Thursday, April 28, 2016

మంచి కథ దొరికితే ఒకే సినిమాలో ముగ్గురం..

   ఖరీదైన వస్తువులు, విలువైన ఆస్తులను కొనుగోలు చేయడం లాంటి విషయాలకు దూరంగా ఉండాలని తన పిల్లలకు తరచూ చెప్నేవాడినని బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ అంటున్నాడు. ఇప్పటికీ తన వయసు మీద పడ్డట్లు కనిపించకుండా చూసుకునే అనిల్, తన పిల్లలకు సలహాలు ఇస్తుంటానని చెప్పాడు. సోనమ్ కపూర్, హర్షవర్థన్ కపూర్,రియా కపూర్ లకు ఆరోగ్యానికి సంబంధించిన వాటిపై ఖర్చు చేయడంలో తప్పులేదన్నాడు. ఆస్తులు, ఆభరణాలు, విలువైన బ్యాగులు లాంటివి కోనుగోలు చేయడం వృథా అని ఆయన అభిప్రాయపడ్డాడు. తాను మాత్రం స్పా సెంటర్లలో ఎక్కువగా గడుపటానికి ఇష్టపడతానని, అందువల్లే చాలా అనందంగా, ఆరోగ్యంగానూ ఉంటానని అనిల్ హెల్త్ సీక్రెట్ బయటపెట్టాడు.
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) 17వ ఎడిషన్ వేడుకల నిర్వహణ స్పెయిన్ లోని మాడ్రిడ్ లో జరుగుతుందని తెలిపాడు. మెడికల్ స్పా ఎక్కడ ఉన్నా సరే వాటిలో అత్యుత్తమమైన వాటిలో కనీసం వారమైనా ఆరోగ్యం కోసం గడుపుతానని వెల్లడించాడు. ఇంకా చెప్పాలంటే చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు తమ బరువు సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆస్ట్రియాలోని 'స్పా' సెంటర్లకు తరచుగా వెళ్తుంటారని చెప్పుకొచ్చాడు. వారసుడు హర్షవర్ధన్, సోనమ్ లతో కలిసి నటించే ఆలోచన ఉందా అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ... మా ముగ్గురికి సమ ప్రాధాన్యం ఉండేలా ఏదైనా స్క్రిప్టుతో దర్శకుడు వస్తే  కచ్చితంగా ఇది నెరవేరుతుంది అంటూ అనిల్ కపూర్ నవ్వేశాడు.

Tuesday, April 26, 2016

అన్నదమ్ములిద్దరూ... ఒకేరోజు

 చిరంజీవి 150వ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ తరవాతి చిత్రాన్ని పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడు మొదలెడతారా అనే ఆసక్తి నెలకొంది. ఈ రెండు ప్రశ్నలకు ఒకేసారి సమాధానం దొరికిందిప్పుడు. చిరంజీవి - వినాయక్‌ల ‘కత్తి’ రీమేక్‌కి ఈనెల 29న లాంఛనంగా కొబ్బరికాయ కొట్టేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం. అదే రోజున పవన్‌ కల్యాణ్‌ - ఎస్‌.జె.సూర్యల సినిమా కూడా ముహూర్తం జరుపుకోనుందట. 29వ తారీఖు దాటితే మంచి ముహూర్తాలు లేవని వీరిద్దరూ అదే రోజున తమ సినిమాని లాంఛనంగా ప్రారంభించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. వచ్చే నెల చివరి వారంలో చిరు సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. పవన్‌ - సూర్యల చిత్రం కూడా వచ్చే నెలలోనే మొదలవుతుంది. ఈలోగా అటు వినాయక్‌, ఇటు ఎస్‌.జె సూర్య స్క్రిప్ట్‌పై కసరత్తులు ముమ్మరం చేశారు. చిరు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌, పవన్‌ సినిమాకి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.

Monday, April 25, 2016

అనుష్క గురించి కోహ్లి ఏం చెప్పాడంటే!

