిని పెంపొందించే తరావి నమాజ్‌ ..           రంజాన్‌ మాసంలో ప్రత్యేకంగా చేసే తరావీ నమాజ్‌ దైవభక్తిని పెంపొందిస్తుంది. ఈనెలలో 29 రోజులపాటు ప్రతిరోజూ చేసే ఐదు పూటల నమాజ్‌తోపాటు తరవీ నమాజ్‌ను అదనంగా చేస్తారు. సుమారు గంటన్నరనుండి రెండున్నర గంటలపాటు ఏకధాటిగా ఈనమాజ్‌ కొనసాగుతుంది. నమాజ్‌లో దివ్య ఖురాన్‌కు చెందిన 30 అధ్యాయాల్లోని పవిత్ర శ్లోకాలను ఒకటినుండి రెండున్నర పేరాల వరకూ హఫీజ్‌ ఏ ఖురాన్‌ (ఖురాన్‌ చూడకుండా చదివేవ్యక్తి) ప్రతిరోజూ కొన్నింటిని చదువుతారు. ఇక ఇషా నమాజ్‌ తర్వాత తరాబీ నమాజ్‌ చేస్తారు. రంజాన్‌ ప్రారంభానికి ఒకరోజుముందు మొదలయ్యే ఈ నమాజ్‌ 29రోజుల దీక్షల అనంతరం ఈదుల్‌ ఫితర్‌ పండగ పర్వదినానికి ఒకరోజు ముందు ముగుస్తుంది. పండగరోజు ఊరిచివరన ఉండే ఈద్గాలవద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

ఫిత్రా ..            రంజాన్‌ మాసంలో ముస్లింసోదరులు తన ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా తన సంపాదనలో కొంతమేరకు దానం చేయాల్సి ఉంటుంది. దీనినే ఫిత్రాగా పిలుస్తారు. కుటుంబ సభ్యుల లెక్కన నాణ్యమైన గోధుమలు, జొన్నలు కిలో విలువ లెక్కగట్టి ఆలెక్కప్రకారం ఒక మనిషికి ఒక కిలో విలువకట్టి డబ్బులు పేదలకు పంచిపెట్టడమే ఈ ఫిత్రా ఆనవాయితీ.
దురలవాట్లకు దూరంగా ..               సిగరెట్‌, బీడీ, మద్యపానం, గుట్కాలతో పాటు ఇతరాత్ర అలవాట్లు సాధారణమైనా రంజాన్‌లో ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. ఈ పవిత్ర మాసంలో ముస్లిం లంతా విధిగా రోజా పాటించి అల్లా నిర్ధేశించిన అన్నిరకాల నమాజ్‌ను ఆచరిం చాలని ఖురాన్‌ ఆదేశిస్తుంది. అనారోగ్యం, దూర ప్రయాణాలు, ఇరత కారణాలతో కొందరికి మినహాయిం పు ఉంటుంది. అధికశాతం ముస్లింలు రంజాన్‌లో ఉపవాస దీక్షలను పాటిస్తారు. దురవాట్లకు బానిసైన చాలా మందిసైత ం నెలరోజులు మాత్రం ఉపవాసం ఉంటారు. ఉపాదీక్షలు లేనివారుసైతం తరా వి నమాజులకు వెళ్తుంటారు.