 విరాట్‌ కోహ్లి కెరీర్‌ మంచి జోరుమీద ఉంది. అటు మైదానంలోనూ, అటు వ్యక్తిగత జీవితంలోనూ అతను దూసుకుపోతున్నాడు. ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ కెప్టెన్‌గా దూకుడు మీదున్న కోహ్లి తాజాగా టీ-20లో సెంచరీ కూడా కొట్టాడు. క్రికెట్‌లో అసాధారణమైన పరుగుల ప్రవాహాన్ని సృష్టిస్తున్న కోహ్లి వ్యక్తిగత జీవితంలోనూ హ్యాపీగా కనిపిస్తున్నాడు. గతంలో బ్రేకప్‌ చేసుకున్నట్టు భావిస్తున్న కోహ్లి-అనుష్క శర్మ మళ్లీ ఒక్కటైనట్టు వార్తలు వచ్చాయి. ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో ఈ ప్రేమజంట డిన్నర్ చేస్తూ కనబడింది.                        ఈ నేపథ్యంలో కోహ్లి సోమవారం ముంబైలో తన అభిమానులతో పిచ్చాపాటిగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా మీరు మీ ప్రియురాలు అనుష్క శర్మతో మళ్లీ కలిసిపోయారా? ఒకరు ప్రశ్నించగా.. 'అదిమాత్రం ఎవరికీ తెలియకూడదు. ఆ విషయంపై నేనేమీ మాట్లాడను' అంటూ దాటవేశారు. దీంతో ఓ మహిళా జర్నలిస్టు 'మీ వ్యక్తిగత జీవితం ఎలా సాగుతుంది' అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నతో కనుబొమ్మలు ముడేసిన కోహ్లి 'నా వ్యక్తిగత జీవితం గురించి కొంతవరకు తెలుసుకొనేందుకు ఫ్యాన్స్‌కు అవకాశముందని చెప్పాను. దానర్థం నా వ్యక్తిగత జీవితం గురించి ప్రతి విషయాన్ని చెప్తానని కాదు' అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చారు.