పండ్లకు ప్రాధాన్యం ..
           రంజాన్‌ ఉపవాస దీక్షలో ఉన్నవారు తెల్లవారు జాము నుండి సూర్యాస్తమయం వరకు ఎలాంటి ఆహారంగాని మంచినీళ్లుగాని తీసుకోరు. అయితే దీక్ష విరమణకు పండ్లను ఆరగిస్తారు. ముఖ్యంగా ఖర్జూర పల్లకు మతపరంగా ప్రాధాన్యముంది. మహ్మద్‌ ప్రవక్త ఉపవాస దీక్షను ఖర్జూర పళ్లుతిని విరమించారని ప్రతీతి. అందువల్ల ముస్లింలు రోజావిరమణ సమయంలో ఖర్జూర పళ్లను తినడం పవిత్ర కార్యంగా భావిస్తారు. ఇఫ్తార్‌లో జామ, సేపులు, ద్రాక్ష, పుచ్చకాయలు, అనాస, బొప్పాయి, సంత్రా, మోసంబి, అరటిపండ్లు తీసుకుంటారు. హలీం, హరీష్‌, దైవడ, ఇతర తి బండారాలకోసం ప్రత్యేకంగా హోటళ్లు వెలుస్తాయి.
29రోజులు.. 3 భాగాలు ..
               రంజాన్‌ నెలను మూడు భాగాలుగా భావిస్తారు. ఇందులో తొలి 10రోజులు ఉపవాస దీక్షలుండటాన్ని రహమత్‌ (దయను పొందుట), రెండో పదిరోజలు ఉపవాసముంటే మగ్‌ఫిరత్‌ (క్షమకోరడం), మూడోది పదిరోజులు ఉపవాసాలను జాహ్నంసే నజ్జత్‌ (నరకం నుంచి విముక్తి) అని పిలుస్తారు. చివరి 10రోజుల్లో వచ్చే బేసి సంఖ్యలైన 21, 23, 25, 27, 29 రోజుల్లో ఉపవాస రాత్రుల్లో ఖురాన్‌ను అల్లా భూమిమీదకు పంపినట్లు విశ్వసిస్తారు. ఆ రాత్రిని గుర్తించి జాగరణచేస్తే దేవుడు పాపాలను తొలగించి కోర్కెలు తీరుస్తారని విశ్వాసం. ఈ రాత్రులను తఖ్రత్‌ అని పిలుస్తారు.
షబ్‌-ఎ-ఖదర్‌ ..
              రంజాన్‌ మాసంలో 26వరోజున షబ్‌-ఎ-ఖదర్‌ జరుపుకుంటారు. ఆ రోజున 30 ఫారాల ఖురాన్‌ను పఠిస్తారు. ఖురాన్‌ పఠనం ఈరోజు ముగుస్తుంది. అదేరోజు రాత్రి మజీదులతోపాటూ తమ గృహాల్లో జగ్‌నేకిరాత్‌ (జాగరణ) పాటిస్తారు. ఈ సందర్భంగా కొత్త బట్టలు ధరించి జాగరణలో పాల్గొని అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం నెల రోజులపాటు ఖురాన్‌ను చదివి వినిపించిన హఫీజ్‌-ఎ-ఖురాన్‌(మౌల్విసాబ్‌)ను మస్‌జిద్‌ కమిటీల ఆధ్వర్యంలో సన్మానించి తమవంతు సహకారం అందజేస్తారు.

పేదల హక్కు జకాత్‌ ..
            ఇస్లాం నిర్ధేశించిన ఐదు సూత్రాల్లో జకాత్‌ ఒకటి. దీనినే దాన ధర్మాలకు ప్రతీకగా చెబుతారు. తమవద్ద ఉన్న ఆస్తిపాస్తులో కొంతైనా నిరుపేదలకు పంచివ్వాలన్నదే జాకత్‌ సారాంశం.
ఎతెకాఫ్‌ వ్రతం ..
              రంజాన్‌ మాసంలో 21వ రోజు రాత్రినుండి పండగ ముందురోజు వరకు ఉపవాస దీక్షాపరులు ఎతెకాఫ్‌ వ్రతాన్ని చేస్తారు. ఈ సందర్భంగా వారు బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మరిచి మస్‌జిద్‌లలో దైవ ప్రార్థనల్లో నిమగమవుతారు. నెలవంక కనిపిస్తే వ్రతాన్ని విరమిస్తారు. పండగరోజు నమాజ్‌ అనంతరం తమతమ ఇళ్లకు చేరుకుని షీర్‌ఖుర్మా సేవిస్తారు. ప్రధాన పట్టణాలు, మండలాల్లో ఉపవాస దీక్షల అనంతరం హలీం, హరీస్‌్‌, దైవడ, కద్దుకీఖీర్‌, డబుల్‌కామీఠా, ఖుర్బానీకామీఠా తదితర వంటకాలను భుజిస్తారు.
షబ్‌-ఎ-ఖదర్‌ 26ట రోజున షబ్‌-ఎ-ఖాదర్‌ జరుపుకుంటారు. ఆరోజున 30పారాల ఖురాన్‌ను చదువుతారు. ఖురాన్‌ పఠనం ఈ రోజుతో ముగుస్తుంది. అదేరోజు రాత్రి మస్‌జిద్‌లతో పాటు తమ గృహాల్లో జగ్‌నేకిరాత్‌ (జాగరణ) చేస్తారు. ఈ సందర్భంగా కొత్తబట్టలు ధరించి జాగరణలో పాల్గొని అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

రోజులు మారాయి..

 వరుస హిట్లతో దూసుకెళుతున్న దర్శకుడు మారుతి కథ, స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం ‘రోజులు మారాయి’. చేతన్ మద్దినేని, పార్వతీశమ్, కృతిక, తేజస్వి ప్రధాన పాత్రల్లో మురళీ కృష్ణ ముడిదానిని దర్శకునిగా పరిచయం చేస్తూ జి.శ్రీనివాసరావు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. జేబీ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ‘దిల్’రాజు మాట్లాడుతూ- ‘‘మారుతి కథలు ప్రధానంగా యువతను ఆకట్టుకుంటాయి. కానీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్నివర్గాల వారిని ఆకట్టుకుంటుంది.
ఇప్పటికే ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా బిజినెస్ ట్రేడ్‌లో సూపర్ క్రేజ్ రావడం విశేషం. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 7న సినిమా విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. అలీ, పోసాని కృష్ణమురళి, రాజారవీంద్ర, హర్ష, సంధ్యా జనక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ సారధ్యం: గుడ్ సినిమా గ్రూప్, సహ నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

Saturday, June 4, 2016

కావాలనే మాజీ లవర్‌తో ఫొటో దిగలేదు!

 'ఉడ్తా పంజాబ్‌' సినిమాతో మళ్లీ వెండితెర మీద కనిపించబోతున్నారు షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌. చాలాకాలం కిందటే విడిపోయిన ఈ మాజీ ప్రేమజంట.. గతంలో ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా విలేకరులు ఎంత కోరినా.. కలిసి ఫొటో దిగేందుకు ఒప్పుకోలేదు. ఇందుకు కారణం ఏమిటంటే.. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌ వెల్లడించాడు. కావాలనే తామిద్దరం కలిసి ఫొటో దిగలేదని, ఒకవేళ ఫొటో దిగితే అప్పట్లో మీడియా మొత్తం దీనిపైనే మాట్లాడేదని, అందుకే మేం కలిసి ఫొటో దిగకూడదని తాను భావించానని షాహిద్ చెప్పాడు.
ఎన్నో ఏళ్ల గ్యాప్‌ తర్వాత షాహిద్‌, కరీనా..  అభిషేక్ చుబే తెరకెక్కించిన 'ఉడ్తా పంజాబ్‌'లో నటించారు.  నిజానికి ఒకే సినిమాలో నటిస్తున్నారనే మాటే కానీ.. ఈ ఇద్దరు కలిసి కనిపించే సీన్‌ ఒక్కటి కూడా ఈ చిత్రంలో లేదట. అంతేకాకుండా మీ ఇద్దరు భవిష్యత్తులో కలిసి నటించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు వీరు సమాధానం దాటేశారు. సహ నటులు ఆలియా భట్‌, డైరెక్టర్‌ అభిషేక్‌ చుబే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఈ ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమంలో షాహిద్, కరీన చాలా ఇబ్బందిగా కనిపించారని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై స్పందిస్తూ 'మేం ఇబ్బందిగా ఫీలైనట్టు మీరు ఎలా నిర్ణయిస్తారు? మేం అలా కనిపించామా? అలా ఎలా రాస్తారు?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

బాహుబలితో బ్రిటిష్ బ్యూటీ

 బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్, బాహుబలి 2 సెట్స్ మీద ఉండగానే తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు, ఇప్పటికే ప్రభాస్ రెగ్యులర్ సినిమా చేసి చాలా కాలం అవుతోంది. అందుకే బాహుబలి పూర్తవ్వగానే గ్యాప్ తీసుకోకుండా మరో సినిమాను పట్టాలెక్కించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. చాలాకాలం క్రితమే రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో సినిమా ఉంటుందంటూ ప్రకటించాడు ప్రభాస్.