Saturday, April 23, 2016

రివ్యూ: సరైనోడు

 ఆరు పాటలు.. నాలుగు ఫైటింగ్‌లు.. కొంచెం ఎమోషన్‌.. అన్నిటికంటే మించి హీరోయిజం. ఇవి ఉంటే చాలు.. కమర్షియల్‌ సినిమా తయారైపోతోందిప్పుడు. ఈ నాలుగూ ఏ స్థాయిలో ఉన్నాయన్న దాని మీదనే సినిమా జయాపజయాలు ఆధారపడుతున్నాయి. బోయపాటి శ్రీను సినిమాలూ వాటినే నమ్ముకొన్నాయి. ఈసారి ఆయనకు.. స్టైల్‌ జోడించే కథానాయకుడు దొరికాడు. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రమే ‘సరైనోడు’. బోయపాటి శైలికి.. అల్లు అర్జున్‌ స్టైల్‌కీ లింకు ఎలా కుదిరింది? ‘సరైనోడు’ ఎలా ఉంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.. పదండి.
కథేంటి?: గణ (అల్లుఅర్జున్‌) కళ్ల ముందు అన్యాయం జరిగితే సహించడు. ఎంతటివాడికైనా ఎదురెళ్తాడు. స్థానిక ఎమ్మెల్యే దివ్య (కేథరిన్‌)ని తొలి చూపులోనే ఇష్టపడతాడు. ఇంట్లో వాళ్లు కూడా వీరిద్దరి ప్రేమని అంగీకరిస్తారు. అయితే.. ఎవరితోనూ గొడవ పెట్టుకోననే మాటిస్తేనే పెళ్లిచేసుకొంటానని షరతు విధిస్తుంది దివ్య. అమ్మవారి ముందు ప్రమాణం చేయబోతుండగా.. అక్కడికి మహాలక్ష్మి(రకుల్‌ ప్రీత్‌ సింగ్‌) వస్తుంది.
ఆమె కోసం మళ్లీ బరిలోకి దిగుతాడు గణ. మహాని వెంటాడుతున్న సమస్య పేరు.. వైరం ధనుష్‌ (ఆది పినిశెట్టి). అతను ముఖ్యమంత్రి కొడుకు. పర్ణశాల అనే గ్రామంలోని పంటపొలాల్ని బలవంతంగా లాక్కుని అక్కడ వ్యాపారం చేయాలనుకొంటాడు. అడ్డొచ్చినవాళ్లని చంపుతూ పోతుంటాడు. ఆ పర్ణశాలకీ మహాకీ సంబంధం ఏమిటి? ధనుష్‌ని గణ ఎలా ఎదిరించాడు? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది?: కమర్షియల్‌ సూత్రాలకు అనుగుణంగా అల్లుకొన్న కథ ఇది. దుర్మార్గుడైన ప్రతినాయకుడు. అతన్ని ఎదిరించే కండబలం ఉన్న కథానాయకుడు. వారిద్దరి మధ్య పోరు. తెలిసిన చిన్న కథనే తీసుకున్న దర్శకుడు తనదైన శైలిలో కథనాన్ని నడిపించారు.
హీరోయిజం.. పోరాటాలు.. పాటలు.. బిల్డప్‌ షాట్స్‌.. ఇలా మాస్‌కి నచ్చే అంశాల్ని రంగరించారు బోయిపాటి. మాస్‌తో పాటు.. అల్లుఅర్జున్‌ అభిమానులకు ఈ చిత్రం బాగా నచ్చే అవకాశం ఉంది. ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం విడివిడిగా చూస్తే బాగానే ఉన్నట్టు అనిపించినా వాటిని కలిపే బలమైన కథ లేకపోవడం ‘సరైనోడు’లో కనిపించే ప్రధానమైన లోటు.
విశ్రాంతి ముందొచ్చే పోరాట ఘట్టం ఆకట్టుకుంటుంది. కోర్టు సన్నివేశంలో ఎమోషన్‌ని బాగా పండించారు. ద్వితీయార్థంలో అనుకోని మలుపులు పెద్దగా కనిపించవు. కామెడీని నమ్ముకున్నా ఆశించినంతగా పండలేదు. అయితే.. పతాక ఘట్టాలు మాత్రం ఆకట్టుకొంటాయి. అదే.. ‘సరైనోడు’ అనుకునేలా చేస్తుంది.
ఎవరెలా?: ఈ సినిమా కోసం అల్లుఅర్జున్‌ బాడీ పెంచాడు. కండ బలం చూపించాడు. మాస్‌కి నచ్చేలా మారిపోయాడు. యాక్షన్‌ ఘట్టాల్లో చాలా చురుగ్గా కనిపించాడు. తనకు అలవాటైన డాన్సుల్లో మరింత అలరించేలా చేశాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని లాగించే ప్రయత్నం చేశాడు.
కేథరిన్‌ ఓకే అనిపిస్తుంది. రకుల్‌కి అంత స్కోప్‌ లేదు. ఆది పినిశెట్టి నటన ఆకట్టుకుంటుంది. ప్రతినాయకుడిగా బన్నీకి దీటుగా కనిపించాడు. బ్రహ్మానందం అప్పుడప్పుడు కాస్త నవ్విస్తాడు. శ్రీకాంత్‌కి ఇలాంటి పాత్రలు అలవాటే. మిగిలినవాళ్లంతా తమ అనుభవంతో బండి లాగించేశారు.
తమన్‌ అందించిన బాణీల్లో రెండు బాగున్నాయి. ‘తెలుసా.. తెలుసా’ మంచి మెలోడీ. యాక్షన్‌ ఘట్టాల్ని తన నేపథ్య సంగీతంతో మరింత ఎలివేట్‌ చేశాడు. ద్వితీయార్థానికి కాస్త కత్తెర పడాల్సింది.. సినిమా అంతా స్టైలిష్‌గా తీశారు. రత్నం డైలాగులు అక్కడక్కడ పేలాయి. కథకుడిగా బోయపాటి కొత్తగా ఏం చేయకున్నా.. తన బలాలపైనే దృష్టి పెట్టాడు. బోయపాటి సినిమాల్లో ఏవైతే హైలైట్స్‌గా కనిపిస్తాయో.. సరైనోడులోనూ రిపీట్‌ అయ్యాయి.. మారింది హీరో మాత్రమే.
చివరిగా.. మాస్‌కి వీడు.. ‘సరైనోడు’ 