యువి క్రియేషన్స్ బ్యానర్.., ప్రభాస్, సుజిత్ ల సినిమాను భారీగా నిర్మించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే జాతీయస్థాయిలో ప్రభాస్ కు  ఫాలోయింగ్ రావటంతో ఈ సినిమాను కూడా మూడు భాషల్లో భారీగా నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అందుకు తగ్గట్టుగా నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా గుర్తింపు ఉన్న అమీజాక్సన్ ను ఈ సినిమాను హీరోయిన్ గా ఫైనల్ చేశారట. తొలిగా ఈ బ్రిటిష్ బ్యూటీ ప్రభాస్ పక్కన నటించటం సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్.

Wednesday, June 1, 2016

పండుగొచ్చింది..

 
అంతటా పండుగ వాతావరణం, విద్యుత్ కాంతుల్లో నగరం, స్పెషల్ అట్రాక్షన్‌గా, అతిపెద్ద జెండా ఆవిష్కరణ, ఆవిర్భావ వేడుకలకు హైదరాబాద్ ముస్తాబు
కోట్ల కళ్లు ఎదురుచూస్తున్న పండుగ..అరవై ఏండ్ల కొట్లాట..వేయి మంది అమరుల బలిదాన ఫలితమైన రాష్ర్టావతరణ ఉత్సవం వచ్చేసింది. ఈ సంబురాలను అంబరాన్నంటేలా చేసుకునేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. నభూతో..నభవిష్యత్ అనే రీతిలో సిటీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతోపాటు ప్రధాన కూడళ్లు విద్యుత్ కాంతులు, త్రీడీ లైటింగ్‌తో ధగధగలాడుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివళ్లు, జెండావిష్కరణలతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహించడానికి నగరం సిద్ధమైంది.

తెలంగాణ జాతికి పెద్ద పండుగొచ్చింది. రాష్ట్రం రెండు వసంతాలు పూర్తి చేసుకొని మూడోఏట అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లతో పాటు ట్యాంక్‌బండ్, పర్యాటక ప్రాంతాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అసెంబ్లీ, సచివాలయం, నెక్లెస్‌రోడ్, హుస్సేన్‌సాగర్ తీరం, ైఫ్లె ఓవర్లు విద్యుత్ వెలుగులతో జిగేల్‌మంటున్నాయి. అమరవీరుల స్తూపాలను పూలతో అలంకరించారు. ప్రధానంగా నగర వీధుల్లో ఎక్కడచూసినా దసరా, దీపావళి లెక్కన ఉత్సాహం కనిపిస్తున్నది. 
 
నగరం..సప్తవర్ణశోభితం..
పురివిప్పిన నెమళ్లు, కనువిందు చేసే పూలు ఇంకా అనేక రకాల అలంకారాలతో నగర కూడళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. రాష్ట్ర అవతరణ వేడుకలకు ముస్తాబైన నగరం సప్తవర్ణ శోభతో అలరారుతోంది. మరోపక్క పరేడ్ మైదానంలో వేడుకలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. వేడుకలకు స్వాగతం పలుకుతూ హెచ్‌ఎండీఏ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. సంజీవయ్య పార్కులో ఎత్తైన జాతీయ పతాకం ఎగురవేయడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. దసరా, దీపావళి కలిసి వచ్చినట్టు నగరమంతా పండుగశోభను సంతరించుకుంది. 











 

ముచ్చటగా మూడో నెల?