Wednesday, April 20, 2016

పెళ్లిపై స్పందించిన తమన్నా

 ముంబయికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ని మిల్కీబ్యూటీ తమన్నా వివాహం చేసుకుంటోందని, పెళ్లి తరువాత ఆమె సినిమాలు చేయడం మానేస్తుందని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలన్నీ అవాస్తవమని తమన్నా తేల్చి చెప్పారు.
తాను ఈ వార్తలు చదివిన వెంటనే ట్విట్టర్‌ ద్వారా ఖండించానని, అయినప్పటికీ కొందరు తన పెళ్లిపై స్టోరీలు రాస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో మూడు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నానని తెలిపారు. అసలు ఈ వార్త ఎలా ప్రచారంలోకి వచ్చిందో తనకు తెలియడం లేదని చెప్పారు తమన్నా. తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని, పెళ్లి వార్త ఏమైనా ఉంటే మొదట అందరికీ చెబుతానన్నారు.

Tuesday, April 19, 2016

ఆలియా, సిద్ధార్థ్‌ డిషూం.. డిషూం

 బాలీవుడ్‌ ప్రేమపక్షులు ఆలియా భట్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రాల మధ్య పెద్ద గొడవ జరిగిందని సినీ వర్గాల సమాచారం. ఇటీవల సినీ నిర్మాత మన్మోహన్‌ శెట్టి కుమార్తె ఆర్తీ శెట్టి బర్త్‌డే పార్టీకి హాజరైన ఇద్దరూ పార్టీలో గొడవపడినట్లు తెలుస్తోంది.
సిద్ధార్థ్‌కి ఆలియా మాజీప్రియుడు అలీ దడార్కర్‌ ప్రవర్తన నచ్చడంలేదని ఈ విషయమై ఇద్దరి మధ్య వాదులాట జరిగిందని బాలీవుడ్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. పార్టీ అయ్యాక ఇద్దరూ అసలేం జరగనట్లు వెళ్లిపోయారు. ఇటీవల కరణ్‌ జోహార్‌ ఇంటికి వెళ్లిన వీరిద్దరూ ఎడమొహం పెడమొహం పెట్టుకుని విడివిడిగా ఎవరి కారులో వారు ఇంటికి వెళ్లిపోయారట. వీరిద్దరి మధ్య గొడవ సద్దుమణుగుతుందో లేదో చూడాలి.

విన్నారా!

 కొత్త విషయాలు నేర్చుకోవడం ప్రభాస్‌కు ఇష్టం. దానికోసం పుస్తకాలు బాగా చదువుతారు. కొత్త కొత్త టాపిక్స్‌తో వచ్చే పుస్తకాలను ఏరికోరి చదువుతుంటారు. ఆయన ఇంట్లో ఓ మినీ లైబ్రరీ ఉంది. దాన్నిబట్టి ఈ యంగ్ రెబల్ స్టార్ ఏ రేంజ్‌లో పుస్తకాలు చదువుతారో ఊహించుకోవచ్చు. చదువు వల్ల వచ్చే జ్ఞానం ఎప్పటికీ వృథా కాదని ప్రభాస్ నమ్ముతారు. ‘‘పుస్తకాలు మానసిక వికాసానికి తోడ్పడతాయి. అందుకే  చదువుతుంటాను. షూటింగ్స్ బిజీ వల్ల పుస్తకాలు చదివే తీరిక చిక్కడంలేదు. కానీ, టైమ్ దొరికినప్పుడల్లా ఏదో ఒక బుక్ చదివేస్తా’’ అని ప్రభాస్ అన్నారు. ప్రస్తుతం ‘బాహుబలి 2’లో నటిస్తూ బిజీగా ఉన్నారాయన.

Monday, April 18, 2016

రివ్యూ: ‘ఫ్యాన్‌’


బాలీవుడ్‌లో ఏ పాత్రలోనైనా అద్భుతంగా నటించగల నేర్పరి షారుఖ్‌ ఖాన్‌. రొమాంటిక్‌ హీరోగానే కాదు.. విలన్‌ పాత్రల్లోనూ తనలోని నటనా చాతుర్యంతో ప్రేక్షకులను అకట్టుకుంటాడు. 2006లో వచ్చిన ‘డాన్‌’.. 2011లో సీక్వెల్‌గా వచ్చిన ‘డాన్‌-2’లో షారుఖ్‌ నెగెటివ్‌ పాత్రల్లో కనిపించాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మరో నెగిటివ్‌ రోల్‌తో ‘ఫ్యాన్‌’గా థియేటర్లలోకి అడుగుపెట్టాడు. గురువారం యూఏఈలో విడుదలైన ‘ఫ్యాన్‌’ చిత్రం.. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ప్రేక్షకుల్ని ఈ ‘ఫ్యాన్‌’ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం.
కథేంటంటే..: ఆర్యన్‌ ఖన్నా(షారుఖ్‌ ఖాన్‌) దేశంలోనే అత్యంత అభిమానగణం ఉన్న హీరో. 19 ఏళ్ల గౌరవ్‌(షారుఖ్‌ ఖాన్‌) అతనికి ప్రపంచంలోనే గొప్ప అభిమాని. విశేషమేమిటంటే.. ఇద్దరూ అచ్చుగుద్దినట్లు కవలల్లా ఉంటారు. ముఖకవళికలు.. శరీరాకృతి.. హావభావాల్లో వీసమెత్తు తేడా కనిపించదు. ఆర్యన్‌ ఫొటోలు.. ఫ్లెక్సీలతో తన ఇంటినే ఓ ఆల్బమ్‌లా మార్చేస్తాడు ఆ ‘ఫ్యాన్‌’. ఒక్క మాటలో చెప్పాలంటే తన అభిమాన హీరోనే అతని ప్రపంచం! ఆర్యన్‌ను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు వూరుకోడు. చీల్చి చెండాడుతాడు. అంత అభిమానం మరి.
ఓ రోజు ఎలాగైనా ఆర్యన్‌ను కలవాలని ముంబయిలోని అతని ఇంటికి వెళతాడు గౌరవ్‌. అతన్ని చూసి ఆర్యన్‌ ఉద్వేగానికి గురవుతాడు. దాంతో ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. అనుకోకుండా ఆ అనుబంధం తెగిపోయి.. ఇద్దరి మధ్య వైరుధ్యం ఏర్పడుతుంది. ఆర్యన్‌కు ఉన్న మంచిపేరును చెడగొడతానని గౌరవ్‌ శపథం చేస్తాడు. దీంతో అప్పటి వరకూ తన అభిమాన నటుడి కోసం గౌరవ్‌ పడరాని పాట్లు పడగా.. ఆ తర్వాత కథ అడ్డం తిరుగుతుంది. గౌరవ్‌ను ఛేజ్‌ చేసేందుకు హీరో నానా తంటాలు పడతాడు. మరి చివరికి ఆ ‘ఫ్యాన్‌’ అన్నంత పని చేశాడా? అందుకు హీరో ఏం చేశాడు? తదితర విషయాలను తెరపైన చూడాల్సిందే.
ఎలా ఉందంటే..: షారుఖ్‌ అభిమానులకు ‘ఫ్యాన్‌’ డబుల్‌ బొనాంజా అనే చెప్పొచ్చు. 19 ఏళ్ల యువకుడి పాత్రలో షారుఖ్‌ ఇమిడిపోయిన తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆర్యన్‌ను కలిసేందుకు గౌరవ్‌ పడే తిప్పలు.. ఆ తర్వాత ఇద్దరి మధ్య వైరుధ్యం వంటి థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ సగటు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. చిత్రం మొత్తాన్ని ‘వన్‌ మ్యాన్‌ షో’గా నడిపించేశాడు షారుఖ్‌.
ద్వితీయార్ధంలో మాత్రం కొన్ని సన్నివేశాలు కాస్త మందకొడిగా సాగినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రంతో తన రియల్‌ అభిమాని వలూచా డిసౌజాను వెండితెరకు పరిచయం చేశాడు షారుఖ్‌. ఈ చిత్రంలో షారుఖ్‌ సతీమణి గౌరీఖాన్‌గా నటించింది. ఇతర నటీనటులు వారి పరిధుల మేరకు మొప్పించారు.
సాంకేతికంగా..: నేపథ్య సంగీతం విషయంలో సంగీత దర్శకుడు బాగానే పని చేసినట్లు అనిపిస్తుంది. ఎడిటింగ్‌ ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది. తర్వాతేం జరుగుతుంది? అన్న ఉత్కంఠను కలిగించడంలో దర్శకుడు విజయవంతమయ్యారు.