 ‘‘నేను ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు? రెండేళ్ల వరకూ పిల్లలు వద్దనుకున్నాం. అసలు ఎక్కణ్ణుంచి ఇలాంటి వార్తలు పుట్టుకొస్తాయో అర్థం కావడంలేదు’’ అని కరీనా కపూర్ ఆ మధ్య పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. దాంతో ఇప్పట్లో కరీనా, సైఫ్ అలీఖాన్ తల్లిదండ్రులయ్యే అవకాశం లేదని చాలామంది ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో తాజాగా ఓ వార్త ప్రచారంలోకొచ్చింది. కరీనా ప్రెగ్నెంట్ అన్నది ఆ వార్త సారాంశం.

ఆమెకు మూడో నెల అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇటీవలే కరీనా, సైఫ్ లండన్ వెళ్లారు. హాలిడేస్‌ని ఎంజాయ్ చేసి, మంగళవారం ఇండియా వచ్చారు. కరీనా ప్రెగ్నెంట్ అనే వార్త బుధవారం గుప్పుమంది. బాలీవుడ్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్. దీనికి ఈ భార్యభర్తల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మౌనం అర్ధాంగీకారం అంటారు. సో.. కరీనా నిజంగానే తల్లి కాబోతున్నారా? లేక గతంలో ప్రచారం అయినట్లుగా ఇది కూడా వదంతిగా మిగిలిపోతుందా? వేచి చూడాల్సిందే.
 

ఈ మెగా సెల్ఫీ చాలా అరుదు గురూ

 ఒక సాధారణ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటేనే ఒక వార్తగా నిలుస్తుంది. అలాంటిది ఓ ఐదుగురు ప్రముఖులు ఓ చోట చేరి సెల్ఫీ తీసుకుంటే ఎలా ఉంటుంది. అది కూడా ఒకరిని ఒకరు చూసుకుంటూ పట్టరాని సంతోషంతో.. ఇంకా ఆసక్తిగా చెప్పాలంటే ఒకే రకమైన వస్త్రాలు వేసుకొని.. ఎవరి మొఖంలో నవ్వుచూసినా అదే పరిమాణంలో ఉండి.. ఈ అరుదైన సెల్ఫీ తిరుపతిలో ఆవిష్కృతమైంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ చెరిగిపోని చరిత్రను లిఖించుకున్న ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి, నట సామ్రాట్ అక్కినేని నాగార్జున, గీతా ఆర్ట్స్ సారధి అల్లు అరవింద్.. వీళ్లందరికీ ఒక్కసారిగా అదనపు రంగు అద్దినట్లుగా మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, వ్యాపార ప్రముఖుడు నిమ్మగడ్డ ప్రసాద్ కలిసి ఈ స్వీయ చిత్రాన్ని తీసుకున్నారు. బయటకు వచ్చిన ఈ ఫొటోను చూసిన వారంతా కూడా వావ్ వాట్ ఏ సెల్ఫీ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు.

Tuesday, May 31, 2016

బడ్జెట్ 4కోట్లు, కలెక్షన్లు 75 కోట్లు

 అంఛనాలను తలకిందులు చేస్తూ ఓ మరాఠీ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. స్టార్ హీరోలు కూడా వంద కోట్ల కలెక్షన్ల కోసం అష్టకష్టాలు పడుతుంటే.. ఓ చిన్న సినిమా శరవేగంగా వందకోట్ల మార్క్ వైపు అడుగులు వేస్తుంది. నూతన నటీనటులు ఆకాష్ తోసర్, రింకూ రాజ్ గురు హీరో హీరోయిన్లుగా మరాఠీలో తెరకెక్కిన చిన్న సినిమా సైరత్. నాగరాజ్ మంజులే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది.
కేవలం 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్, 63వ జాతీయ అవార్డుల వేదిక మీద కూడా సత్తా చాటింది. ఎలాంటి అంఛనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా స్పెషల్ జ్యూతీ అవార్డు ను సొంతం చేసుకుంది. సాధారణంగా అవార్డు సినిమాలకు కలెక్షన్లు రావన్న అపవాదు ఉంది. అలాంటి అనుమానాలను కూడా దూరం చేస్తూ సైరత్ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 31 రోజుల్లో 75 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తుండటంతో వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.